
"ఏమే తలుపు తీయటానికి ఇంత లేటా?" అరుస్తున్నాడు.
"మీరు తలుపు కొట్టగానే లేచి వచ్చి తలుపు తీసానండి." ఏడుస్తూ చెప్పింది ఆమె.
"వెంటనే తీస్తే ఎందుకంటాను నాకు ఏమైనా పిచ్చా...!?! నిన్ను అనాలనే జిలా? అయినా నేను ఈ టైము కి వస్తానని తెలుసు కదా? తలుపులు తీసి పెట్టి ఉంచాలి అని తెలియదా?"
"రోజు ఇదే టైం కి రావటం లేదు కదండి. ఒకసారి ముందుగా తీసి పెడితే, ఎవడి కోసం తీసిపెట్టావని తిట్టారు అందుకే..." నసుగుతూ అంది ఆమె.
"ఎనకటివన్నీ తవ్వుతావెందుకు? పాత విషయాలు తవ్వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మొగుడు అంటే లెక్కలేదు. మొగుడు మాటలు లెక్కలేదు నీకు. సరే అండి అంటే ఒక ముక్కతో పోతుంది కదా! నీకు ఈ మధ్య నోరు జాస్తి అయిపోయింది. ఎదురు సమాధానాలు చెబుతున్నావు...ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తూ నుంచొన్నావు? కూడు పెట్టవా ఏంటి? పో పోయి పట్టుకురా?" అంటూ అరిచాడు.
నిశ్శబ్ద వాతావరణం కావడంతో... ఏ శబ్ధ మైన పక్కింటికి స్పష్టంగా వినిపిస్తోంది.
ప్రణవికి... భార్యాభర్తల మాటలు వినకూడదు అని అనిపించినా...వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
తర్వాత పళ్ళెం పడేసిన శబ్దం వినిపించింది.
"ఏంటి ఇంత చల్లగా ఉంది? తిరిగి తిరిగి వచ్చిన మొగుడికి చల్ల కూడు పెడతావా?" మళ్ళీ ఫట్ మని శబ్దం వినిపించింది. ఆమెను కొట్టినట్టున్నాడు.
"పిల్లలు కునికిపాట్లు పడుతుంటే... 11: 00 కి వండి వాళ్లకి తినిపించి పడుకోపెట్టాను. మీరు రావడం లేట్ అయింది." ఏడుస్తూ చెప్పింది.
"వాళ్ళకు ఆకలేస్తే ముందు వండి వాళ్ళ మొహాన పడేయి. పొద్దుగూకనివ్వరు. తిండికోసం పుట్టినట్టుగా చస్తారు వెధవ లం...కొడుకులు. అయినా...ఏంటి? లేటు ... గీటు అంటున్నావు? నా ఇష్టం వచ్చిన టైం కి వస్తాను. అడగటానికి నువ్వు ఎవరు? ఉంటే ఉండు పోతే పో," అన్నాడు కోపంగా.
"భార్యగా..." ఏదో అన బోతున్న ఆమె నోటిక అడ్డుకట్ట వేస్తూ...
"నువ్వు భార్య అని నేను అనుకోవాలి. నువ్వు అనుకుంటే సరిపోదు. పో పోయి వేడివేడిగా అన్నం వండి పట్టుకురా. చనువిస్తే నెత్తిక్కి కూర్చుంటావు." అంటూ కసిరాడు.
ఆమె ఏడుపు తర్వాత వంటింట్లో గిన్నెలు శబ్దం వినిపించింది.
'భగవంతుడు ఆడవాళ్ళకే ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడు? ఎదిరించే ఆడదాని నోటికి జంకి, తనను బాగా చూసుకుంటున్నారు. మంచివాళ్ళనేమో ముంచేస్తున్నారు. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇలా వేదనకు గురయ్యే స్త్రీ మూర్తులకు... మొగుడ్ని తిప్పుకోవడం చాతకానితనమా! లేక మూర్ఖుల మనస్సు రంజింపలేమనా! తమలో తామే కుమిలి పోతూ, జీవించినంతకాలం నరకయాతన అనుభవిస్తున్నారు. నా తల రాత దేవుడిలా రాసాడని ఏడుస్తూ కూర్చుంటే... మనోవ్యాధి తప్పితే చివరకు మిగిలేది ఏమి ఉండదు.
ముందు మేము మారాలి... తరువాత తాళికట్టిన వాడ్ని మార్చాలి. మార్పు కోరినప్పుడు మడి కట్టుకు కూర్చోకూడదు. రేపు పొద్దున్న పక్కింటావిడ తో మాట్లాడాలి,' అని మనస్సు లో అనుకుంది.
*****
"మిమ్మల్ని బయటకు వెళ్లొద్దన్నాను కదా! ఎందుకు వెళ్లారు?" గద్దించాడు రాజన్.
"నీళ్ళ కోసం వెళ్లాల్సి వచ్చింది బావా," సన్నగా అంది రాణి.
"ఏ పనికి వెళ్లారో... ఆ పని చూసుకోకుండా మీటింగ్ ఎందుకు పెట్టారు?" కోపంగా అరిచాడు రాజన్.
"వాళ్ళు వదలకుండా అడుగుతుంటే... అత్త..." అంటూ చెప్పబోయింది.
"ఎన్నిసార్లు చెప్పాను. ఎవరన్నా పిలిస్తే పనున్నట్లుగా వచ్చేయమని. అక్కడే ఉంటే వాళ్ళు రెట్టించి అడుగుతూ ఉంటారు. వాళ్లకి మనం సమాధానం చెప్పామంటే మన జుట్టు వాళ్లకి ఇచ్చినట్టే," అన్నాడు.
"మరి మొహం మీదకు వచ్చి అడుగుతుంటే... మాట్లాడకుండా ఎలా తప్పించుకుంటాం?" అంది సుందరి.
"నిన్ను ఎవరు వాళ్ళ వంక చూడమన్నారు? నువ్వు సీరియస్ గా ఉంటే ఎవరూ నిన్ను పలకరించరు. నువ్వు వాళ్ళ మొహాలొంక చూస్తేనే... వాళ్లు నిన్ను పలకరించేది." అన్నాడు.
"నీకేం నువ్వు అలాగే చెబుతావు. అది ఆచరించడం కష్టంరా!" అంది సుందరి.
"ఏంటమ్మా కష్టం! ఇంట్లో తిని కూర్చోక. లేని పోని తలనొప్పులు తెచ్చి పెడతావు. బయటకు వెళ్ళినా మేము ఉండటం లేదా? అది ఉండటం లేదా? మన నాలికను ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. ఎదుటి వాళ్ళ లోతులు తెలుసుకోవాలంటే... మన చెవులకు ఎక్కువ పని చెప్పాలి. నాలికకు ఎంత తక్కువ చెబితే అంతమంచిది.
పెద్ద దానివి నువ్వు మాకు చెప్పాలి గాని... నీకు మేము చెప్పాలంటే సిగ్గు పడుతున్నాం." అన్నాడు భాధగా.
"నేనేం తప్పు చేశాను రా నాయనా! అలా అంటావు? ఎదురు పడి పలకరిస్తే పలక కుండా ఎలా ఉండేది? నీతో చచ్చే చావు వచ్చి పడింది," అంది సుందరి.
"మంచి చెప్తే ఎవడికి ఎక్కదు... నువ్వు వాళ్ళ వంక చూస్తే కదా! వాళ్ళు నిన్ను చూసి పలకరించేది..." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు రాజన్.
లోపలి నుంచి ...
"అత్తా కాఫీ కలుపు" అంటూ సుందరిని లోపలికి పిలిచింది రాణి.
"హా వస్తున్నాను" అంటూ లోపలికి వెళ్ళింది సుందరి.
లోపలికి వచ్చాక "ఎందుకు అత్తా ఎదురు గా నుంచొని జవాబు చెబుతావు. సరే అని ఇవతలకి వస్తే పోతుంది. అక్కడే నుంచుని వాళ్ళు అనే మాటలను వింటావెందుకు? అందుకే పిలిచా. ఇదిగో నీ కాఫీ. వాళ్లకి నేను ఇచ్చేస్తాలే" అంటూ రాజన్ కి జంబేష్ కి కాఫీ ఇవ్వటానికి వెళ్ళింది రాణి.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..
|