Menu Close
nirmalaadithya author
కథ వెనుక కథ
-- నిర్మలాదిత్య --

‘సైబీరియన్ క్రేన్స్’ నేను వ్రాసిన మూడో కథ. 1986 లో ఆంధ్రప్రభ వార పత్రిక కథల పోటీ కి పంపించింది. మామూలుగా అయితే ఇలాంటి పోటీలకి కథావిషయం పై నియమాలు ఏమీ ఉండవు. కానీ ఈ కథల పోటీకి విదేశాలలో ఉన్న తెలుగు వారి గురించిన కథలు అడిగారు.

నేను అంతవరకు భారత దేశం బయట అడుగుపెట్టలేదు. యాదృచ్ఛికంగా, అదే సమయంలో నేను పని చేస్తున్న రిజర్వ్ బ్యాంక్, విదేశాలలో ట్రైనింగ్ కని నన్ను, నాలా కొత్తగా చేరిన కొంతమందిని ఇంటర్వ్యూ కు పిలిచారు. సమయాభావం వల్ల నన్ను హైదరాబాద్ నుండి బొంబాయికి ఫ్లైట్ లోనే రమ్మన్నారు. ఆ ఇంటర్వ్యూ అయ్యి నేను హైదరాబాద్ లో తిరిగి వస్తుంటే, బొంబాయి ఎయిర్పోర్ట్ లో ఒక వయసయ్యినావిడ, నా ముందు చెక్ ఇన్ కావడానికి నిలుచుంది. కొంత మందిని చూస్తే మరచిపోవడం కష్టం. తెలియకపోయినా ఆప్తులనిపిస్తారు. ఇష్టపడతాము.  నేను హైదరాబాద్ తిరిగి వచ్చినా ఆవిడ గురించిన ఆలోచనలు వెంటాడుతూనే ఉండటంతో, నేను వ్రాయలనుకున్న కథకు ముఖ్య పాత్రధారి దొరికిపోయింది. ఇక పత్రిక అడిగిన కథా విషయం వల్ల, మిగిలిన కథా పాత్రలు మేమున్నామని ముందుకు దూసుకు వచ్చాయి. హైదరాబాదు వచ్చిన తరువాత, ఒక బ్యాంక్ ఇన్స్పెక్షన్ పని పై, రెండు వారాలు వరంగల్ లో ఒక హోటల్ లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఆ హోటల్ లో వ్రాసిన కథనే ఇది.

అప్పుడు పి. జి. వోడ్ హౌస్ పుస్తకాలు తెగ చదివే వాడిని. నా శైలి, గుర్తింపు కోసం ఇంకా వెదుక్కుంటున్న రోజులు. ఈ కథలో పాత్రల పేర్లు చెప్పకుండానే కథ నడిపించండంలో, వోడ్ హౌస్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలానే కథ బావుందంటూ మా మేనమామ గారు వ్రాసిన అనేక లేఖలలో, మొదటి లేఖ ఈ కథ తరువాతనే వచ్చింది.

కథ పోటీలలో నెగ్గకపోయినా, పోటీ కథలతో బాటే మరుసటి వారం ప్రచురించారు. ఆ పోటీలో నెగ్గిన కథలలో ఎక్కడ విదేశంలో నివసిస్తున్న వారి ప్రసక్తి లేక పోవడం, నాకు ఆశ్చర్యమనిపించినా, నేను చేసేదేమీ లేదు.

కథ పడిన రెండు నెలలకే రిజర్వ్ బ్యాంక్ నన్ను సెలెక్ట్ చేసి ఆస్ట్రేలియా కు ట్రైనింగ్ కని పంపించడం నా జీవితంలో గొప్ప మలుపు. అలాగే మరో ఏడేళ్ల తరువాత, ఒక సంవత్సరం అమెరికా కు చదువులకని బ్యాంక్ స్పాన్సర్ చేయడం కూడా జరిగి, చివరికి నేను అమెరికాకు వలస పోవడానికి దారితీసింది.  జీవితంలో చూసినది కథలో ప్రతిఫలించడం సామాన్యమే. వ్రాసిన కథలు, తరువాత జీవిత మలుపులకు దారితీసి నిజమవ్వడం అరుదే అనుకుంటాను. అది నా విషయంలో తరచుగానే జరిగింది.

కథ వ్రాసినప్పుడు, విదేశీ జీవితాల గురించి తెలియక పోయినా, కథలో వ్రాసినట్లు ఇప్పటికీ అదే కారణాల వల్ల భారత దేశం కు ప్రయాణం చేస్తున్న వారిని చూసినప్పుడు, ఈ కథ ఇన్ని రోజులుగా మన్నడానికి కారణం బోధపడి, సంతోషం వేస్తుంది.

అవతలి మనిషి గురించి ఆలోచించే వారు, ఇప్పటికీ అక్కడక్కడ తారస పడుతుంటారు. వారిని చూస్తే ముచ్చటేస్తుంది, అరాధించాలనిపిస్తుంది. నేను చేయగలిగినదల్లా అలాంటి వారికి ఈ కథ అంకితం చేయడమే.

సైబీరియన్‌ క్రేన్స్

siberian-cranes

ఆకాశం తూర్పున ఎర్రబడింది. పడమట దూరంలో, అరేబియా సముద్రంమీద ఎగురుతున్న పక్షులు, ఆ సూర్యుని తొలి కిరణాలందుకొని ఆకాశంలో నల్లటి చుక్కలుగా, అంతవరకు ప్రకాశించిన నక్షత్రాలకు నెగెటివుల్లాగా కనబడుతున్నాయి. దగ్గర్లో పక్షులు లేకున్నాకూడా ఎందుకో పక్షుల కిలకిలారావాలు నాకు వినిపించ సాగాయి. ‘తింగ్స్‌మే టర్నవుట్‌ వెల్‌’ అన్న ఆప్టిమిస్టిక్‌ మూడ్‌కు వచ్చేశాను. ఇంతకూ నేనున్నది బాంబే ఎయిర్‌ పోర్టులో. ఉదయం ఆరు గంటలైంది. సెక్యూరిటీ చెకింగు తరవాత, 7 గంటల హైదరాబాదు ఫ్లైట్‌ కోసం వెయిట్‌ చేస్తూ ఎదురుగా ఉన్న అద్దాలలోంచి వచ్చి పోయే ప్లేన్లను చూస్తున్నాను.

వేచి ఉన్న ప్రయాణీకుల కోసం, ఆ హాలునిండా చాలా ప్లాస్టిక్‌ మోల్డెడు కుర్చీలు వేశారు. నేను ఆ హాల్లో ఓ పక్క కూర్చున్నాను. నా పక్కనే మా నాన్నమ్మ కూర్చుంది. న్యూయార్క్‌లోని ఓ హాస్పిటల్‌లో మామమ్మీ, డాడీలు డాక్టర్లుగా పనిచేస్తున్నారు. మమ్మీ, డాడీ నన్ను, నాన్నమ్మను న్యూయార్క్‌ కెన్నెడీ ఎయిర్‌పోర్టులో ప్లేనెక్కించి కొన్ని గంటలే అయినా కొన్ని నెలలైనట్టుంది. పాపం! మమ్మీ, డాడీ రావాలనే ప్రయత్నించారు. కాని హాస్పిటలులో అస్సలు తీరిక లేకుండా ముందే అపాయింట్‌‌మెంట్స్‌ ఇచ్చి కమిట్‌ అయిపోవడంవల్ల వీల్లేకపోయింది. నాన్నమ్మ డిసప్పాయింటై నట్టున్నా. బయటికి కనిపించలేదు. ఏదో ఒకటి చెప్పి, తనే నన్ను నవ్విస్తూంది.

నాన్నమ్మ ఎత్తు అయిదడుగులకి మించదు. నెరిసిన పొట్టి వెంట్రుకలను లాగి ఓ చిన్నముడి వేసింది. మెళ్ళో రుద్రాక్షమాల, చేతులకు రెండు బంగారు గాజులున్నాయి. చిన్న చెక్సున్న కాఫీ రంగు పట్టుచీర కట్టింది. దబ్బపండు ఛాయ, ముఖంమీద బొట్టులేకున్నా, ఆ స్థానంలో తను చిన్నప్పుడు పొడిపించుకున్న పచ్చ ఓ వింత అందాన్నిస్తుంది. గుండ్రటి అద్దాలు, మెటల్‌ ఫ్రేమ్‌ బరువు వల్లనేమో, ముక్కుకి మధ్యలోకి జారాయి. జెట్‌లాగ్ వల్ల నాన్నమ్మ అలిసిపోయి జోగుతూంది. వయస్సు కూడా తక్కువా మరి, ఎనభైఅయిదేళ్ళాయే! ఎంత జెట్‌‌లాగ్ అయినా, ఇంకో పది నిమిషాలకంటే ఎక్కువ తను నిశ్శబ్దంగా ఉండటం సందేహమే. షి ఈజ్‌ ఎ లైవ్‌లీ పర్సెన్‌!

నాన్నమ్మ జోగుతుంటే ఆమె పక్కనే కూర్చుని నాన్నమ్మ తన వైపు పడకుండా అటువైపు వంగుతున్న పెద్దమనిషి న్యూయార్క్‌ నుంచి మాతోనే వచ్చాడు. అతని వయస్సు ఓ ఏభై ఏళ్ళుండవచ్చు. ఎత్తైన నుదురు. వెంట్రుకలు పైకి దువ్వాడు. ఎగునెత్తి వల్ల తనకున్న వెంట్రుకలన్నీ నడినెత్తినుంచే మొదలయ్యాయి. సఫారీ సూటు వేశాడు. అతని కళ్ళు పెద్దగా అటూ ఇటూ కదులుతూ కొంచెం అజిటేటెడ్‌గా ఉన్నట్లనిపిస్తున్నాయి. అతని పక్కనే, అతని కొడుకనుకుంటా ఉన్నాడు. వయస్సు పద్దెనిమిది, పందొమ్మిది ఏళ్ళుండవచ్చు. అమెరికాలో చాలా రోజులు పెరిగినట్లుంది. నా సంగతీ అంతేకదా! ఆ అబ్బాయి పాంటు స్పోర్ట్సు బనియన్‌ టక్‌ చేసి బనియన్‌ పైన విండ్‌ చీటర్‌ వేసుకున్నాడు. కానీ ఇప్పుడా అబ్బాయి దృష్టి ఎదురుగా కూర్చున్న ఓ పడుచు అమ్మాయి మీదుంది.

ఆ అమ్మాయి వయస్సు పాతిక ఉండవచ్చు ఆ అమ్మాయి జీన్స్‌పాంటు, దానిలోకి ఓ ఉలిపిరిలాంటి చీజ్‌ కాటన్‌ షర్టు టక్‌చేసింది. వెంట్రుకలు మెడ కింద వరకు కత్తిరించి జడ వేయకుండా వదిలేసింది. ముఖం ఆకర్షణీయంగానే ఉంది. ఆ అమ్మాయి పక్కన ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూర్చున్నారు. తండ్రి లావుగా బట్టతలతో చూడగానే బిజినెస్‌ మాన్‌లాగా ఉన్నాడు. ఆవిడ తల్లి ఓ సింథెటిక్‌ మెటీరియల్‌ చీరకట్టుకొని ఎర్రటి లిప్‌స్టిక్‌తో బాగా స్టైల్‌గా ఉంది. ఇంత ఉదయమే ఆవిడ రెస్ట్‌రూమ్‌కి పోయి ముఖానికి మెరుగులు దిద్దుకొని రావడాన్ని మెచ్చుకోవచ్చు.

నా కింకో వైపు ఓ ముప్ఫై ఏళ్ళతను బెరుకు బెరుగ్గా కూర్చున్నాడు. అతని చేతుల్లో ఉన్న టూ-ఇన్‌-ఒన్‌ చూస్తే మిడిల్‌ ఈస్టు నుంచి వచ్చినట్లుంది. అతని దగ్గర ఇంకో ఎయిర్‌బాగుకూడా ఉంది. మన దేశంలోనే కొన్నట్లున్నాడు. ఆ బాగుకు జిప్పు పట్టకపోతే దానిమూతి తెరుచుకోకుండా ఓ కర్చీఫు కట్టాడు. మామూలు పేంటు, షర్టు ప్రయాణం వల్ల బాగా నలిగినట్లున్నాయి. మాసిన గడ్డం. అతని బిహేవియర్‌ చూస్తే అస్సలు చదువుకున్నవాడు కాదేమో అన్న సందేహం కూడా కలుగుతుంది.

ఆ యువకుడికి రెండు సీట్ల తరువాత ఇంకో మనిషి ఫుల్‌ సూటు బూటుతో కూర్చుని పేపర్లో ముఖం దూర్చేశాడు. బిజినెస్‌మాన్‌, లండన్‌లో మా ప్లేను రీఫ్యూయలింగ్‌ కోసం ఆగితే అక్కడ ఎక్కాడు. ఇక మిగిలిన వాళ్ళు దగ్గర్లో లేరు.

నాన్నమ్మ జోగడం పూర్తి అయినట్లుంది. ఆవిడ చూపుల్లోని ఉత్సాహాన్ని చూసే అనుకున్నాను, తన పబ్లిక్‌ రిలేషన్స్‌ పని ప్రారంభిస్తుందని. నాన్నమ్మ పక్కనున్న ఎగునెత్తి అసహనంగా తన వాచీ చూస్తూ విండ్‌ చీటర్‌ వేసుకున్న వాళ్ళబ్బాయికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. విండ్‌ చీటర్‌ ఎదురుగా ఉన్న జీన్స్‌ అమ్మాయి పైనుంచి చూపులు మరల్చకుండానే వాళ్ళ నాన్నకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ జీన్స్‌ నవల చదువుతూంది. జీన్స్‌ తల్లిదండ్రులు ఏదో విషయం చిన్నగా చర్చించుకుంటున్నారు. నా కిటువైపున్న పల్లెటూరి శాల్తీ అయిన టూ-ఇన్‌-వన్‌ ఆ టేపు పెట్టుకొని మనస్సులో మిగతా వాళ్ళు ఏమంటారో అన్న సమస్య వల్లనేమో ఇబ్బందిగా చూస్తున్నాడు. ఆ టూ-ఇన్‌-వన్‌ కటువైపున్న సూటు బూటు వాలా పేపరులోనుంచి తలెత్తలేదు.

ఇదంతా చూస్తున్న నాన్నమ్మకు నేను నచ్చినట్లు లేదు. నేనెలాగూ మాట్లాడనని నన్ను ముంగి ముంగి అంటూ ముద్దుగా పిలుస్తూనే ఉంటుంది. ఆ మిగతా వాళ్ళ నెలా తనవైపు కలుపుగోలుతనంతో తిప్పుకుంటుందో చూడవలసిందే. ఇంతకుముందు నాన్నమ్మ చాలాసార్లు ఆ పని చేయడం చూసినా నాలో ఇంకా ఎక్సైటుమెంటు పోలేదు. షిఈజ్‌ జస్ట్‌ గ్రేట్‌. నాన్నమ్మ ఎగునెత్తాయనను చూసి

‘‘ఏమయ్యా, నీవు న్యూయార్కు నుంచే గదూ వస్తూంట?’’ అంది.

‘‘అవునండీ!’’ అని ముక్తసరిగా మాట్లాడి అక్కడికే కట్‌ చేయబోయాడు ఎగునెత్తి. కాని నాన్నమ్మ వదిలే రకం కాదుగా ‘‘అబ్బాయా’’ అనడిగింది మళ్ళీ విండ్‌ చీటర్‌ను చూస్తూ.

‘‘అవునండి’’

‘‘మరి మీ ఇద్దరే వస్తున్నారు. మీ ఆవిడేదయ్యా?’’

నాన్నమ్మ నోట ఆ ప్రశ్న నాచురల్‌గానే అనిపించింది. ఇక లాభం లేదను కున్నాడు, ఎగునెత్తి.

‘‘లేదు బామ్మగారు మా ఆవిణ్ణి స్టేట్స్‌లోనే ఉంచాను. మా అబ్బాయిని ఇక్కడి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలోనైనా చేర్పించిపోదామని  వచ్చాను. వీడికి అమెరికాలో సీటు దొరకడం కష్టం కావడమేకాక ఖర్చు కూడా ఎక్కువే అయ్యేటట్లుంది’’

నాన్నమ్మ! ఆయనతో కోపం నటిస్తూ ‘‘బామ్మ ఏంటయ్యా, నీకంటే ఓఇరవై ఏళ్ళు పెద్దదాన్నేమో, కావాలంటే ‘ఆంటీ అను’ అంది.

ఎగునెత్తి ‘‘సర్లే అంటీగారు’’ అంటూ నవ్వేశాడు.

నానమ్మ కూడా నవ్వుతూ ‘‘అదీ అలాఅన్నావు బావుంది. ఏదీ మెడికల్‌ సీటు కదూ కావాలన్వావు? ఆ కాలేజీ మేనేజ్‌మెంట్‌ కమిటిలో మా చెల్లెలు కొడుకు మెంబరేనయ్యా. నీ క్కావాలంటే వాడితో కలిసి నా పేరు చెప్పు నీ పనైపోతుంది’’ అంది.

ఎగునెత్తి ఇబ్బందిగా చూశాడు. నాన్నమ్మ నావైపు తిరిగి ‘‘ఏరా ముంగీ అలాచూస్తావు, మీ బాబాయి పేరు రాసివ్వు ఆయనకి’’ అని బలవంతంగా నాచేత రాయించి ఆయన కిప్పించింది. ఎగునెత్తాయనకు పెద్దగా నమ్మకం లేకున్నా నాన్నమ్మను నొప్పించకూడదేమోనని నే నిచ్చిన స్లిప్పు తీసి జేబులో పెట్టుకున్నాడు. విండ్‌ చీటర్‌ వాళ్ళ నాన్న స్లిప్పు జేబులో పెట్టుకోవడం చూసి వాళ్ళనాన్న మనస్సు చదివినట్లు చిన్నగా నవ్వాడు.

కానీ ఆ నవ్వు వినపడకుండా కిసకిస శబ్దం వినపడింది. ఎవరో బలవంతంగా వస్తున్న నవ్వాపుకుంటున్నట్లుంది, ఇంకెవ్వరు? జీన్సు పేంటుపనే అది! నాన్నమ్మ కూడా శబ్దం విన్నట్లుంది. ఆ పిల్లవైపు తిరిగి ‘‘ఎందుకమ్మా నవ్వు? మావాడిని ‘ముంగి’ అన్నాననా, మీరు మాత్రం చేస్తున్న పనేమిటి? ఓ అరగంటనుంచి ఇక్కడే కూర్చోనున్నారు. ఎవరైనా పెదవి విప్పారా, ఇంకోరితో మాట్లాడటానికి?’’ జీన్సు పేంటు వెంటనే నవ్వాపేసింది కాని కళ్ళతో ఇంకా నవ్వుతూనే ఉంది. జీన్సు పేంటు తల్లి, అదే లిప్‌స్టికు ‘‘ఈ కాలం పిల్లలంతే ఆంటీ, మన ఎక్స్‌పెక్టేషన్‌ ప్రకారం నడుచుకోరు. అసలు దీన్ని ఇక్కడికి తేవడమే ఒక ఘనకార్యమైంది. అమెరికా వదిలి రానంది మొదట.’’

నాన్నమ్మకు ఓ రవ్వ ఇంట్యూషన్‌ ఎక్కువే. ‘‘పెళ్ళి ప్రపోజలా ఏంటి కొంపదీసి?’’ అంది.

‘‘అవునాంటీ భలేగెస్ చేశారే!’’ అని మెప్పుగా చూసింది లిప్‌స్టికు.

‘‘పోయిన ఇరవై ఏళ్ళనుంచి అమెరికాలోనే ఉన్నాను. మన వాళ్ళ సంగతి తెలీదా. ఇంతకీ ఏ కులం మంది?’’ అంటూ ఆరా తీయసాగింది. మొత్తం మీద ఓ అయిదు నిమిషాలలో వాళ్ళకి రెండు, మూడు మంచి సంబంధాలు అడ్రసులతో సహా చెప్పేసింది. లిప్‌స్టిక్‌ మొగుడు ఆ అడ్రెసులు జాగ్రత్తగా రాసుకోవడం కూడా జరిగిపోయింది.

ఇదంతా పేపరు ముందు పెట్టుకునే వింటున్న సూటు బూటు, పేపరు పక్కన పెట్టి నవ్వుతూ ‘‘మీకు గవర్నమెంటులో కూడా ఎవరైనా తెలుసా ఆంటీ?’’ అన్నాడు.

‘‘ఎందుకు తెలీదూ? నా తమ్ముడి కొడుకు సెక్రెటేరియట్‌లో ఇండస్ట్రీస్‌ డిపార్టుమెంటు సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయినా ఎందుకా వెటకారపు నవ్వు?’’ అంది.

సూటు బూట్‌ షాక్‌ తిన్నాడు. ముఖం పాలిపోయింది. వెంటనే తేరుకుని ‘‘నా మీద ప్రాక్టికల్‌ జోకు వేయడం లేదుకదూ! నాకు నిజంగానే ఇండస్ట్రీస్‌ సెక్రటరీతో పని ఉంది ఆంటీగారూ’’ అన్నాడు.

‘‘లేదబ్బాయి. నా పేరు వాడికి చెప్పు నీక్కావలసిన సాయం చేస్తాడు’’ అంది తరువాత అతను చెప్పినదాన్నిబట్టి తేలిందేమిటంటే అతనో ఇండస్ట్రీ  ప్రారంభించాలన్న ఆలోచనతో మనదేశానికొచ్చాడు. గవర్నమెంటు ఫార్మాలిటీలను గురించి వర్రీ అవుతుండగా నాన్నమ్మ పరిచయం, అతనికి కొంచెం రిలీఫ్‌ ఇచ్చింది.

టూ ఇన్‌ వన్‌కి ఇదేమి పట్టినట్లు లేదు. అందరితో కల్పించుకుని మాట్లాడిన నాన్నమ్మకు, ఇతణ్ణి మాత్రం ఎందుకు వదలాలనిపించిందేమో, ‘‘ఏంటబ్బాయి, నువ్వుమాత్రం నిశ్శబ్దంగా ఉన్నావు. ఏ ఊరుమంది?’’ అంది ‘‘విజయవాడే నండీ’’ అన్నాడు టూ ఇన్‌ వన్‌.

‘‘అరె మా ఊరి దగ్గరేనన్న మాట. దుబాయిలో కదూ నీవు ఎక్కుతా?’’

‘‘అవునమ్మగారూ!’’ అన్నాడతను.

‘‘ఏం జేస్తుంటా వక్కడ?’’

‘‘మేస్త్రీ నమ్మగారూ’’ ఇబ్బందిగా చెప్పాడతను.

కానీ నాన్నమ్మ క్రాస్ ఎగ్జామినేషన్‌ ఆపితేకదా!

‘‘మరి అరేబియానుంచొస్తున్నానంటున్నావు. ఈ టూ ఇన్‌ వన్‌ తప్పితే ఇంకేమి తేలేదంటయ్యా?’’

‘‘లేదమ్మా డబ్బులన్నీ ఇంటికి పంపించాను. భూములు కొని వ్యవసాయం చేయాలి’’ అన్నాడు.

‘‘ఇదిగో అబ్బాయి వ్యవసాయం అదీ ఇదీ అంటూ గొడవ పెట్టుకోకు. కొబ్బరి చెట్లు వేసుకొని ఓ తోట పెట్టుకో. కావాలంటే ఓ సైడు బిజినెసు కూడా ప్రారంభించు. బాగుపడతావు ఇంతకీ ఇంటికి వచ్చేసినట్లేనా?’’

‘‘లేదమ్మగారూ డబ్బులేమీ ఎక్కువ మిగలలేదు. ఇంకో రెండేళ్ళు పనిచేస్తే డబ్బు మరికొంచెం మిగలొచ్చు. మీరు చెప్పినట్లు చేయొచ్చు. మనస్సులో ఎంత తీపి ఉన్నా పెళ్ళాం పిల్లల్ని వదిలేసి దుబాయి పోవలసి వస్తుంది’’

మా నాన్నమ్మలో ఉన్న ఇంకో గుణం అది. తనతో మాట్లాడితే చాలామంది వాళ్ళ మనస్సులో ఉన్న మాటలు పైకి చెప్పేస్తారు. పూర్వజన్మలో చర్చిఫాదర్‌గా ఉండేదేమో అందరి కన్‌ఫెషన్సు వింటూ!

నాన్నమ్మ మాట్లాడ్డం మొదలు పెట్టినప్పటినుంచి అందరూ ఆక్టివ్‌గా ఒకరితో ఒకరు సన్నిహితంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి జీన్సు పిల్ల ‘‘మామ్మగారూ’’ ఇంతకూ మీరు మన దేశం ఎందుకు తిరిగి వచ్చినట్టు?’’ అని నాన్నమ్మ నడిగింది.

‘‘నేను చెబితే కూడా నీ కర్థం కాదులే పిల్లా!’’ అంది నాన్నమ్మ.

నా హృదయం ఎందుకో కలుక్కుమంది. కానీ ఓ పట్టాన వదిలే రకంలాగ లేదా పిల్ల.

‘‘చెప్పండి మామ్మగారూ! మీ పనేదైనా ఉంటే మేమూ సాయపడగలమేమో! మీరైనా చెప్పండి మామ్మ గారెందుకొచ్చారో’’ అంది నావైపు తిరిగి.

నేను నోరు తెరిచేలోగా ‘‘నువ్వు నోర్మూసుకోరా ముంగీ’’ అంది. నన్ను ముంగి అనడం చూసి జీన్స్‌ పిల్ల మళ్ళీ నవ్వేసింది. నేనూ నాతోబాటు మిగతావాళ్ళూ ఆ నవ్వుతో శ్రుతి కలిపేశాం.

అప్పుడే హైదరాబాదు ఫ్లైటు ప్రయాణికుల కోసం అనౌన్సు చేశారు. వెంటనే అందరూ లేచి ప్లేను ఎక్కడానికోసం గేటు దగ్గర ఆగిన బస్సువైపు దారితీశాం.

***

నెల తరువాత ఓ సాయంత్రం అయిదున్నర గంటలకు హైదరాబాదు బేగంపేట ఎయిర్‌ పోర్టులో నేను కూర్చుని, బాంబే ఫ్లైటుకోసం వెయిట్‌ చేస్తున్నాను. రాత్రి రెండు గంటలకు బాంబేనుంచి న్యూయార్కుకు కనెక్టింగు ఫ్లైటు. సడన్‌గా ఏదో పరిచయమున్న నవ్వు వినిపించింది. తలెత్తి చూశాను ఎదురుగా కొంచెం దూరంలో జీన్సు పిల్ల, వాళ్లమ్మ లిప్‌స్టికు, వాళ్ళ నాన్నతో బాటుంది. ఆ జీన్సు పిల్ల నా దగ్గరొచ్చి నవ్వుతూ ‘‘అయ్యో  మీ పేరు తెలీదండి ముంగిగారు. కాని భలే కోఇన్సిడెన్సండి రిటర్ను జర్నీలో కూడా మనం కలవడం’’ అంటూ నన్ను వాళ్ళు కూర్చున్న చోటికి లాక్కెళ్ళింది.

నిజంగానే మంచి కోయిన్సిడెన్సు. అక్కడ జీన్సు పేంటు ఫ్యామిలీయేకాక, ఎగునెత్తి వాళ్ళబ్బాయి విండ్‌ చీటర్‌, సూటూ బూటూ కూడా ఉన్నారు. ఒక్క టూఇన్‌ వన్‌ మాత్రం లేడు. జీన్సు పాంటు తండ్రి ‘‘మీ నాన్నమ్మ చెప్పిన సంబంధాలలో ఒకటి కుదిరిందయ్యా. థాంక్సు చెబుదామంటే మీ అడ్రెసు తీసుకోలేదు...’’ అతని మాటలు పూర్తి కాకుండానే సూటూ బూటూ అందుకున్నాడు. ‘‘నా పనికూడా సెక్రెటేరియెట్‌లో నిమిషాల మీద అయిపోయింది’’ అన్నాడు. ఎగునెత్తి ‘‘మా అబ్బాయికి మెడిసిన్‌లో సులభంగా సీటు దొరికింది’’ అంటూ నాన్నమ్మ గురించి అడగటం మొదలెట్టారు. నేను నవ్వి నిశ్శబ్దంగా ఉన్నాను. మరి నాన్నమ్మ చెప్పినట్లు నేను ముంగిలా ఉండటం మంచిదేమో! అక్కడివాళ్ళందరూ నా నుంచి ఏ సమాధానమూ రాకపోయేసరికి టూ-ఇన్‌-వన్‌ రాకపోవడానికి కారణాల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. టూ-ఇన్‌-వన్‌ పనైపోయిందని వాళ్ళకి తెలీదు పాపం. నాన్నమ్మ తన పేర నున్న రెండెకరాల కొబ్బరి తోటను రెండువారాల క్రితమే టూ- ఇన్‌-వన్‌కి రాసిచ్చి ఇంక భార్యా బిడ్డలను వదిలివెళ్ళనవసరం లేదని గట్టిగా చెప్పింది. టూ-ఇన్‌-వన్‌ ముఖంలో వెలిగిన కృతజ్ఞతాభావం వర్ణనాతీతం. కానీ నాన్నమ్మ ఎందుకలా చేసిందో అతని కర్థం కాలేదు.

ప్లేను ఎక్కడానికి అనౌన్సుమెంటిచ్చిన తరువాత వెళ్ళి ప్లేను ఎక్కాము. ఎగునెత్తి మాత్రం మాతో వెంటనేరాక, కొంచెం ఆగి, ఆఖరున వచ్చాడు. ‘‘పాలోనియస్‌ అడ్‌వైస్‌ టు హిజ్‌ సన్‌’’ లెవల్లో అతడు విండ్‌ చీటర్‌తో ఏదో మాట్లాడి ప్లేనెక్కాడు.

ప్లేనులో నా పక్కన సూటూ బూటూ, నా ముందు ఎగునెత్తి. మిగిలిన వాళ్ళు వెనకపక్కా కూర్చున్నారు. సూటూ బూటూ న్యూస్‌ పేపర్‌లో తలదూర్చేశాడు. ప్లేను టేకాఫ్‌కోసం రన్‌వే చివరన రెడీగా ఉంది. ప్లేను రన్‌వే మీద పరిగెత్తడం మొదలెట్టి గాలిలో ఎగిరే సమయంలో సూటూ బూటూ చిన్నగా కేకవేశాడు. చుట్టు పక్కల వాళ్ళు ఏమైందన్నట్టు అతనివైపు చూశారు. అతను మాట్లాడకుండా నాకు పేపర్‌లో ఓ కాలం చూపెట్టాడు. ఆ పేపరులోనాన్నమ్మ ఫొటో. అంటే నిన్న అడ్వర్టయిజింగుకని ఇచ్చిన ఫొటో మాటర్‌ ఇవ్వాళ ప్రింట్‌ చేశారన్న మాట!

ఎగునెత్తి ‘‘ఏంటయ్యా మీ నాన్నమ్మ చనిపోయిందని ఈ పేపర్లో ‘ఆబిట్స్యురి’ కాలంలో ఫోటోవేస్తే ఓ మాటైనా చెప్పలేదేం?’’ అంటూ నన్ను నిలదీశాడు. మిగతా వాళ్ళు కూడా షాక్‌ అయినట్లున్నారు. జీన్సు పిల్ల సంగతి సరేసరి. కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది. ఓ నిమిషం తరువాత ఆ పిల్ల అంది.

‘‘అవును, మామ్మ మనదేశం ఎందుకొచ్చిందో నా కిప్పుడు అర్థమౌతోంది.’’

మనసులో నేను ‘‘జీన్సు పిల్లా, నాకు మీ అందరికంటే ముందు, అమెరికా నుంచి వస్తున్నప్పుడే తెలుసు. నాన్నమ్మ ఇంకెక్కువ కాలం బ్రతకదని. తన కోరిక ప్రకారం తన సొంత ఊళ్ళో చనిపోవాలని ఇక్కడకి వచ్చింది. మీరందరూ ఇక్కడికి రావడానికి కారణమున్నట్లే నాన్నమ్మకు కారణముందని నాకు తెలుసు. కాని ఏడ్చి, ఏడ్చి కన్నీళ్ళింకిపోయిన నన్ను, ‘ముంగీ ముంగీ’ అంటూ నేను మాట్లాడకుండా, నిజం పొక్కనీయకుండా తను జాగ్రత్తపడిందని ఎలా చెప్పను?’’ అనుకున్నాను.

విమానం ఆకాశంలోకి ఎగిరి స్టెబిలైజు అయింది. నేను ముఖం తిప్పుకుని కిటికీలోనుంచి చూడ్డం మొదలెట్టాను.

ఎర్రటి ఆకాశంలోనుంచి, ఎర్రటి సూర్యుడు మెల్లగా భూమివైపు జారుకుంటున్నాడు. తన గమ్యం దగ్గర పడిందనేమో, తొందరగా ఓనిమిషంలోనే సూర్యుడు అదృశ్యమైపోయాడు.

(సైబీరియన్‌ క్రేన్స్‌ ప్రతి సంవత్సరం తప్పకుండా భారతదేశం వలస వచ్చే ఓ రకం కొంగజాతి పక్షులు)

********

Posted in January 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!