Menu Close
nirmalaadithya author
కథ వెనుక కథ
-- నిర్మలాదిత్య --

వ్యాపారం చేసే వారందరూ చాల మటుకు బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటారు. పెద్ద పెద్ద కంపెనీలకు బ్యాంకుల ఆర్థిక సహాయం తప్పని సరి. అందు వల్ల ఆ కంపెనీల పని తీరు, చేయ బోయే కొత్త ప్రాజెక్టులు, లాభ, నష్టాల గురించి అంచనాలు ప్రజల కంటే ముందే బ్యాంకింగ్ రంగం లో పని చేస్తున్న వారికి తెలిసిపోతుంది. ఆ సమాచారం ఉపయోగించుకొని ఈ అధికార్లు స్స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేర్లు కొనడమో, అమ్మడమో చేసి విపరీతమైన లాభాలు చేసుకోవచ్చు. దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇలాంటి పనులు వల్ల సాదారణ ప్రజలు నష్ట పోతారని, ప్రభుత్వాలు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ని నేరంగా పరిగణిస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ బాధ్యతలలో, భారత దేశంలో ఉన్న దేశ, విదేశీ బ్యాంకులను విస్తృంగా తనిఖీ చేయడం ఒకటి. ఇలా బ్యాంకుల తనిఖీ చేస్తున్నప్పుడు, బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకున్న పెద్ద కంపెనీల ఆర్థిక వ్యవహారాలు కూడా క్షుణంగా పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమాచారం ఉపయోగించి ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి నేరాలకు పాలు బడకుండడానికి, అలాంటి నేరాలు చేసిన వారికి బ్యాంక్, చట్టం విధించే శిక్షల గురించి కరదీపికల (మాన్యువల్), పలు శిక్షణల ( ట్రైనింగ్ ) ద్వారా అధికారులకు మంచి అవగాహన కల్పిస్తారు.

ఆర్థిక రంగంలో ఉన్న ఈ కట్టుబాట్లు, ఇతర వ్యాపార రంగాలలోను, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలలో, లేకపోవడం గురించి వ్రాసిన కథ ఇది. దీని వల్ల మనకు తెలియకుండానే గ్రామాలకు,  ప్రజలకు, ప్రకృతికి జరుగుతున్న నష్టాలకు ప్రతిస్పందన ఈ కథ.

ఈ కథ వ్రాసినప్పుడు నేను అమెరికా చూడలేదు. కథలోని విమాన ప్రయాణం, నేను అంతకు ముందు వెళ్లిన ఇతర విదేశాల అనుభవంతో వ్రాసింది. చిత్రంగా కథలో వ్రాసిన మరి కొన్ని సంవత్సరాల తరువాత నేను అమెరికాలో జీవితం కొనసాగించడం జరిగింది.

1992 లో వ్రాసిన ఈ కథ తన కాలం కన్నా ముందే పూసిన పువ్వు అనిపిస్తుంది నాకు. దానికి కారణం, ఇలాంటి నేరాల గురించిన అవగాహన ప్రజలలో ఇంకా పూర్తిగా రాలేదని నా అంచనా.

2020 అమెరికా వచ్చాక రజత్ గుప్త, రాజ రత్నంలు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ నేరం ఆధారంగా ‘గోడ’ అన్న కథ వ్రాయడం జరిగింది. అందులో పాత్రధారి ఈ ‘లోగుట్టు’ లోనూ కనిపిస్తాడు. కాదంటే 1992 వ్రాసిన ‘లోగుట్టు’ కథకు ముందు జరిగిన వృత్తాంతం(ప్రీక్వెల్)  2020 వ్రాసిన ‘గోడ‘ కథలో వస్తుంది.

నా కథలన్ని సమగ్రంగా చదివిన పాఠకులకు, విశ్వం ఆవిష్కరణ చేయగలగాలని, ముందే వ్రాసిన కథలకు అప్పుడప్పుడు ప్రీక్వెల్స్, సీక్వెల్స్ వ్రాస్తుంటాను. అలాంటి కథలలో ఇదొకటి.

లోగుట్టు

loguttu

‘డునాట్‌ డిస్టర్బ్‌ ప్లీజ్‌’ అన్న కార్డుని సీటుకు తగిలించి తన సీటుకి పక్కనున్న సీటుకు మధ్యనున్న హేండ్ రెస్ట్‌ను వెనక్కు మడిచేశాడు విశ్వనాథం.

పక్కసీట్లో ఎవ్వరూ లేరు. కాళ్ళు పక్కసీట్లో పెట్టుకుని ఈ రెండు సీట్లను పరుపులా చేసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు విశ్వనాథం. లోపల ఎ.సి.వల్ల కొంచెం చలిగా వుంది. ఎయిర్‌ హోస్టెస్‌ యిచ్చిన బ్లాంకెట్‌ కప్పుకున్నాడు. అయినా నిద్రపట్టడంలేదు. అలసట లేదా? అంటే అది సరికాదు. న్యూయార్క్‌ నుండి లండన్‌ ఫ్లైట్‌, లండన్‌నుంచి యిప్పుడు మద్రాసుకు. ఫ్లైట్‌లో గత పన్నెండు గంటలనుంచి ప్రయాణం చేస్తూనే వున్నాడు. శారీరకంగా బాగా అలసిపోయాడు విశ్వనాథం. దానికి తోడు వయస్సు కూడా మొన్ననే అరవై దాటింది. బట్టతల రాకపోవడం తన తాతవద్దనుండి సంక్రమించిన జీన్స్‌ పుణ్యంవల్లనైనా, జుట్టుమాత్రం బాగా నెరిసిపోయింది. ముఖంలో ముడుతలు, బాగా వత్తుగా వున్న తెల్లటి జుట్టు విశ్వనాథం ముఖానికి ఓ ఆకర్షణ కల్పించినా, ముసిలితనం కూడా బాగా ప్రస్ఫుటంగానే కనబడుతోంది. ముసలివాళ్ళకు నిద్ర త్వరగా పట్టదంటారు కదా! అంటే విశ్వనాథం విషయంలో కాదు. విశ్వనాథం అనుకొంటే ఓ రెండు నిమిషాలలో గుర్రు పెట్టి మరీ నిద్రపోగలడు.

విశ్వనాథం నిద్రపోకపోవడానికి కారణం ఆయన అనుభవిస్తున్న మానసికోద్రేకం. దాదాపు ఓ 35 సం॥ల తర్వాత విశ్వనాథం మళ్లీ భారతదేశంలో అడుగు పెడ్తున్నాడు. విశ్వనాథంకు తను చిన్నతనం గడిపిన పల్లె స్కూలు, బాల్య స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ లీలగా గుర్తుకొస్తున్నారు. తన పల్లెలో గడిపిన రోజులు అస్సలు మర్చిపోలేనేమో అనుకొన్నాడు విశ్వనాథం. పల్లెకు పోవాలంటే ఓ రెండు మైళ్ళ దూరంలో వున్నరోడ్డు దగ్గర బస్సు దిగాలి. రోడ్డు దగ్గర దిగి ఓ మూడు ఫర్లాంగులు మట్టి బాటమీద నడిస్తే చెరువు కట్టవస్తుంది. ఆ చెరువులో ఎప్పుడూ నీళ్ళే. తను సముద్రం చూడనన్ని రోజులు, ఆ చెరువునే సముద్రం అనుకొనేవాడు విశ్వనాథం. చెరువులో అలలు కట్టను కొట్టుకొని కొట్టుకొని, కట్టవెంబడి నురుగును పేర్చేవి. చెరువులో నీటికోళ్ళు బుడుంగని తలలు ముంచుతూ, అప్పుడప్పుడు మాయమవుతూ, తిరిగి ప్రత్యక్షమవుతూ కనిపించేవి. చెరువు కట్ట రెండు చివర్లలో నున్న తూములనుండి నీళ్ళు కాలువలై చేలలోకి పారుతూవుండేవి. ఆ కాలువలు దాటడానికి చెప్పులు చేతుల్లోకి తీసుకొని నడవడం విశ్వనాథానికి గుర్తువచ్చింది. వాటిలో మిలమిల మెరుస్తూ చేపపిల్లలు ఈదడం వాటిని పట్టడానికి పిల్లలు ప్రయత్నించడం కూడా ఓ ఆట. చెరువుకట్టమీద నుంచి ఓ వైపు చూస్తే నీరు, మరోవైపు పచ్చటి పైర్లు. ఎక్కువగా వరి, చెరుకు పంటలు వేసేవాళ్ళు.

విశ్వనాథంకు పై చదువుకని విదేశాలకు వెళ్ళడం. అక్కడి వాతావరణానికి ఆకర్షితుడవ్వడం, అక్కడ పెళ్ళిచేసుకోవడం. దానివల్ల యింట్లోవారితో మనస్పర్థలు, భారతదేశానికి రాకవపోవడం, అన్నీ మనస్సులో మెదిలాయి. యింతచేస్తే తను సాధించిందేమిటో? డబ్బు డబ్బు అంటూ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు. మనదేశం పరిస్థితులతో పోలిస్తే తను మిగలబెట్టిన 50 లక్షల రూపాయలు ఓ పెద్ద మొత్తం అయినా, అక్కడి డాలర్లలో అదోపెద్ద మొత్తం కాదు. అందరు మధ్యతరగతివారూ ‘అమెరికా’లో ఆ మాత్రం మిగల్చగలరు. ఇక యింట్లోనివారిని కాదని పెళ్ళిచేసుకొన్న ‘జేన్‌’తో కూడా ఎక్కువ రోజులు వుండలేకపోయాడు. ఒక్కసారి ఆవిడతో విడాకులు తీసుకొన్న తరువాత మళ్ళీ పెళ్ళి గురించి ఆలోచించలేదు. తన లైఫ్‌ స్టైల్‌ పిల్లల్ని కనడం పెంచడం అన్న ఆలోచనకు అవకాశం యివ్వలేదు.

విడాకులు, పిల్లలు లేకపోవడం, డబ్బు అంతగా సంపాదించలేకపోవడం, వీటన్నిటికి మించిన బాధ విశ్వనాథంకు యింకోటి వుంది. అది విశ్వనాథం అమెరికాలో ఓ ఐదు సంవత్సరాలు జైల్‌లో గడపడం. విశ్వనాథానికి ఆ సంఘటన తల్చుకొంటే యిప్పటికీ అంతులేని బాధ కల్గుతుంది.

విశ్వనాథం తను చేస్తున్న పనివల్ల జైలుకి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. కంపెనీ అకౌంట్లు ఆడిట్‌ చేసేపనిలో ఉన్నాడు విశ్వనాథం. ఓ కంపెనీ ఆడిట్‌ చేసేటప్పుడు ఆ కంపెనీ మంచి ఆర్డర్లు సంపాదించడం, బాగా లాభాలు గడించే సూచనలు కనిపించడంతో ఆ కంపెనీ షేర్ల ఖరీదు పేపర్లో చూశాడు విశ్వనాథం. చాలా చౌకగా అమ్ముడు పోతున్నాయి. వెంటనే తన సేవింగ్సు మొత్తంతో ఆ కంపెనీ షేర్లు  కొన్నాడు. తను అనుకున్నట్లే ఆ కంపెనీ లాభాలు బాగా ఎక్కువవ్వడంతో, ఓ రెండు నెలల తరువాత ఆ కంపెనీ షేర్ల విలువ ఓ పదింతలు పెరిగింది. విశ్వనాథం వెంటనే తను కొన్న షేర్లు అమ్మేసి తన పెట్టుబడికి ఓ పదింతలు లాభాలు సంపాదించుకోగలిగాడు. ఒకేసారి ఇన్ని షేర్లు చేతులు మారడం అనుమానాస్పదంగా ఉండటంతో కంపెనీ కంప్లైంటు చేయడం. తరువాత జరిగిన దర్యాప్తులో విశ్వనాథం ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగు’ చేశాడని రుజువు అవ్వడంతో విశ్వనాథం అరెస్టు కావడం, జైలుపాలు కావడం జరిగింది.

ప్రజలెవరికీ సామాన్యంగా తెలియని విషయం, బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నందువల్ల ముందే తెలిసినా, అలాంటి ఇన్ఫర్మేషన్‌ సొంతలాభానికి ఉపయోగించడం అదే ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ నేరంగా పరిగణిస్తారు అని విశ్వనాథానికి తెలిసినా, తనకు వచ్చే లాభాలను తలచుకొని రిస్కు తీసుకున్నాడు. కాని శిక్షపడిన తరువాతగాని ఆ దేశంలో ఇలాంటి నేరాలను ఇంత సీరియస్‌గా తీసుకుంటారని విశ్వనాథానికి అర్థంకాలేదు.

‘‘కొద్దినిమిషాలలో ప్లేను మద్రాసులో దిగుతుంద’’ని అనౌన్సుమెంటు వినపడడంతో విశ్వనాథం కప్పుకున్న దుప్పటి తీసి, దుస్తుల మీది మడతలు సరిచేసుకుంటూ దిగటానికి ఆయత్తమవ్వసాగాడు.

ఓసూట్‌ కేసు చేతిలో పట్టుకొని విశ్వనాథం బస్సుదిగాడు. ఈ ముప్ఫై ఐదేళ్లలో పెద్ద మార్పేమీ కనపడలేదు విశ్వనాథానికి. చిన్నప్పుడు రకరకాల రంగులున్న ప్రైవేటు బస్సుల బదులు ఒకే ఎర్రరంగున్న ఆర్‌.టి.సి బస్సులు తన ఊరికి నడుస్తున్నాయి. మట్టి రోడ్డు మీద అక్కడక్కడా తారుపూసిన గుర్తులు కనపడినా, ఎత్తుపల్లాల్లో ఏమాత్రం, తేడా కనపడలేదు. విశ్వనాథానికి చికాకు, ఆశ్చర్యం కలిగించిన మరో విషయం - ఇన్ని ఏళ్ళు గడిచినా తన ఊరికి నేరుగా బస్సు పడకపోవడం. ఇప్పటికీ ఊరికి రెండు మైళ్ళ అవతల దిగి చెరువుకట్ట మీద నడిచిపోవాల్సిందే! మొదట ఆ మాట విన్నప్పుడు విశ్వనాథానికి మనస్సు చివుక్కుమంది. పోన్లే... చెరువు కట్టమీద నడుస్తూ తన బాల్యాన్ని నెమరేసుకోవచ్చని సరిపుచ్చుకున్నాడు.

బస్సునుండి మరెవ్వరూ దిగలేదు. విశ్వనాథానికి మరీ ఆశ్చర్యం వేసింది. సరే కొన్ని వందలసార్లు నడిచిన తోవేకదా, అని మెల్లగా చెరువుకట్టవైపు నడవసాగాడు. సూట్‌కేసు మోస్తూ నడుస్తుండడం వల్లనేమో కొంచెం అలసటగానే ఉంది. వయస్సు మళ్లడం వల్ల వచ్చిన సమస్యే ఇది అనుకున్నాడు విశ్వనాథం. తనతో తెచ్చిన సామాన్లన్నీ మద్రాసులోనే ఓ హోటల్లో పెట్టేశాడు. ముందు ఊర్లో తన ఇల్లు చూసి, ఊళ్లోవాళ్ళని కలుద్దామని ఓ సూట్‌కేసుతో బయలుదేరాడు విశ్వనాథం.

తొందరగానే చెరువుకట్ట చేరుకున్నాడు. చెరువులోనున్న నీళ్ళపై నుంచి వీచే చల్లటిగాలి కోసం ఎదురు చూస్తున్న విశ్వనాథానికి ఆశాభంగమే కలిగింది. చెరువువైపు చూశాడు ఆశ్చర్యం! ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు. చెరువునిండా తుమ్మచెట్లు, ముళ్ళచెట్లు, కంపలు. ఆ చెట్లు పెరిగిన వైనం చూస్తేకొన్ని ఏళ్ళనుంచి చెరువులో నీళ్ళున్నట్లు లేదు. కట్టకు మరోవైపు చూశాడు విశ్వనాథం. ఎక్కడ తన మనస్సులో మెదుల్తున్న చెరుకు, వరిపొలాలు? ఎక్కడ తన ముక్కు ఎదురుచూస్తున్న చెరుకు గానుగాడే బెల్లంకాలుస్తున్న తీపి వాసనలు? కట్టకి ఇటువైపు కనిపిస్తున్నవి తుప్పలు, కంపలే. విశ్వనాథానికి తీవ్రమైన అసంతృప్తి, ఆశాభంగం కల్గింది.

చెరువు కట్టమీదున్న దారి కూడా సరిగా లేదు. అక్కడక్కడ బాగా లోతుగా బీటలువారినాయి. ఇప్పుడు ఒకవేళ చెరువులో నీళ్ళుపడినా, ఈ బీటలవల్ల చెరువుకు గండి పడుతుందనటానికి సందేహంలేదు. విశ్వనాథం ఆ స్థితికి అర్థం వెతుక్కుంటూ ఊరు చేరుకున్నాడు. చెరువుకంటే బాధాకరంగా ఉంది ఊరి పరిస్థితి. ఒకప్పుడు కళ్లాపి చల్లి వేసిన ముగ్గులతో అలరారుతుండే వీధులు మట్టి గొట్టుకుపోయాయి. ఇళ్ళు పాడుపడిపోయాయి. గోడలు పడిపోయాయి. తాళం వేసిన ఇళ్ళలో కప్పు సందుల్లో నుంచి చోటు చేసుకున్న సూర్యరశ్మి, గోడ పగుళ్ళలోనుంచి దారి చేసుకున్న ఊరకుక్కలు, తాళం కప్పలని వెక్కిరిస్తున్నట్లున్నాయి.

విశ్వనాథానికి ఏం చేయాలో తోచలేదు. తన వారందరూ అమెరికాలో ఉన్నప్పుడే కాలంచేశారు. ఇప్పుడు బాల్యస్నేహితులు ఎవరైనా ఊళ్ళో ఉన్నారేమో కలుద్దామని వచ్చాడు. మరి ఇక్కడ చూస్తే మనుష్య సంచారమే కనిపించటంలేదు. మెల్లిగా తన ఇంటివైపు దారితీశాడు. విశ్వనాథం అనుకున్నట్లుగానే తన ఇంటికి తాళంవేసి వుంది. బయట అరుగు మీద ఉన్న మట్టిని దులిపి అలసటగా కూర్చున్నాడు విశ్వనాథం. సూట్‌కేసులోనే పెట్టుకున్న నీళ్ళబాటిల్‌ తీసి నీళ్ళు తాగాడు. అమ్మ, నాన్న పోయిన తరువాత ఇల్లు తన చిన్నాన్న కొడుక్కిచ్చారని తెలిసింది. అంటే వాడూ ఇక్కడ లేడన్నమాట. నీళ్ళు తాగడంతో కొంచెం తెరిపి కలిగింది. విశ్వనాథానికి చిన్నప్పుడు ఇదే అరుగుపైన నాన్న, తాతలతో పొట్టలపై కూర్చుని ఆడుకోవడం గుర్తొచ్చి, బాధతోకూడిన సంతోషం కల్గింది. మెల్లగా ఆప్యాయంగా అరుగుని తన చేతులతో తాకాడు విశ్వనాథం. పక్కన దగ్గుతోపాటు, పలకరింపు వినపడ్డంతో విశ్వనాథం ఉలిక్కిపడి చూశాడు. ఓ ముసలతను నిలబడ్డాడు.

‘‘ఎవర్నాయనా నీవు. ఇక్కడ కూర్చున్నావు’’ అని కళ్ళపై చేయి పెట్టి కళ్ళు చికిలించి మరీ విశ్వనాథాన్ని పరీక్షించసాగాడు. వయస్సు దాదాపు తొమ్మిది పదులు దాటి ఉంటాయేమో! విశ్వనాథానికి పోలికలు గుర్తు వచ్చాయి. ఆయన తన స్నేహితుడు ఆనంద్‌ వాళ్ళనాన్న తమ పక్కింట్లో ఉండేవారు.

‘‘అయ్యో బాబాయి నేను విశ్వాన్ని’’ అని చెప్పాడు విశ్వనాథం. ముసలతనికి వినపడలేదు.

మళ్ళీ విశ్వనాథం గట్టిగా మాట్లాడి అతనికి అర్థం అయ్యేటట్లు చెప్పసాగాడు. ఆనంద్‌ వాళ్ళ నాన్నకి విశ్వం గుర్తుకి వచ్చేసరికి ఓ పది నిమిషాలు పట్టింది. ఆయననుంచే విశ్వనాథం మరికొంత సమాచారం రాబట్టగలిగాడు. ఆ ఊళ్ళో ఎందుకనో ఇరవై, ఇరవై ఐదేళ్ళ నుంచి చెరువు నిండటం జరగలేదు. దాంతో పొలాలు బీడుపడి, బావులు ఎండిపోయాయి. మెల్లగా ఒకరి తరువాత ఒకరు ఆ ఊరు వదిలివేసి పోయారు. ఇప్పుడు ఆ ఊళ్ళో ఉంటున్నది ఓ ఐదు కుటుంబాల వాళ్ళు మాత్రమే. అదీ ఆ కుటుంబంలో వయస్సు మళ్ళినవాళ్ళు. ఇవాళో రేపో పోవాల్సినవాళ్ళు. ఈ పుట్టిన ఊళ్ళోనే పోవాలి, అన్న సెంటిమెంటే వాళ్ళని, వాళ్ళ పిల్లల అడుగుజాడలలో నడవనీయకుండా, ఊళ్ళోనే బందీ చేశాయి.

విశ్వనాథం ఆ మాట ఈ మాట మాట్లాడి తన చిన్నాన్న కొడుకు గురించి ఆరాతీశాడు. అతగాడు రెవెన్యూ డిపార్టుమెంటులో ఆర్‌.డి.ఓగా పనిచేస్తున్నట్లు, అతడు సెలవు పెట్టి అక్కడికి ఓ అరవైమైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ళో ఇల్లు కట్టేప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. మళ్ళీ కలుస్తాను అని చెప్పి విశ్వనాథం ఆ ముసలాయన దగ్గర సెలవు తీసుకున్నాడు.

‘‘మళ్ళీ వస్తామని పోయినవాళ్ళు, ఇంతవరకూ ఎవ్వరూ రాలేదు బాబూ’’ అని నర్మగర్భంగా నవ్వాడా ముసలాయన. విశ్వనాథానికి మనస్సు చివుక్కుమంది. విశ్వనాథం తన చిన్నాన్న కొడుకు దగ్గరకు బయలుదేరాడు.

చిన్నాన్న కొడుకు పేరు లోకనాథం. మళ్ళీ చెరువుకట్ట మీదనుంచి నడచివెళ్ళి బస్సు పట్టుకుని ఆ జిల్లా కేంద్రానికి పోయి, అక్కడి నుంచి మరో బస్సు పట్టుకొని లోకనాథం దగ్గరికి చేరాడు. తను చిన్నప్పుడు ఆ జిల్లాలో బాగా తిరిగినవాడే కాని లోకనాథం ఉన్న ఊరుపేరు ఎప్పుడూ విన్నట్టులేదు. పేరు కూడా ‘క్రాంతినగర్‌’ అని ఏదో ఈకాలంవాళ్ళు పెట్టే పేరులాగానే ఉంది. క్రాంతినగర్‌లో దిగిన వెంటనే అదో పట్టణంలా ఉండటం ఆశ్చర్యపరచింది విశ్వనాథాన్ని.

తన ఊళ్ళోలా కాకుండా, ఇక్కడ అన్నీ తారురోడ్లే. గుడిసెలకంటే పెంకుటిళ్ళు సిమెంటు బంగళాలు చాలా కనిపిస్తున్నాయి. ఇళ్ళముందు కనిపిస్తున్న మోటారు సైకిళ్ళు, స్కూటర్లు, అక్కడక్కడా కార్లు ఆ ఊరి వాళ్లు ఉన్నవాళ్ళు అని చాటుతున్నాయి. అక్కడక్కడా ఇళ్ళపైన  ఇల్లు కట్టిన సంవత్సరం చెక్కారు. అన్నీ ఓ ఇరవై, ఇరవై ఐదేళ్ళ ముందు కట్టించినవే, ఈ ఇళ్ళు వేర్వేరు పద్ధతులలో కట్టడం వల్ల కాకపోతే ఒకే సంవత్సరంలో కట్టబడిన గవర్నమెంటు కాలనీలాగ ఉంది క్రాంతినగర్‌.

వెతుక్కుంటూ లోకనాథం ఇల్లు కనుక్కొని లోకనాథంను పరిచయం చేసుకున్నాడు. లోకనాథం విశ్వాన్ని ఇంతకుముందు చూడకపోవడంవల్ల ముందు గుర్తుపట్టకపోయినా పరిచయం చేసుకున్న తరువాత ఆప్యాయంగా లోపలికి పిలిచి సోఫాలో కూర్చోమని, తన ఇంట్లో వారిని వారికి పేరు పేరునా పిలిచి పరిచయం చేశాడు. విశ్వనాథం వాళ్ళకు తను ఫారిన్ నుంచి తెచ్చిన వస్తువులివ్వడంతో వాతావరణం మరింత సంతోషంగా మారింది. విశ్వనాథం స్నానం, భోజనం చేశాక, వసారాలో ఈజీఛెయిర్‌లో కూర్చున్నాడు. మరో కుర్చీలో లోకనాథం కూర్చుని అవీఇవీ మాట్లాడుతున్నాడు.

లోకనాథం పనిచేస్తున్నది రెవెన్యూ డిపార్టుమెంటులో కాబట్టి ఆ చుట్టు పక్కల భూములు, పంటలు వాటిని పండించే భూస్వాముల గురించి వివరాలు విశ్వంతో చెప్పడం మొదలెట్టాడు. మధ్యమధ్యలో మళ్ళీ బంధువుల క్షేమసమాచారాలు మాట్లాడుకున్నారు. విశ్వనాథానికి తను ఇందాక చూసిన ఇళ్ళపైన ఉన్న సంవత్సరపు అంకెలు గుర్తుకొచ్చాయి. అదే విషయం లోకనాథంతో ప్రస్తావించాడు. లోకనాథం దానికి ‘‘అన్నయ్యా! ఈ ఊరు పుట్టి కూడా ఇరవై ఐదు సంవత్సరాలే అయ్యింది. అంతకు ముందు, ఇదంతా ఓ పోరంబోకు నేల. సేద్యం చేయడానికి వీలుకాని నేల. అప్పుడే ఇక్కడికి ఓ ముఫ్పై మైళ్ళ దూరంలో ఓ ఆనకట్ట కట్టారు. దాంతో ఈఊరి వైపు ఓకాలువపడింది. అంతే ఇక్కడ నేల తీరే మారిపోయింది. బీడును పచ్చని పొలాలుగా ఈ కాలువనీళ్లు మార్చేశాయి. అప్పుడే ఈ వూరు వెలిసింది’’ అని అర్థోక్తిలో ఆగి, రహస్యం చెప్తున్నట్టు గొంతు మెల్లగా చేసి. ‘‘అసలు ఈ ఊరు సృష్టించింది బాగా డబ్బున్న కొన్ని కుటుంబాలే. వాళ్ళకి ఇక్కడో ఆనకట్ట పడుతుందని, కాలువ పడుతుందని ఎలాగో ముందే తెలిసిపోయింది. మెల్లగా వాళ్ళందరూ ఈ ఊరి దగ్గరచేరి ఇక్కడున్న పోరంబోకు నేలలను చౌకగా కొనేశారు. అలా ఓ ఆనకట్ట పడుతుందని తెలియని ఇక్కడి ఊరివాళ్ళు వచ్చిన  డబ్బుతో సరి అని సంతోషంగా అమ్మేసి కూలినాలి చేసుకుంటూ బతుకు తెరువు వెదుక్కుంటూ వేరే ఊళ్ళకు వెళ్ళారు. అలా పోయినవాళ్ళలో సగంమంది కెనాలు పడగానే వాళ్ళ భూములనే దున్నడానికి, వ్యవసాయం చేయడానికి, కొత్త భూస్వాములకింద కూలీలుగ చేరారు. అన్నయ్యా! నీకు ఇళ్ళపైనున్న సంవత్సరపు అంకెలను చూసి సందేహం వచ్చింది కదా! మా దగ్గరున్న రెవిన్యూ రికార్డులు చూస్తే ఆ చుట్టుపక్కనున్న భూములన్నీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొద్ది నెలల తేడాలోనే చేతులు మారాయని తెలుస్తుంది’’ అని చిరునవ్వుతో ముగించాడు లోకనాథం.

విశ్వనాథానికి తన ఊరుకూడా ఇరవై ఐదేళ్ళ క్రితమే పాడవడం గుర్తుకొచ్చింది. తన ఊళ్ళో చెరువు ఎండిపోవడం, బావులలో నీళ్ళు ఇంకిపోవటం కూడా ఈ ఆనకట్ట కట్టడం వల్ల ఫలితమేనా? తన బుర్రలో తొలుస్తున్న ప్రశ్నను లోకనాథంను అడిగాడు.

లోకనాథం ‘‘ఈ విషయం నేను చాలా ఆలోచించాను అన్నయ్యా! మన ఊరి చెరువులోకి పారే ఏర్లన్నీ ఆనకట్ట కట్టడంతో, ఆ కట్టదగ్గరే తమ ప్రవాహాన్ని ఆపుకొని అటునుంచి క్రాంతి నగర్‌ వంటి కొత్త ప్రదేశాలకు కొత్తగా కట్టిన కాల్వల ద్వారా ప్రవహించడం మొదలెట్టాయి. చెరువు ఎండిపోవటంతో బావులు ఎండటం, మనుష్యులు ఊరు వదిలిపోవడం జరిగింది. చివరకు ఊరు పాడుబడింది. మన ఊరు పాడుబడడానికి ఈ ఆనకట్టే కారణం. ఐయాయ్‌ కన్విన్స్‌డ్‌’’ అని నొక్కి చెప్పాడు.

ఆనకట్ట కట్టడం వల్ల ఊళ్ళు నీళ్ళలో మునిగితే కనీసం నష్టపరిహారం అయినా దొరికేది. అలా ఒకే దెబ్బతో ముంచేయకుండా, మంచాన పడ్డవాడి చావులాగా, తన ఊరు పాడు పెట్టడంవల్ల తన ఊరివారికి ఆ కంపెన్‌సేషన్‌ కూడా లభించలేదు.

విశ్వనాథానికి ఆలోచించేకొద్దీ కోపం, బాధ అధికం కాసాగాయి. తను షేర్ల అమ్మకంలో ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ చేశానని తన్ను జైల్లో వేశారు. మరి అలాంటిది. ఇక్కడ భూములు చౌకగా కొని డబ్బులు సంపాదిస్తున్న వీరికి శిక్ష లేదా? అసలింతమంది ఇక్కడకు కొత్తగా వచ్చి భూములు కొన్నారంటేనే, వీళ్ళకి ఇక్కడో ఆనకట్ట పడుతుందన్న ‘ఇన్‌సైడర్‌ ఇన్ఫర్మేషన్‌’ తెలిసి ఉండాల్సిందే కదా. ఈ సంగతి లోకనాథంతో మాట్లాడితే ఇక్కడ మొన్నటివరకూ షేర్ల విషయంలోనే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు శిక్ష లేనప్పుడు ఇలాంటి భూముల విషయంలో శిక్షించడం ఎలా సాధ్యం అని వాపోయాడు.

విశ్వనాథం ఆరోజు లోకనాథం దగ్గర ఉండి మరుసటి రోజు తన ఊళ్ళో తన ఇంటి తాళం చెవి తీసుకొని తన ఊరికి బయలుదేరాడు. ఇల్లు చేరింతరువాత కూడా విశ్వనాథంకు మనశ్శాంతి లేకుండాపోయింది. అడుగు బయటపెడితే కనిపించేవి పాడుపడిన ఇళ్ళు, బీడైన పొలాలు. దాదాపు నిర్మానుష్యం అయిన ఊరు విశ్వనాథానికి కోపం, బాధ, చికాకు కల్గించసాగింది.

బాగా ఆలోచించి విశ్వనాథం ఓ నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గర ఓ యాభై లక్షల రూపాయల దాకా డబ్బుంది. అదీ ఫారిస్‌ కరెన్సీలో కాబట్టి తను ఆ డబ్బు ఓ ఫ్యాక్టరీకని పెట్టుబడి పెడితే ప్రభుత్వం తప్పక సహకరిస్తుంది. అలాంటి ఫ్యాక్టరీ తను తన ఊరి దగ్గర నెలకొల్పితే తిరిగి తన ఊరు కళకళ లాడవచ్చని అనిపించింది. విశ్వనాథానికి ఆలోచించిన కొద్ద తన నిర్ణయం సరియైనదే అనిపించింది.

విశ్వనాథం నాన్‌ రెసిడెంటు కావడంతో, ఫ్యాక్టరీ నెలకొల్పడానికి కావల్సిన పనులు పర్మిట్లు అన్నీ చకచకా జరిగిపోయాయి. చివరకు మినిష్టరు, అధికార్లు విశ్వనాథంను అభినందిస్తూ అతనికి పర్మిట్‌, లోన్‌ శాంక్షన్‌ కాగితాలు అందచేశారు. విశ్వనాథం తన లక్ష్యం త్వరలోనే నెరవేరుతున్నందుకు సంతోషిస్తూ కాగితాలు పెట్టుకున్న బ్రీఫ్ కేసుతో ఆ కార్యాలయం నుంచి బయటపడ్డాడు.

విశ్వనాథం బయట అడుగు పెట్టడంతో ఆఫీసులోపల ఫోన్లు పని చేయడం మొదలెట్టాయి.

‘‘ఆ ఫలాని గ్రామంలో ఓ పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నాడు...’’

‘‘ఆ ఓ ఎన్‌.ఆర్‌.ఐ యాభై లక్షల పెట్టుబడి పెడ్తున్నాడు...’’

‘‘ఆ గ్రామం చుట్టూ ఉన్న భూములన్నీ కొనేయ్‌. సరేనా?’’

‘‘ఫ్యాక్టరీ పడటంతో ఆ చుట్టూ ఉన్న భూములకు మంచి గిరాకి తగిలే అవకాశం ఉంది. ఆ గ్రామం పేరు నోట్‌ చేసుకో’’

ఆ కార్యాలయ ఫోన్లు ఆ రోజంతా విశ్వనాథం ఫ్యాక్టరీ గురించే వర్తమానం అందచేస్తున్నాయి. ఆ కార్యాలయంలో ఉన్న వారికి, కావలసిన వారికి.

.. విపుల, 1992

********

Posted in February 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!