Menu Close

Alayasiri-pagetitle

మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

కోదండ రామాలయం, గొల్ల మామిడాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

KodandaRamalayam_GollaMamidada

మన సంస్కృతి ఎంత విలువైనది, పురాతనమైనది. అందుకు ప్రామాణికాలు, ప్రతి ఒక్క గ్రామంలో నిర్మితమైన మన దేవాలయాలు. తరాలు మారి అంతరాలు పెరుగుచున్నను తమ నిర్మాణ పటిమను చూపుతూ తమలో ఎటువంటి మార్పు ఉండదని ఠీవిగా నిలుచుని మన ప్రాచీన సంస్కృతిని, సామాజిక స్థితిగతులను ప్రతిబింబింప జేస్తున్నాయి. ఎన్ని ప్రకృతి విలయాలు ఏర్పడినను మేమున్నామని ధైర్యం చెప్పే ఆ మహా రాజగోపురాల రాజసం వర్ణించడానికి ఎన్నో కావ్యాలు వ్రాయాలి. ఒక విధంగా ఈ రాజగోపురాలు మనకు దిక్చూచి వంటివి. ఊరిలో ఏవైపు నుండి చూసినను ఎత్తుగా ఉండి మనకు దోవ చూపుతాయి. అటువంటి పెద్ద గోపురాలను కలిగి నిత్యపూజలతో అలరారుతున్న గొల్ల మామిడాడ శ్రీ కోదండరామ ఆలయం యొక్క విశేషాలే నేటి మన ఆలయసిరి.

తూర్పు, పడమర రెండు వైపులా రెండు ప్రధాన రాజగోపురాలతో ఈ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. తూర్పు వైపున ఉన్న రాజగోపురం దాదాపు 200 అడుగుల ఎత్తుతో అనేక అంతస్తులు కలిగి ఉంటుంది. ఆ గోపురం చివరి అంతస్తు నుండి చూస్తే దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఊళ్ళు, పచ్చటి గోదావరి పచ్చిక బైళ్ళు మనకు గోచరిస్తాయి. రాజగోపురాల మీద రామాయణ భారత భాగవత ఘట్టాలను అత్యంత శోభాయమానంగా చెక్కారు. మన సంస్కృతిని గుర్తుచేసుకోవడానికి ఇటువంటి ఆలయాలను సందర్శిస్తే చాలు. వేరే పుస్తక పఠనం అవసరం లేదు.

ఇక ఈ హనుమత్ సీతా లక్ష్మణ సమేత కోదండ రామ ఆలయ చరిత్రను గమనిస్తే, ఈ దేవాలయం క్రీ.శ. 1889 సంవత్సరంలో కోలల రూపంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఆ తరువాత ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు ద్వారంపూడి రామిరెడ్డి గార్ల నిర్వహణలో 1934 సంవత్సరంలో పూర్తి రాతి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ తరువాత ఆలయ నిర్మాణం కూడా జరిగి, నాటి నుండి నేటికీ అప్రహితంగా నిత్యపూజలతో అలరారుచున్నది. ఈ ఆలయ విశేషాలు ఈ క్రింది యు ట్యూబ్ లింక్ లో చూడవచ్చు. https://www.youtube.com/watch?v=n4qlEKyVY8c

1954లో అద్దాల మందిర నిర్మాణం జరిగింది. రామపట్టాభిషేక అనంతరం తనకు ఎంతగానో సహాయం చేసిన వానరులకు సత్కారము చేస్తున్న సమయంలో హనుమంతుడు తనకు రాముడు బహూకరించిన రత్నాల హారములోని రత్నములలో రామ నామాన్ని వెతుకుకొను ఘట్టమును, అత్యంత రమణీయముగా చిత్రీకరించిన దృశ్యమును, ఈ అద్దాల మేడలో మనం చూడవచ్చు. అలాగే గాజు అరలలో అమర్చిన సీతారామ విగ్రహాలు, సింహాసనము పరికించినచో, ఊయల ఊగుచున్నట్లుగాను, సీతారాములు సింహాసనములో కుర్చున్నట్లుగాను అనిపిస్తుంది. అది ఆ అద్దముల అమరిక వలన ఏర్పడిన భ్రాంతి మాత్రమే కానీ ఎంతో ముచ్చట గొలుపుతుంది.

ఈ ఆలయంలో ముఖ్యమైన రోజులు అనేకం ఉన్నాయి. ప్రధానమైనవి శ్రీరామనవమి, రథసప్తమి. మరొక ముఖ్యమైన సేవ శ్రీ పుష్పయాగ విధి, ఈ కార్యక్రమం శ్రీరామనవమి తరువాత ఐదవ రోజున జరుగుతుంది. భద్రాచలం లో లాగానే ఇక్కడ కూడా రాములవారి కళ్యాణం ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరుగుతుంది. ఈ కోదండ రామాలయం దర్శించడం నిజంగా ఒక మంచి సంతృప్తిని మిగులుస్తుంది.

Posted in June 2018, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!