
గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »
4. కొంకేపూడి అనూరాధ - శీర్షిక: యువర్ & మై చిల్డ్రన్
"యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ క్వారల్డ్ విత్ అవర్ చిల్డ్రన్" అనే ఇంగ్లీషు సామెత విన్నారా శ్యామల గారూ" అని నవ్వుతూ అడుగుతున్న విశ్వం అనబడే విశ్వేశ్వర రావు ముఖం కేసి తెల్లబోయి చూసింది శ్యామలమ్మ.
తను కాన్వెంట్లో పనిచేసేటప్పుడు ఆ కాన్వెంట్ ఓనర్ కమ్ ప్రిన్సిపాల్ ఈ విశ్వేశ్వరరావు.
వారం రోజుల క్రితం సడన్ గా ఫోన్ చేసి ఎంతో ఆప్యాయతగా క్షేమ సమాచారం అడిగి తన వివరాలు కూడా చెప్పాడు. ఈ మధ్యనే తన భార్య అనారోగ్య కారణంగా చనిపోయిందని తాను ఒంటరిగా ఉన్నానని అన్నాడు.
ఇప్పుడు ఇతని మాటలలో ఉద్దేశం అర్థం అయింది.
తాను ఉద్యోగం చేసే నాడు ఎంతో మర్యాదగా చూసేవాడు. మంచి మనిషి అని ఆలోచిస్తూ ఉండగా
"ఈ వయస్సులో అవర్ చిల్డ్రన్ ఏమిటి? అని అనుకుంటున్నారా? మీకు అంగీకారం అయితే నా స్కూల్ని మునపటి లాగే మనిద్దరం కలిసి రన్ చేద్దాము. మన స్కూలు పిల్లలు మన పిల్లలేగా. స్కూల్లోనే కాకుండా జీవితంలో కూడా.... అంటూ చేయి అందించాడు.
అప్పుడే శ్యామలమ్మకి కొడుకు వద్ద నుంచి ఫోన్,
"అమ్మ అంకుల్ నాతో అన్ని విషయాలు మాట్లాడారు నువ్వు ఆనందంగా ఉండడమే మాకు ఆనందం. సందేహించకమ్మ” అంటూ ఫోన్ పెట్టేసాడు.
కూతురు కాలక్రమేణా తెలుసుకుంటుంది అని మనసులో అనుకున్న శ్యామలమ్మ
"యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ గేమ్స్ విత్ అవర్ చిల్డ్రన్" అంటూ విశ్వం చేయి సంతోషంగా అందుకుంది.