గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »
24. అద్దేపల్లి జ్యోతి
అంశం :: కథ మొదలు మాది_ ముగింపు మీది; శీర్షిక: 'ధీర శ్యామల'
శ్యామల టీచర్గా చేసినప్పుడు ఒక ఛానల్ వాళ్ళు వచ్చి పిల్లలకి పోటీలు పెట్టేవారు, ఆ ఛానల్ వాళ్ళని మెచ్చుకున్నప్పుడు,
"మేడం మీరు రిటైర్ అయిపోయాక కావాలంటే మా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అని వాళ్ళ కార్డు ఇచ్చారు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో పిల్లల్ని పోగేసి వాళ్లకి డ్రాయింగ్ పోటీలు పెట్టి బాగా వేసిన పిల్లలను ఎన్నుకొని ఫైనల్ గా పోటీ పెట్టి వాళ్లకి లక్ష రూపాయలు బహుమతిగా అందిస్తామని చెప్పారు.
దానికోసం చుడిదార్ వేసుకుని చుట్టుపక్కల పల్లెటూర్లు తిరుగుతుంటే పక్కింటి వాళ్ళు, "ఈ వయసులో ఈవిడకి ఇదేం పోయేకాలం "అనుకోవడం విన్నా పట్టించుకోలేదు. మనకి కష్టం వచ్చినప్పుడు పట్టించుకోని మనుషులు మనం ఉత్సాహంగా మంచి పనికి వెళుతుంటే నిరుత్సాహపరచడం వాళ్ళ నైజం, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి అన్నట్టు భావించి, ధైర్యంగా చుట్టుపక్కల పల్లెటూళ్ళు తిరిగి పిల్లలు వేసిన డ్రాయింగ్లు ఆ ఛానల్ వారికి అందించి ధీర శ్యామల అనిపించుకుంది. అది ఆ ఛానల్ లో ప్రసారమైన వీడియో చూసి కూతురు,
"అమ్మా క్షమించమ్మా, మట్టిలో మాణిక్యాలని తీసి ప్రపంచానికి చూపిస్తున్నావు, నీ ప్రయత్నానికి నా అభినందనలు" అంది. కొడుకు కోడలు ముందే నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అది చెయ్ అన్నారు కాబట్టి వాళ్లు కూడా అభినందించారు. వయసు శరీరానికి గాని మనసుకు కాదని మరోసారి నిరూపించింది శ్యామల.
******
25. కూరెళ్ళవరాహ సత్యవతి
అంశం: కథ ప్రారంభం మాది ముగింపు మీది; శీర్షిక: మరో మజిలి
చూడండి శ్యామలా! మలి సంధ్య బ్రతుక్కి మరో తోడు తప్పనిసరి అన్నది ఈ కాలం నిరూపిస్తున్న నిజం. ఈ స్పీడ్ యుగంలో పెద్దలు పిల్లలకి భారమై పోయారు. అది వారి తప్పుకాదు కాలధర్మం. ఏదో లోకం గురించి మా దగ్గరుండండి అంటారే గాని వారికి పెద్దలు గుది బండలే. అందుకే నా భార్య పోయి, ఉన్న ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయాక ఒంటరినయిపోయిన నేను మరోతోడుకి వెతుకుతుండగా మా చెల్లి మీ గురించి చెప్పింది.
ఇంత వరకూ బాధ్యత బరువుతో కృంగిపోయిన మీరు ఈమలి సంధ్యలో మరోతోడు కావాలనుకోవడం తప్పుకాదు. మీకు నా విషయంలో ఎటువంటి అనుమానానికి ఆస్కారం ఇవ్వను. మిమ్మల్ని ఒక స్నేహితురాలిగానే నా జీవితంలోకి ఆహ్వానిస్తూ నా జీవనతోడుగా స్వీకరిస్తానని హామీ ఇస్తున్నాను. ఆలోచించండి. మీ నుంచి అనుకూలమైన వార్తను ఆశిస్తున్నాను. మీ గురించి, మీ తోడు గురించి ఎంతకాలమైనా ఎదురు చూస్తాను అన్న అతని మాటల్లోని నిజాయితీ ఆమెకి అతనిపై సత్ప్రభావాన్ని చూపెట్టడంతో అలాగే రెండు రోజుల్లో నా నిర్ణయం చెప్తానంది శ్యామల.
"ఏమిటీ ఇప్పుడు నీవు పెళ్ళి చేసుకుంటావా? కాటికి పోవాల్సిన సమయంలో కల్యాణం కావాల్సి వచ్చిందా?
మనవల తల్లైన నీకు మరో మనువుపై ఆశ కలిగిందా? ఈ వయస్సులో నీవు పెళ్ళి చేసుకుంటే మా పరువేంగాను? నీకు మా వద్ద ఉండడం కష్టమైతే ఏ వృద్ధాశ్రమంలోనో చేరు. అంతే గాని ఇలాంటి తిక్క పనులు చేసి నాకు తిక్కరేగేట్టుచేయొద్దు" అని అంటాడు అనుకున్న కొడుకు,
"నీ జీవితం, నీ ఇష్టమని, మీ ఆనందమే మాకు ముఖ్యమన్న కోడలి సమాధానంతో తన బాధ్యతను వారు సున్నితంగా తిరస్కరించడం చూసి మనసులో నవ్వుకుంది. ఇక కూతురు తను చెప్పిన విషయం విన్నవెంటనే టప్ మని ఫోన్ పెట్టెయ్యడంతో తనని తన ఇంటిదగ్గర ఉంచుకుని అమ్మగా కాక ఆయాగా చూసే కూతురి స్వార్ధాన్ని గ్రహించిన శ్యామల, ఇక లోకులు పలుగాకులు వారి మాటలను లెక్కించక వెంటనే తాను శ్రీమతి శ్యామ సుందరంగా మారడానికి నిశ్చయించుకున్నట్టుగా తన నిర్ణయాన్ని సుందరానికి ఆనందంగా తెలిపింది శ్యామల.
******