నువ్వు భూగోళం అవతలి వైపు
లక్ష్యాన్ని అలానే అంటిపెట్టుకుని ఉండు.
ఇక్కడ నిద్ర, లేని రాత్రులు
తెల్లారిపోతున్నాయి.
గూడు విడిచిన పక్షి లా
నువ్వెల్లిపోతే తిరిగొచ్చేవరకూ
దిగులు సంద్రాలు ఈదుతున్నాను.
టి.వి.ల్లో రక్తమడుగుల్ని చూసి
యుద్ధ విద్వంసాల్ని చూసి
చిగురుటాకుల్లా వొణుకుతున్నాం.
సరిగా ఉన్నావా తిన్నావా
బతుకు భయం తో
గొంతు సవరించుకుంటున్నావా
గొంతు పెగలని మాటల్తో
నువ్వు
చీకటి దృశ్యాల్ని వొంపేసావు.
ఊహకందని ప్రపంచంలో
తడబడుతూ నేను విలపిస్తున్నాను.
హద్దులు గీయటం తోనే
యుద్ధాలు వచ్చాయి.
పక్షి జీవితమే నయం
ఆంక్షలులేని దూరాలు పోతుంది.
సందె వేళ
మిణుగురు పురుగుల కాంతిని
నాలో నింపుకుని
గుప్పెడు గుండెల్లో
నిన్ను దాచుకుని
ఎదురు చూపులు
ఆకుల్లా రాలుతున్నాయ్.
రెండు దేశాల
యుద్ధాల మధ్య
మమతల మేఘాలు కరిగి
ఏడ్చి ఏడ్చి
కన్నీళ్ళింకిపోతున్నాయ్.
గాలులు రువ్వుతున్నాయ్.
నువ్వు ఏ ఒడ్డుకు
చేర్చుతావో గానీ
దిగులు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి.
దుఃఖం దిగులు చూపుల్లో
వేలాడుతోంది.
చాలా బాగుంది సార్