Menu Close
Ghali-Lalitha-Pravallika
కథ మొదలు మాది - ముగింపు మీది
ఘాలి లలిత ప్రవల్లిక

గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »

16. పల్లవి

అంశం :: కథ మొదలు మాది_ముగింపు మీది✍️ శీర్షిక:: సంధ్యాచైతన్యం

ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు.  కానీ ఈ మధ్య కాలంలో...  'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.

అది...

'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం..శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.

కంటికొలకుల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.

***

పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.

"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.

పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది.

ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.

***

కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు. కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు,

"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.

*******

ఇక మిగిలిన కథ

ఎవరు ఏమి అనుకున్నా, తను చేయాలి అనుకున్నది వెంటనే ఆచరణలో పెట్టింది. ఆరోగ్యమే మహాభాగ్యము కదా. శారీరక ఆరోగ్యం ఉంటే మానసికోల్లాసానికి  ప్రయత్నించడం తేలిక. రోజూ లాగే పొద్దున్నే తాను కొత్తగా చేరిన రన్నర్స్ క్లబ్ నడిపే కోచ్ తన ఇంటి వద్దకు వచ్చారు. ఆయన దగ్గరలోనే ఉంటారు. టీషర్టు, పాంట్స్ తొడుక్కుని ఆయనతో పాటు క్లబ్ వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ అయిన పార్క్ కి బయలుదేరింది.

దారిలో వాళ్ళకి రెండిళ్ళ అవతల ఉండే ఆయన చూసి, ఒక వెటకారపు నవ్వు నవ్వి, మీ అమ్మాయి బాగుందా, ఫోన్ చేస్తోందా అని అడిగాడు. కూతురు కోపంగా ఫోన్ కట్ చేసిన విషయం గుర్తుకు వచ్చి, ఆమె కోపానికి కారణం ఈయన నిర్వాకం అని అర్థం చేసుకుంది ఆమె. ఇటువంటివి లక్ష్యపెట్టకండా తాను అనుకున్నది సాధించాలి అంటే ముందుకు సాగాల్సిందే అని ఆమెకి తెలుసు.

కొడుకు, కోడలు ఉద్యోగాల రీత్యా వేరే ఊరిలో ఉంటారు. కొంతకాలం వారి దగ్గరే ఉన్నా, మనవడు కూడా స్కూలుకి వెళ్ళడం మొదలుపెట్టాక తను అక్కడ ఉండలేకపోయింది. తన మనసు అర్థం చేసుకున్న కొడుకు, మళ్ళీ తన ఇంటిలోనే దింపేశాడు. వీలైనప్పుడల్లా వచ్చి వెళుతూ, మంచీ చెడూ చూస్తూ ఉంటాడు. కోడలు కూడా ఆమె ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించడంతో ఇక తన ప్రయత్నం కొనసాగించింది.

చిన్నగా జాగింగ్ తో మొదలుపెట్టి ఒక మూడు నెలలలో కొద్దికొద్దిగా రన్నింగ్ చేయడం మొదలుపెట్టింది. శ్యామలమ్మని కోచ్ వాళ్ళ అబ్బాయి ప్రత్యేకంగా ఉత్సాహపరుస్తూ శ్రద్ధ తీసుకోసాగాడు. ఆరు నెలలు తిరిగేసరికి, తన కాళ్ళు, కీళ్ళు కొంచెం స్వాధీనంలోకి వచ్చాయి అనిపించాక ఈత నేర్చుకోవడం మొదలుపెట్టింది.

సంవత్సరం తిరిగేసరికి తను అనుకున్నది సాధించి ఇల్లు చేరిన ఆమెకి ఇంటి దగ్గర కొడుకు, కోడలూ, కూతురు ఘనస్వాగతం పలికారు. కన్నీళ్ళతో తల్లిని కావులించుకుని కూతురు, "ఎవరో చెప్పింది విని ఏదో ఊహించుకుని, నిన్ను దూరం పెట్టాను. నువ్వు మాత్రం నిస్పృహని తరిమికొట్టి, అనుకున్నది సాధించావు. మాకు ప్రేరణగా నిలిచావు. నన్ను క్షమించు అమ్మా" అన్నది.

కోచ్, మరియు అతని కొడుకు ప్రోత్సాహంతో సీనియర్ సిటిజన్స్ ట్రయథ్లాన్ (ఈత, సైక్లింగ్, పరుగు మూడు అంశాలు కలిపిన పోటీ) లో స్వర్ణపతకం సాధించిన శ్యామలమ్మ, తన తదుపరి లక్ష్యంగా తనవంటి ఎంతోమంది ఒంటరి పెద్దవారికి ఈ ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని పరిచయం చేయాలి అనుకున్నది. అనుకున్నట్టే వీలైనన్ని సార్లు, అటువంటివారికి సదస్సులు నిర్వహిస్తూ "ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్" (పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయాక, అంటే, స్వతంత్రులై వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళాక, పెద్దల దరిచేరే నిరాశానిస్పృహలు) గురించి అవగాహన కలిగిస్తూ, చైతన్యవంతమైన సంధ్యాజీవితం గురించి జాగృతపరచడం మొదలుపెట్టింది.

****

17. వి.వి.వి.కామేశ్వరి

VVV Kameshwariఅంశం: కథ మొదలు మాది_ముగింపు మీది. కథా శీర్షిక: విజయమార్గం

ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు.  కానీ ఈ మధ్య కాలంలో...  'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.

అది...

'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగాఅనారోగ్యం..శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.

కంటికొలకుల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.

***

పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.

"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.

పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది.

ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.

***

కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయంకొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు. కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు,

"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.

*******

నా ముగింపు:

పడిలేచిన అలలా ఉత్సాహం నింపుకుని “డెమో” ప్రదర్శిస్తున్న శ్యామలమ్మను చూసిన, బోసి బుగ్గల బామ్మలు అబ్బురంగా బుగ్గలు నొక్కుంటూ అనుకుంటున్నారు.

“ఏదో తక్కువగా అంచనా వేశాము. కొందరికి అరవైలో ఇరవై వస్తుందని వినటమే గానీ, ఇంత వరకూ చూసింది లేదు. ఇదుగో… ఇప్పుడు… ఇక్కడ… ఈ వేదిక మీద చూస్తున్నాము. మనం కూడా పాత చింతకాయ భావాలకు స్వస్తి చెప్పాలి ఆవిడలా” అని.

వయోభేదం లేదన్న ప్రకటన చూసి, అక్కడకు వచ్చిన భామలు, పైన పడుతున్న వయసును పట్టించుకోకుండా పక్కనపడేసి స్త్రీ జాతికే గర్వకారణమనిపించేలా… చకచకా కట్లు, అల్లికలు, ఒత్తులు మొదలుకుని, అయిదు నుంచీ పది నిమిషాల్లో చిరుతిళ్ళను తయారుచేసుకోవటానికి వీలుగా ఇన్స్టంట్ మిక్సర్ల తయారీ మొదలైన ఆసక్తికర విషయాలపై, శిక్షణా తరగతుల ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆ పెద్దావిడ చేసిన ప్రసంగం, చాకచక్యంగా పనిచేసే తీరు నచ్చి,

“ఆహా! ‘సాధికారత’కు అసలైన అర్థం, శ్యామలమ్మ గారి రూపంలో కనిపిస్తోంది” అనుకుని ఆవిడ వంకే చూస్తున్నారు విస్మయంగా.

‘తను మరొకరికి భారం కాకుండా, ఎవరికీ తలవంచక, ఒంటరితనాన్ని జయించటమే కాక, మరో పదిమందికి ఉపాధిని కల్పిస్తానని, తన మెడలో మిగిలిన చంద్రహారాన్ని తాకట్టు పెట్టి సొమ్మును తెచ్చిన తన నిర్ణయం సరైనదే!’ అనుకున్న శ్యామలమ్మ వదనంలో విరిసింది, విజయ దరహాసం. జాయినవుతూ రిజిష్టరులో సంతకాలు పెట్టిన వారి లిస్టు చూసిన తృప్తితో.

*****

****సశేషం****

Posted in October 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *