గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »
10. మంగు కృష్ణ కుమారి
అంశం: కథ మొదలు మాది - ముగింపు మీది. శీర్షిక: కంటికి రెప్పలా
ఎవరేమన్నా శ్యామలమ్మ తను అనుకున్న పని మొదలెట్టింది.
తనకి తెలిసిన కొందరితో మాటాడి వాళ్ళ సమాచారం మొత్తం ఒక పుస్తకంలో రాసుకుంది. తనకింద హెల్ప్ కి ఒకమ్మాయిని పెట్టుకుంది.
కొన్ని కరపత్రాలు వేయించింది.
*కంటికి రెప్పలా* మీకూ ఇలాటి తోడు కావాలా? సంప్రదించండి మమ్మల్ని. (వంటరివారికే…,)
ఈ బోర్డు చూసి ఎందరో ఆమెని కలిసేరు.
శ్యామలమ్మ పెట్టిన ‘వయోజన వితంతు వివాహ వేదిక’ ఏడాది తిరిగేసరికి కళకళలాడుతోంది.
ఎందరో ముసిలివారూ, వంటరివారూ, పిల్లలు తమని పట్టించుకోని వారు, ఆ వేదికలోకి వచ్చి తమ వివరాలు చెప్తారు. నచ్చినవారు అక్కడే అన్నీ మాటాడుకొని జంటలు కూడా అవుతున్నారు.
సంస్థ వార్షిక వేడుకలు ఘనంగా అవుతున్నాయి. శ్యామల హుందాగా ప్రసంగిస్తున్నది.
“ఎందరో నన్ను ‘నీకు పెళ్ళికొడుకు కావాలా? అందుకా ఈ సంస్థ పెట్టేవు?’ అని అడుగుతున్నారు. నా దృష్టిలో వయోజన వివాహం తప్పు కానే కాదు. మనసులో ఇలా జంట కావాలన్న కోరిక ఉండీ, కుటుంబ సభ్యుల సహకారం లేక, జంట దొరక్క ఉండే అభాగ్యులని చూసేను. వితంతు జీవితం గడిపి, ఇలా బతకడంలో సాధక బాధకాలు తెలిసిన దాన్ని. అందుకే ఈ వేదిక స్థాపించేను. ఇక్కడ మేం అందరి సమాచారం రాబట్టి, వాళ్ళ సొంత పూచీమీదే ఈ పెళ్ళిళ్ళు చేస్తాం. ఇక్కడ జంటలు అయిన అందరూ సంతోషంగా గడుపుతున్నారు. ఇందరిని జంటలుగా చేసేనన్న తృప్తి చాలు నాకు…” చప్పట్లు మారు మ్రోగేయి.
******
11. రమాదేవి కులకర్ణి
అంశం: కథ మొదలు మాది - ముగింపు మీది. శీర్షిక: (3ముగింపులు)
ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.
అది...
'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం... శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.
కంటికొలకు ల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
***
పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.
"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పెట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.
పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్‌గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది.
ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.
కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయం కొడుక్కి, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు.
కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది.
చుట్టుపక్కల వాళ్ళు, "ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.
******
1️⃣ముగింపు:
శ్యామలమ్మ తన జీవితాన్ని ఒంటరితనం లేకుండా అర్థవంతంగా మార్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తనని గౌరవించి, ప్రేమించే వారితో స్నేహాన్ని పెంచుకోవాలని, సామాజిక సేవలు చేసి, తన మనసులో ఖాళీని పూరించుకోవాలని అనుకుంది.
ఇంకా, ఆ ఊరిలో ఒక వృద్ధాశ్రమం ఉందని తెలుసుకుని, అక్కడ ఉన్న వృద్ధుల కోసం ఏదైనా సహాయం చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి రోజు వృద్ధాశ్రమం వెళ్ళి, అక్కడ వాళ్ళతో గడుపుతూ, వారికి సాయం చేస్తూ తన జీవితానికి కొత్త సంతోషాన్ని కలిగించుకుంది.
కొద్ది రోజులకే, వృద్ధాశ్రమం వాళ్ళు ఆమెను ప్రేమతో “అమ్మ” అని పిలవడం మొదలుపెట్టారు. శ్యామలమ్మ గుండెలోని ఒంటరితనం కరిగిపోయి, స్నేహితుల మధ్య ఉన్న తనకి నిజమైన సంతోషం దొరికింది. ఈ కొత్త బంధంలో ఆమెకి తను ఎంతో విలువైన వ్యక్తిగా, తనకు తాను అనిపించింది.
అంతేకాకుండా, కొడుకు, కోడలు, కూతురు ఈ విషయాన్ని తెలిసి గర్వంతో తల్లి నిర్ణయాన్ని గౌరవించారు. వాళ్ళు ఆమెను చూసేందుకు వృద్ధాశ్రమం వచ్చి, ఆమె సేవా కృషిని చూసి ఆనందపడ్డారు.
ముగింపు: తన ఒంటరితనాన్ని సామాజిక సేవతో భర్తీ చేసుకొని, శ్యామలమ్మ తన జీవితానికి కొత్త అర్థాన్ని, సంతోషాన్ని కనుగొంది.
2️⃣ముగింపు:
తన ఒంటరితనానికి చెక్ పెట్టడానికి శ్యామలమ్మ అనుకోని నిర్ణయం తీసుకుంది. తన కష్టసుఖాలను అర్థం చేసుకోగల, తనని గౌరవించగల తోడు కావాలని కోరుకుంది. అదే ఊరిలో నివసిస్తున్న ఒక వృద్ధ రిటైర్డ్ అధికారి, రాఘవయ్యగారిని ఈ మధ్యే కలిసింది. అతని సహృదయత, గాంభీర్యం తనకు సరిపోతాయి అనిపించింది.
రాఘవయ్యగారు కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. కొద్ది రోజుల్లోనే శ్యామలమ్మ రాఘవయ్యగారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిజంగా తోడు కావల్సింది ఈ వృద్దాప్యంలోనే కదా.!
తన నిర్ణయం తన పిల్లలకి చెప్పింది. కొడుకు మొదట తడబడి, "ఇది వయసుకు తగ్గదని, ఇతరులు ఏమనుకుంటారో ఆలోచించమని" అన్నాడు!
వివాహం ఒక అనాథాశ్రమంలో సాదాసీదాగా జరిగింది, వృద్ధాప్యంలో వారు ఒకరికి ఒకరు తోడైనారు.
ముగింపు: అప్పుడు ఒంటరితనంతో తాను అనుభవించిన వేదనను,ఇప్పుడు రాఘవయ్యగారి స్నేహంతో మరిచిపోగలిగింది. ఎప్పకటికైనా పిల్లలు అర్థం చేసుకుంటారనే నమ్మకం తనకు ఉంది!
3️⃣ముగింపు:
తన ఒంటరితనాన్ని భరించలేక, తన జీవితం కోసం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది శ్యామలమ్మ. ఎప్పటిలాగే తన పిల్లలకి ఏ రకమైన భారంగా మారకుండా, ఆమె తన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవాలనుకుంది.
ఆ ఆలోచనతో తన తోటమాలి కొడుకు మాధవ్‌ను దత్తత తీసుకోవాలనుకుంది. తల్లిదండ్రుల మరణంతో ఒంటరిగా ఉన్న వాడిని అక్కున చేర్చుకుంది. తనను కొడుకులా చూసుకోవడమే కాకుండా, అతనికి మంచి విద్యను అందించి, అతని జీవితానికి ఒక బలంగా మారింది.
తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు కొడుకూ, కోడలూ తృణీకరించినా, శ్యామలమ్మ తన మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంది. మాధవ్ కు తల్లి ప్రేమను అందించింది. మాధవ్ కూడా శ్యామలమ్మను "అమ్మ" అని పిలవడం మొదలు పెట్టాడు, ఆమె కష్టాల్ని అర్థం చేసుకుంటూ, కొడుకైనాడు!
ముగింపు: తన జీవితంలో ఒంటరితనాన్ని పోగొట్టుకొని, శ్యామలమ్మ మరో ఒంటరి ప్రాణికి నీడై నిలిచింది!