“జాలి కాదమ్మా! ఇలాంటి దుర్దశలోపడి కొట్టుమిట్టాడుతున్నవాళ్ళు లోకంలో ఎందరో ఉండి ఉంటారు. జాలిపడి నేనెందరికి సహాయపడగలను చెప్పు? వెనక ఒకసారి నువ్వన్నావు, గుర్తుందా ... వితంతువుకి తిరిగి పెళ్ళి కావడమంటేనే చాలా కష్టం. అందులోనూ పిల్లలు కూడా ఉంటే అసలు ఎవరూ ఆమెను చేసుకోడానికి ముందుకురారు - అని. అది నా మనసుకి పట్టిపోయిందమ్మా! నా వల్ల నువ్వు ఎంత నష్టపోయావో తెలిసింది. ఆ అపరాధభావం నాలో ఉండిపోయింది. “అమ్మకి నేనెలాగా ఏ సాయం చెయ్యలేకపోయా, కనీసం అమ్మలాంటి కష్టాల్లో ఉన్న మరొకరికైనా సాయపడి, ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వ గలిగితే బాగుంటుందని అప్పుడే అనుకున్నా. అందుకే జాహ్నవిగారి కష్టాలు విన్నాక, ఆమెను పెండ్లాడి, ఆ ఇద్దరు బిడ్డలకు తండ్రి నవ్వాలని అనుకున్నా! అది, నీకు కొడుకుగా పుట్టిన నా కర్తవ్యమ్ - అనిపించింది. కాని అది జరిగేది మాత్రం నువ్వు ఒప్పుకుని ఆశీర్వదించి నప్పుడే సుమీ ... ” .
చెప్పదల్చుకున్నదంతా చెప్పేసి, మాటాడకుండా కళ్ళుమూసుకుని పడుకుని ఉండిపోయిన జీవన్, క్రమంగా అలాగే నిద్రలోకి జారుకున్నాడు. లయబద్ధమైన అతని ఊపిరి చప్పుడు వింటూ, ఆలోచనలోపడి కొయ్యబారినట్లు అలాగే కూరుచుండిపోయింది మీనాక్షి. కదిలితే కొడుక్కి ఎక్కడ నిద్రాభంగమౌతుందోనన్న భయంతో కదలకుండా ఉండిపోయింది ఆమె. చాలా సేపు అలాగే గడిచిపోయింది.
రాత్రి తాలూకు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, బయట వేట చేస్తున్న వెన్నెల పులుగులు ఉండుండీ ఒకసారి అరుస్తున్నాయి. ఇంట్లో వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ చప్పుడు తప్ప, మరే శబ్డంలేదు. తన ఒడిలో గాఢనిద్రలో ఉన్న కొడుకుని లేపడం ఇష్టంలేక, గోడకు చేరబడి అక్కడే, అలాగే కదలకుండా కూర్చుoడిపోయింది మీనాక్షి.
రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఉందిగాని, మీనాక్షి మనసులో మాత్రం ఆలోచనలు అలలు అలలుగా కదులుతూ అలజడి పెడుతున్నాయి. కొడుకు ఆలోచన ఆమెకు వింతగా తోచింది. యాజులుగారు చెప్పిన సంబంధం “ఉజ్జీ” కుదరదని తోసి రాజన్నాడంటే అందులో సబవు ఉందనిపించింది తనకు కూడా. కాని, స్రవంతి మాటేమిటి?
సెలవు దొరికితే చాలు, ఆ పిల్ల, “మీనాక్షి గారిని చూడాలని ఉందని” వంక పెట్టి ఇక్కడికి వస్తూoటుoది. కాని, ఆమె సెలవురోజు జీవన్ తో కలిసి గడపడం కోసం ఇక్కడకు వస్తోoదన్నది మీనాక్షి ఎప్పుడో గ్రహించింది. అది మీనాక్షికీ ఇష్టమే. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగితే బాగుంటుందన్నది ఆమె మనసులో దాగి ఉన్న కోరిక. చక్కని జోడే ఔతుంది వాళ్ళది - అని మీనాక్షి అభిప్రాయం. అంతేకాదు, అలా జరిగిననాడు జీవన్ కి తాతయ్య కుటుంబంలో మనుమడిగా ఒక స్థిరమైన గుర్తింపు ఉంటుందనీ, తాతయ్యతో ఉన్న అనుబంధం బాంధవ్యమౌతుందనీ ఆశ కూడా ఉంది. అందుకే ఒకపట్టాన కొడుకు ఆశయాన్ని సమర్దిoచలేకపోతోంది.
”దేనికైనా పెట్టి పుట్టాలి! స్రవంతిలాంటి బంగారుబొమ్మని పెళ్ళి చేసుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి. వచ్చి ఉన్న కాసేపట్లోనే, అందర్నీ నవ్విస్తూ, తను నవ్వుతూ, ఇల్లంతా వెలుగులు నింపి వెడుతుంది. అందమైనదీ, బాగా చదువుకున్నదీ, పైగా వీడంటే ప్రాణం పెట్టేదీ - అటువంటి పిల్లమీదకి వీడి మనసు పోలేదంటే, వీడిని ఏమనుకోవాలి! స్రవంతిలాంటి పిల్ల కోడలయ్యే అదృష్టం నా మొహాన రాసిలేదు, దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా” అనుకుని బాధపడింది మీనాక్షి స్రవంతి పైనున్న ప్రేమతో.
కాని మరికొంత ఆలోచించేసరికి, ఏది మంచో ఆమెకే తోచింది, “స్వవిషయం కంటే కూడా నేనూ, నా కష్టాలూ వీడి మనసులో ఎక్కువ చోటును ఆక్రమించి ఉన్నాయన్న మాట! ఒక పువ్వులాంటి జీవితాన్ని మట్టిపాలు కాకుండా కాపాడాలని - ఇంత చిన్నవయసులోనే వీడు తాపత్రయ పడుతూంటే, తల్లినైన నేను సహకరించడానికి బదులుగా అడ్డుపుల్ల వెయ్యడం భావ్యంకాదు కదా! వాడి ఆలోచనలలో తప్పు పట్టగల శక్తి నాకు లేదు. వాడు కోరుకున్నట్లే జరగనియ్యి” అనుకుని, మనసు నిర్మలం చేసుకునే ప్రయత్నంలో పడింది మీనాక్షి.
బయట చెట్లపైన చేరిన ఋషి పక్షులు హఠాత్తుగా కీచులాడుకోడం మొదలుపెట్టడంతో వాటి కర్ణకఠోరమైన కూతలకి జీవన్ కి నిద్రాభంగ మయ్యిoది.
* * *
భూమి చుట్టూ తిరిగే జాబిలిలా స్రవంతి జీవన్ చుట్టూ తిరుగుతోంది - అంటూ, చాలా రోజులనుండే వాళ్ళ కొలీగ్సు చెవులు కొరుక్కుoటూనే ఉన్నారు. ఆ గుసగుసలు క్రమంగా, జీవన్ ని మిత్రులు వేళాకోళంచేసే స్థాయికి చేరాయి. కానీ జీవన్ మాత్రం; స్రవంతి కలివిడిగా ఉంటుంది అందరితోనూ, అంతమాత్రంలో అభాండాలు వెయ్యకండి - అని వాళ్ళను అదలించేవాడు. ఇదిగో పులి - అంటే అదిగో తోక - అనే నోటివట్టంగాళ్లను పట్టించుకోకూడదు - అనుకోని అతడు ఏ స్పందనా ప్రదర్శించలేదు. అయినా, స్రవంతికి ఆ ఉద్దేశం ఉందేమో గాని, జీవన్ కి మాత్రం, అటువంటి ఊహే రాలేదు.
అతడు జాహ్నవిని పెండ్లాడి ఆమెకొక మంచి జీవితాన్ని ఇవ్వడం తన కర్తవ్యంగా భావించడం వల్ల అతనిని ఇప్పటివరకు ఏ ప్రలోభం లొంగదియ్య లేకపోయింది. అతనికి స్రవంతి ఒక మంచి స్నేహితురాలిగా, తన శ్రేయోభిలాషిగా మాత్రమే కనిపిస్తుంది ఎప్పుడూ. కాని కొన్నాళ్ళ తరవాత స్రవంతిని చూస్తూంటే అతనికి కూడా తన మిత్రుల ఆరోపణలలో నిజముందేమో - అనిపించింది. కోనసీమకు ప్రయాణం పెట్టుకున్నజీవన్ కి తన మనసులోని మాట స్రవంతికి కూడా చెప్పి, ఆమెకు నచ్చజెప్పి, ఒప్పించి మరీ వెళ్ళడం ఉచితమైన పని అనుకున్నాడు. తన శ్రేయోభిలాషియై, తనకు మంచి జీవితాన్నిచ్చిన స్రవంతిని సమాధానపరచి మరీ కోనసీమ వెళ్లడం మంచిపని - అని అనుకున్నాడు.
ఆమె మనసును నొప్పించకుండా ఆమెను ఒప్పించడం ఎలాగా - అన్న ఆలోచనలో పడ్డాడు జీవన్. ఎన్నో ఊహాపోహల తరువాత ముఖాముఖీ మాట్లాడడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. వెంటనే ఫోన్ అందుకున్నాడు ...
“నీతో మాటాడాలి, మీ ఇంటికి వస్తున్నా” అని స్రవంతికి ముక్తసరిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఏమేమో ఊహించుకుని సంబరపడిపోయింది స్రవంతి. ప్రేమపూరితమైన ఆమె మనసులో ఎన్నెన్నో ఊహలూ, మరెన్నో ఆశలూ చెలరేగాయి. ఆ రోజు సెలవు రోజు కావడంతో, జీవన్ ని ఘనంగా స్వాగతించడానికి కావలసిన సన్నాహాలు చెయ్యడం మొదలుపెట్టింది స్రవంతి. ఇంటిని తీరుగా సద్ది, తను తలారా స్నానం చేసి, చక్కగా ముస్తాబై అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
డోర్ బెల్ రింగవ్వగానే తలుపు తెరిచి అతన్ని లోనికి ఆహ్వానించింది. తెల్లని డ్రెస్ లో ఉన్న జీవన్ ఆమెకు మరీ “హేండ్సమ్” గా కనిపించాడు. జీవన్ లోనికి వచ్చి, అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. అతను కూర్చోగానే, తానే స్వయంగా తయారు చేసి, ఫ్రిజ్ లో ఉంచిన బత్తాయి రసం తీసుకువచ్చి అతనికి అందించింది స్రవంతి.
“థాంక్సు”చెప్పి ఆ గ్లాసుని అందుకుని, రెండు గుక్కలు తాగి, గ్లాసు టీపాయ్ మీద ఉంచి, “హలో! స్రవంతీ! నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాటాడాలని వచ్చా, నీ మర్యాదలకోసం కాదు. ఇంక అవన్నీ కట్టిపెట్టి స్థిమితంగా కూర్చుని నేను చెప్పేది శ్రద్ధగా విను” అన్నాడు జీవన్ చిరునవ్వుతో.
ఆమె మంత్ర ముగ్ధలా వచ్చి అతనికి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. జీవన్ చెప్పసాగాడు ...
“స్రవంతీ! నీకు నేను చాలా ఋణపడి ఉన్నాను - అన్నది నాకు తెలుసు. నువ్వు నాకు ఎంత మేలు చేశావో అమ్మ నాకు చెప్పింది. ఈ నాటి ఈ అభివృద్ధి అంతా నీ చలవ - అన్నది నేను ఎల్లవేళలా తలుచుకునే నిజం! నీ ఎదుట నిలబడి నీకు కృతజ్ఞతలు చెప్పకపోయినా, ఎప్పుడూ నీ మీద కృతజ్ఞతతోనే ఉంటాను.” ఇంత వరకూ చెప్పి, పాత జ్ఞాపకాలవల్ల పెరిగిన ఉద్వేగంతో మరి మాటాడలేకపోయాడు జీవన్.
స్రవంతి తన కళ్ళు చక్రాల్లా తిప్పి అతనివైపు చూసి అంది, “ఏమిటి గురూ! పనిగట్టుకుని నువ్వు ఇంత దూరం వచ్చినది ఈ మాటలు చెప్పడానికా! నేనప్పుడు పెద్దగా ప్లాన్ చేసిందేమీ లేదు. కళ్ళ కెదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలనిపించింది. ఆ క్షణంలో నాకు న్యాయమని తోచింది నేను చేశా, అంతేగాని, పొగడ్తలకోసం కాదు.”
“సరే ఐతే... ఇక పొగడను, నా కృతజ్ఞత నా మనసులోనే దాచుకుంటాలే. ఇప్పుడిక నేను చెప్పేది శ్రద్ధగా విను... సుమారు మూడు సంవత్సరాల క్రితం నేను యాజులు తాతయ్యగారి పనిమీద వారి స్వగ్రామమైన మల్లెవాడకు వెళ్లాను. అక్కడ నేనొక అమ్మాయిని చూశా. వీలు కుదిరితే ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనుకున్నా. కానీ, అప్పట్లో నేనొక నిరుద్యోగిని. ఏమాత్రం బ్రతుకుతెరువు లేని వాడిని. అందుకే ఆ సంగతిని నేను నా మనసులోనే దాచుకున్నా, ఎవరికీ చెప్పలేదు. నేనిప్పుడు సంపాదనా పరుడినయ్యా. నాకు పెళ్ళాడే అర్హత వచ్చింది. ఆమెను పెళ్ళాడి, ఆమెకొక మంచి జీవితం ఇవ్వాలని నా కోరిక. ఆమె వితంతువు, ఇద్దరు పసి పిల్లలున్నారు. ఆమెను పెండ్లాడి, ఆ ఇద్దరు పిల్లలకి తండ్రినై, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు నివ్వాలన్నది నా ఆశయం.”
ఎంతో నిగ్రహంతో, పైకి అలవోకగా మాట్లాడుతున్నట్లు కనిపించినా, జీవన్ ముఖం జేవురించింది. తన మనసులోని మాట స్రవంతికి చెప్పడానికి ఇంత శ్రమౌతుందనుకోలేదు అతడు. అది ఎంత కష్టమైనా కానియ్, జీవన్ చెప్పడం మాత్రం ఆపలేదు.
జీవన్ తీసుకున్న నిర్ణయం స్రవంతిని చాలా బాధపెట్టింది. ఆశాభంగం ఆమెను నిలువునా కుదిపెయ్యడంతో, ఆమెకు దుఃఖం పొంగి వచ్చిoది. విపరీతమైన దుఃఖంతో మనసు చెదిరిపోగా నిగ్రహించుకోలేకపోయింది. కన్నీరు కాల్వలయ్యి చెంపలవెంబడి కారిపోయింది. .
జీవన్ వంచిన తల ఎత్తకుండా ఏకబిగిని చెప్పుకుపోతున్నాడు, “మా అమ్మ విషయమే చూడు, తనకని ఏ సుఖమూ లేకపోయినా, నేను పుట్టింది లగాయితూ నాకోసం, మరో తోడన్నది లేకుండా, ఒంటి రెక్కమీద పవలూ, రాత్రీ అన్న భేదం పట్టించుకోకుండా రోజంతా కష్టపడి పనిచేసి నన్ను పెంచింది. మరీ చిన్నప్పుడు మా అమ్మని చట్టూ ఉన్న ముత్తైదువలతో పోల్చి చూసి, మా అమ్మ వారిలా ఎందుకు ఉండదు - అని బాధపడేవాడిని. మా అమ్మని ముత్తైదువుగా ఊహించుకుని కలలు కనేవాడిని. మా అమ్మకు మంచి జరగడం కోసం ఏమైనా చెయ్యాలని అనుకునేవాడిని. కాని పెద్దవాడి నయ్యాక తెలిసింది, నేను మా అమ్మకు మంచి చెయ్యడం మాట అటుంచి, చెడునే చేశానని! నేను పుట్టి ఉండకపోతే మా అమ్మకి మళ్ళీ పెళ్ళి జరిగే అవకాశం ఉండేదేమో... మన సంఘంలో అసలు విధవరాలికి తిరిగి వివాహం అవ్వడమన్నదే అరుదు, అలాంటిది ఇక బిడ్డలు కూడా ఉంటే - ఆమెకు వివాహం జరగడం అన్నది బొత్తిగా అసంభవం. అది గుర్తుకి వచ్చినప్పుడల్లా నా మనసంతా అపరాధ భావంతో నిండిపోతుంది. మా అమ్మకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది, కాని ఆమె నాకా అవకాశం ఇవ్వదు. ఆమెకోసం నేనేమీ చెయ్యలేని పరిస్థితి నాది. అందుకే ఆమెలాగే దైవోపహతురాలైన మరొక అమ్మాయికైనా మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. మా అమ్మకి కొడుకుగా పుట్టినందుకు అది నా కర్తవ్యమ్ - అని నా ఉద్దేశం. నువ్వు నాకొక మంచి స్నేహితురాలిగా సపోర్టు ఇవ్వగలవనే ఆశతో అంతా నీకు చెప్పి, నీ సలహా సహకారాలు అందుకోవాలని ఇటు వచ్చా” అంటూ, అంతవరకూ వంచిన తల ఎత్తకుండా ఏకబిగిని చెప్పదలుచుకున్నదంతా చెప్పేసి తలెత్తి చూసిన జీవన్ ని, స్రవంతి కన్నీరు భయపెట్టింది. “స్రవంతీ! ఏమిటిది? ఎందుకా కన్నీరు?” అంటూ కంగారు పడ్డాడు.
“జీవన్! ఐ లవ్ యూ” అంటూ రెండు చేతులతో మొహం కప్పుకుని భోరున ఏడ్చింది స్రవంతి. వేళ్ళ సందులనుండి ఉబికి వచ్చిoది కన్నీరు.
“నన్ను క్షమించు స్రవంతీ. చాలా ప్రేమలు ఏకపక్ష ప్రేమలుగానే ముగిసిపోతూంటాయి. ఏదో ఒక కారణంగా, ఒకరు వెనక్కి తగ్గడం వల్ల రెండవ వారు భగ్నప్రేమికులుగా మారి జీవితాన్ని దుర్భరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి బలహీనతలు నీకు వద్దు స్రవంతీ. ప్లీజ్! నువ్వు ధైర్యంగా పరిస్థితులను ఎదిరించి సంతోషంగా ఉండాలి.”
మొహం మీదనుండి చేతులు తీసి సూటిగా అడిగింది స్రవంతి, “నే నంటే నీకు ఇష్టం లేదా?”
“నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంది. కాని అది నువ్వు కోరుకుంటున్నది కాదు. దానికొక ప్రత్యేకమైన పేరేదీ లేదు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రముఖ వ్యక్తివి నువ్వు! నా మనసులో నీకొక ప్రత్యేకమైన స్థానం ఉంది, అదెప్పుడూ నీదే!”
“మరైతే ఆ కోనసీమ అమ్మాయిని ఎలా ప్రేమించావు?”
“ప్రేమా! అదేమీ అందరూ అనుకునే ప్రేమ లాంటిది కాదు; అది ఒక బాధ్యత! ఆ అమ్మాయిని నేనసలు కలుసుకోలేదు. ఇక ఆమెను చూసింది కూడా ఒకే ఒక్కసారి, అదీ ఒక్క క్షణం. ఆమెపై నా కున్నది ప్రేమకాదు, జాలీ అనకూడదు. జాలిపడి ఒకరి ఆర్తిని తీర్చేటంత తాహతు నాకు లేదని నాకు బాగా తెలుసు. నా మనసులో ఉన్నభావం ఒకే ఒక్కటి, అది “నా కర్తవ్యమ్” అని. నేనీ నిర్ణయం తీసుకుని మూడేళ్ళకు పైన అయ్యింది. ఆలోచన అప్పుడే పుట్టినా దానిని అమలుచెయ్యగల శక్తి మాత్రం నాకు ఇప్పుడే వచ్చింది. నువ్వు కూడా ఆలోచించు స్రవంతీ! నువ్వేమీ అసహాయ స్థితిలోలేవు. నీకు మంచి చదువు ఉంది, చక్కని రూపురేఖలున్నాయి, మంచి సంస్కారముంది. పైగా నీ తల్లిదండ్రులుకు, నీకొక గొప్ప వరుని ఎంచి తెచ్చి, నీ పెళ్ళి చెయ్యగల స్తోమత ఉంది. ఇన్ని అర్హతలుగల నువ్వు జీవితంలో చక్కగా స్థిరపడగలవు. ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే, ఆమె దైవోపహతురాలు. ఇద్దరు పసిబిడ్డలకు తల్లి. ఆమెకు సాయంచేసీ వారెవరూ లేరు. తల్లిదండ్రులా ముసలివారు. ఆ తల్లితండ్రులకు పెద్దవయసు వచ్చాక పుట్టిందిట ఆమె! ఈ పెళ్లి జరిగితే ఆ పెద్దవాళ్ళకు కూడా భారం తగ్గుతుంది. మన సాంఘిక పరిస్థితినిబట్టి, ఇద్దరు బిడ్డల తల్లియైన విధరాలికి పెళ్లి కావడం అన్నది ఉత్తి మాట. నేను తప్పుకుంటే, మళ్ళీ నాలా ఆ అమ్మాయిని ఇష్టపడే వరుడు దొరకడం చాలా కష్ట మౌతుంది. నువ్వు అటువైపునుండి కూడా ఆలోచించు స్రవంతీ, అప్పుడు ఏది ఉచితమో, ఏది కాదో నీకే తెలుస్తుంది.”
స్రవంతి ఆలోచించడం ప్రారంభించింది. ఆలోచిస్తూనే లేచివెళ్ళి చన్నీళ్ళతో మొహం కడుక్కుని తువ్వాలుతో శుభ్రoగా తుడుచుకుని వచ్చి, జీవన్ కి ఎదురుగా కూర్చుంది. కొంతసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. దుఃఖంతో ఎర్రబడిన ముఖంతో, అదిరే ముక్కుపుటాలతో, నిండా కన్నీళ్ళతో నిండివున్న సోగకళ్ళతో మూర్తీభవించిన శోక దేవతలా ఉన్న స్రవంతి, అదిరే పెదవిని మునిపంటితో నొక్కి పట్టి పొంగివచ్చే దుఃఖాన్ని అడుపుచేసుకునే ప్రయత్నంలో పడింది. ఎట్టకేలకు ఆమె మనసును కుదుటపరచుకుని నిబ్బరాన్ని ప్రదర్శించగలిగింది ...
“సరే, నీ ఇష్టం! నువ్వు చెయ్యాలనుకుంటున్నది తప్పు పనైతే నేను “కాదు – కూడదు” అంటూ దెబ్బలాడినా అందమే! కాని గురూ! నువ్వు చాలా అరుదైన ఔదార్యాన్ని చూపించాలనుకుంటున్నప్పుడు, దానిని కాదనే శక్తి నాలో లేదు. అపురూపమైన నీ ఆశయాన్ని నేనెలా కాదనగలను! నువ్వు ఒక నిండు జీవితాన్ని మట్టిపాలవ్వకుండా కాపాడాలి అనుకున్నప్పుడు నీ స్నేహితురాలిగా నేను దాన్ని ప్రోత్సహించడమే ఉచితం. అలాగే కానియ్! నీకు నా ఫుల్ సపోర్టు ఉంటుంది. “మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్” అంటారు. ఎవరికి ఎవరు ప్రాప్తమో ఎవరికి తెలుసు! అది నిర్ణయించేది మనం కాదు కదా! భగవన్నిర్ణయాన్ని మనం ఆపలేము” అంది స్రవంతి నిరీహతో.
“నాకా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన వచ్చి మూడేళ్ళు దాటిపోయింది. అప్పుడు ఒక్కసారి మాత్రమే నేను అక్కడకు వెళ్ళినది. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఎలావుందో, ఏమైనా మార్పులు వచ్చాయో - లేదో ఏమీ తెలియదు నాకు. నెక్స్టు వీక్ మనకి లాంగ్ వీక్ ఎండ్ వస్తోoది కదా, అప్పుడే మరో రోజు సెలవు తీసుకుని వెళ్ళాలనుకుoటున్నా” అని చెప్పి, ఒక్క క్షణం ఆగి, “నిన్ను చాలా బాధపెట్టాను, నన్ను క్షమిoచగలవా స్రవంతీ” అని అడిగాడు జీవన్.
అతని కంఠంలో ధ్వనించిన దైన్యానికి చలించిపోయిన స్రవంతి, తానింకా అతనిని బాధపెట్టకూడదని నిర్ణయించుకుంది. వెంటనే కళ్ళు తుడిచేసుకుని, లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుని హుషారుగా మాట్లాడాలని ప్రయత్నిoచింది ...
“సరేలే బాసూ! నువ్వెళ్ళి ఆమెను తీసుకురా. మీరొచ్చేసరికి నేను హారతి పళ్ళెం పట్టుకుని గుమ్మంలో నిలబడతా, సరేనా? మరి నాకిచ్చే హారతి కట్నం మాత్రం ఘనంగా ఉండాలి సుమీ” అంది తనకు సహజమైన పద్దతిలో.
ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అంతలోనే సద్దుకున్నాడు జీవన్, “నిజమా! సంతోషం. అలాగైతే నాకెంతో అమూల్యమైన తాతయ్య ఉంగరం నీకు హారతి కట్నంగా ఇచ్చేస్తా! సరేనా” అంటూ వెళ్ళడానికి లేచాడు జీవన్.
స్రవంతి కళ్ళు వింతగా మెరిశాయి, “ఆ ఉంగరం నువ్వు నా వేలికి తొడిగినప్పుడు నాకు సంతోషమయ్యేది, కాని నువ్వది నాకు హారతి కట్నంగా హారతి పళ్ళెంలో వేసినప్పుడు కాదు” అనుకుంది మనసులో. అలా అనుకోగానే ఆమె హృదయం ఉద్వేగంతో నిండిపోయింది. ఊహ కందని భావావేశంతో ఆమె హఠాత్తుగా లేచి, రెండడుగులు ముందుకు వచ్చి జీవన్ మెడచుట్టూ చేతులువేసి, మునివేళ్ళపై పైకి లేచి, అతని పెదవులపై గాఢముగా ముద్దుపెట్టుకుంది. ఎంత వేగంగా అతన్ని అల్లుకుపోయిందో అంత వేగంగానూ అతనిని వదలి దూరంగా వెళ్ళి నిలబడింది.
దిగ్భ్రాంతిలో పడిపోయాడు జీవన్. ఒక్క క్షణంలో జరిగిపోయిన దానికి జీవన్ లోలోన వొణికిపోయాడు. ఆ క్షణంలో అతని హృదయంలో “స్రవంతియే నా జీవిత సర్వస్వం” అన్నభావం ఏర్పడింది. కాని అంతలోనే నిగ్రహం తెచ్చుకున్నాడు. ఏదైనా ఒక మంచి పని చెయ్యబోతే, వింతవింత విఘ్నాలు రాకమానవు. ఈ ప్రలోభాన్ని కూడా ఒక పరీక్షే అనుకుంటే సరి, ఈ పరీక్షను నెగ్గాలనే కోరుకుంటాము. అప్పుడు మంచి మార్కులతో పాసవ్వడానికే మనం కృషి చేస్తాం కదా - అనుకున్నాడు జీవన్. మనసు సరిపెట్టుకున్నాడు. స్రవంతికి “బై” చెప్పి, ద్వారంవైపు నడిచాడు.
“ఐ విష్ యు ఆల్ ది బెస్ట్” అంటూ అతన్ని సాగనంపింది స్రవంతి. బాల్కనీలో నిలబడి, బైక్ మీద వెళ్ళిపోతున్న జీవన్ని కనిపించినంతవరకూ చూస్తూ నిలబడింది. “ఎంత ఎత్తుకి ఎదిగిపోయావు బాసూ! రోజు రోజుకీ ఉన్నతంగా ఎదిగిపోతున్న నిన్ను అందుకోడం నావల్ల నెలాగౌతుంది! అలాగని నిన్ను ప్రేమించకుండా నేనెలా ఉండగలను” అనుకుంది. అలా అనుకోగానే పొoగి వచ్చిన దుఃఖంతో వెళ్ళి మంచం మీద వాలిపోయింది స్రవంతి.