
'వీడేంట్రా బాబు ఇలా వెంటపడ్డాడు. అసలే చీకటి పడిందని నేను టెన్షన్ పడుతుంటే! వీధిలో ఎవరైనా చూస్తే లేనిపోని నిందలు పడాల్సి వస్తుంది.
సముద్రం లో పడ్డ వాన చినుకు తన ఉనికిని కోల్పోయినట్లు... దుష్ట దృష్టిలో పడితే... మల్లె లాంటి మనస్సు కూడా మలమల మాడిపోతుంది. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అని ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చా. ఇప్పుడేంటి ఇలా? ఏం చేయను.
పోని ఎక్కడన్నా దిగేసి, వాడిని కన్ఫ్యూజ్ చేసి వేరే ఆటోలో వెళ్లి పోదాం అంటే... ఇప్పటికే చీకటి పడింది. ఈ టైంలో అలాంటి సాహసాలు చేయటం కష్టం. ఎలాగరా దేవుడా! ఇంటి అడ్రస్ తెలుసుకుంటే... తర్వాత నా గురించి ఎంక్వయిరీ చేస్తాడు.
మొగుడు వదిలేసిన దాన్ని అని తెలుసుకున్నాడంటే... ఇక రోజు మన్మధబాణాలు కళ్ళల్లో పెట్టుకుని నాకు బాడీగార్డ్ లా వస్తాడు.
అమ్మో ఇంకా ఏమైనా ఉందా! నా గతి బాగోక మతి చెడి, నే ఉంటే...ఈ మద మతుల తాకిడిని తట్టుకోగలనా?
భయాన్ని మనలోకి ఆహ్వానిస్తే అది సూది మొనలా ఎంట్రీ ఇచ్చి, సర్జరీ చేసే స్థాయికి వెళ్ళిపోతుంది. వాస్తవాన్ని కాలికిందేసి సింహాసనం ఎక్కి కూర్చుంటుంది. అయిన దానికి, కాని దానికి భయపడకూడదు. ఒకవేళ అతను దురుద్దేశంతో వస్తే అప్పుడు ఎలా తప్పించుకోవాలో ఉపాయం ఆలోచిస్తే సరిపోతుంది.'
అని మనసులో రకరకాలుగా అనుకుంటూ, తనను తాను సర్ది చెప్పుకుంటూ ఉంది ప్రణవి.
ఆమె ఆలోచనలు లాగానే ఆటో స్పీడుగా వెళుతోంది. ఆటో ప్రణవి వీధిలోకి రాగానే ఫాలో అవుతూ వచ్చిన ప్రణయ్ వీధి మొదట్లోనే ఆగిపోయాడు.
అది చూసి హమ్మయ్య అని గుండెలమీద చేయి వేసుకుంది ప్రణవి.
ఇందాక మాటల సందర్భంలో అతని ఇల్లు ఆ వీధిలోనే అని అతను చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, తనను తాను తిట్టుకుంటూ నెత్తి మీద ఓ మొట్టికాయ వేసుకుంది.
'అనుమానమా! నీవెంత నేర్పరి వే! నాలోని ఆలోచన జ్ఞానాన్ని అణిచేయాలని ఎంత ఎత్తు వేసావే!' అనుకుంది నవ్వుకుంటూ.
ఇంటి ముందుకు రాగానే, ఆటో దిగేసి, డబ్బులు ఇచ్చి లోపలకు వెళ్ళింది. అప్పటికే ఇంట్లో వాళ్ళు కారాలు, మిరియాలు నూరుతూ ఉన్నారు.
"నువ్వు సంపాదించిన ఇస్టేట్స్ చాలుగానీ, ఇక బయటకు వెళ్ళబోక, నువ్వూ, నీ పిల్లలు మాకు భారం కాదు. తాడి చెట్టు కింద నుంచొని నువ్వు పాలు తాగినా కల్లు తాగేవనే అంటారు. పెళ్లి కానీ అమ్మాయి నన్నా ఏమన్నా అంటానికి, జంకుతారేమో! గాని మొగుడు వదిలేసిన ఆడదాని మీద నిందలు వేయడానికి లోకుల నాలుక షాంఘై మాగ్లేవ్ {గంటకు 460 కిలోమీటర్లు( చైనా)} రైలంత స్పీడ్ గా వచ్చేస్తుంది. రేపొద్దున్న ఏదన్న జరగరానిది జరిగితే... మీ అత్తారికి ఏం సమాధానం చెప్పాలి? మేము తలెత్తుకొని తిరగగలమా?" ఆవేశంగా అంది గిరిజ.
"అమ్మా! నేను ఎలాంటి దానినో నీకు తెలియదా?" బాధగా అంది ప్రణవి.
"నా బిడ్డ గురించి నేను తప్పుగా మాట్లాడతానా! తల్లీ... నువ్వు నిప్ప ని నాకు తెలియదా!?! లోకం ఏమన్నా అంటారు, ఏదైనా చేస్తారు అన్న భయంతోనే అనేది. నీ మీద నమ్మకం లేక కాదు. నిన్ను బాధ పెట్టాలనీ కాదు, అర్థం చేసుకో!" అంది నొచ్చుకుంటూ.
"నాకు మాత్రం తెలియదా అమ్మా! నేను మాత్రం చీకటి పడే వరకు ఉండాలని అనుకుంటానా? ఈరోజు అనుకోకుండా లేటు అయ్యింది." అని చెప్పింది.
"సర్లే ఈ వ్యాపారాలు ఇంతటితో కట్టిపెట్టేసి, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవడానికి ప్రయత్నించు. వెళ్లి స్నానం చేసి అన్నం తినేసి పడుకో," చెప్పింది గిరిజ.
పిల్లలు అప్పటికే పడుకుండిపోవడంతో, ప్రణవి స్నానం చేసేసి అన్నం తినేసి వచ్చి పడుకుంది.
పడుకుందన్నమాటే గాని ఆమెకు నిద్ర పట్టడం లేదు, అనే కంటే బ్రతుకు భయం ఆమెను నిద్రపోనియ్యడం లేదు అనడం సబబేమో!
అందరూ నిద్రపోతున్నారు. టైం పన్నెండు కావొస్తోంది.
తలుపు దబదబా బాదుతున్న శబ్దం వినబడింది. ముందు వాళ్ళింటి తలుపేమోనని శబ్దాన్ని జాగ్రత్తగా వినింది ప్రణవి. కానీ అది పక్కింటి తలుపు.
తండ్రి ఆంజనేయులు చనిపోయాక, గిరిజ కు పెన్షన్ కి, తమ్ముడు కృష్ణకు జాబ్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగవలసి వచ్చింది. ఆ ఊరు నుంచి తిరగడానికి వీలుకాక, గిరిజ ముగ్గురు పిల్లల్ని తీసుకుని పట్నం వచ్చేసింది.
10 ఇళ్లు ఉన్న లోగిలిలో వారు అద్దెకు దిగారు. ముందు ఐదు పోర్షన్లు వెనుక 5 పోర్షన్లు ఉంటాయి. దగ్గర దగ్గరగా ఇళ్ళు ఉండటంతో... పక్కపక్కనున్న ఇళ్లల్లోని మాటలు, శబ్దాలు ఒకరికొకరికి వినిపిస్తూ ఉంటాయి.
పక్కింటి తలుపు తీసిన శబ్దం వినిపించింది. వెంటనే గట్టిగా శబ్దం, పక్కింటి ఆవిడ ఏడుపు ప్రణవికి వినిపించాయి.
*****
ఎండలు తీవ్రంగా ఉండటంతో నీటి ఎద్దడి ఏర్పడింది. వీధి కుళాయిలు బంద్ అయిపోయాయి. ఇంట్లో మోటార్లలో నీళ్లు పైకి ఎక్కడం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ వస్తుంది అని తెలియగానే, మహిళలందరూ బిందెలు పట్టుకుని క్యూలో నుంచొని ఉన్నారు.
నీళ్లు తేవడానికి బిందెపుచ్చుకొని బయలుదేరారు, రాణి, సుందరి. వీళ్ళని చూడగానే వీధిలో కొందరు ఆడవారు మొహం తిప్పుకున్నారు.
ఒక ఆవిడ సుందరిని ఉద్దేశించి,
"మీ చిన్న కోడలు ఎక్కడా? కనబడదేం?" అంటూ అడిగింది.
"ఆవిడకి గోషా కాబోలు బయటికి తీసుకురారేమో!” అంటూ గొణిగింది ఇంకొక ఆవిడ.
"అబ్బే అదేం లేదండి. మా కోడలు పురిటి మంచం చూడటానికి పుట్టింటికి వెళ్ళింది." అంటూ చెప్పింది ప్రణవి అత్త సుందరి.
"ఏంటి ఐదు సంవత్సరాలా?!? పురిటి మంచం చూసి రావడానికి," ఆశ్చర్యంగా అడిగింది ఇంకొక ఆవిడ. "ఏంటి ఐదేళ్ల నుంచి ఇక్కడ లేదా! ఏమైంది? గొడవపడి వెళ్ళిపోయిందా?" అడిగింది ఇంకొక ఆవిడ.
"చెప్పడానికి సిగ్గు పడి చస్తున్నాం. ఆ పిల్ల మాతో కలవలేదు. చదువుకున్నానని పొగరు ఎక్కువ. మొగుణ్ణి పట్టుకొని, నువ్వు మగవాడివి కాదు అంది. పాపం మా రాణిని పట్టుకు నానా మాటలూ మాట్లాడింది. దానికి వాడికి రంకుతనం అంటగట్టింది," అంటూ చెప్పుకు పోతోంది.
"ఆవిడ చెప్పేవి అన్నీ అబద్ధాలే... పాపం ఆ అమ్మాయి ఏం మాట్లాడేది కాదు. వీళ్ళే ఆ అమ్మాయిని గెంటేశారు," వారి మాటలు విన్న హౌస్ ఓనర్ కలగజేసుకుంటూ చెప్పింది.
"అత్తా రా... !" అంటూ పిలిచింది రాణి.
"నీళ్ళు..." నసిగింది సుందరి.
"పట్టేసి ఇంట్లో పెట్టేసాను రా!" అంది రాణి.
రాణి వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే... వాటర్ ట్యాంక్ రావడంతో... చిటుక్కున వాళ్ళ సందులోకి దూరేసి గబగబా నీళ్లు పట్టుకుని పోయింది. సుందరి రాణి వెనుకగా వెళ్ళిపోయింది.
"నిన్ను ఎవరితో మాట్లాడొద్దని చెప్పాను కదా! వాళ్ళకు తెలిస్తే ఊరుకోరు." అంది సుందరిని ఉద్దేశించి.
ఇద్దరూ ఇంట్లోకి రాగానే...
ఇంట్లో ఎప్పుడు వచ్చారో ఏమో! రాజన్, జంబేష్ లు కూర్చొని ఉన్నారు.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..
|