
‘అడుగులోన అడుగు వేసి’ నా మొదటి కథ. మార్చ్ 1986 లో స్వాతి వార పత్రికలో వచ్చింది.
1985 నా జీవితంలో గొప్ప మైలు రాయి. మా ఏకైక వారసుడు ఆదిత్య ఆ సంవత్సరం పుట్టాడు. మా ఆవిడ నిర్మల, అబ్బాయి పుట్టిన తరువాత ఐదు నెలలు పుట్టినింట్లోనే ఉండటంతో, సాయంత్రాలు సమయం గడిచేది కాదు. చిన్నప్పటి నుంచే మా మేనమామ, అమ్మ, నాన్నల సాహిత్యాభిలాష ప్రభావం వల్ల పుస్తకాలు తెగ చదివినా, వ్రాయాలన్న ఆలోచన రాలేదు. అప్పుడు నేను పని చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ లో రామశాస్త్రి నా సహోద్యోగి, మిత్రుడు. అతను ‘అనామకుడు’ అన్న కలం పేరుతో అప్పటికే కథలు వ్రాసి ప్రచురించాడు. అలానే మా మేనమామ పిల్లలు, మధురాంతకం నరేంద్ర, మహేంద్ర కథలు పత్రికలలో రావడం మొదలు బెట్టాయి. తీరిక సమయం, వీరు తొక్కిన మార్గం వెరసి నేను నా మొదటి కథ వ్రాయడానికి స్ఫూర్తినిచ్చాయి.
అప్పటి కాలంలో నాకు పి. జి. వోడ్హౌస్ రచనలంటే పిచ్చి. రాస్తే అలాంటి హాస్యరస ప్రధాన కథలే వ్రాయాలని అనుకుండేవాడిని. అలానే ఓ హెన్రీ కథలు, ఆ కథలలోని కోస మెరుపులు నాకు తెగ ఇష్టం. ఆ రెంటి కలయికల ఔత్సాహిక ప్రయత్నం, ఈ కథలో కనిపిస్తుంది.
అప్పుడు నేను పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ నియమాల ప్రకారం, బయట పత్రికలకు ఏది వ్రాసినా, బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. అది సమయంతో కూడిన పని, చీకాకు కావడంతో నేనూ అప్పటికే కథలు వ్రాస్తున్న కొందరు సహోద్యోగులు లాగా, ఒక కలం పేరుతో వ్రాద్దామనుకున్నాను. కొత్తగా నా జీవితంలో అడుగుపెట్టిన మా ఆవిడ పేరు, మా అబ్బాయి పేరు కలిపి, కొత్తగా అడుగుపెడుతున్న మానస పుత్రిక, నా రచనా వ్యాసంగానికి, ‘నిర్మలాదిత్య’ అని నామకరణం చేసాను. ఆ పేరు ఎన్నుకోవడంలో ఆంధ్రుల శాతవాహన రాజుల సాంప్రదాయం, చిన్నప్పుడు చదివిన బేతాళ కథల ప్రభావం ఉండి ఉండొచ్చు.
కథ పంపిన కొన్ని వారాలకే ఎడిటర్ వేమూరి బలరామ్ దస్తూరి తో కథ ప్రచురణకు ఎన్నుకున్నట్లు రావడం ఆనందం వేసింది. పత్రికలో పేరు చూసుకొని, ఆనంద పడిన నాకు, కథ పారితోషికం అక్షరాల 75 రూపాయలు అందడంతో ఆశ్చర్యం తోడయ్యింది.
నా కథ ‘నేను - నావారు’ మరో సంవత్సరం తరువాత పడిన తరువాత కానీ మా మేనమామ మధురాంతకం రాజారాం గారు నా కథల గురించి స్పందించలేదు. ఆయనకు నా మొదటి కథ నచ్చలేదని తరువాత అర్థం అయ్యింది. ఈ కథ లో ‘ప్లేయింగ్ టు ద గ్యాలరీ’ లక్షణాలు కనిపించి ఉండాలి. మా మామ సూచించిన చిరకాలం మన్నే ‘క్లాసికల్’ కథలు, వ్రాసే ప్రయత్నం అటు తరువాతే ప్రారంభమై, ఇంకా కొనసాగుతున్నది.
కానీ, రచయితగా ఇది మొదటి కథ, ఇప్పటికీ పరిస్థితులు మారనందు వల్ల ఒక సతత హరిత కథ. కాబట్టి ముద్దే. కొన్ని కథలు చదువుతున్నంత సేపు నవ్విస్తూ ఉంటాయి. మరి కొన్ని మధ్య, మధ్య విరామం లతో ఆగి, ఆగి నవ్విస్తాయి. కొన్ని కథలు సీరియస్ గా ఉన్నట్లే ఉంది, చివరకు భళ్ళున నవ్విస్తాయి. మరి ఆలస్యం ఎందుకు, కథ చదివి మీ అభిప్రాయం ప్రకారం ఈ కథ ఏ తరగతి లో పడుతుందో పంచుకోండి.
అడుగులోన అడుగువేసి

హైదరాబాదు పిచ్చాసుపత్రి,
17-7-1985 (అమావాస్య) రాత్రి 11గంటల 30 నిమిషాలు.
హాస్పిటల్ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎర్రటి మారుతీకారు, ఆవరణలోకి వచ్చి, నెమ్మదిగా అక్కడ వున్న చెట్లగుబురువైపు తిరిగి, వాటి క్రింద ఆగింది. కారులో డ్రైవరు తప్పితే మరెవరూలేరు. కారులోంచి అతను దిగి, కారు తాళం వేసి అటు ఇటు చూసాడు. రాత్రి కాబట్టి ఆవరణలో ఎవరూ లేరు. హాస్పిటల్ వైపు వేగంగా నడవసాగాడతను.
మనిషి సన్నగా, ఐదున్నర అడుగుల కంటే ఎత్తుగానే ఉన్నాడు. చేతులు పొడవుగా ఉన్నాయి. కాని మనిషి నడకే, కొంచెం కులుకుతున్నట్టు, వెనక నుంచి చూస్తే ఏదో అమ్మాయి నడిచినట్టు కనిపిస్తోంది. ఖరీదైన బట్టలే వేసుకున్నాడు. పేంటు ఆపై వదులుగా ఫుల్‌హాండ్స్ చొక్కా వేసుకున్నాడు.
హాస్పిటల్ వాచ్‌మన్ గుమ్మం దగ్గర ఇతనిని చూచి పలకరింపుగా నవ్వి సెల్యూట్ చేసాడు.
‘‘ఏం నర్సయ్యా, ఇవాళ నీకు డ్యూటీ పడిందా? డాక్టరు వున్నాడా?’’ అని పలకరింపుగానే ప్రశ్నించాడతను వాచ్‌మాన్‌ను. అతడి గొంతుకూడా కీచుగా, యింకా గొంతు ఎదగని పిల్లవాడి గొంతులాగా వుంది. ‘‘జీసాబ్, డాట్రు సాబ్ పదిగంటలకు డూటికెక్కిండు’’ అని చెప్పాడు నర్సయ్య.
అతను ఆ హాస్పిటల్‌తో పరిచయమున్న వ్యక్తిలాగా మలుపులు తిరిగి ఒక గది ముందు ఆగాడు.
‘డాక్టర్ చంద్రన్’ అని ఆ గది ముందు బోర్డు ఉంది. తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించాడు.
‘‘హల్లో కుమార్! నీవీపాటికి వస్తుంటావని ఇప్పుడే అనుకున్నాను. రా కూర్చో’’ అన్నాడు డాక్టర్ చంద్రన్.
‘‘హల్లో చందూ. అమావాస్య, పౌర్ణమి రోజులలో అయితే తప్పనిసరిగా వస్తానని నీకు తెలుసుగా. అసలు నా స్నేహితుడిగా నీవు ఈస్థానంలో ఉండడం నా అదృష్టం. ఇలాంటి అవకాశం వదులుతాననుకున్నావా?’’ అన్నాడు కుమార్.
‘‘పన్నెండు గంటలవ్వడానికి ఇంకో ఇరవైనిమిషాలుంది. కాఫీ తాగుతావా?’’
‘‘కాఫీ అంటే నేను ‘నో’ అననుకదా?’’
చంద్రన్ ప్లాస్క్‌లో నుంచి కాఫీ రెండు కప్పుల్లో పోసి ఒక కప్పు కుమార్ కిచ్చి, తన కప్పులోనుంచి కాఫీ త్రాగుతూ కబుర్లు చెప్పసాగాడు.
పదకొండు గంటలా యాభైనిమిషాలైంది.
‘‘ఇక బయలుదేరుదామా?’’ అన్నాడు చంద్రన్ గడియారం చూసి.
‘‘సరే’’ నంటూ కుమార్ లేచాడు.
‘‘ఇవాళ ఎవరిని చూస్తానంటావ్?’’
‘‘ఏదైనా క్రొత్తగా ఉండాలి. నీకు తెలుసుగా అన్ని కేసులు. ఏదైనా ఇంటరెస్టింగు కేసు చూపెట్టు’’ అన్నాడు కుమార్.
డాక్టర్ చంద్రన్, కుమార్‌ని ఒక గది దగ్గరకి తీసుకొచ్చాడు. గదిలోకి చూడడానికి వీలుగా ఒక చిన్న గాజు కంత ఉంది. అందులోనుంచి చూడమన్నాడు కుమార్‌ని. లోపలికి చూసాడు. ఒక పేషంటు నిద్ర పోకుండా ఉన్నాడు.
‘‘నీకెలాగూ ఓ అరగంట పడుతుందిగా, నేను మిగతా వాళ్ళనొకసారి చూసివస్తా’’ నని చంద్రన్ వెళ్ళిపోయాడు.
‘‘సరే’’ నని కుమార్ మళ్ళీ గదినీ, పేషంటునూ పరిశీలించసాగాడు. పేషంట్ వున్నట్లుండి గోడవైపు తిరిగి గోడకేసి తలకొట్టుకోసాగాడు. కొంతసేపైన తరువాత మరోగోడ వైపు పరిగెత్తాడు. గోడను మళ్ళీ కొట్టుకుంటాడేమో అనుకునేసరికి, ఆగి మెల్లగా రెండడుగులు వెనక్కి వేసాడు. వెంటనే గట్టిగానవ్వి, తిరిగి మరో గోడవైపు పరిగెత్తాడు. మళ్ళీ ఆగి, రెండడుగులు వెనక్కి వేసి గట్టిగా నవ్వడం... అలాగే పరిగెత్తడం... ఆగడం... రెండడుగులు వెనక్కివేయడం... గట్టిగా నవ్వడం... పరిగెత్తడం... ఆగడం... రెండడుగులు వెనక్కి వేయడం... గట్టిగా నవ్వడం... విసుగూ విరామం లేకుండా అలా చేయడం మొదలెట్టాడు.
కుమార్ ఆ పేషంట్‌ను, అతడి చేష్టలను బాగా పరిశీలించి అర్థమైనట్టు తలూపి, తన పాంటు జేబులోనుంచి చిన్న ఎర్రటి డైరీ లాంటి పుస్తకం తీసి దాంట్లో వ్రాయడం మొదలెట్టాడు.
***
మాసాబ్ టాంక్
19-7-85, సాయంత్రం 5 గంటలు
కుమార్ ‘బంజారా హిల్స్‌లో’ వున్న ఇంకో స్నేహితుడిని కలవాలని మాసాబ్ టాంక్ దగ్గర కారును మలుపు తిప్పాడు. కొద్దిగా ముందుకు పోయే సరికి, ఓ పక్క ఖాళీ స్థలంలో పెద్ద గుంపు కనబడింది. దొమ్మరివాళ్ళు ఆడుతున్నట్లుంది. వెంటనే కుమార్ కారును అక్కడనే ఓ ప్రక్క ఆపి, ఆ గుంపువైపు నడిచాడు. ఆట అప్పటికే మొదలైంది.
ఒక ఆడామె మోకాలివరకూ చీరబిగించి కట్టి, రెండు వెదుళ్ళమధ్య కట్టిన తాడుపై నడవసాగింది. ఇంకో మగవాడు క్రింద పిల్లిమొగ్గలు వేస్తున్నాడు. చిన్నపిల్లలిద్దరూ ఓమూల కూర్చొని డోలు, తప్పెట వాయిస్తున్నారు.
ఆవిడ ఈ వైపు నుంచి ఆవైపుకు రెండుసార్లు నడిచి, క్రిందకు దూకి తానుకూడా పిల్లిమొగ్గలు వేయసాగింది... ఇదంతా చూస్తున్న కుమార్ ముఖం వికసించింది. ఆట సాంతం చూసి, వాళ్ళకు ఓ ఐదు రూపాయలిచ్చి వాళ్ళచేత ‘దెమ్మ పెబువు’ లనిపించు కొని, కారులోకి వచ్చి కూర్చున్నాడు.
వెంటనే తన జేబులో నుంచి ఎర్రపుస్తకం తీసుకొని వ్రాయడం మొదలెట్టాడు. వ్రాయడం ఓ ఐదు నిమిషాలకు పూర్తి అయ్యాక, కారు స్టార్ట్‌చేసి ‘బంజారాహిల్స్’ పైకి పరిగెత్తించాడు.
***
నెహ్రూ జూలాజికల్ పార్కు,
‘24-7-1985’. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు.
బుధవారం కాబట్టి పెద్ద జనంలేరు జూలో. ఆది, శనివారాలలో తను అనుకున్నది చేయనివ్వరు జనం. కారులోపలికి వెళ్ళడానికి టికెట్టు తీసుకొని ఓ రెండువందల గజాలు దాటి కారును నిలిపాడు కుమార్. అక్కడికి కొద్దిగా ప్రక్కనే కోతులుండే స్థలముంది. ఓ పది పన్నెండు మంది పిల్లలు, ఓ ఐదారుమంది పెద్దలు తప్పితే ఎవ్వరూ లేరు. వాళ్ళు కూడా ఓ పదినిమిషాలకు వెళ్ళిపోయారు.
చింపాంజీలుండే ఎన్‌క్లోజర్ ఎదురుగా కూర్చున్నాడు కుమార్. ఇంతకు ముందు మగా, ఆడ రెండు చింపాజీలుండేవి. తాను అంత తిరగనవసరం వచ్చేది కాదు, అని గతించిన దినాలను తలచుకొని బాధపడ్డాడు కుమార్. ఆడచింపాంజీ కొన్ని నెలల క్రితం చనిపోయింది. ఇక మగ చింపాంజీ ఎవరూ తోడులేనందు వలననేమో ఎక్కువసేపు డల్‌గా ఉంటుంది. అంటే కుమార్ వేచి ఉండే సమయం కూడా ఎక్కువేనన్న మాట.
సరే ఇక తప్పేది లేదుకదాని, ఆ చింపాంజీకి ఎదురుగా చెట్టు క్రింద కూర్చున్నాడు. ఓ అరగంటవరకు ఏం జరుగలేదు. తరువాత ఓ జూకీపర్ వచ్చి దానికి పళ్ళు విసరసాగాడు. వెంటనే కొంచెం చలనమొచ్చింది చింపాజీలో. అది తన నాల్గుకాళ్ళ మీద పరిగెత్తడం మొదలెట్టింది. తమాషాగా అనిపించింది కుమార్‌కు. వెంటనే తన ఎర్రపుస్తకం తీసి ‘‘నడ్డి కొద్దిగా వెనక్కి పెట్టి, మోకాలు కొద్దిగా వంచి ముందు చేతులపై భారం వేసి, గబగబా పరిగెత్తడం...’’ అంటూ రాసుకుంటూ పోయాడు.
***
శాంతినగర్ కాలనీ.
28-7-1985, ఉదయం 8 గంటలు.
ఇవాళ కుమార్ యింట్లోనే వున్నాడు. నిన్నరాత్రి పార్టీకి పోయి రావడంతో లేవడం ఆలస్యమైంది. ఒంటరిగాడే కాబట్టి ఇంట్లో పెద్ద వంటచేయకుండా, బయటి పార్టీలతో గడిపేస్తున్నాడు. ఇంట్లో చిన్న పనులు చేయడానికి హోటల్లో పనిచేసే ఓ అబ్బాయిని పెట్టుకున్నాడు.
రాము వాడిపేరు. కాఫీ, టిఫిన్‌ల వరకు వాడు చేయగలడు. అన్నంకూడా చేస్తానంటాడు. కానీ కుమారే రిస్క్ తీసుకోదలచుకోలేదు.
రాము అప్పుడే కాఫీ తెచ్చిస్తే, తాగుతూ ఆరోజు పేపర్ చదవడం మొదలెట్టాడు కుమార్. ఇంతలో పెద్దగా ఓ అరుపు. ఇంకా చాలా మంది గుమికూడినట్టు శబ్దం వినపడింది. ఏమైందో చూద్దామని బయటకు వెళ్ళాడు కుమార్. అక్కడ గేటుదగ్గర ఒక బిచ్చగాడేమో పడి కోట్టుకోవడం మొదలెట్టాడు. ఆ ప్రక్కింటి అతను అతని మెళ్ళో ఇత్తడిబిళ్ళ చూసి ‘‘మూర్ఛ రోగమండీ. నీళ్ళు తెండని హడావిడి చేసి వాడిమీద నీళ్ళు పోయసాగాడు.
కాని కుమార్ దృష్టి వాడి చేష్టలమీదే వుంది. కాళ్ళు చేతులూ బిగుసుకు పోయాయి. వళ్ళంతా తడివల్లనేమో వొణుకుతున్నది. ముఖం కూడా ఒక ప్రక్కకు లాక్కుపోయింది. కాళ్ళూ చేతులూ బిగుసుకుపోయి అదుపు లేనట్లు ఎగిరెగిరి పడుతున్నాయి. కుమార్ వెంటనే ఇంట్లోకిపోయి, తన విప్పిన పేంటు లోనుంచి ఆ పుస్తం తీసుకొని రాసుకోసాగాడు.
***
చార్మినారు,
30-7-1985, రాత్రి 11 గంటలు.
ఎదురుగా చార్మినారు. ఓ రెండు వందలగజాల దూరంలో కనిపిస్తోంది. కుమార్ కారును అక్కడనే పార్కు చేసి, లాక్‌చేసి, నడవసాగాడు. అతని దుస్తులు చూస్తే కారున్నవాడని అనుకోరు. జాగ్రత్తగా, ఏదో లోయర్ మిడిల్ క్లాసువాడిలా కనపడేటట్లు వేషం వేసుకున్నాడు. ఓ వందగజాలు నడిచి అక్కడి సందులలో తిరగడం మొదలెట్టాడు. బాగా తెలిసినట్లు సందుల వెంట నడుస్తున్నాడు. అలానడిచి ఓ హోటల్ ముందు నిలబడ్డాడు. హోటల్ యజమాని అతన్ని చూచి నిలబడి.
‘‘ఆప్‌కా రూమ్ ఖాళీహై సాబ్’’ అని హైదరాబాద్ ఉర్దూలో చెప్పాడు. కుమార్ నవ్వి అతని చేతుల్లో డబ్బు పెట్టాడు. మెట్లెక్కి మొదటి అంతస్తులో ఓ రూములోకి వెళ్లాడు. అది రూం అనడం కంటే పార్టీషన్ అంటే బావుంటుందేమో. ఆ హోటల్ గొప్పదనము, ఆ డొక్కు మంచాలు, చిరిగిన దుప్పట్లు, మరకలు చెప్పకనే చెబుతున్నాయి అక్కడి పరిస్థితి.
కుమార్, రూములోపలికి పోయి వెంటనే తలుపేసాడు. మంచం పార్టీషన్ దగ్గరికి జరిపి మంచంపై కర్చీఫ్ వేసి, దానిపై కూర్చున్నాడు. పార్టీషన్‌కు చాల చిన్న చిన్న కంతలున్నాయి. ఒకదాంట్లో తన కన్ను పెట్టి చూడసాగాడు.
హోటల్ యజమాని తన మాట నిలబెట్టుకున్నాడు. అప్పుడే ఒక జంట ప్రవేశించింది. పరిచయస్థులు లాగానే ఉన్నారు. ఒకరినొకరు పరిహాసమాడుకున్నారు. ఒకరి నొకరు దగ్గరికి లాక్కున్నారు. కొంచెంసేపు అలా ఆడుకున్నాక, ఇకతను ఓపలేనట్టుపడుకున్నాడు. ఆమె అతడికి చేరోవైపు కాలు వేసి కూర్చుంది.
కుమార్ తన రెడ్‌బుక్కులో రాసుకుంటూనే ఉన్నాడు.
***
శాంతినర్ కాలనీ,
1-8-1985, ఉదయం 11 గంటలు
కుమార్ తన డైరీ చూసాడు. రేపే మైసూర్ వెళ్ళాలి. బృందావన్ గార్డెనుకు కూడా పోవాలి. ఫోన్ తీసి నంబర్ డయల్ చేసాడు.
‘‘హల్లో కృష్ణయ్యగారా? ఎల్లుండి బృందావన్ గార్డెన్సుకి అరేంజ్ చేసారాండి... ఎక్కడ బస.... బృందావన్ గార్డెన్స్‌లోని హోటల్లోనేనా? బెంగుళూరు వరకు ఫ్లైటు, అక్కడి నుండి కారు అరేంజి చేసారా?.... సరే ఎయిర్ పోర్టులో కలుస్తా’’నని చెప్పి ఫోన్ పెట్టేశాడు కుమార్.
మధ్యాహ్నం ఫ్లైట్. బట్టలు సర్దుకోవాలి, అంతా సర్దుకున్నాడు. బట్టలన్నీ పెట్టి, సూట్‌కేసులో మళ్ళీ తన ఎర్రపుస్తకం పెట్టుకున్నానోలేదో అని జాగ్రత్తతో ఓసారి చూసుకున్నాడు.
***
‘X’ రోడ్స్
ఎయిర్ కండిషన్డ్ థియేటర్
2-10-1985 సాయంత్రం 6 గంటలు.
కుమార్ తన కారును ధియేటర్ లోనికి పోనిచ్చాడు. ముందే చెప్పి ఉంచడం వల్ల ఓనర్ తన కోసం ఎదురు చూస్తున్నాడు. కుమార్‌ను చూస్తూనే.
‘‘రండి సార్, రండిసార్’’ అని పైన ప్రొజెక్టరు రూం ప్రక్కనున్న స్పెషల్‌బాక్స్‌లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాడు. ఓ పది సీట్లున్నాయి బాక్స్‌లో వాళ్ళిద్దరూ తప్పితే ఎవరూలేరు.
సినిమా మొదలైంది. కథ మధ్యమధ్యలో పాటలు అతికించినట్లు వస్తున్నాయి. పెద్దగా సంగీతం కూడా ఆ పాటలకి. ఓ అరగంట తరువాత నాలుగోపాట వచ్చింది. అప్పటికే చాలాసార్లు ఆ సినిమాచూసిన ఆఖరి తరగతి ప్రేక్షకులు ఈలలువేసి తమ షర్టులు విప్పి పైకి విసరసాగారు...
‘‘ఏంసార్, ఎలాఉంది ఈ సినిమా కలెక్షన్‌లు’’ అనడిగాడు కుమార్ ఓనర్‌ని.
‘‘మీకు తెలియందేముందిసార్. పాటలే ఈసినిమాకు హైలెట్టు. జూబ్లీపోతుంది సార్’’ అన్నాడు.
పాట బృందావన్ గార్డెన్స్‌లో పిక్చరైజ్ చేశారు. హీరో పసువుపేంటు, ఎర్రచొక్కా నీలం టై, ఆకుపచ్చ కోటు, తెల్ల బూట్లు... ఆ తరువాత అలానే రంగురంగుల దుస్తులు మార్చడం మొదలెట్టాడు. హీరోయిన్ బ్రా లాంటి జాకెట్టును, ‘మినిస్కర్ట్’ లాంటి చీరను కట్టి, ఆ దుస్తులరంగులను మార్చడం మొదలెట్టింది.
ఇక పాటలో హీరో హీరోయిన్‌లు ఇద్దరూ పరిగెత్తడం మొదలెట్టారు... వెంటనే ఆగి.... రెండడుగులు వెనక్కి వేసారు... గట్టిగా నవ్వారు... నవ్వడం ఆపి పిల్లి మొగ్గలు వేయసాగారు... తరువాత... హీరోయిన్ నడ్డి కొద్దిగా వెనక్కిపెట్టి మోకాలు కొద్దిగవంచి, ముందు చేతులపై భారం వేసి, గబగబ నడుస్తుంటే... హీరో ఆవిడను అనుకరిస్తూ అనుసరించాడు... ఆ తరువాత వర్షం సీను!
వళ్ళంతా తడివల్ల వొణుకుతున్నది... ముఖాలు ‘క్లోజప్’లో చూపెట్టినప్పుడే ఒక ప్రక్కకు లాక్కుపోయింది... కాళ్ళు చేతులు బిగుసుకుపోయి అదుపులేనట్లు.... ఒకరికాళ్ళ చేతుల మీద మరొకరివి ఎగిరి ఎగిరి పడుతున్నాయి. ఆ తరువాత హీరోయిన్ పడుకుని ఉన్న ఆ హీరోమీద చెరోవైపు కాలువేసి కూర్చుంది...
హాలంతా ఒకటే ఈలలు... చప్పట్లు... షర్టులు ఎగిరి ఎగిరి పడుతున్నాయి.
‘‘స్టెప్స్ ఏం చేయించారు సార్, హీరో హీరోయిన్‌లచేత. అస్సలు ఈ స్టెప్స్‌కే ఈ సినిమా హిట్టయింది సార్’’ అని ఓనర్ సంతోషంగా చెప్పడం మొదలెట్టాడు.
కానీ తరువాత సినిమాలో హీరో చేత (వీలైతే హీరోయిన్ చేత కూడా) బట్టలు విప్పించి పైకి విసిరేయించితే ఎలా ఉంటుంది? అనే ఐడియాను ఎర్ర బుక్కులోకి ఎక్కించేయాలని తొందర పడుతున్నాడు కుమార్. అతడా సినిమాకు నృత్య దర్శకుడు కదా మరి!
- స్వాతి, 1986.