Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

కడుపులో లేంది కావలించుకుంటే వస్తుందా!

నాగులవరం గ్రామంలో నాగేంద్రయ్య ఒకరైతు. అతనికి ముగ్గురు తమ్ములు. నాగేంద్రయ్య పసితనంలో పక్కనున్న పెద్దూరులో పదోతరగతి వరకూ చదివి, నాయనకు పొలంపనుల్లో సాయం చేయను చదువు వదిలేశాడు. తండ్రికి పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ మిగతా ముగ్గురు తమ్ములనూ పెద్ద చదువులు చదివించాడు. పక్కూరి పార్వతమ్మ తో పెళ్ళైంది. పార్వతమ్మ భర్త మనసెరిగి, అత్తామామలను సొంత అమ్మా నాయన్లలా చూసుకునేది.

ముగ్గురు తమ్ముళ్ళూ చదువులై విదేశాలకు ఇంజనీరుగా ఒకరు, డాక్టరుగా ఒకరూ వెళ్ళగా, మరొకడు పెద్ద నగరంలో బ్యాంక్ ఉద్యోగానికి వెళ్లాడు. అమ్మా నాయనల ప్రమేయం లేకుండా వాళ్ళతోటి వాళ్ళను పెళ్ళిళ్ళు చేసేసుకుని నోటి మాటగా అయ్యకు అమ్మకూ చెప్పి, కార్లలో వచ్చి భార్యలను చూపించి వెళ్ళారు.

అప్పుడు తెలిసింది, నాగేంద్రయ్య నాయనకు తను చేసిన తప్పేంటో. పెద్దోడిని చదువుకు దూరం చేసి మట్టిపిసుక్కునే పల్లెటూరి వాడిగా చేసి, మిగతా ముగ్గురినీ వాడి రెక్కల కష్టంతో చదివించి నందుకు తమను గాలికొదిలేసి వెళ్ళిపోయారు. పెద్దోడికి అన్యాయం చేశానే అని బాధపడేవాడు. దానికి నాగేంద్రయ్య "నాయనా! నన్నూ చదివిస్తే తమ్ముళ్ళ మాదిరి నేనూ మిమ్మల్ని వదిలేసి పోయేవాడినేమో! అందుకే దేవుడు నన్ను రైతును జేసి మీ దగ్గరుంచాడు. పోన్లేయే నాయనా! నా కేమీ లోపం చేయలేదులే. ఊరికే బాధపడకు" అని చెప్పాడు.

తల్లి మాత్రం "ఒరే! నాగేంద్ర!" నీ బిడ్డల నైనా చదివీయరా!" అని పోరసాగింది. కవల బిడ్డలైన ఇద్దరు మగబిడ్దలున్న నాగేంద్రయ్య వారిని పక్కూరిలో చదివిస్తూ, ఆ పైన పట్నంలో కాలేజీలో వేశాడు. వారూ తండ్రి, తాతల బాధ గుర్తుంచుకుని బాగా చదివి, ఒకడు ఇంజనీరూ, మరొకడు డాక్టరూ అయ్యారు. కొడుకులిద్దరికీ ముసలివారైన అయ్యా అమ్మా బతికుండగానే పెళ్ళిళ్ళు చేయాలని భావించాడు నాగేంద్రయ్య. సాంప్రదాయ కుటుంబాలనుంచి పిల్లలను చూసి బిడ్డల ఇష్టం మేరకూ పెళ్ళిళ్ళు స్థిరపరచి ముగ్గురు తమ్ముళ్ళకూ తెలియపరచాడు. 'ముసలి వారైన అమ్మా అయ్యా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారనీ, పెళ్ళిళ్ళకు వచ్చి పెద్దోళ్ళను చూసిపొమ్మనీ' తెలిపాడు. దానికి వారు అక్కడి నుంచే కొన్ని బహుమతులు పంపుతూ "మాపిల్లలు ఏసీలూ, కార్లూ, ఫోన్లూ లేని చోట, పల్లెలో ఒక్కరోజైనా ఉండలేరు. ఆ పేద వాసనలు, దోమలూ పడవు. పైగా అక్కడికి అందరం రావాలంటే బోలెడు డబ్బు వృధా. ఎందుకొచ్చిన దండగ. బహుమతులు పంపుతున్నాం." అని వ్రాశారు.

అది విని నాగేంద్రయ్య తల్లి బాధపడి "ఒరే నాగేంద్రా! కడుపులో లేంది కావలించుకుంటే వస్తదిరా! మనల్ని ఒదిలేసి పోయినోళ్ళు ఎందుకొస్తర్రా! అబ్బా అమ్మల్ని చూడాలని వాళ్ళకు లేంది నీవు పిలిస్తే ఒస్తార్రా!" అని బాధ పడింది. మనవల పెళ్ళి చూసి, తన పొలంపుట్రా అంతా తన తదనంతరం నాగేంద్రయ్య కొడుకులకు చెందేలా వ్రాశాడు తాత. అది తన స్వార్జితం ఐనందున ఎవ్వరూ ఎమీ మాట్లాడను వీలులేదు. చదివించిన తన బిడ్దలు దూరమైనా నాగేంద్రయ్య, పార్వతమ్మ ల ప్రేమాభిమానాలతో ఆ ముసలి దంపతులు సుఖంగా బతికారు.

Posted in January 2020, బాల్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!