Menu Close
kumari-samineni
జీవితకాలం (కథ)
-- కుమారి సామినేని --

ప్రొద్దున్న కాఫీ తతంగమైన తర్వాత మెయిడ్ (maid)మరియా రాకముందే స్నానం, పూజ కానిద్దామని న్యూస్ వింటూ వంటిల్లు సర్దుతుంటే ఫోను ----- అరువు మేనకోడళ్ళలో ఒక కోడలు

"ఆంటీ, ఈ సమ్మర్ లో ఇండియా వెళ్తున్నా, మీకేమైనా చీరలు కావాలా? నాకు తెలిసిన మంచి చీరల షాపు లో వెంకటగిరీ, ధర్మవరం, మైసూరు సిల్కు చీరలు మంచి ధరకే వస్తాయి ఒకటో, రెండో చీరలు కావలిస్తే తెస్తా!" అంది అభిమానంతో.

"థాంక్సు కానీ, వద్దులేమ్మా! దీపారాధనకి కాడ వత్తుల ప్యాకెట్టులు రెండు మట్టుకు తెచ్చి పెట్టమ్మా" అన్నాను.

"తప్పకుండాను, ఆంటీ! కానీ మీ దగ్గర చీరలన్నీ పాత డిజైనులే! నేను క్రొత్తవి తెచ్చిపెడ్తా మీకేమైనా కావలిస్తే" చనువుగా అని అంతలో "అన్నట్ట్లు మన అరుణ నిన్న మధ్యాహ్నం కనింది. పాప చాలా ముద్దుగా వుంది. అరుణ కూడా బాగానే వుంది. ఈ సాయంత్రమే వచ్చేస్తోంది ఇంటికి" అంది.

"అలాగా! ఇంటికి రాగానే వెళ్తే వాళ్ళకి ఇబ్బందేమో మీ అంకుల్ తో ఏమైనా రెండు కూరలు రేపు పంపి నేను నిదానంగా వెళ్ళి చూస్తాలే" అని అన్నాను. అంతలో,

"నాకింకేదో కాల్ వస్తోంది ఆంటీ. రేపు మళ్ళీ ఫోను చేస్తా. బై ఆంటీ" అని పెట్టేసింది.

అరుణా వాళ్ళ పాప గురించి ఆలోచిస్తూ నా ఈ జీవితకాలంలో ముప్పాతికో ఇంకా ఎక్కువ కాలమే దాటేయేమో తెలియడం లేదు. కానీ, ఈ చిన్ని, చిన్ని, బుజ్జి చిన్నారులని చూచినప్పుడు వీళ్ళ గ్రాడ్యుఏషన్లూ, పెళ్ళిళ్ళూ నేను వెళ్ళి పోయిన తర్వాతే జరుగుతాయని తెలుసు కదా!

మళ్ళీ నామనస్సు, చీరల మీదకు గెంతింది. ఓ ప్రక్క మరో గద్వాల్ చీరో, పూనా చీరో, వెంకటగిరీనో తెప్పించుకుంటే బాగుణ్ణేమో అనుకునేంతలో క్లాజెట్లలో ఇస్త్రీలు చేసే ఓపిక లేక, మా ముఖాలు ఎప్పుడు చూస్తావని దిగులుగా వేళ్ళాడుతున్న పట్టు చీరలూ, మమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటావని బీరువాలలో పడి మూలుగుతున్న మరి కొన్ని క్రొత్త చీరలూ గుర్తొచ్చి వద్దులే బాబూ అనుకున్నా!

ఇక నా ప్రయాణం ముగిసిన తర్వాత మా అమ్మాయి కి ఎంత తలనొప్పో ఇవన్నీ ఒదిలించుకుని ఒక కొలిక్కి తేవడానికి అనుకుంటుంటేనే నా తల తిరుగుతున్నది!

ఇలా ఆలోచిస్తున్న నాకు ఒక్క సారిగా అవతలవేపు ఎక్కడో ఏముందో ఎవరున్నారో అన్న భావన ఉప్పొంగింది. మా పాప తనకి మూడేళ్ళప్పుడు "మమ్మీ! వేర్ వాస్ ఐ బిఫోర్ ఐ ఎంటెరెడ్ యువర్ టమ్మీ?" అని అడిగిన ప్రశ్న మళ్ళీ గుర్తుకొచ్చింది.

అవును! ఎక్కడ? ఎవరున్నారు? లేక ఏముంది? నన్నిక్కడికి ఎవరు పంపారు? ఎందుకని పంపారు? అస్సలు అటు వైపునున్న శక్తి కి నన్ను సృష్టించాల్సిన అవసరం ఏముంది? నన్ను ఏమైనా ప్రత్యేకంగానో, అద్భుతం గానో సృష్టించాడా పోనీ నాకేమైనా నా చేతలతో పదిమందికీ సహాయపడే, సంతోషపరిచే, ఉధ్ధరించే అద్భుత విద్యలు, కళలు, తెలివీ, ధైర్యం, సాహసాలూ గానీ ఇచ్చాడా అంటే అదీ లేదు.

అవును ఎవరున్నారు లేక ఏముంది? అస్సలు అటు వైపునున్నశక్తి కి నన్ను సృష్టించాల్సిన అవసరం ఏముంది?

కోటాను కోట్ల యుగాలలో, కోటాను కోట్ల బ్రహ్మాండాలనీ, కోటాను కోట్ల గ్రహాలలో కోటాను కోట్ల జీవ రాసులన్నింటినీ సృష్టించిన ఆ భగవానుడికి నన్ను సృష్టించాల్సిన కారణం గానీ, అవసరం గానీ ఏమొచ్చింది? నా జన్మ ఈ అనంత సృష్టిలో ఎంత సూక్ష్మాతి సూక్ష్మమో?

ఫలానా తల్లి తండ్రులకి పుట్టి, వాళ్ళ ప్రేమ, శ్రమ, కష్టార్జితాలతో నా ప్రాణాలూ, జీవితమూ నిలబెట్టుకున్న దాంట్లో నా గొప్ప ఏమీ లేదు. ఇక నాకని ఓ జీవితం అంటూ ఏర్పడింతర్వాత ఏదో మా సంసారం లో పొట్టలు పోషించుకోడం కోసం మా బాగోగులు చూసుకోవడం తోనే సరిపోయింది కాలం కాస్తా!

ఈ పాటి జీవితానికి నన్ను సృష్టించి నాకో తలా తోకా లేని అర్థం పర్థం లేని బ్రతుకునివ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నా బ్రతుకు వల్ల నీకు గాని, నీ సృష్టికీ గాని, నాకు గాని, వూడబెట్టిన గొప్ప ప్రయోజనం ఏమిటి? ఒక్క వందేళ్ళు బ్రతికే మానవులనే దగ్గరనుండీ సూర్యుడి వెలుతురుని కూడా చూడకుండా వందల కొలదీ ఏళ్ళు బ్రతికే వేల కొలది జీవరాసుల దాకా ఇలా పుట్టిస్తూ వుండాల్సిన అవసరం, కారణం నీకేమిటి?  అస్సలు నీకు మతి సరిగ్గానే వుందా? లేకపోతే ఇలాటి అర్థం పర్థం లేని అస్తవ్యస్తాలని పిచ్చిగా సృష్టించడం ఎందుకు? నీకు ఒరిగిందేమిటని అడగాలని, నిలదీయాలని వుంది.

నా జీవితం నా చేతుల్తోనే దిద్దుకోవాలనుకొని తాపత్రయ పడిన నాకు కొన్ని ముఖ్యమైన సంఘటనల్లో ఎక్కడనుండో ఎందుకనో ఎప్పుడూ వూహించని మలుపులు తెచ్చి పెట్టి "మీ బ్రతుకులు నా ఒక్కడి అధీనం లోనే వుంటాయి నేనే సూత్రధారుణ్ణి" అని తెలియ చెప్పేందుకు నన్ను సృష్టించమని ఎవడడిగాడు?

నా లోనో లేక నన్ను నువ్వు సృష్టించిన విధానంలో లోపాలు వెతుకుతున్నాననుకోకు. నా జన్మను ఒక్క చిన్న సూక్ష్మ అణువు గా మొదలు పెట్టి కోట్ల కొలది కణాలని వివిధ భాగాలుగా చేసి ఇంతకాలం నా దేహంలోని అవయవాలన్నీ అత్యద్భుతం గా లోకం లో ఏ కర్మాగారాలు పనిచేయలేని విధంగా ఈ శరీరం పని చేస్తూ, నాకు తెలియకుండానే నాప్రమేయం లేకుండానే నీ ఇఛ్ఛా, దయా ప్రకారంతో ఇణ్ణాళ్ళూ ఎలా ఎదిగిందో, ఇలా ఎలా మారిందో నాకు తెలియదు (నామనస్సెలా ఎదిగిందో నాకు ఊహ తెలిసినప్పట్నుండే కొంచెం కొంచెం  గుర్తుందనుకో).

అప్పుడప్పుడూ నిన్ను గడ్డిపోచ మీద హిమబిందువులో అరవిచ్చుకుంటున్న పూవులో, మొలకెత్తుతున్న బీజం లో, పసిగుడ్డుల కన్నుల్లో, ఏడుపులో; బిడ్డల బోసినవ్వుల్లో, చూపుల్లో, చేష్టల్లో; ఆకాశపు అంచుల్లో; సూర్యోదయ సూర్యాస్తమయాల రంగుల్లో; నీటి తరంగాలాలో, సముద్రపుటలల్లో, కొండల్లో, కోనల్లో, వాగుల్లో; మనిషి మంచితనం లో, మానవుడి దీనావస్థలల్లో, తల్లీ బిడ్డల అనుబంధం లో, భార్యా భర్తల హృదయానురాగాలలో, కొన్ని కవితలలో; మేధావుల పద్య గద్యాలలో, నాట్య గాన, శిల్ప, చిత్ర, బాష్య కళల్లో, కొన్ని ఆలయాల ప్రతిమల్లో, ఆరాధనలల్లో, భక్తి గీతాలలో, ప్రవచానలల్లో ఇలా చాలాచోట్ల నిన్ను చూసినట్లు, నువ్వు నా ప్రక్కనే వున్నట్లున్న నా భావనలు గుర్తు! కానీ అస్సలు అవతలివేపుకి వెళ్ళింతర్వాత నువ్వు అనేది ఎలావుంటావో కనపడతావా? అక్కడ కూడా కనపడకుండా తప్పించుకు తిరుగుతావా?

ఒకవేళ కనబడితే, పాల సముద్రం మీద హాయిగా అమ్మవారితో కాళ్ళు ఒత్తించుకుంటూ పవళించిన రూపు తో కనపడ్తావా? లేక ఓ ప్రక్క అనేక విశ్వాలని సృష్టిస్తూ అంతం చేస్తూండే అర్థనారీశ్వర రూపంతో విలయ తాండవునిగా కనపడ్తావా?

లేక 'టట్ టట్' అంటూ తలుపుల దగ్గరే ఆపేసి, "ఏం పెద్ద భక్తురాలివా, ఏం ఘనకార్యాలు వెలగబెట్టావనీ? నువ్వేం వేదాలూ, ఉపనిషిత్తులూ చదివి వడ పోసావా? గొప్పగా నియమ నిష్టాలూ ఆచరించావా? లేదు.  వ్రతాలూ, మంత్రాలూ, ఉపవాసాలూ, పూజా పునస్కారా లతో నీ జీవితం వెళ్ళపుచ్చావా? ధ్యానాలూ, యజ్ఞాలూ, యాగాలూ, యోగాలూ, తపస్సులూ, హవిస్సులూ వాటి ప్రసక్తైనా నీ జీవితం లో లేనే లేవు.

ఎనలేని భక్తి తో వేలాది యేళ్ళ కొలదీ నిష్ట తో కఠోర తపస్సులు చేసిన వాళ్ళకే ఎన్నెన్ని పరీక్షలు పెట్టామో నువ్వు వినే వుంటావు. అలాటిది నీకు వచ్చీరాగానే నిన్ను హుఠా హుఠి గా సన్మానాలతో ఆహ్వానించడానికి? పాపం ఎంత ఆశ!"

('నొ ఎంట్రీ! ఫస్ట్ గో టు చిత్రగుప్తా!' అని బోర్దుంటుందా?)

"మొట్ట మొదట చిత్రగుప్తుల వారి చిట్టాలో నీ చేష్టల వివరాలన్నీ చూసింతర్వాత చెప్తాంలే ఎక్కడకి ఎలా తీసు కెళ్ళాలో" అని చిత్రగుప్తుడి దగ్గరకి తరిమేస్తారా?

నేను ఎలాటి పాపాలు చేయలేదని గుండె మీద చెయ్యేసి చెప్పే (ఓ!  అప్పుడు గుండే చేతులూ వుండవు కదా!) భూకరించే ధైర్యమయితే లేదు.

నేను నాతోటి మామూలు మానవుళ్ళలాగే అక్కడా, ఇక్కడా; ఏవో చిల్లరా, చితకా; తెలిసో, తెలియకో; నువ్వు ప్రసాదించిన పరిస్ఠితుల వల్లో, నా బుధ్ధి గడ్డి తినో, పాపాలు చేసాను.

ఆ కట్టె ఆ భూలోకం లో రాలిపోక మునుపే చాలాకాలంగా నా బుధ్ది తక్కువ తనం గురించీ నాపాపాల గురించీ చాలా చింతించాను. ఇక క్షమిస్తావో, ఏ శిక్షలే వేస్తావో అన్నది నీ దయ అని రెండిటికీ సిధ్ధంగా ధైర్యంగానే వుంటాను. అక్కడ అస్సలు దయలూ, ధైర్యాలూ మిగిలిన భావాలూ మన శరీరం తో వున్నప్పటిలాగే వుంటాయా? వుంటే మళ్ళీ ఇక్కడి లాగే మనో సంఘర్షణలతోటి వుండాలా?!!?

అన్నట్టు మా అమ్మా, నాన్న, మా అత్తమ్మగారు, మామయ్యగారు, లతో పాటూ మాపూర్వీక బంధువులు ముఖ్యంగా నేను పుట్టక ముందే కాలంతీసిన మా నాయనమ్మా, తాతయ్యా, పురిట్లోనే తిరిగి వెళ్ళిపోయిన చెల్లెలూ కనపడతారా?

లేకపోతే నన్ను మళ్ళీ మాయ చేసేందుకు హఠాత్తుగా ముత్యాల ద్వారం దగ్గర సెయింట్ పీటరు అడ్డగించి "నీవు నీ జీవితమున ఒక్క యేసు క్రీస్తు ప్రభువునే నమ్మిన దానవు కాదు. అందువలన నీవు ఒనరించిన ఏ ఒక్క పాపమూ క్షమింపబడదు. ఒక్క క్రీస్తు మతస్థులకే, యేసు క్రీస్తు ప్రభువునే నమ్మిన వారు తెలిసి చేసిననూ, తెలియక చేసిననూ, వారి పాపములన్నియునూ క్షమింపబడి వారిని మాత్రమే స్వర్గమునకు పంపుదును. నీవు హిందువుగా స్వర్గములో ప్రవేశము ఏ మాత్రమునూ అనుమతి పొందజాలవు. నరకమునకే వెళ్ళెదవు ఇక ప్రొమ్ము!" అని పంపిచేస్తాడా.

'అటుల అయిన అఖిల సృష్టికర్త  క్రీస్తు ప్రభువే అయిన హిందువుగా నాకు జన్మను ఎందువలన ప్రసాదించెను? నా జన్మ భాధ్యతగా నేను హిందూ మతము నాచరించినాను. అయిననూ క్రీస్తు ప్రభువును ఒక గొప్ప శాంతి దూతగా పరమ పురుషినిగానే గౌరవించి ఆరాధించినాను. (క్రీస్తు జన్మ దిన వేడుకలను, గుడ్ ఫ్రైడే ఈస్టరు లనూ గౌరవించి నాకు అనువైన రీతిలో మనసారా ఆరాధించినాను కదా)!' అని వాదిస్తాను. అలాగే కరుణామయుడూ అహింసామూర్తి అయిన ఆ తథాగతుడు శాంతంగా, చిరునవ్వుతోనే 'నీకు నిర్వాణ జ్ఞానోదమయినదా?' అని నిరాకరించిన పక్షంలోనూ, అలాగే ఆ మహా వీరుడూ, అల్లా, యహోవా, అహుర మజ్డ--జొరస్ట్రీనిస్మ్ (ఫార్సి) బహ’ఉ’ల్ల్హహ్(బాహై); ఇక అహొనె, అగుగుఎక్స్, ఎస, కమె, ఇకుజురి, నుండీ, నిసహ్ను, యుట్టొరె వరకు మొదలగు పలు రెడ్ ఇండియన్ ఆది వాసులు నమ్మకంగా కొలిచే అనేక దేవుళ్ళూ; ఇంకా అబల్యీ, అకంబ, అలుర్, అంకొరె, అషంతి నుండీ యొరుబ, జంబెసి, జులు వరకు మొదలగు పలు ఆఫ్రికన్ ఆది వాసులు నమ్మకంగా కొలిచే ఇంకా పలు పలు దేవుళ్ళూ; అబెగువొ అదరొ, అది, అఫెకన్, అగునూ, అకు అకు, అల ముకి, అలలహె, అఒ కహివహివ, అఒ కనపనప, నుండీ వరిమ టె టకెరె, వెహినె హే, * వహిని హై, వైఒర, వ్హైటిరి దాకా పలు పలు పసిఫిక్ దీవుల జనాల మతాల దేవుళ్ళూ, వీళ్ళందరే కాక ఇంకా ఎప్పుడూ చూడని ఎన్నెన్నో వేలాది వేల కొలదీ రూపాలు విశ్వంలోని వేలాది వేల ఖగోళాలనుంచి ఎన్నో ఎన్నెన్నో లెక్క లేనన్నిఎప్పుడూ చూడని రూపాలన్నీ నా ముందు నిలబడి 'ఇదిగో! నా విశ్వ రూపం! నేనే దేవుణ్ణి!' అంటాయేమో పార్థుని ముందు ప్రత్యక్షమయిన పార్థసారుధునిలా! ఉన్నట్ట్లుండి నాశరీరం ఏమయిందో నాకు తెలియలేదు! అస్సలు నేను అన్న భావన వున్నట్లు కూడా నాకు గుర్తు లేదు! అలా లెక్కలేనన్ని ఆకారాలు ఎన్నో ఎన్నెన్నో గుంపులుగా గుంపులుగా ఓ పెద్ద వలయంలా తిరుగనారభించాయి క్రమ క్రమంగా అన్ని ఆకారాలు ఒక్కటిగా  చాలా చాలా వేగంగా ఆ తిరుగుతున్న మిళితమయి ఏఆకారమూ కనపడకుండా వేగంగా తిరుగుతూ తిరుగుతూనే వున్నాయి చాలాసేపు.

ఒక్కసారిగా వలయమంతా ఒక్క నక్షత్రం కూడా లేని చిక్క చిమ్మటి అమావాస్య ఆకాశంలా మారిపోయి కనబడింది. ఆ నల్లటి నలుపు తనంలో ఏ ఆకారమూ ఏ పరిభ్రమణమూ కనపడలేదు! క్రమంగా చిక్క చిమ్మటి  నల్లటి అమావాస్య ఆకాశం మారిపోయి నక్షత్రాల, పాల పుంతల మయమై కనబడింది.

అంతలోనె ఉన్నట్ట్లుండి ఆ నల్లటి వలయం  పై అంచుపై ఒక చల్లని తెలుపూ పసుపూ కలిసిన వెలుతురు చాలా ఆహ్లాదంగా నా కాంతి కళ్ళముందు కొద్ది కొద్దిగా ఉదయిస్తూ అంతటా పరచుకుంది. ఆకాంతి పరిభ్రమించడం లేదు దాని లో ఏ ఆకారమూ కనపడలేదు.. చక్కటి చల్లటి ఆహ్లాదమైన వెలుతురు అంతే! అలా ఆవెలుతురిలోనే హాయిగా లీనమైపోయాను. ఇంకేమీ తెలియలేదు.

హఠాత్తుగా పదే పదే కాలింగ్ బెల్  మ్రోగుతుంటే గబుక్కున తెలివి వచ్చింది. వంటిల్లు సర్దడం ఎప్పుడయిందో, ఎప్పుడు లివింగ్ రూము కొచ్చి కూర్చున్నానో తెలియలేదు. ఏదో మత్తు ఆవరించినట్టు అలా ఎంత సేపుండిపోయానో గుర్తే లేదు.

అప్పుడే మరియా వచ్చేసిందా? ఇంకా స్నానం, పానం కాకుండా నే ఇలా ఆలోచిస్తున్నాని తెలిస్తే చాగంటి బోటి వాళ్ళు 'హన్నా!  ఓ శుచీ శుభ్రతా ఉండక్కర్లా? ఆచారాలూ నియమాలూ పాటించక్కర్లేదా?' అని కోప్పడరూ?! అనుకుంటూ వెళ్ళి తలుపు తీసాను.

చిరునవ్వుతో, మెక్సికన్ అమెరికన్ యాసతో  'ఓలా!  మిస్సెస్ సాం!  వి తాట్ యు ఆర్ నాట్ హోం!  ఆర్ యు ఒ.కే?' అని మరియా, వెనకాలే కూతురు ఎలేనా నవ్వుతూ, స్పానిష్ లో 'పుయెదె సెర్ కె తోదవియ ఎస్త దుర్మిఎందో! (puede ser que todavía está durmiendo!)'

'ఒకవేళ ఇంకా నిద్ర పోతోందేమో!' అంటూ లోపలి కొచ్చారు.

“యువర్ ఫేస్ సొ వెరీ హప్పీ అండ్ వెరీ కాం మిస్సెస్ సాం.” అంది మరియా. వెంటనే ఎలెనా అందుకుని “మేబి హర్ డాటర్ ఈజ్ గెట్టింగ్ మార్రీడ్” అంది నేను నవ్వుతూ “కమాన్ యు గైస్! గెట్ టు వర్క్. ఆఫ్టర్ యు ఫినిష్, ఐ హావ్ ఎ త్రి ఒక్లాక్ అప్పాయింట్మెంట్ టు గో టు” అంటూ లోపల కి దారి తీసాను.

****సమాప్తం****

Posted in February 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!