మా తల్లిగారు, తెలుగు సాహిత్యంలోను, జ్యోతిషశాస్త్రంలోను, మా తాతగారివద్ద ( ఆవిడ తండ్రిగారు ) ప్రావీణ్యత పొందేరు. నేను B.A. పరీక్షకు ప్రయివేటుగా చదువుతున్న రోజుల్లో, తెలుగు సబ్జెక్టులో రెండు పేపర్లకు , ఆవిడ వద్ద శిక్షణ పొందేను. 2006 సంవత్సరంలో తన 89 వ ఏట స్వర్గస్తురాలయ్యేరు. ఈ కవిత సుమారుగా అదే సంవత్సరంలో రచించేరు.
గౌరవముతో,
గ . వె. ల. నరసింహం.
నువ్వు నవ్వుతావు నీ కోసం.
నువ్వు ఏడుస్తావు నీ కోసం.
అది నీ స్వార్థం.
అహోరాత్రులు కష్టించినా, ఆకలి తీరక
అలమటించే అభాగ్యుల
అశ్రుధారల్లో,
నీ హృదయాంతరాల్లో
కరగి పైకుబికిన కన్నీటి
బిందువు కలుపు.
అహాన్ని ఆకలి జ్వాలలకాహుతి చేసి,
ఎంగిలాకులకు ఎగబడే,
గర్భదరిద్రుల కడుపులు నింపే
మహనీయుడు కనిపిస్తే,
మనసారా నవ్వు.
నిస్వార్థంగా నింగినుండి నేలమీద
తన కాంతి కిరణాలతో కళ్ళాపు జల్లే
చందమామను చూచి
చక్కని పాఠం నేర్చుకో.
అన్యాయాలకు ఔపోసన పట్టి
దౌర్జన్యాలను భోజనం చేసి,
గుడిగంటలు కొడితే, కరుణించడు
శివుడు.
మానసోద్యానంలో మల్లె చెట్టు నాటితే
జీవిత మార్గంలో
వస్తాయి సుగంధాలు.
చాల బాగుందండి.