చివరి భాగం
జీవన్ వెంటనే అన్నాడు సుబ్బరామయ్యగారితో… “మీరేమీ ఇదవ్వకండి బాబాయ్! ముద్దులొలికే ఒక చిన్నారి మూలంగా మీ ప్రశాంతతకు భంగం వస్తోంది - అంటే నాకు ఎంత మాత్రం నచ్చడంలేదు. ఈ పాపను నేను పెంచుకుంటాను. రేపే నా తిరుగు ప్రయాణం. జాహ్నవిగారు ఒప్పుకుంటే పాపను నేను రేపే నావెంట తీసుకు వెడతాను. త్వరలోనే మీరు జాహ్నవిగారితో మీ అబ్బాయి పెళ్లి జరిపించండి” అన్నాడు జీవన్.
తెల్లబోయి చూశారు జీవన్ వైపు సుబ్బరామయ్యగారు. “ఇదేమి ఆలోచన! ఇలా నువ్వు ఊళ్ళో వాళ్ళ సమస్యలన్నీ నీవే ననుకుంటే మీ అమ్మగారు ఒప్పుకుంటారా? రేపు నీ పెళ్లయ్యాక ఆమె కూడా ఒప్పుకోవాలికదా!”
“మీకు మా అమ్మను గురించి తెలియదు గాని నాకు బాగా తెలుసు, పాప మాకేమీ సమస్య కాదు, ఒక వరం! ఇక నా భార్య విషయానికి వస్తే - పాపను కన్నబిడ్డలా చూసుకుంటానని ప్రామిస్ చేసిన అమ్మాయినే నేను పెళ్లిచేసుకుంటా. ఆ తరువాత మేము సంతకాలు పెట్టి, ఆ పాపను దత్తత తీసుకుంటాము. పాప మాపిల్ల ఔతుంది. ఆమెకు మేము ఏ లోటూ రానివ్వం.”
ఆశ్చర్యపోయారు సుబ్బరామయ్యగారు. “జీవన్ బాబూ! నీలా నేను ఆలోచించలేకపోయినా, నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను. నీది చాలా గొప్ప మనసోయ్!”
“లోక: సమస్తా సుఖినో భవంతు:” అని మనము అందరి మేలూ కోరగలంగాని, అందరికీ సాయం చెయ్యలేముకదా! అందులో ఒక్కరికైనా మేలు చెయ్యగలిగితే, మనజన్మ సార్ధకమైనట్లే అంటుంది మా అమ్మ. చూడండి, ఈ పాపను నేను పెంచుకోడంవల్ల రెండు కుటుంబాలకు వచ్చిన పెద్ద సమస్య తీరిపోయి, ఇరుకుటుంబాలలోనూ శాంతి ఏర్పడుతుంది. ఇక మా ఇంట్లోకూడా ఈ పాప, నేను ఆఫీసుకి వెళ్ళాక మా అమ్మకు తోడుగా ఉంటుంది. ఇక్కడ చీడలా, పీడలా ఉండడం కంటే అక్కడ తోడులా నీడలా, ఇంటికి వెలుగులా గారాబంగా పెరుగుతుంది. అంతకంటే ఇంకేమి కావాలి. ఒక చిన్నమార్పువల్ల చాలా మందికి సుఖసంతోషాలు దొరుకుతాయంటే దానిని నేను ఆచరణలో పెట్టాలనుకోడంలో ఆశ్చర్యమేముంది? ఒకానొకప్పుడు, జాహ్నవిగారికి మేలు చెయ్యాలి అనుకున్న నా కోరిక కూడా నెరవేరుతుంది. ఈ పాపను నేను పెంచుకోడం వల్ల ఆమెకూ మేలు జరుగుతుంది.
అంతబాధలో ఉండికూడా జాహ్నవిగారు మీ అబ్బాయినే కలవరిస్తున్నారుట! ఒకసారి మీ అబ్బాయిని వెళ్లి ఆమెకు నాలుగు ఓదార్పుమాటలు చెప్పి రమ్మనండి. సాధ్యమైనంత తొందరగా మీరు వాళ్ళ పెళ్లి జరిపించేస్తే అందరూ ప్రశాంతంగా బ్రతకవచ్చు. నేను రేపు మా ఊరు వెళ్లిపోతున్నా, నాకు సెలవు లేదు. జాహ్నవిగారు సరేనంటే నేను రేపు నాతోపాటుగా పాపను తీసుకెళ్ళిపోతా” అంటూ వెళ్లడానికి లేచాడు జీవన్.
అప్రయత్నంగా సుబ్బరామయ్యగారు కూడా లేచారు. “నీది చాలా విశాల హృదయమోయ్! నీకు తెలుసునో తెలియదోగాని, నువ్వు నా అహాన్ని కూడా కాపాడావు” అన్నారు.
జీవన్ చిన్నగా నవ్వి, “మీరు మీ మాట నిలబెట్టుకుంటారు కదూ” అని అడిగాడు.
“అయ్యో! తప్పకుండా నిలబెట్టుకుంటాను. సందేహం వద్దు” అన్నారు పెద్దాయన సంతోషంగా. ఆపై “చిన్నవాడివైన నువ్వు, నీకు ఏమీ కాని వాళ్లకు సాయపడడం కోసం అంత గొప్ప నిర్ణయం తీసుకుంటే, పెద్దవాడిని నేను నా కొడుకు సంతోషంకోసం ఈపాటీ చెయ్యకపోతే ఎలాగ బాబూ!” మనసులోనే అనుకున్నారు ఆయన.
సుబ్బరామయ్యగారు గుమ్మందాకా వచ్చి జీవన్ ని సాగనంపి వెనక్కి వెళ్లిపోయారు. కానీ, సుధీర్ మరికొంత దూరం సాగనంపడానికి అన్నట్లుగా జీవన్ వెంట నడిచాడు. తండ్రి కనుమరుగవ్వగానే ఎదురుగా వచ్చి, జీవన్ రెండుచేతులూ పట్టుకుని, “మీరు మమ్మల్ని రక్షించారు మాష్టారూ” అన్నాడు ఎలుగురాసిన కంఠ స్వరంతో.
“సుధీర్ గారూ, మీరు మరీ అంతగా ఇదవ్వకండి. అందరికీ మేలు జరగాలంటే నాకు తోచిన మార్గమిది. మనం పెద్దవాళ్లమైనందుకు, అభం శుభం తెలియని ఆ పసిపాప సుఖం కూడా కొంచెమైనా ఆలోచించాలికదా!”
“మీరు నాకూ జాహ్నవికి గొప్ప మనసుశాంతి నిచ్చిన పుణ్యమూర్తులు! మేము జన్మంతా మీకు ఋణపడి ఉంటాము. ఎన్ని జన్మలకు మర్చిపోలేని గొప్ప త్యాగం మీది. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు” అంటూ జీవన్ చేతుల్ని తన కళ్ళకు హత్తుకున్నాడు సుధీర్. సుధీర్ కంటి నీరు జీవన్ చేతులకు అంటింది.
గమ్మున చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు జీవన్, “దిస్ ఈజ్ టూ మచ్! ఇదేమి పని సార్!” అంటూ కంగారుపడ్డాడు.
“సార్! మీరు నాపాలిట దేవుడు సార్! ఇటు కన్నవాళ్ళనీ కాదన లేక, అటు ప్రియమైన జాహ్నవిని ఒదులుకోనూ లేక, ఏమి చెయ్యడానికీ పాలుబోక చచ్చిపోవాలనే అనుకున్నాను. దిక్కు తోచని స్థితిలో అల్లాడుతున్న నన్ను కాపాడి పుణ్యం కట్టుకున్నారు. మీరు. మీ ఋణం నే నెలా తీర్చుకోగలను, చేతులు జోడించి నమస్కరించడం తప్ప.”
అతని మాటలకు అడ్డుపడ్డాడు జీవన్. “అయ్యయ్యో! అంతంత మాటలు వద్దు. నేను కష్టాలలో పుట్టి పెరిగాను. కష్టమంటే ఏమిటో తెలియని వాడిని కాను. అందుకేనేమో, కష్టాలలో ఉన్నవాళ్లను చూసి నా హృదయం స్పందిస్తుంది. చాతనైన సాయం చెయ్యాలనిపిస్తుంది. జాహ్నవి గారు ఒప్పుకుంటే, రేపే నేను పాపని నాతో తీసుకెళ్ళిపోతా. ఎప్పుడైనా సరే, ఆమెకు పాపను చూడాలనిపిస్తే చాలు, ఎలాంటి మొహమ్మాటం వద్దు, మీరు ఆమెను తీసుకుని మా ఇంటికి రండి - మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.”
సుధీర్ నొచ్చుకున్నాడు. “మా నాన్న మరీ అంత చెడ్డవాడేమీ కాడు. కామేశంగారితో పంతాలకుపోయి తిక్క పెంచుకున్నాడు. కొన్నాళ్ళు గడిస్తే తిక్కతగ్గిపోతుంది. అప్పుడు ఒప్పుకుంటాడు, పాపను మేము తెచ్చుకోడానికి.”
“ఆమ్మో! ఆ పనిమాత్రం వద్దు. మేము పాపమీద మమకారం పెంచుకున్నాక మీరొచ్చి, తీసుకెళ్ళిపోతామంటే, మేము ఎలా ఒప్పుకుంటాము! త్వరలోనే పాపకు తల్లిగా ఉండగల అమ్మాయితో నా పెళ్లి జరుగుతుంది. ఆపై మేమిద్దరమూ సంతకాలు పెట్టి పాపను మా బిడ్డగా అంగీకరించి, ఆ బాంధవ్యాన్ని రిజిష్టర్ చేయిస్తాము. పాప అది మొదలు లీగల్గా మా బిడ్డవుతుంది. పరస్పరం సర్వ హక్కులూ వర్తిస్తాయి.”
జీవన్ జేబులోనుండి తన విజిటింగ్ కార్డు పైకి తీసి, దానిని సుధీరుకి ఇస్తూ, “ఇదిగో నా విజిటింగ్ కార్డు. మీరు ఎప్పుడైనా సెలవురోజున నాకు ఫోన్ చెయ్యవచ్చు” అన్నాడు.
కార్డు అందుకుని, దానిని పదిలంగా జేబులో ఉంచుకుంటూ, “ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్ థాట్స్ మీకు ఎలా వస్తున్నాయి - అని ఆశ్చర్యంగా ఉంది, జీవన్ గారూ” అన్నాడు సుధీర్.
“సుధీర్ గారూ! మన మిద్దరం సమ వయస్కులం. మీరిలా నన్ను సారూ, మాష్టారూ అంటూ పిలవడం ఏమీ బాగాలేదు. నా తక్కిన మిత్రులందరిలాగే మీరూ నన్ను “జీవన్” అని పేరు పెట్టి పిలవడం బాగుంటుంది.”
“అలాగే సార్! ఇంతకీ నేనడిగిన ప్రశ్నకు మీ రింకా జవాబు చెప్పనేలేదు.” అన్నాడు సుధీర్.
“ముందా సారూ, సాంబారు వదిలెయ్యండి, తరవాత జవాబు చెపుతాను” అన్నాడు జీవన్ నవ్వుతూ.
తనుకూడా నవ్వుతూ, “సరే! వదిలేశా. ఇక చెప్పండి” అన్నాడు సుధీర్.
“ఏదైనా ఒక సబ్జక్టుని ఎంచుకుని, దానిలో పరీక్ష రాసి నెగ్గాలంటే మనం ఏమి చేస్తాము?”
వెంటనే జవాబు చెప్పాడు సుదీర్. “ఆ సబ్జక్టును థరోగా స్టడీ చేస్తాము. ఎంత బాగా చదివితే అంత బాగా వస్తాయి మార్కులు.”
“అంతే కదా! మన అవగాహన మీదే ఆధారపడి వుంటుంది మన విజయం. అలాగే మానవ జీవితాలను విశ్లేషిస్తూ కథలు రాయాలనుకుంటే, మనం మానవ నైజాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని ఉండవలసి ఉంటుంది. చదువంటే బడికివెళ్ళి చదివిందే చదువు కావలసిన పనిలేదు, ఇంట్లోవుండి కూడా ఉద్గ్రంధాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు” అన్నాడు జీవన్.
సుధీర్ ముఖం వికసించింది. “జీవన్ గారూ! మీరు రచయితలా? మీరు మాటాడే పద్దతి చూస్తే, మీరొక గొప్ప రచయిత అనే అనిపిస్తుంది ఎవరికైనా. నిజమే కదూ!”
జీవన్ చిన్నగా నవ్వి అన్నాడు, “నిజమే! చిన్నప్పటినుండి నాకు హాబీగా కథలు రాసే అలవాటు ఉంది. అప్పుడప్ప్పుడు ఆ కథలు వివిధ పత్రికల్లో వస్తూ ఉంటాయి.”
సుధీర్ జీవన్ వైపు ఆరాధనగా తేరిపారజూసి, లోగొంతుతో నసిగాడు,” మీరేమీ అనుకోకపోతే ఒక్కమాట! నేను ఒరేషన్ రీడర్ని. కనిపించిన ప్రతి పుస్తకం చదువుతాను. ఇంగిలీషువే కాదు, మన భాషలో వచ్చే చాలా పత్రికలూ కొని చదువుతూంటాను ప్రతినెలా. కానీ ఎక్కడా జీవన్ - అన్న పేరు కనిపించలేదు ఎక్కడా. ఏదైనా కలం పేరు వాడుతారా?”
“మీ ఊహ నిజమే! కానీ కలం పేరు కాదది, అదే నా నిజమైన పేరు. నా కలం పేరుగా దానినే వాడుతున్నాను. నిజానికి, - అన్నది నా వ్యవహారిక నామం మాత్రమే!”
కుతూహలంతో జీవన్ వైపు చూస్తూ, “ఏమిటి మీ అసలు పేరు, చెప్పండి” అన్నాడు సుధీర్.
“మా తాతయ్య నాకు పెట్టిన పేరు చిరంజీవి. నాలోని రచయిత పేరు కూడా అదే!”
ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు సుధీర్. గమ్మున జీవన్ రెండు చేతులూ పట్టుకుని, “మా అభిమాన రచయిత చిరంజీవి మీరా! మీ రచనలద్వారా మీరు మాకు చిరపరిచితులు. నిజం చెప్పాలంటే నేనూ, జాహ్నవి కూడా మీ ఫేనులం! మీ శైలి, మీ ప్రజంటేషన్ మీ భావాలు మాకు చాలా చాలా నచ్చుతాయి. మీరు మమ్మల్ని క్షమించాలి, మీ కథలు చదివి మీరెవరో అనుభవజ్ఞుడైన పెద్దమనిషి అనుకున్నాము. మీరింత చిన్నవారని మేము ఊహించను కూడా లేదు”
చేతులు విడిడిపించుకుని, చిరునవ్వుతో, “మీ సందేహాలన్నీ తీరినట్లేనా! ఐతే ఇక నాకు సెలవిప్పించండి” అన్నాడు జీవన్. మళ్ళీ అంతలోనే, “త్వరలోనే నా పెళ్లి జరుగుతుంది, అప్పుడు మీరిద్దరూ ముందుగా వచ్చి, పాపాయి దత్తత కూడా జరిపించి, ఆ తరవాతే తిరిగి వెళ్ళాలి. మీరిద్దరూ తప్పకుండా రావాలి సుమీ!”.
“తప్పకుండా వస్తాము” అని సుధీర్ దగ్గర మాట పుచ్చుకుని, కరణంగారి ఇంటి వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు జీవన్.
“నానృషి: కురుతే కావ్యం” నాలుగు కాలాలపాటు నిలిచే కథలు రాయాలంటే, రచయిత తగినంత సద్గుణ సంపన్నుడై ఉండడం కూడా అవసరం” అనుకున్నాడు సుధీర్.
వెళ్లిపోతున్న జీవన్నే, చూస్తూ నిలబడిన సుధీర్, అతడు కనుమరుగయ్యాక వెనుదిరిగి ఇంట్లోకి నడిచాడు. కారుమబ్బు లాంటి కష్టాలు తొలగిపోయి, వెన్నెల వెలుగులలో జగతి నిలువునా పులకించిపోతున్నట్లుగా అనిపించింది అతనికి.
* * *
జీవన్ ఇల్లు చేరేసరికి అతనికోసం ఎదురుచూస్తూ కరణం గారు అరుగుమీద కూర్చుని ఉన్నారు. జీవన్ని చూడగానే ఎదురు వచ్చి, చెయ్యి పట్టుకుని ఉద్వేగంతో నిండిన చూపులతో అతని వైపు చూశారు.
వెంటనే జీవన్ చిరునవ్వు నవ్వుతూ, “అంతా సఫలమయ్యింది. త్వరలోనే వాళ్ళ పెళ్లి జరుగుతుంది” అన్నాడు.
“చాలు బాబూ! ఆ మాట చాలు! అసలే భోజనానికి ఆలస్య మైపోయింది. తక్కిన విషయాలు తింటూ మాట్లాడుకుందాము లే” ఆంటూ, కాళ్ళు చేతులూ కడుక్కునేందుకు, బక్కెట్ తో పెట్టి ఉంచిన నీళ్లను చెంబుతో తీసి అతనికి అందించారు కరణంగారు.
భోజనం చేస్తూ, జరిగినదంతా టూకీగా కరణంగారికీ, సీతమ్మగారికీ చెప్పేశాడు జీవన్.
అంతా విని, “నే చెప్పలేదూ, మా సుబ్బడు సామాన్యుడు కాడని! ఏదో ఒక పెటకం పెట్టకుండా వదలడు కదా! వాడి బుద్ధే అంత! నీకెందుకు బాబూ, అమ్మవంక వాళ్ళా, అబ్బవంక వాళ్ళా - ఎవరని ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతను తలకెత్తుకోవాలనుకుంటున్నావు” అన్నారు కరణంగారు.
వెంటనే అన్నాడు జీవన్, “నన్ను ఎవరూ పురిగొల్పలేదు, నేను స్వయంగా తీసుకున్న నిర్ణయమిది. మనమంటే ఇష్టపడని జనం మధ్య బ్రతకడం ఎంత దుర్భరంగా ఉంటుందో, నాకు తెలుసు. నా చిన్నతనంలోని అనుభవాలు నేనింకా మరిచిపోలేదు. ముద్దులొలికే ఈ చిట్టితల్లికి అటువంటి కష్టాలు రాకూడదని నాకోరిక. అందుకే ఆమెను నేను దత్తత తీసుకోవాలనుకున్నాను. ఎవరికైనా సహాయం చెయ్యాలనిపించినప్పుడు చెయ్యాలి గాని చుట్టరికాలకోసం వెతకకూడదు. ఈ అమ్మగారు నాకు వచ్చినప్పుడల్లా ఇంత ప్రేమగా షడ్రసోపేతమైన భోజనం పెడుతున్నారంటే ఆమెకు నేను ఎటువైపు చుట్టాన్నని!”
“చంపేశావు కదోయ్” అంటూ పెద్దగా నవ్వారు కరణంగారు.
“మనం చేసిన సహాయం ఊరికే పోదు, మళ్ళీ నీకు అవసరమైనప్పుడు అది తిరిగి, ఏదో ఒక విధంగా నీకు దొరుకుతుందనే అంటారు కదా పెద్దలు! మీరేం ఇదవ్వకండి. అవసరం ఎవరికైనా రావచ్చు! ఈరోజు మీకయితే రేపు నాకు.”
జీవన్ మాటలు విని నిర్ఘాంతపోయారు కరణంగారు. క్రితం మాటు జీవన్ వచ్చినప్పుడు యాజులుగారు రాసిన ఉత్తరంలో జీవన్ ని గురించి, “కుర్రాడు మంచివాడు” అని రాశారు. మంచితనమంటే మరీ ఇంత మంచితనమా!
కరణంగారు విస్తరిలో చెయ్యి ఉంచుకుని, జీవన్ వైపు, ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లు చూస్తు, రెప్పావాల్చడం మర్చిపోయారు.
చెయ్యి కడుక్కోడానికి లేచిన జీవన్ ఆ చూపును తప్పుగా అర్థం చేసుకున్నాడు. వెంటనే అన్నాడు, “మీరేమీ సందేహించవద్దు. అన్నీ సవ్యంగా జరుగుతాయి. ముందు మీ అమ్మాయికి సుదీర్ గారితో పెళ్లి జరుగుతుంది. ఆ తరవాత నా పెళ్లి జరుగుతుంది. ఇస్తున్నట్లు వారు, పుచ్చుకుంటూన్నట్లు మేము సంతకాలు చేస్తేగాని పాప దత్తత పూర్తవ్వదు. దానికి మాత్రం కొంచెం కాలవ్యవధి కావాలి.”
అదాటుగా లేచి వెళ్లి కరణంగారు, “బాబూ” అంటూ, ఆ అంటచేత్తోనే జీవన్ ని కౌగిలించుకున్నారు. “నీ మీద నాకు అనుమానమా! అసంభవం. నా కొడుకులెవ్వరూ చెయ్యని గొప్ప సాయం నువ్వు నాకు చేస్తున్నావు. నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడంలేదు” అన్నారు. భావావేశంతో ఆయన గొంతు గద్గదమయ్యింది. కళ్ళలో కన్నీరు పెల్లుబికింది. సీతమ్మగారు కూడా కళ్ళకు కొంగు అడ్డు చేసుకుని కన్నీరు కార్చారు. అవి ఆనంద భాష్పాల్లో, దుఃఖాశ్రువులో ఆమెకే తెలియలేదు.
ఆ సాయంకాలం విజిటింగ్ అవర్సులో కామేశం గారు పాపని, జీవన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. వాళ్ళు వెళ్లే సరికి జాహ్నవి మంచం మీద పడుకునే సుధీర్ తో కబుర్లు చెపుతోంది. ఆమె బలహీనంగా ఉన్నా, ఆమె ముఖంలోని సంతోషం ఆ లోపాన్ని బయటకు కనిపించనీయడంలేదు.
కరణంగారు పాపను తల్లిమంచం మీద కూర్చోబెట్టారు. జాహ్నవి లేచి కూర్చుని కూతుర్ని హత్తుకుంది. ముందుగానే సుధీర్ ద్వారా అంతా విని ఉండడంతో కూతుర్ని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంది.
అది చూసిన జీవన్, “జాహ్నవి గారూ! మీకు పాపని చూడాలనిపించినప్పుడు మీరు యథేచ్ఛగా వచ్చి చూసి, కొన్నాళ్ళు మాతో ఉండి వెళ్ళవచ్చు. సంకోచించవలసిన పనిలేదు. త్వరలోనే మీరు అక్కడకు రావలసి ఉంటుంది. నేను పాపను లీగల్గా దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మా ఇంటి బిడ్డగా ఆ పాపకు సర్వ హక్కులూ వస్తాయి. మీరేమీ దిగులు పడవద్దు. పాపకి నేను ఏలోటూ రానివ్వను” అన్నాడు.
జాహ్నవి నొచ్చుకుంది. “ఎంతమాట అన్నారు జీవన్ గారూ! మీ మీద నాకు సందేహమా! మీ ఋణం, మేము జన్మజన్మలకూ తీర్చుకోలేని ఋణం. మా కష్టాన్ని గమనించి మీరు మమ్మల్ని కాపాడారు” అంటూ చేతులు జోడించి నమస్కరించింది జాహ్నవి జీవన్ కి.
“జాహ్నవిగారూ ఇక గతాన్ని మర్చిపోండి. మీకు పాపని చూడాలనిపించి నప్పుడు, మీరు వచ్చి చూసి, కొన్నాళ్ళు మా ఆతిధ్యం స్వీకరించి వెళ్ళవచ్చు. మేముకూడా మీ బంధుకోటిలోని వాళ్ళమే అనుకోండి” అన్నాడు జీవన్.
జీవన్ మాటలతో జాహ్నవి సేదతీరింది. నెమ్మదిగా భావోద్వేగాల బిగువు తగ్గిపోయింది.
“మొదట్లో పాపను నేను కోల్పోతున్నానని బాధగా అనిపించింది. కానీ ఆలోచిస్తే అర్ధమయ్యింది, ప్రేమలేని చోట బ్రతకడం కన్నా పెద్ద నరకం మరొకటి లేదని. జీవన్ గారూ! తరవాత, మీలాంటి ప్రేమమూర్తుల అండ దొరికిందంటే నా పాప ఎంత అదృష్టం చేసుకుందో అర్థమయ్యింది. నా కిప్పుడింక ఏ బెంగా లేదు” అంది జాహ్నవి.
“జాహ్నవిగారూ! నాకింకా సెలవు లేదు, రేపు వెళ్ళాలనుకుంటున్నా మీరు అనుమతిస్తే రేపు నాతో పాపను కూడా తీసుకు వెడతాను.”
జాహ్నవి పాపను తనివితీరా ముద్దాడింది. ఆపై, “చిట్టీ! అంకుల్ దగ్గరకు వెళ్ళమ్మా” అంటూ పాపచేతిని జీవన్ చేతిలో ఉంచింది. ఆపుకుందామనుకున్నా ఆగని కన్నీరు ఆమె చెంపలవెంట ధారలు కట్టింది. ఆ సన్నివేశం అక్కడున్న అందరిచేతా కంట తడి పెట్టించింది. కానీ అది అనివార్యం! సరిపెట్టుకోక తప్పదు.
కొత్త తెలియని ఆ పాప జీవన్ దగ్గరకు వెళ్ళింది. జీవన్ ఆ పాపను ఆప్యాయంగా చేరదీసుకుని ఎత్తుకున్నాడు. “చాకెత్తు కావాలి” అంటూ ఆ పాప చనువుగా జీవన్ చొక్కా జేబులో చెయ్యి పెట్టింది.
పాప అంటున్నదేమిటో తెలియక తెల్లమొహం వేశాడు జీవన్. కరణంగారు సద్ది చెప్పారు, “జీవన్ బాబూ! ఈ రోజు మొదలు ప్రతిరోజూ నువ్వు నీ జేబులో ఓ నాలుగు చాకోలెట్లు పెట్టుకు తిరగాలి సుమీ! మరచిపోకే” అంటూ తన జేబులోనుండి ఒక చేకోలెట్ తీసి జీవన్ కి ఇచ్చారు.
జీవన్ పైనున్న కాగితం విప్పి చాకొలేట్ పాప చేతికి ఇచ్చాడు.
“జీవన్ గారూ! మీరే మా అభిమాన రచయిత చిరంజీవిగారని తెలిసింది. నే నిలా అయాచితంగా మిమ్మల్ని చూడగలనని కలలో కూడా అనుకోలేదు” అంది జాహ్నవి.
“మీ కథలు చదువుతున్నప్పుడు, మా ఊహలలో మీరు చాలా పెద్దవారు. కనీసం 50 అయినా దాటి ఉంటారనుకునేవాళ్ళం. మీరు ఇలా మా జీవితాలను నిలబెట్టి మాకు అత్యంత ప్రీతి పాత్రులవ్వడం నిజంగా మా అదృష్టం” అన్నాడు సుధీర్.
ఆ మరునాడు పాపను తీసుకుని ప్రయాణమయ్యాడు జీవన్. అతనికి వీడ్కోలు చెపుతూ సీతమ్మగారు, “జీవన్ బాబూ! నిన్ను కన్నతల్లి ధన్యురాలయ్యా! నీతులు వల్లించేవాళ్ళు, శుష్క ప్రియాలు చెప్పేవాళ్ళు ఈ భూమిమీద చాలామందే ఉన్నారు, కానీ, నీలా ఆచరణలో పెట్టే ఆదర్శమూర్తులు మాత్రం అరుదు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి! నీ తల్లికడుపు చలవగా నిండు నూరేళ్లు నువ్వు సుఖంగా ఉండు” అని ఆశీర్వదించింది.
నరసాపురం దాకా అతనికి తోడుగా వెళ్లి; పాపని, జీవన్ని రైలు ఎక్కించి, “బై, టిల్ వుయ్ మీట్ అగైన్” అని అతనికి వీడ్కోలు చెప్పి తిరిగి వచ్చాడు సుధీర్.
* * *
గుమ్మంలో కారు ఆగిన చప్పుడు విని, బాల్కనీలోకి వచ్చిన మీనాక్షి, “జీవన్ వచ్చేశాడు” అని పెద్దగా కేక పెట్టి చెప్పి, గబగబా మెట్లు దిగి క్రిందకు వెళ్ళింది. ఆ కేక వినగానే శ్రీజననీ పరివారమంతా ఎక్కడి పనులక్కడే వదలి, పరుగు పరుగున ముందు వైపు వరండాలోకి వచ్చేశారు.
మేడమీది హాలులో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సుమతి, స్రవంతి కూడా ఆ కేక విని కబుర్లు ఆపేశారు. స్రవంతి తృళ్ళిపడి లేచింది. ఆమె మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. అయినా, జీవన్ కిచ్చిన మాటకోసం హారతి పళ్లెం కోసం, వెతకడానికి వంట గదిలోకి వెళ్ళింది.
ఆమె వెనకే వెళ్లిన సుమతి “ఏమిటలా కంగారుగా వెతుకుతున్నావు” అని అడిగింది. స్రవంతి చెప్పింది.
సుమతి చిన్నగా నవ్వి అంది, “ఇద్దరం ఇక్కడే పాతుకుపోవడం ఎందుకు, నువ్వెళ్లు నేను హారతి పళ్లెం తెస్తా”
వెంటనే జవాబు చెప్పింది స్రవంతి, “అలా కుదరదు. నేనే ఇవ్వాలి హారతి. నేను జీవన్ కి మాటిచ్చాను.”
“సరేనమ్మా! హారతి నువ్వే ఇద్డువుగాని, నువ్వు వెళ్ళు, నేను పళ్లెం వగైరాలన్నీ వెతికి తెచ్చి దేవుని ముందు పెట్టి, దీపం వెలిగించి క్రిందికి తెస్తా. వాళ్లకి హారతి నువ్వే ఇద్డువుగానిలే. నేను చెప్పాను, ఆపై నీ ఇష్టం” అంది.
ఆ తరవాత స్రవంతి అక్కడ క్షణం నిలబడలేదు, ఒక్క పరుగున క్రిందకు వెళ్ళిపోయింది.
కొడుకు వస్తానన్న రోజుకంటే ఒక రోజు ముందుగా వచ్చేశాడెందుకనో - అనుకుంటూ కొడుకుకి ఎదురుగా వెళ్ళింది మీనాక్షి. నాలుగేళ్ళున్న పాపను ఒక చేత్తో ఎత్తుకుని, మరొక చేత్తో ట్రావెలింగ్ బేగ్ పట్టుకుని, టేక్సీ దిగి వస్తున్న కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ, దగ్గరగావెళ్లి, లో గొంతుతో అడిగింది మీనాక్షి, “జాహ్నవి ఏదిరా?”
లోనికివస్తూ, మల్లెవాడ విశేషాలన్నీ టూకీగా తల్లికి చెప్పి, “ఈ పాప జాహ్నవి కూతురు, చిన్నారి జాహ్నవి” అని చెప్పి పాపను తల్లికి అందించాడు. మీనాక్షి ఆ పాపను సంతోషంగా ఎత్తుకుంది.
మల్లెవాడ కథ స్రవంతి కూడా వింది. ఆమె మనసులో మోడువారిందనుకున్న ఆశ చిగురించింది. అంతలోనే ఆమెకు మరో ఆలోచన వచ్చింది, ఏమో, జీవన్ మళ్ళీ కర్తవ్యమ్, కర్తవ్యమ్ - అంటూ తన కర్తవ్యాన్ని వెతుక్కుంటూ దూరంగా వెళ్లిపోడన్న గారంటీ ఏముంది కనుక! ఈ మాటు తెలివి తక్కువగా తను బయటపడిపోకూడదు - అనుకుంది. ఇలా ఆశా నిరాశల మధ్య నలుగుతూ, బేలగా కళ్ళు విశాలం చేసుకుని. జీవన్నే చూస్తూ ఒక వారగా నిలబడి పోయింది స్రవంతి.
జీవన్ కళ్ళు స్రవంతికోసం వెతికాయి. ఆమె కనిపించగానే రెండు అంగల్లో ఆమె దగ్గరకు నడిచాడు. ఆమె ముందు మోకాళ్లపై కూర్చుని, చెయ్యి చాచి, “స్రవంతీ! అంతా విన్నావు కదా… నువ్వు నా పాపకు అమ్మవు కాగలవా” అని సూటిగా అడిగేశాడు.
అకస్మాత్తుగా స్రవంతికి సిగ్గు ముంచుకు వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆమె మాటాడలేకపోయింది. చివరకు ఏంతో ప్రయత్నం మీద తన సమ్మతిని సూచిస్తూ తల ఆడించి, చాపివుంచిన అతని చేతిలో చెయ్యి వేసింది. ఒక్కసారిగా అక్కడే నిలబడి చోద్యం చూస్తున్న శ్రీ జననీ పరివారమంతా చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు అలా మ్రోగుతూండగా జీవన్, లేత తమలపాకులా మృదువుగా వున్న ఆమె చేతిని పైకెత్తి సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆపై తన వేలినున్న తాతయ్య ఉంగరాన్ని తీసి, ఆమె ఎడమచేతి అనామికకు తొడిగి, ఆమె పక్కన నిలబడ్డాడు జీవన్.
సరుకు రవాణా ముగించి తిరిగి వచ్చిన రాఘవ, అది చూసి ఉత్సాహం పట్టలేక గట్టిగా విజిల్ వేశాడు. ఆ వెనకాలే వచ్చిన వెంకటేశుమామ తన మనసులోనే శుభాకాంక్షలు తెలుపుతూ అందరితోపాటు తానూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు.
స్రవంతికి ఇవ్వడానికని హారతి వెలిగించి తెచ్చిన సుమతి అక్కడ జరుగుతున్నదేమిటో తెలియక మొదట్లో తెల్లబోయినా, అంతలోనే అంతా అర్థం చేసుకుని, ఆ యువజంటకు మంగళ హారతి ఇచ్చింది. వెంటనే అక్కడే ఉన్న కిరణ్ “శతమానం భవతి, శతాయుః -.- -” అంటూ శాస్త్రోక్తంగా వాళ్ళని ఆశీర్వదించాడు.
ఇక మీనాక్షి సంతోషానికి అవధుల్లేవు. తాను కోరుకున్న పిల్లే తనకు కోడలు కాబోతోంది. ఆమెకు అంతకన్నా ఇంకేమి కావాలి! సంకల్పసిద్ధి ఆమెకు గొప్ప సంతోషాన్ని ఇస్తోంది.
తాతయ్యకి మనుమరాలి భర్త కూడా మనుమడే ఔతాడు కనుక ఇంక వాళ్ళ తాతా మనుమలు బంధాన్ని ఇక ఎవరూ ఆక్షేపించలేరు. ఆ తరువాత మరో ఆలోచన వచ్చింది మీనాక్షికి - ఎవరైతే నిష్కారణంగా తన కొడుకుని అవమానించాలనుకున్నారో వాళ్ళే కన్యాదానం వేళలో తన కొడుకు కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకుంటారు! దీనికంతటికీ కారణం ఈ పిల్ల! దీనికి అర్జెంట్ గా అమ్మ కావలసి వచ్చి జీవన్ ఈ పెళ్ళికి సిద్ధపడ్డాడు. గాని, ఈ పిల్ల తగులాటమే లేకపోతే మళ్ళీ, కర్తవ్యమ్, కర్తవ్యమ్ - అంటూ ఊళ్ల వెంట తిరిగే వాడేమో - అనుకుంది, అసలు సంగతి తెలియని మీనాక్షి అమాయకంగా.
ఆ పాప అందరినీ చూసి తనుకూడా చప్పట్లు కొడుతూ, కిలకిలా నవ్వసాగింది. పట్టరాని ఆనందంతో పాపను హృదయానికి హత్తుకుని, దాని బూరి బుగ్గలపైన ముద్దుల వర్షం కురిపించింది మీనాక్షి.
పాపని ఎత్తుకుని తల్లి తన వెంటరాగా, స్రవంతి చెయ్యి పట్టుకుని హాలులో ఉన్న తాతయ్య లైఫ్ సైజ్ ఫొటో దగ్గరకు, తమ సంతోషాన్ని ఆయనతో పంచుకోవాలన్న ఉద్దేశంతో….