కంటే కూతురునే కనాలి...
అంటూ ఉంటారు...
తలలు పండిన
కొందరు తల్లిదండ్రులు
కారణం
అవసాన దశలో
కరుణ
తొణికిసలాడే కళ్ళతో...
ఆపదలో ఆదుకునే
మంచి మనసుతో...
మనస్పూర్తిగా
ఆలింగనం చేసుకునే
కడుపు నింపే
చల్లని హస్తాలతో...
మేమున్నామనే
భరోసా నిచ్చే
ప్రేమ పూర్వకపు
పలకరింపులతో...
కన్నవారిపై
కన్నకూతురు చూపే
అంతులేని
ఆ ప్రేమ
ఆ వాత్సల్యం
స్వచ్ఛమైన
ఆ అనురాగం
ఆ ఆప్యాయతను
ప్రత్యక్షంగా చవిచూస్తుంటే..
హాయిగా అనుభవిస్తుంటే...
అదంతా నమ్మశక్యం కాకుంటే...
కళ్ళనుండి
జాలువారిన
ఆ కన్నీటి చుక్కలు
గుండె తడిగా...
ఆశల దీపాలుగా...
మారిపోవచ్చు...
కళ్ళనుండి
జలజల రాలిన
ఆ ఆనంద భాష్పాలు
మనసు కడలిని చేరి
కలల అలలపై
ఎగిసి ఎగిసిపడే
సంతోష సాగరం కావొచ్చు
ఏడేడు జన్మల
ఏడు రంగుల
ఇంద్ర ధనుస్సు కావచ్చు
పిల్లల్ని
ఎందరినికన్నా
ఏ ఒక్కరిలోనైనా
కాసింత కృతజ్ఞత ఉంటే...
ఆరిపోయే ఆ దీపాలకు...
రెక్కలు విరిగిన ఆపక్షులకు...
ఎంత తృప్తి..! ఎంత తృప్తి..!
ఎంత అదృష్టం..! ఎంత అదృష్టం..!
ఆపై చితికి చేరేరు చిరునవ్వులతో
పరమాత్మలో లీనమయ్యేరు
హాయిగా...
ఆనందంగా...
పరమానందంగా...
తృప్తిగా...సంతృప్తిగా
అది ఏ దేవుని వరమో...
అది ఏ జన్మ పుణ్యఫలమో...
ఎవరికెవరు...? ఆ పరమాత్మకు తప్ప...