Menu Close
Ghali-Lalitha-Pravallika
కథ మొదలు మాది - ముగింపు మీది
ఘాలి లలిత ప్రవల్లిక

గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »

11. దినవహి సత్యవతి

Dinavahi Sathyavathiఅంశం: కథ మొదలు మాది - ముగింపు మీది. శీర్షిక: నిర్ణయం

ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో...  'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.

అది...

'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం...శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.

కంటికొలకుల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.

***

పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.

"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.

పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది.

ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.

***

కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది.

తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు.

కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది.

చుట్టుపక్కల వాళ్ళు, "ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.

*******

కొనసాగింపు👇

*****

పచ్చని పరిసరాలనడుమ, ఊరికి శివార్లలోఉన్న ఒక ఆశ్రమం చేరుకుంది శ్యామలమ్మ. ఆశ్రమ నిర్వాహకులను కలుసుకుని తన పరిస్థితి, అనారోగ్యం...ఇత్యాదివి తెలిపి, "ఇటువంటి వాతావరణంలో ఉంటే ఇటు నాకు స్వస్థతా చేకూరుతుంది, అటు నాకు ఒంటరితనం నుంచి ముక్తి కూడా లభిస్తుంది" అని చెప్పింది.

"కానీ మేడం... ఈ ఆశ్రమం, ఆర్థికంగా ఎటువంటి ఆధారము లేని వారి కోసం స్థాపించాము. కానీ మీకు ఆర్థికంగా ఏ లోటూ లేదు. పైగా అందరూ ఉన్నారు. కనుక మన్నించాలి", అన్నాడు ఆశ్రమ మేనేజర్.

"ఊ... మీరన్నది సబబే. నాకంటే కూడా అలాంటివారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది" కాసేపు ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చినదానిలా, బ్యాగులోంచి చిన్న పుస్తకం తీసి, దానిపై ఏదో వ్రాసి, మేనేజర్ చేతికిచ్చి, "ఇప్పుడు నన్ను ఇక్కడ ఉండనీయడానికి మీకేమి అభ్యంతరం లేదుగా" అంది.

శ్యామలమ్మ ఇచ్చిన కాగితం చూసి అవాక్కై, "అమ్మా! మీదెంత పెద్దమనసు. మీలాంటి వారి సేవలు అందుకోవడం మా ఆశ్రమం చేసుకున్న పుణ్యం", చేతులెత్తి నమస్కరించాడు.

నాటినుంచి ఆశ్రమంలోని ఒక గదిలో ఉంటూ, 'మానవ సేవే మాధవ సేవ' గా భావించి, ఆశ్రమవాసులని తనవారుగా భావించి, చేతనైన సేవలు చేస్తూ, శేషజీవితం ప్రశాంతంగా వెళ్లదీసింది శ్యామలమ్మ.

ఇంతకీ శ్యామలమ్మ ఇచ్చిన ఆ కాగితం...ఒక ఖాళీ చెక్కు. చట్టపరమైన పత్రాల ద్వారా తన యావదాస్తిని ఆశ్రమానికి వ్రాసి ఇచ్చి, అక్కడ ఒక సామాన్యురాలిలా చేరింది శ్యామలమ్మ.

******

13. గొర్తి వాణి శ్రీనివాస్

Gorthi Vaani Srinivasఅంశం: కథ మొదలు మాది - ముగింపు మీది.  శీర్షిక: ఆలంబన

అలసిన మనసుకు ఆలంబన ఏమిటని ఆలోచిస్తున్న సమయంలో, శ్యామలమ్మ దగ్గరకు ఒకబ్బాయి వచ్చి ఉత్తరం చూపించాడు.

"శ్యామలమ్మా! నీ జీవితాన్ని శూన్యం చేసిన పాపం నాదికూడా. పరాంకుశం నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు, అతనికి పెళ్ళై పిల్లలున్నారని తెలిసి కూడా కళ్ళు మూసుకుపోయి తీసుకున్న నిర్ణయం నన్ను నిప్పుల కొలిమిలోకి నెట్టేస్తుందని ఊహించలేకపోయాను. డబ్బున్నా విలువలు పాటించని నాకు విలువ ఇవ్వకూడదనుకున్నాడేమో కొడుకు పుట్టగానే నాకంటే డబ్బున్న ఆమెతో పరాంకుశం వెళ్ళిపోయాడు. ఒంటరితనం తోడుగా కొడుకుని పెంచి పెద్దచేసాను. విధి కూడా నన్ను వంచించింది. క్యాన్సర్ నన్ను కబళించబోతోంది. నా కొడుక్కి అమ్మ లేని లోటు నువ్వే తీర్చాలి. నా కోరిక నీకు స్వార్థంగా అనిపించొచ్చు.

నీ ఔదార్యం నాకు తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. నా కొడుకుతో కలిసి మా బంగళాకు వస్తావని కొన ఊపిరితో ఎదురుచూస్తున్న నిర్భాగ్యురాలు... మాధవీలత."

ఉత్తరం చదివి నిర్ఘంతపోయింది శ్యామలమ్మ. ఎప్పుడో ఒకసారి పరాంకుశంతో మాధవీలతను చూసింది. ముమ్మూర్తులా పరాంకుశం పోలికలో వున్న ఆమె బిడ్డ అభ్యర్థన కాదనలేకపోయింది.

తల్లి నిర్ణయం కొడుక్కి అభ్యంతరం లేదు. కోడలికి అవసరం లేదు. సమాజానికి అక్కర లేదు. బంధువులకు నిమిత్తం లేదు. కానీ ఒంటరి అమ్మను జీవితాంతం తన ఇంటి పనులకు ఉపయోగించుకోవచ్చనుకున్న కూతురికి మాత్రం మింగుడు పడలేదు.

******

****సశేషం****

Posted in August 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *