కొద్దిగా ఈ చలి రాత్రి
- గవిడి శ్రీనివాస్
ఉక్కపోత సమయాల నుంచి
ఆరుబయటకు వచ్చి
ప్రాణాన్ని ఆరబోసుకుంటున్నాను.
ప్రాణ వాయువు వీచి
మనసుని లేపినట్లయింది.
చలి గాలి కాస్త సుఖం గాను వుంది.
దుప్పటిని కాస్త తెరుస్తూ మూస్తూ
దోబూచులాడుతుంటాను.
రోజులు చిగురులు తొడిగి
చెట్ల గాలులు ఉయ్యాలలూపి
ఎల్లప్పుడూ తడి తడి గా ఉంచుతుంటాయి .
జీవితాన్ని ప్రేమించడం మొదలెట్టాక
చలైన ఎండైన వానైనా
కొన్ని సమయాలు ఉపిరిలూదుతూ
ఊతమిస్తాయి.
చల్ల గాలి కొరుకుతుంటే
చెట్లలో చూపులు చిక్కుకుంటున్నాయి.
ఆకాశాన్ని కళ్ళల్లో నింపుకుని
చుక్కల్ని వెలిగించుకుంటున్నాను.
కొద్దిగా ఈ చలి రాత్రి
ఒద్దికగా చలిని వెలిగించుకుని
కలల అంచున తేలుతూ
ఒక దిండు పై రెండుగా వాలుతూ
ఒక స్వప్న లోకం లో మునిగిపోతాను.