చేతిలో ఉన్న బరువు సంచులను ఒక భోగిలోకి విసిరేసి హేండిల్ పట్టుకుని ట్రైన్ తో పాటు స్పీడ్ గా పరిగెడుతూ ఎక్కే ప్రయత్నం చేసింది ప్రణవి.
ఎవరో ఆమె చేతిని అందుకొని ట్రైన్లోకి ఒక్క గుంజు గుంజారు.
స్పీడ్ గా లోపలకి వచ్చి చేరింది ప్రణవి. ఆ స్పీడ్ కి పడబోయి నిలదొక్కుకుంది. కానీ ఆమె గుండె వేగం కొట్టుకుంటూనే ఉంది.
అక్కడ ఉన్న అందరూ ప్రణవి ని తిట్టడం మొదలుపెట్టారు.
"మగవాళ్ళం మేమే ఇటువంటి సాహసాలు చేయం, మీరేంటి ఇలా?" అని ఒకరు,
"ఇంట్లో చెప్పేవచ్చావా?" అని మరొకరు,
"ప్రాణం సమయం కన్నా విలువైనది. దాన్ని కాపాడుకోవడానికి... సమయాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి." అని హితబోధ చేస్తూ ఇంకొకరు,
"చూస్తూ చూస్తూ ఎవరూ ప్రాణాల మీదకు తెచ్చుకోరు కదా! ఆవిడకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో!" జాలిగా వేరొకరు...
"ఆడవాళ్ళకు ఏం పనులు ఉంటాయి? ఈ టైం వరకు," అని వెకిలిగా ఒకడు.
"ఏ కాలంలో ఉన్నావు మిష్టర్? ఇప్పుడు ఆడ మగ అందరూ సమానమే! మీకు లేని కట్టుబాట్లు మాకేంటి?" అని అంది ఓ కౌమార కోమలి, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
"కాసేపు ఆవిడకి గాలాడనివ్వండి. ఎంత టెన్షన్ గా ఉందో చూడండి." అన్నారు ఒకళ్ళు.
"అయినా అమ్మాయి నువ్వు ఇంత సాహసం చేయకూడదు." అన్నాడు ఓ వృద్ధుడు.
"ఆవేశం లో ఉన్నవారికీ, ఆదుర్దాగా ఉన్నవారికి హితోపదేశాలు ఎక్కవు. ముందు ఆవిడని స్థిమితంగా కూర్చోనివ్వండి," అంటూ ఓ పెద్దావిడ అందర్నీ పక్కకు జరిపి,
ప్రణవిని తీసుకొచ్చి ఓ సీటు ఖాళీ చేయించి అందులో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఆమె చేతికి అందించి,
"నీళ్ళు తాగి, కాస్త కళ్ళు మూసుకుని అలా జారబడు. నువ్వు ఎక్కడ దిగాలో చెబితే... లేపుతాను," అని చెప్పింది.
“పరవాలేదు లెండి. మీరు కూర్చోండి..." అంటూ లేవబోయింది ప్రణవి.
"నాకు సీటు ఉంది లేమ్మా నువ్వు కూర్చో," అని చెప్పి ఆవిడ తన సీటులోకి వెళ్ళి కూర్చొన్నది.
ప్రణవి కళ్ళు మూసుకుని కూర్చొంది. కళ్ళనైతే మూయగలిగినది కానీ, బుర్రలో అడ్డూ అదుపూ లేకుండా సుడులు తిరుగుతున్న ఆలోచనలను ఆపలేకపోయింది.
‘భరోసా కొరవడిన జీవిత సాగరంలో భవిష్యత్తు ఒడ్డుకు దారప్పోగు సాయంతో ఈదులాడుతున్నానా!?! ఈ చిన్న చిన్న ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదు. కష్టపడి ఏదైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి,' అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నది ప్రణవి.
ఆమె దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రైన్ దిగి వడివడిగా ఆటోస్టేండ్ వైపు నడుస్తోంది.
ఫ్లై ఓవర్ ఎక్కి వెళితే టైం ఎక్కువ తీసుకుంటుందని, ప్లాట్ ఫారం చివరకు వెళ్ళి రైలు ట్రాక్ మీంచి వెళ్ళాలని నిశ్చయించుకొని, వడివడిగా నడుస్తోంది. ఆ వైపు వెలుతురు తక్కువగా ఉంది.
'పిల్లలు తిన్నారో! లేదో! ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో! నా మీద ఏం ఎగురుతున్నారో!' ఇలా రకరకాలుగా ఆలోచిస్తోంది ప్రణవి.
ఆమె ఆలోచనలన్నీ ఇంటి చుట్టే తిరుగుతుండటంతో...పరిసరాలను గమనించడం లేదు.
ఆమె వెనకాలే ఆమెను ఓ బేవర్స్ బేచ్ ఫాలో అవుతూ వచ్చారు.
పరధ్యానంగా ఉన్న ప్రణవి పక్కకి ఒకడు వచ్చి, "ఏయ్ పిల్లా వస్తావా?" అన్నాడు.
వాడి మాటలు వినిపించుకోలేదు ఆమె.
"ఒరే... పాపకి సెవుడేమో! సెవికాడ కెళ్ళి అడుగు," వెకిలిగా నవ్వుతూ అన్నాడు
వాళ్లలో ఉన్న ఇంకొకడు.
పనిలో పని రేటు కూడా అడిగేసేయ్... అన్నాడు ఇంకొకడు.
ఆ పోకిరి ఆమెకు దగ్గరగా వెళ్ళి...
"ఏయ్... ఆగు... ఫ్రీగా వద్దులే డబ్బులు ఇస్తాం." అన్నాడు గుసగుసగా.
ఈ లోకం లోకి వచ్చిన ప్రణవి,
'ఇలాంటి సమయంలో పెదవి విప్పకూడదు. ఏమన్నా తిరిగి అంటే వాళ్ళు మరింత రెచ్చిపోతారు. ఇలాంటి అల్లరి మూకకి నీతి నియమాలు ఉండవు. ఎదుటివారి మనోభావాలతో వారికి పనిలేదు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేస్తారు. వాళ్ళని మాటలతో వేధించి, పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు,' అని మనసులో అనుకుని, ఏమి మాట్లాడకుండా, తనని కాదు అన్నట్లుగా... వేగంగా నడుస్తోంది ప్రణవి.
వాళ్లు మరింత స్పీడ్ గా వచ్చి, ప్రణవిని రౌండప్ చేసారు.
ఇక మాట్లాడక తప్పలేదు ప్రణవికి.
"ప్లీజ్ దారివ్వండి," అంది రిక్వెస్ట్ గా.
"ఏంటే పెద్ద పతివ్రతలా ఫోజులు కొడుతున్నావు? మర్యాదగా అడిగామనా?" అంటూ
ఆమె చున్నీ పట్టుకొని లాగబోయాడు ఒకడు.
అంతే అతని చెంప చెళ్ళుమంది.
ఆ దెబ్బకి బిత్తర పోయి చూసాడు అతను.
ఏం జరిగిందో అర్థం కాక, అయోమయంగా అటు చూసింది.
ఆ మసక వెలుతురు లో... అస్పష్టంగా కనిపించాడు ఓ బలిష్టమైన వ్యక్తి.
ప్రణవికి పరిస్థితి అర్థం అయ్యింది.
బెవర్స్ బేచ్ లో మిగిలిన వారంతా ఎలర్ట్ అయి... ఎదిరిద్దామా! పిక్క బలం చూపిద్దామా!?! అన్నట్లుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
మనిషి దృఢంగా ఉండటంతో... సైగలు చేసుకొని అందరూ పారిపోబోయారు.
కానీ ఆ వ్యక్తి వారిని వదిలిపెట్టలేదు. చిక్కిన వాడిని చిక్కినట్టు బాది బాది పెట్టాడు.
అందరూ పట్టాలకు అడ్డంపడి పారిపోయి... చీకట్లో కలిసిపోయారు.
అతను వెనక్కి తిరిగి వచ్చి,
"భయం లేదు లెండి వెధవలు వెళ్ళిపోయారు. ఆడది వంటరిగా కనిపిస్తే చాలు చిత్త కార్తి కుక్కలు లా వెంటపడతారు. ఇలాంటి వాళ్ళకు భయపడకూడదు. ధైర్యంగా ఎదిరించాలి. అందుకే ఆడవాళ్ళు ఆత్మ రక్షణ కోసం కరాటే, కుంఫూ లాంటి విధ్యలు నేర్చుకోమనేది. బైదబై నాపేరు ప్రకాష్. నేను మీరు ఉండే వీధిలోనే ఉండేది." అంటూ లొడ లొడా మాట్లాడాడు.
"ధన్యవాదాలు సర్" అని మాటలు పొడిగించడం ఇష్టం లేక ముక్తసరిగా చెప్పి ఊరుకుంది.
"భలే వారే మనలో మనకి ధన్యవాదాలు ఎందుకు?" అన్నాడు.
'మనలో... మనకి అంటాడేంటి? నాకేమన్నా స్నేహితుడా? బంధువా?' అని మనసులో అనుకుని, పైకి ఏమీ మాట్లాడలేదు.
రైలు పట్టాలు దాటేసారు.
ఆమె ఆటో స్టాండ్ వైపుకు నడిచి వెళుతోంది.
ఇంతలో అతను బైక్ పై ప్రత్యక్షమై... "ఈ టైంలో ఆటో వాళ్ళు ఎక్కువ అడుగుతారు. అది ఒంటరిగా... ఆటోలో వెళ్ళటం సేఫ్ కాదు... మీకభ్యంతరం లేకపోతే, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను," అన్నాడు.
"పర్వాలేదు లెండి. నేను వెళ్తాను," అని చెప్పి, ఒక ఆటో మాట్లాడుకుని ఎక్కేసింది.
అతను ఆటో నే ఫాలో అవుతూ రావడం చూసి, 'వీడేంటి జిడ్డులా వెంటపడ్డాడు. కొంపతీసి ఆ అల్లరి మూకను వీడు అరేంజ్ చేయలేదు కదా!' అని మనసులో అనుకున్న ది ప్రణవి.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లికరచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.) పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు. బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’. సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు. |