
ముందుమాట: అందరికీ నమస్తే. కొన్ని కొన్ని కథలు చదివినప్పుడు, ముగింపు ఇలా ఉంటే బాగుంటుంది. అలా ఉంటే బాగుంటుంది అని మనకనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రైటర్ కథలోకి మనం చొరబడలేము... ఏమనుకుంటారోనని సలహాలూ ఇవ్వలేము. అలాంటి సందిగ్ధావస్థ నుంచి బయటపడేసి... తమదైన శైలిలో, వారి వారి ఆలోచనలకు తగిన విధంగా ముగింపులు ఇచ్చే వినూత్న కార్యక్రమాన్ని మా ‘కథా రవళి’ గ్రూప్ ద్వారా మొదలుపెట్టాము.
రచయితలుగా కథలు సృజించడంలో మనం అన్ని కోణాల నుంచి ఆలోచించగలం. అలా విభిన్న ముగింపుల సమాహారమే... ఈ ‘కథ మొదలు మాది ముగింపు మీది.’
శ్రీ రామశర్మ గారి ఆధ్వర్యంలో నడుపుతున్న కథా రవళి వాట్సాప్ సమూహంలో నా నిర్వహణలో వచ్చిన కథల సమాహారాన్ని ఇక్కడ మీకందిస్తున్నాను.
నా అభ్యర్థనను మన్నించి, ధారావాహికగా ప్రతి నెలా ‘సిరిమల్లె పత్రిక’ లో వేయుటకు అంగీకరించిన శ్రీయుతులు బుడమగుంట మధు గారికి, ఉమ గారికి ధన్యవాదాలు.
ఇక ఈ గొలుసుకట్టు కథా సమాహారాన్ని మొదలు పెడదాము.
*****
కథ మొదలుపెట్టింది: ఘాలి లలిత ప్రవల్లిక
ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది. అది...
'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం... శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.
కంటికొలకల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గలపైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
***
పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.
"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏ మొహం పెట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏ చావన్నా చావండి. మాకు, మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను, ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.
పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ, ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది. ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.
***
కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు. కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు,
"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం," అని అన్నారు.
ముగింపు కథ కొనసాగింపు .... ద్విభాష్యం రాజేశ్వరరావు ‘తోడు’
చుట్టుపక్కల వాళ్ళ మాటలను లక్ష్యపెట్ట దలుచుకోలేదు శ్యామలమ్మ. కట్టుకున్నవాడు తనను నిర్ధాక్షిణ్యంగా వదిలేసి తన మానాన తాను వెళ్ళిపోయాడు. అత్తింటి వాళ్ళు కూడా తనమీద ఏమాత్రం దయ చూపలేదు. తన రెక్కల కష్టం మీద కాన్వెంట్లో ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసింది. పెళ్లిళ్లు చేసింది. భగవంతుని దయవల్ల తన బాధ్యతను తాను సవ్యంగానే నిర్వర్తించగలిగింది.
అయితే, ‘ఇప్పుడు ఈ ఆరు పదులు దాటిపోయిన వయస్సులో తనకు కష్టం కలిగితే చూసే వాళ్ళు ఎవరు?!' అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నిద్ర పట్టదు. ఏదో తెలియని భయం మనసులో ఆవరించుకుంటుంది. ఈ భయం నుంచి బయటపడాలి. 'ఎలా? ఎలా?' అనుకుంటూ దీర్ఘంగా అనేక రోజులు ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది.
తన రోజులు భవిష్యత్తులో ఆనందంగా గడవాలంటే, తన కష్టసుఖాలను మరొకరితో పంచుకోవాలంటే ఈ ఒంటరి నుంచి బయటపడాలి. అంటే తనకి ఓ తోడు కావాలి!!
పాలు అలా వదిలి పెట్టేస్తే ఏదో ఒక సమయానికి విరిగిపోతాయి. అదే పాలను కాసింత మజ్జిగతో తోడు పెడితే చక్కగా తోడుకొని గడ్డ పెరుగులా తయారై విలువైన ఆహారంగా మారుతుంది. తన జీవితాన్ని కూడా తాను విలువైనదిగా మార్చుకోవాలి. అందుకే తనతో పాటు కాన్వెంట్లో టీచర్ గా పనిచేసి, భార్యను పోగొట్టుకొని ఒంటరిగా బతుకుతున్న ఆనందరావును వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. ఆనందరావు ఎంతో సౌమ్యుడు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పది మంది పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతూ కాలం వెళ్ళదీస్తున్నాడు.
'ఇలా ఒంటరిగా ఎంత కాలం బతుకుతారు మీరు! మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా!' అంటూ తన భార్య పోయిన ఓ సంవత్సరం తర్వాత తనకు సలహా కూడా ఇచ్చాడు. అతనికి తన ఎడల సదభిప్రాయం ఉందని, తనతో జీవితం పంచుకునేందుకు ఆసక్తితో ఉన్నాడని, చాలా సందర్భాలలో అతని మాటల వల్ల తనకు అర్థం అయింది. అంతేకాదు, వారం రోజుల క్రితం అతని దూరపు మేనత్త ద్వారా తన మనసులోని భావాన్ని తనకు తెలియజేశాడు కూడా.
ఈ అవకాశాన్ని శ్యామలమ్మ వదులుకోదల్చుకోలేదు. తనకు ఒకతోడు సంపాదించుకుని భవిష్యత్తును సంతృప్తిగా, సుఖంగా గడిపే నిమిత్తం ఆనందరావు ఇంటి వైపు అడుగులు వేసింది.
ముగింపు కథ కొనసాగింపు ....పూర్ణ కామేశ్వరి – తరువాతి సంచికలో