
1991 లో వ్రాసిన కథ ‘కొవ్వొత్తి దీపం’. ఆంధ్రప్రభ వార పత్రికలో అచ్చయింది. వ్రాయటం మొదలుబెట్టి ఆరేళ్లయిన తరువాత వ్రాసిన ఆరో కథ.
బాంబే, ఇప్పటి ముంబై, రాజధాని ఢిల్లీ లాంటి నగరాలకు పోవాలంటే, నాకు కొంచెం బెరుకుగా ఉండేది. కానీ చదువుల వల్ల, ఉద్యోగాన్వేషణలో ఈ నగరాలకు పోవడం, అక్కడ సంచరించడం తప్పలేదు. మొదట్లో ఉన్న బెరుకు కొన్ని రోజులకే పోయి, ఆ నగరాలలో ఆనందంగా తిరగడం వెనుకనున్న కారణాలు, ఒకానొక ఆలోచనా విహారంలో వెదుకుతుంటే దొరికింది - బహుశా అది ఈ నగరాల గురించి, అక్కడ నివసిస్తున్న వారి గురించి, నగర సాంస్కృతి తెలియక పోవడం వల్ల అని. అదొక భయం - ‘ఫియర్ ఆఫ్ ది అన్నోన్’.
ఉద్యోగంలో చేరాక అనేక మందిని కలిసి, వారి పని తీరులను, సాటి వారితో వారు మెలిగే తీరును పరిశీలించడానికి అవకాశాల చాల దొరికాయి. బెల్ కర్వ్ లాగ చాల మంది ఒకే మూసలో ప్రవర్తించినా, కొద్ది మంది ప్రవర్తన అందుకు భిన్నంగా, విలక్షణంగా ఉండేది. ఈ కథలోని బెనర్జీ పాత్రలా ప్రవర్తించే కొందరు అలాంటి ఔట్ లైయర్స్. వీరి ప్రవర్తన ఓ.సి.డి. లా కనిపించినా, వారు చేస్తున్న పని తమకు, ఇతరులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న సదుద్దేశం తోనే చేస్తున్నారనుకుంటే, అలాంటి వారి పట్ల హేళన బదులు, నాకు గౌరవమే కలిగేది. అలాంటి వారు బహుశా ‘ఫియర్ ఆఫ్ ది అన్నోన్’ లాంటి భయాలు ఉన్నా, వారి పంథాలో ఆ సమస్యను పరిష్కరించుకోగలరన్న, ఆలోచన తో వ్రాసిన కథ ఇది.
ఈ కథ ఇప్పుడు చదివితే, గూగుల్ కంపెనీ స్టార్ట్ ఆఫ్ గా ఉన్నప్పుడు, బ్రిన్, పేజ్ లు, తమ ఏంజెల్ ఇన్వెస్టర్ లకు ఆర్థిక సహాయం కోసం చెప్పే ‘యూజ్ కేస్’ లాగా అనిపిస్తుంది. గూగుల్ వచ్చాక, సులభంగా తిరగడానికి మ్యాప్ లు, స్థల పురాణాలు, విశేషాలు అన్ని ముంజేతి వేళ్ళ అందుబాటు లోకి వచ్చేశాయి.
కానీ ఎలాంటి మార్గం వెదుక్కున్నా, మన సమస్యలు, భయాలు అన్నీ తీరిపోయే పరిష్కారాలు దొరికాయా? ఆ ప్రశ్నకు సమాధాన్వేషణ లో దొరికిన కథనే ‘కొవ్వొత్తి దీపం’. అచ్చయిన ప్రతీ కథ చదివి, నచ్చితే రచయితకు తప్పకుండా, తన స్పందన, మెప్పు అందజేసే నా మేనమామ గారికి బాగా నచ్చిన కథ ఇది. ఇటీవల నా మొదటి కథల సంకలనం చదివి స్పందించిన మిత్రులకు కూడా నచ్చిన కథలలో ఇదొకటి. శాయి రాచకొండ గారు పుస్తక పరిచయం తో బాటు ఈ కథ పరిచయం జూన్ 2023, ‘కథా మంజరి’ సంచికలో చేసారు.
కొవ్వొత్తి దీపం

‘వేర్ ది మైండ్ ఈజ్ విథౌట్ ఫియర్...’, రవీంద్రుని కవిత ఎదురుగా టేబిల్ పైన కనిపించింది. పద్యం రవీంద్రుని స్వహస్తాక్షరాలలో ఉంది. రవీంద్రుని పద్యం నకలుకి లామినేట్ చేయించి చక్కగా ఫోటో స్టాండ్ లాగా చేయించి, టేబిల్ పైన నిలబెట్టారు. టేబిల్‌వెనుక టేబిల్ అంతే ఎత్తు ఉన్న పుస్తకాల షెల్ఫు ఉంది. దాని అద్దాలలో నుంచి మేనేజ్‌మెంటు, ఆర్థిక విషయాలపై రాసిన పుస్తకాలు అందంగా అమర్చబడి తొంగిచూస్తున్నాయి. ఆ షెల్ఫు పైన ఇత్తడి పాత్ర తళ తళ మెరిసిపోతున్నది. దాంట్లో పూలు అలంకరణ తెలిసినవాళ్ళు సర్దినట్లుంది. రూముకు నాలుగు మూలల కూడా ‘ఇండోర్’ మొక్కలు, వాటి కుండీలు కనబడకుండా అందమైన చెక్క డబ్బాలలో పెట్టారు. టేబిల్ వెనుకనున్నది గోడ బదులు అద్దాలే. లోపల ఎండపడకుండా గోడెత్తు తెరలు వేశారు. కింద మెత్తటి తివాచి. టేబిల్ షెల్ఫు, మొక్కలు పెట్టిన చెక్క డబ్బాలు నల్లగా ‘మహాగని’ ఫినిష్‌లో ఉంటే తివాచి, తెరలు ‘ఆఫ్‌వైట్’, మీగడ రంగులో ఆ రూము అందాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. ఆఫీసు పనిపైన చాలాసార్లు ఆ గదిలో అడుగుపెట్టాను. కాని అడుగు పెట్టిన ప్రతిసారీ నాకు కొట్టొచ్చినట్లు కనిపించేది ఆ గది నీట్‌నెస్.
ఇంతకీ ఆ గది మా మార్కెటింగ్ మేనేజర్ ఛటర్జీది. ఇప్పుడు కూడా ఆయన టేబిల్ వెనకాల ఉన్న రివాల్వింగు కుర్చీలో కూర్చుని ఉన్నారు. అతనిది స్థూలకాయం. కుర్చీ పూర్తిగా నిండిపోయింది. ఆయన ఆకారం ముఖం కూడా ఉబ్బిపోయినట్లుంది. దవడ ఎక్కడ అంతమై, గొంతు ఎక్కడ మొదలవుతున్నదో చెప్పలేము. కళ్ళు ఏనుగుకు లాగా చిన్నవిగా, ఎర్రగా ఉన్నాయి. అయినా వాటిలో ఏదో ఆకర్షణ. ఛటర్జీ గారిని చూస్తూనే, చూసిన వారిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలగడం నాకు, నా సహోద్యోగులకు కూడా అనుభవమే. ఆయనకు తన క్రింద పనిచేసేవారిలో తన చూపులు, మాటలు, ప్రవర్తనలతోనే ధైర్యం కలిగించి తనకు కావలసిన పని చేయించుకోవడంలో చాలా నేర్పు ఉంది.
అతను బిజీగా ఉండడం, నేను ఎప్పుడూ చూడలేదు. వచ్చిన ఫైలును వచ్చినట్లే వెంటనే తిప్పి పంపేయడం ఆయన అలవాటు. ఫైలులో రాసిన విషయాలను ఒక్క చూపులోనే అర్థం చేసుకుని, వెంటనే తన నిర్ణయాలు ఖచ్చితంగా అందమైన శైలిలో రాస్తాడాయన. ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్పవ్వడం నేను వినలేదు. ‘నేనూ మేనేజర్ అయితే ఇలా పనిచేయాలి’ అనుకొనే వారిలో నేనూ ఒకణ్ణి.
నన్ను చూసి నవ్వుతూ ‘‘రండి... మూర్తిగారూ, రండి! ఏంటి ఇలా వచ్చారు. కూర్చోండి’’ అని పలకరించారు. ఛటర్జీ ముదురు నీలం రంగు పాంటు, లేత నీలం రంగు షర్టు టక్ చేసుకున్నారు. ఇస్త్రీ మడతలు కూడా చెరగలేదు. నాతో మాట్లాడుతూనే తన షర్టు జేబుపైన తన దృష్టి మరల్చారు. ఏదో దుమ్ము కనబడినట్లు తన చూపుడు వేలుతో తట్టి దాన్ని తొలగించ ప్రయత్నించారు. నా కంటికేమీ దుమ్ము కనపడలేదు. కాని ఇది ఛటర్జీ గారి అలవాటు, మేనరిజమ్.
‘బొంబాయి ట్రాన్స్‌ఫర్ అయ్యిందండి’’ అన్నాను నేను.
‘‘ఆ, నేనూ విన్నాను’’ అన్నారు ఛటర్జీ. ఆఫీసులో జరుగుతున్న విషయాలన్నీ తెలిసి పెట్టుకొని తన చేతనైన సహాయం, ఇబ్బందులలో ఉన్న వారికి చేయడం ఆయన అలవాటు. అసలు ఛటర్జీ మా ఆఫీసులో అంత పాపులర్ అవ్వడానికి కారణం ఆయనలో ఉన్న ఈ గుణమే అనుకుంటాను.
‘‘అవునండి. ఆ విషయంగానే మిమ్మల్ని కలవడానికి వచ్చాను!’’
ఇంతలో ఓ జవాను వచ్చి ఛటర్జీకి ఓ కవరు అందజేసి వెళ్ళిపోయాడు. ఛటర్జీ నా ముఖంలో చూస్తూనే తన టేబిల్ డ్రాయర్‌లోనుంచి మూడు సీసాలు తీశారు. చిన్న సీసాలే, ఖాళీగా ఉన్నాయి. చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. ఒకో సీసామీద ఒకో రంగు కాగితం అంటించి ఉంది. మొదటి సీసాపై పసుపు పచ్చకాగితం. దాని మీద ‘మార్నింగ్’ అని ఇంగ్లీషులో రాసి ఉంది. ఛటర్జీ ఆ సీసా మూత తీసి జవాను తెచ్చిన కవరులో నించి కొన్ని టాబ్లెట్లు ఆ సీసాలోకి జాగ్రత్తగా మార్చసాగారు.
అలా మారుస్తూనే ‘‘చెప్పండి’’ అన్నారు ఛటర్జీ. ‘‘కొంచెం గాభరాగానే ఉంది. క్రొత్త ఇంటిని వెదకడం నుంచి పిల్లల స్కూళ్ల వరకు అన్నీ గొడవలే. మీరింతకు ముందు బొంబాయిలో పనిచేశారు కదా. మిమ్మల్ని కలిసి అక్కడి విషయాల గురించి తెలుసుకొందామని వచ్చా’’ నన్నాను.
ఛటర్జీ మొదటి సీసా నింపడం పూర్తయ్యింది. నూన్ అని ఆకుపచ్చ కాగితం రాసి అంటించిన సీసాలోకి మరికొన్ని మాత్రలు మార్చసాగారు. ఛటర్జీ గారు ఆ పని చేస్తూనే ‘ఆ మరి చెప్పండి’ అన్నారు.
ఛటర్జీ గారు నా గోడు వినలేదనిపించింది. మళ్ళీ ఒకసారి ఛటర్జీ గారి నుద్దేశించి ‘‘బొంబాయి మొదటిసారిగా పోతున్నాను కదండి. కొంచెం గాభరాగానే ఉంది. కొత్త ఇంటినుంచి పిల్లల స్కూళ్ల వరకు అన్నీ గొడవలే. మీరింతకు ముందు బొంబాయిలో పనిచేశారు గదా, మిమ్మల్ని కలిస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని ఆఫీసులో అందరూ అన్నారండి, అందుకే వచ్చా’’నన్నాను.
ఛటర్జీ గారికి ఒంట్లో అంతగా బాగుండటం లేదని విన్నాను. ఛటర్జీగారు ప్రతి పనిని సిస్టమేటిక్‌గా చేస్తారని కూడా విన్నాను. కాని తినే మాత్రలను కూడా ఇలా చక్కగా వేరు వేరు సీసాల్లోకి మార్చి మరీ తినటం చూడటం ఇదే మొదటిసారి. మిగిలిన మాత్రలన్నీ ఎర్ర రంగు కాగితం అంటించిన ‘రాత్రి’ సీసాలోకి మార్చి సీసాలన్నీ తన డ్రాయర్లో తిరిగి పెట్టేశారు. మాత్రలు తెచ్చిన కవరును నలిపి జాగ్రత్తగా చెత్తబుట్టలో వేసేశారు.
‘‘బొంబాయి మంచి పోస్టింగేనండి. మేము బొంబాయిలో ఉన్నన్నినాళ్ళు బాగా ఎంజాయ్ చేశాము. కొంచెం ప్రయాణాలు కష్టమనుకోండి. కాని క్వార్టర్సు దొరికాక బొంబాయి అంత సౌకర్యం ఉన్న మరో సిటీ లేదండి. క్వార్టర్సుకు వెంటనే అప్లై చేయండి. క్వార్టర్సు దగ్గిరే కదా ఆఫీసు, స్కూళ్లు అన్నీ. ఆ విధంగా మనమీ కంపెనీకి పని చేయడం అదృష్టమేనండి. అయినా మీరు నా ఫైలు కోసమే వచ్చినట్లున్నారు. తీసిస్తాను ఉండండి’’ అని లేచి తన ఎడమచేతి వైపునున్న గోడవైపు కెళ్ళారు. అక్కడున్న షెల్ఫులో ఓ ఫైలు మీద ‘బాంబే’ అని అందంగా రాసి ఉంది. దానిని తీసి నా కిచ్చారు. అవును నే వచ్చింది, ఆ ఫైలు కోసమే. ఛటర్జీగారు తను పని చేసినచోట్ల మీద ఒకో ఫైలు సృష్టించారని, ఆ ఫైలు చాలా ఉపయోగకరమైనదని మా ఆఫీసులో వినికిడి. చాల మంది ఆ ఫైళ్ళను పొగుడుతూ నన్నోసారి తప్పకుండా చదవమని సలహా ఇచ్చినవారే.
ఛటర్జీగారికి టేబిల్ మీద నాకు కనబడని ధూళి ఏదో కనపడిందేమో, దానిని తన టేబిల్ డ్రాయర్‌లోని ఓ డస్టర్ గుడ్డ తీసి, ఓసారి తుడిచి తిరిగి డ్రాయర్‌లో పెడుతూ, ‘‘మూర్తిగారూ! ఈ ఫైల్లో అన్ని విషయాలు ఉన్నాయి. మీకు కావలసినన్ని రోజులుంచుకోండి. కాని తిరిగి ఇచ్చేటప్పుడు, ఇలాగే నీట్‌గా ఉంచితే మంచిది. చిరిగిన పుస్తకాలు, ఫైళ్ళు అంటే నా కిష్టముండదు’’ నవ్వుతూ అన్నారు చటర్జీ.
ఆ రోజు రాత్రి భోంచేసి పడుకోబోయే ముందు ఛటర్జీ గారి ఫైలు ముందేసుకొని కూర్చున్నాను. ఛటర్జీ గారిది చాలా చక్కటి వ్రాత. యధాతథంగా కాపీ తీసి అచ్చు పుస్తకంగా అచ్చేయవచ్చునేమో.
మొదటి పేజిలో బొంబాయి నగరంలోని కొన్ని ముఖ్య ప్రదేశాలున్న పోస్టర్ ఉంది. దానిమీద, ‘వెల్‌కమ్ టు బాంబే, ది ఎల్‌డరాడో ఆఫ్ మిలియన్స్ ఇన్ ఇండియా’ అని వ్రాసి ఉంది. రెండో పేజీలో విషయసూచిక.
- నగరం చరిత్ర, బొంబాయి నగరం పుట్టుకగురించి, దాని చరిత్ర గురించి పేపర్లలో, మాగజైన్స్‌లో పడిన వ్యాసాలను, ఫోటోలను కత్తిరించి అతికించిన స్క్రాప్ పుస్తకం, మొదటి అధ్యాయం.
- నగరం చేరేదెలా, నగరం చేరడానికి ఏయే రైళ్ళు అనుకూలమో, ప్లేన్లో వెళ్ళితే ఎయిర్‌పోర్టు నుంచి టాక్సీ మాట్లాడుకోవడం ఎలా, రైళ్ళుస్టేషన్లు నుంచి, ఎయిర్‌పోర్టునుంచి వాటి దగ్గర్లో ఉన్న కొన్ని హోటళ్ళ వివరాలు, ఆ ప్రదేశానికి చేరడానికి ఎంత ఖర్చు అవుతుందో; అన్ని వివరాలూ ఉన్నాయి.
- స్వీట్ హోమ్‌ను ఎలా వెదుక్కోవడం అన్న ఈ అధ్యాయంలో, కంపెనీ క్వార్టర్సు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటికి ఎవరికి అప్లై చేయాలి, ఒకవేళ కంపెనీ ఇల్లు దొరకడం కొంచెంఆలస్యమైతే ఏ ఏరియాలో కొంచెం రీజనబుల్ రెంటుకు ఇల్లు దొరుకుతుందో అన్ని వివరాలు ఉన్నాయి.
- మీ సామాన్లు ఎలా తరలించాలి? పాకింగ్ బాగా ఎవరు చేస్తారు? రైల్వే కంటెయినర్ సర్వీస్ గురించి, కంపెనీ ఏయే ఖర్చులకు డబ్బు ఇస్తుంది. బిల్లు కోసం రిసీట్లు ఎవరి దగ్గర తీసుకోవాలి, బిల్లు ఎలా సబ్మిట్ చేయాలి అన్న వివరాలు ఈ నాలుగో చాప్టర్లో చోటు చేసుకున్నాయి.
- పిల్లల స్కూళ్ళు, కాలేజీల గురించి వివరాలు, స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం ఎవరిని సంప్రదించాలి, డొనేషన్లు ఏ రేంజిలో ఉంటాయో, రికమెండేషన్లు పనిచేస్తాయా లేదా అన్న విషయాలను ఛటర్జీగారు వివరించారు.
- నగరంలో సులభంగా తిరగడం కోసం ఏయే రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో, రైల్వే బస్సు పాసులు ఎక్కడ దొరుకుతాయో వాటిని సంపాదించే పద్ధతి, టాక్సీలకు మాత్రం పరిమితమైన ప్రదేశాల గురించి వివరించారు, ఈ ఆరో అధ్యాయంలో.
- రేషన్‌కార్డు మార్పించడం ఎలా, మోటార్, సైకిల్, కార్లను ఆర్.టి.ఏ. బొంబాయి దగ్గర రీరిజిస్టర్ చేయడమెలా, గాస్ మార్పించడానికి పద్ధతి అన్నీ ఉన్నాయి.
అంతేకాక ఏయే వస్తువులు ఎక్కడెక్కడ చౌకగా దొరుకుతాయో అని ఎనిమిదవ దానిలో, నగరంలో చూడాల్సిన ప్రదేశాల గురించి తొమ్మిదవ చాప్టర్లలో వ్రాశారు. చివర బొంబాయి నగరం పెద్ద మాపు ఫోల్డరు ఫైలు చేశారు.
ఆ రాత్రి పైపైనే చదవడానికి ఆ ఫైలు రెండు గంటలు తీసుకుంది. నా హృదయంలో ట్రాన్స్‌ఫర్ అయినప్పటి నుంచి చెలరేగుతున్న ప్రశ్నలకే కాక, ఇంకా రాబోయే రోజుల్లో నాకు తప్పకుండా జనించే ప్రశ్నలకు కూడా జవాబులు దొరికాయి.
ఫైలు చివర్లో స్టెప్‌బైస్టెప్ వ్రాసిన పనుల పట్టిక ప్రకారం నా పనులు కూడా చేయడం మొదలుపెట్టాను. నా పనులన్ని చకచకా అయిపోయాయి. బొంబాయి చేరిన వెంటనే నేను, నా ఫ్యామిలి సుపరిచితులుగా తిరగడం మొదలుపెట్టాం. అన్ని సౌకర్యాలు ఛటర్జీ గారి ఫైలు పుణ్యమాని చేరిన వారంలోపలే సమకూరిపోయాయి.
నేను ఇంతకు ముందు నాలుగు ట్రాన్స్‌ఫర్లు చూశాను. ప్రతీసారీ నాకు, నా కుటుంబానికి ఆ ట్రాన్స్‌ఫర్లన్నీ ఓ పెద్ద మానసిక వ్యధగా తయారయ్యాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి కనీసం ఓ ఆర్నెల్ల నుంచి సంవత్సరం వరకు పట్టేది. అలాంటిది ఈ బొంబాయి ట్రాన్స్‌ఫర్ ఎలాంటి టెన్షన్ లేకుండా సంతోషంగా మారడం ఛటర్జీగారి ఫైలు వల్లేనని స్పష్టమైపోయింది నాకు. నేను కూడా చటర్జీగారి అభిమానిని అయిపోయాను.
ఫైలు వాపసు చేసి, నా కృతజ్ఞత ఛటర్జీగారికి తెలపటం కోసం వెళ్ళాను. ఛటర్జీగారు నా సంతోషం చూసి, తనూ సంతోషపడ్డారు.
‘‘ఈ ఫైలు ఇంకా ఉపయోగపడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మూర్తిగారూ! ఈ ఫైలు తిప్పి ఇస్తున్నవారి ముఖంలో సంతోషం చూసినప్పుడల్లా నేను ఈ ఫైలు తయారుచేయడానికి పడ్డ శ్రమకు ఫలితం కనిపిస్తుంది’’ అన్నారు ఛటర్జీ.
‘‘ఛటర్జీగారూ! ఈ ఫైలు నాకు ఎంతగా ఉపయోగపడిందో మాటల్లో చెప్పలేను. నాకు బొంబాయి అంటే ఉన్న భయం అంతా పోయింది. మీకు కృతజ్ఞతలెలా చెప్పుకోవాలో తెలీటం లేదు’’ అన్నాను నేను.
‘‘మీకు బొంబాయి ట్రాన్స్‌ఫర్ అవడం నాకు సంతోషంగా ఉంది. నాకు కూడా బొంబాయిలో కొంత పని ఉంది. మీకీ విషయమై తొందర్లో ఉత్తరం వ్రాస్తాను. మీరు కొంచెం శ్రమపడాల్సి వస్తుందేమో’’.
ఛటర్జీగారు కొంచెం ఆయాసంతో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆస్త్మా వచ్చినట్లుంది అనుకున్నాను. ‘‘ఏమండీ ఛటర్జీగారూ! ఒంట్లో బాగలేదా?’’ అని అడిగాను నేను.
ఛటర్జీ గారు ‘ఆ అవునండి’ అంటూ కింద డ్రాయర్‌లోని ఓ చిన్న ప్లాస్టిక్ సీసా తీసి దానిలో నుంచి ముక్కులోకి డ్రాప్స్ వేసుకున్నారు. ‘‘ఈ డాక్టర్లతో కూడా తెగ ఇబ్బందిగా ఉందండి. అది తినొద్దు, ఇది చేయొద్దు అని లక్షా తొంభై కండిషన్సు వేస్తారు. అవన్నీ చేస్తే జీవితమంటే ఏంటండి? అలా ప్రతివాటికీ భయపడుతూ జీవితం గడపడం నా కిష్టం లేదు’’ అన్నారు ఛటర్జీ.
ఛటర్జీగారిని ఆ పరిస్థితిలో మరింత కష్టపెట్టడం ఇష్టంలేక, ఆయననుంచి సెలవు తీసుకుని బయటపడ్డాను.
బొంబాయి వచ్చి దాదాపు ఆర్నెల్లైంది. సెంట్రల్ ఆఫీసులో అందరూ పరిచయమయ్యారు. స్వతహాగానే బాగా పని చేయటం వల్ల, కలుపుగోలుతనంగా ఉండటంవల్ల ఈ కొద్ది కాలంలోనే నాకు చాలామంది మంచి స్నేహితులు దొరికారు. ఇప్పుడు సెంట్రల్ ఆఫీసులో ఏ పనైనా చిటికెలో చేసుకోగలననే కాన్పిడెన్స్ వచ్చేసింది. ఆర్నెల్లు ముందు ఈ మాత్రం పరిచయాలు ఉంటే అస్సలు ట్రాన్స్‌ఫర్ వచ్చేది కాదేమో!
ఓ రోజు ఆఫీసులో పని చేస్తుండగా ఓ పెద్ద కవర్ రిజిస్టర్ పార్సల్‌గా నా పేరు మీద వచ్చింది. ఫ్రం అడ్రెస్సు ఛటర్జీ గారి నుంచి. అంత పెద్ద పార్సల్ అంటే చదవాల్సింది చాలా ఉంటుందని, దానిని ప్రక్కకి పెట్టి, నా నిర్ణయాల కోసం టేబిల్‌పైన పేరుకుపోయిన ఫైళ్ళను చూడసాగాను.
మరో గంటలో ఫైళ్ళ నన్నిటిని చూసేసి, ఛటర్జీగారు పంపిన కవరు చింపాను. అందులో రెండు కవర్లున్నాయి. ఓ పెద్ద ఫైలుంది. రెండు కవర్లలో ఓ దానిపైన నా పేరు వ్రాసి ఉంది. మరోదానిపై సెంట్రల్ ఆఫీసు అడ్రెస్సుంది. ఛటర్జీ గారి ఫైలు ఇంతకుముందు చదివినందున ఈ ఫైల్లోని విశేషాలేంటని ఆత్రంగా ఆ ఫైలు త్రిప్పడం మొదలెట్టాను.
మొదటి పేపర్లో ఓ కొటేషన్ భగవద్గీత నుంచి
‘‘వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ"
రెండో పేజీలో విషయసూచిక ఉంది.
- ఆర్థిక పరిస్థితి
- హాస్పిటల్ మేనేజ్‌మెంటు
- శ్మశాన వైరాగ్యం
- ఫామిలీని సముదాయించడం
- ప్రావిడెంట్ ఫండ్, ఎల్.ఐ.సి. పెన్షన్
- రి సెటిల్‌మెంట్
విషయసూచిక చూస్తూనే ఆశ్చర్యపడ్డాను నేను. ఛటర్జీగారి సరళమైన శైలి నన్ను ఫైలు సాంతం చదివించింది. కాని ఆ ఫైలులో వ్రాసింది మొదటి నాలుగు చాప్టర్లే. ఆఖరి రెండు చాప్టర్లు ఎందుకో వ్రాయలేదు ఛటర్జీగారు.
మొదటి చాప్టర్లో ఛటర్జీగారు తనకు ఎంతెంత డబ్బు ఏయే బాంకుల్లో ఉన్నదో ఆ అకౌంట్ల వివరాలు, సంపాదించిన స్థిరాస్తుల వివరాలు ఆ పత్రాలున్న చోటు గురించిన వివరాలు ఉన్నాయి. ఆఫీసులో తీసుకున్న లోను వివరాలు, కూడా ఉన్నాయి. బాంకు డిపాజిట్లు, ఎల్.ఐ.సి. పాలసీలకు ఏ విధంగా నామినేషన్లు దాఖలు చేయవచ్చునో కూడా చక్కగా వివరించారు ఛటర్జీ గారు.
రెండో చాప్టర్లో కాన్సర్, ఆస్త్మా, షుగర్ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు వాడవలసిన మందులు, చేరవలసిన హాస్పిటల్స్, కలవాల్సిన డాక్టర్లు, ఎక్స్‌పర్టులను గురించి వ్రాశారు ఛటర్జీ గారు.
ఇక మూడో చాప్టరు కొంచెం డిప్రెసింగ్‌గానే ఉంది. కొంచెమే చదివినా ఎందుకో బాగా డిప్రెస్సు అయ్యాను. మనిషి చనిపోయిన తరువాత తతంగమంతా అందులో ఉంది. డెత్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలో, శ్మశానానికి కావలసిన ఏర్పాట్లు, పిలవాల్సిన బంధువుల లిస్టు.
ఇక నాలుగో చాప్టర్లో బంధువులను సముదాయించడం ఎలాగో ఛటర్జీ గారు తనకు తోచిన విధానాలు వ్రాస్తూ, రీడర్స్ డైజెస్టులో ఈ విషయంపైనే వచ్చిన ఓ చక్కని ఆర్టికల్‌ను ఫైలులో జత చేశారు.
ఫైలు చదవడం ముగించేసరికి నాకు డిప్రెషన్‌తో పాటు ఆందోళన రవ్వంత భయం కూడా వేసింది. ఛటర్జీ గారు నాకీ ఫైలు ఎందుకు పంపించినట్లు? ఎన్నో ప్రశ్నలు నా మదిలో.వెంటనే ఛటర్జీ గారు నాకు వ్రాసిన ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాను.
‘‘డియర్ మూర్తిగారు,
నేను ఈ ఫైలు ఎవరికి పంపించాలి అని ఆలోచిస్తున్నప్పుడే మీకు బాంబే ట్రాన్స్‌ఫర్ కావడం, మీరు నే నిచ్చిన బాంబే ఫైలు చాలా ఉపయోగపడిందని కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సెంట్రల్ ఆఫీసులో కూడా మీవంటి సిన్సియర్ వర్కర్లు తొందర్లోనే పేరు తెచ్చుకోకుండా ఉండడం కష్టమని నాకు తెలుసు. నా అంచనాలు తప్పిపోకుండా మీరు సెంట్రల్ ఆఫీసులో పేరుతోపాటు మంచి ఇన్‌ఫ్లూయన్స్ కూడా సంపాదించేశారు.
మీకీ ఉత్తరం అందేసరికి నేను మీ కందరికీ అందని చోటికి చేరిపోయి ఉంటాను. కాని నా ఫైలు మొదట్లో రాసిన భగవద్గీత శ్లోకంలోలాగా నేను శరీరం అనే వస్త్రాన్ని వదిలేసి, మరో వస్త్రం ధరించడానికి ఈపాటికి తయారు అవుతుంటున్నానేమో!
మీరు నేను ఈ ఉత్తరంలో జతపరచిన ఫైలును చూసే ఉంటారనుకుంటాను. ఈ ఫైలు అసంపూర్ణమే. చివరి రెండు ఛాప్టర్లు- అదే పి.ఎఫ్., ఎల్.ఐ.సి రి-సెటిల్‌మెంట్ గురించి వ్రాయలేదు. పి.ఎఫ్., ఎల్.ఐ.సిల నుంచి రావల్సిన డబ్బును వీలైంత తొందరలో మా ఆవిడకి ఇప్పించగలగడం మీకు వదిలివేస్తున్నాను. దానికి కావలసిన పత్రాలను కూడా నేను ఈ ఉత్తరంతో పాటు జతపరిచాను. వీటిని నా భార్యకు అందజేయడంలో మీరు పడిన సాధకబాధకాలు, మీ సలహాలను మీరు శ్రమ అనుకోకుండా వ్రాస్తే అయిదో అధ్యాయం పూర్తి అయినట్లే.
నా భార్య బి.ఎ. చదివింది. వయస్సు నలభై ఏళ్ళు కాబట్టి ఇంకా 18 ఏళ్ళు పని చేయడానికి వీలుంది. మన కంపెనీలో ఉద్యోగంలో ఉన్నవారు చనిపోతే వారి ఫ్యామిలీలో ఒకరికి కంపాషనేట్ గ్రౌండ్ మీద ఉద్యోగం ఇస్తారని తెలుసు కదా. మీరు సెంట్రల్ ఆఫీసులో ఉన్నారు కాబట్టి, నా భార్యకు నా తరువాత మన కంపెనీలోనే ఓ ఉద్యోగం ఇప్పించడం కోసం కావలసిన ఫార్మాలిటీల నన్నిటినీ పూర్తి చేసే బాధ్యతను కూడా మీ పైనే వేస్తున్నాను. ఈ అనుభవాన్ని కూడా మీరు వ్రాస్తే చివరి అధ్యాయం పూర్తి అవుతుంది. అలా పూర్తి చేసిన ఫైలు మన ఉద్యోగుల అసోసియేషన్ ఆఫీసుకు పంపించండి. నా దగ్గరున్న మిగిలిన ఫైళ్ళను కూడా అసోసియేషన్ అఫీసుకే పంపించి వేస్తున్నాను.
మీకీ పని చెప్పేముందు అసలు నేను ఇలా ఫైళ్లు ఎందుకు వ్రాశానో, వాటిని అసోసియేషన్‌కు ఎందుకు పంపించాలనుకుంటున్నానో మీకు విశదీకరించడం నా కనీస కర్తవ్యం అనుకుంటాను.
చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువగా ఆలోచించడం అలవాటు. మనుషులను, వారి ప్రవర్తనలను పరిశీలించడం, వారి ప్రవర్తనకు కారణాలను ఆలోచించడం కూడా నాకో హాబీ అయిపోయింది. ఇలాంటి ఆలోచనలే నన్నో (పిచ్చి) కన్‌క్లూషన్‌కు తెచ్చాయి. మనిషి అశాంతికి, అసంతృప్తికీ, దుఃఖానికి కారణం తను తరువాత ఏం చేయాలి? తనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో? అన్న సందేహం, భయం. దీన్నే నేను ‘ఫియర్ ఆఫ్ ది అన్‌నోన్’ అని అనుకున్నాను.
మనిషి సంతోషంగా లేడంటే వెంటనే నేను ఆ ప్రవర్తనకి నా జవాబు సరిపోతుందా అని చూసుకునేవాడిని. ఉదాహరణకి మీరు బొంబాయి పోయే ముందు మీ ప్రవర్తన గురించే ఆలోచించండి. మీ టెన్షన్‌కు కారణం? మీకు బొంబాయి గురించి తెలిపిన వెంటనే మీరు కొద్దిగానైనా రిలాక్స్ కాగలిగారు. అలాగే మనుష్యులు దెయ్యాలంటే, దేవుడంటే ఎందుకు భయపడతారు. ఎవ్వరూ దెయ్యాలని, దేవుళ్ళని చూడలేరు కాబట్టి, వాటి గురించి సరిగ్గా తెలీదు కాబట్టి.
కొందరు స్వాములు, జ్ఞానులు తమ జీవితాలని వెచ్చించి అసలు ‘నిజం’ అంటే ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించారు. తాము తెలుసుకున్న దానిని వారికి తోచిన విధంగా మిగతా వారికి చెప్ప ప్రయత్నించారు, కొందరు పుస్తకాలు కూడా వ్రాశారు. అలానే వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు మరో మార్గం వెంట ప్రయాణిస్తూ తెలియని ప్రతి విషయాన్నీ వైజ్ఞానికంగా విశదీకరింప ప్రయత్నించారు.
నేను వారిసాటి వాణ్ణి కాను. కాని నాకు తెలిసిన సగటు మనిషి, తనకు తెలియని చిన్న చిన్న విషయాల వల్ల తన జీవితం టెన్షన్‌తో అనవసరంగా దుఃఖమయం చేసుకుంటున్నాడని తెలుసు. అందుకే నాకు కలిగిన అనుభవాల మీద ఫైళ్ళు రాయడం మొదలెట్టాను. ఈ ఫైళ్ళు ఉపయోగించుకొని తిరిగి నా కిస్తున్నప్పుడు నా మిత్రుల ముఖాలలో వెలిగిన సంతోష చ్ఛాయలలో నా సంతోషాన్ని వెతుక్కున్నాను.
నా అదృష్టం కొద్దీ నా చావు నాకు ముందుగానే తెలిసేలాంటి జబ్బు నాకు వచ్చింది. అప్పుడే నా ఆఖరి ఫైలు వ్రాయటం ప్రారంభమైంది. నా లాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు సేద తీరే విధంగా ఈ ఫైలు వ్రాశాను. ఈ ఫైలు వారిమీద ఆధారపడి ఉండే వారి కోసం కూడా వ్రాశాను. ఈ ఫైలు మీ కిచ్చిన బాంబే ట్రాన్స్‌ఫర్ ఫైలు లాగా అందరికీ ఉపయోగపడకపోవచ్చును. కాని ఎవరికైనా ఆ పరిస్థితి వస్తే ఉపయోగపడుతుంది కదా అని వ్రాశాను. అందుకే అందరికీ అందుబాటులో ఉండేవిధంగా నా ఫైళ్ళు అన్నీ అసోసియేషన్ ఆఫీసులో ఉంచడానికి ఏర్పాటు చేశాను.
నా జీవితం బ్రతికినన్నాళ్ళు వీలైనంత సంతోషాన్నే అనుభవించాను. కాని మూర్తిగారూ! ఇప్పుడు చనిపోయిం తరువాత ఒక్కటే నాకు తీరని కోరిక అసలు మనిషికి అన్నిటికంటే భయం కల్గించేది చావు. కారణం నే నన్నదే ఫియర్ ఆఫ్ ది అన్‌నోన్. చావు తరువాత ఏం జరుగుతుందో? ఏమౌతామో? మృత్యువు తరువాత ఏమతుందో మన కెవ్వరికీ తెలీదు. ఈ ఫైలు మీ కందే పాటికి, నా కా రహస్యం తెలిసిపోయి ఉంటుంది. ఆ విషయంపై నేనో ఫైలు వ్రాయగల్గినా దానిని మీ లోకంలోకి పంపించడమెలా అన్నదే నా బాధ. మరి సెలవా మూర్తిగారూ!
********
క్షేమం. ఇటీవలి ఆంధ్రప్రభ వీక్లీలో నీ కథ చదివాను. కుటుంబ పరిధిని దాటి, తాత్కాలిక సమస్యల్ని అధిగమించి, మానవజీవితానికి సంబంధించిన నిగూఢమైన, నిరంతరమైన, నిరుత్తరమైన ఒక రహస్యం వైపు పయనించిన కథ యిది. ఆచి తూచి పేర్చుకుంటూ పోయిన వాక్యాలు వల్ల కథాశిల్పం బాగా కుదిరింది. ఆఫీసర్ పాత్ర సూపర్బ్. బాగా అంతర్ముఖుడైన కథకుడు మాత్రమే యిలాంటి attempt చేయగలడు. చాలా సంతోషం. రచనా వ్యాసంగాన్ని సీరియస్‌గా తీసుకున్న పక్షంలో యిలాంటి కథలే రాయాలి. ‘వస్తువు’జీవితానుభవాలలోనుంచి దొరుకుతుంది. ‘శిల్పం’ సాహిత్యాధ్యయనం వల్ల సమకూరుతుంది.
.. మధురాంతకం రాజారాం, 11.6.91