“ఔనుగాని బాసూ! ప్రదీప్ చాలా మారిపోయాడు. ఇప్పుడు శిరీషను “హెరాస్” చెయ్యడం పూర్తిగా మానేశాడుట! అంతేకాదు, అతడు ఆమెను తప్పించుకుని తిరుగుతున్నాడని కూడా అనిపిస్తోంది నాకు. పొరపాటున ఎదురుపడి నప్పుడు కూడా వంచిన తల ఎత్తకుండా తప్పుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడుట! అద్భుతం! ఏం మాయ చేశావోగాని బాసూ ...”
“నా కలాంటి మాయలూ, మంత్రాలూ ఏమీ తెలియవు, ముక్కుకు సూటిగా నడిచి పోవడం తప్ప! నేను చేసిందల్లా ఒక్కటే - అతని ప్రవర్తనలోని లోపాల్ని విశ్లేషించి, అది ఎంత తగనిపనో అతనికి తెలిసేలా చేసి, అతనిలోని ఆలోచనను మేల్కొలిపాను. అంతే! తన తప్పు తనే తెలుసుకున్నాడు. మనిషి చేసే తప్పుల్లో చాలావరకూ కేవలం ఆలోచనా లోపం వల్లే జరుగుతూ ఉంటా యనిపిస్తుంది నాకు. కంగారుపడి నిర్ణయాలు తీసుకోకుండా, కొంచెం బుర్రకు పనిచెప్పి, ఇలా చెయ్యడంవల్ల వచ్చే పరిణామాలు ఏమిటి – అని ఆలోచించి ఉంటే ఎవరూ ఏ తప్పూ చెయ్యనే చెయ్యరని నా గట్టి నమ్మకం.”
“ప్రదీప్ తో ఏం అన్నావో చెప్పు బాసూ!” గారాలుపోయింది స్రవంతి.
జీవన్ నవ్వీ నవ్వనట్లుగా నవ్వి, చెప్పడం మొదలుపెట్టాడు. “ముందుగా మీరు నా దగ్గర వదిలివెళ్ళిన పేపర్ కట్టింగ్ చేతికి ఇచ్చి చదవమన్నా. చదివాడు. ఆ తరవాత అడిగా, నీకు నచ్చని అమ్మాయి వచ్చి నీకు “ఐ లవ్ యూ“ చెపితే, నువ్వు “ఓకే” చెపుతావా? “నో” చెప్పడంలో తప్పేముంది? “నో” అన్నదని కక్షసాధిస్తే; పేపర్ లో చూశావుగా... "నో" అందని కోపంతో అతడు ఆమె మొహం మీద యాసిడ్ పోసి కక్ష తీర్చుకున్నాడు. ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె అకాల మరణానికి అతడే బాధ్యుడని, ఆ అబ్బాయికి హత్యానేరం మీద యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఎంత బాగుందో చూడు. దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? వీళ్ళని కన్నఆ తల్లులిద్దరూ, తాము అపురూపంగా కనీ పెంచిన పిల్లలను పోగొట్టుకుని, గర్భశోకం అనుభవిస్తూ వీళ్ళని కన్న పాపానికి దుర్భరజీవితం గడుపుతున్నారు. అంతా చెప్పి, చివరలో అడిగా, “ఇదంతా అవసరమా? “ఈజ్ ఇట్ వర్తు ది ట్రబుల్” అని. అంతే - అతడు అర్థం చేసుకున్నాడు. ప్రదీప్ మరీ అంత చెడ్డవాడేం కాదు.”
“ఇన్నాళ్ళూ ప్రేమ, ప్రేమంటూ తిరిగి అంతలోనే అంతా మర్చిపోయాడన్నమాట! ఎనీహౌ, మొత్తానికి సిరి బ్రతికి బయటపడింది. థాంక్సు బాసూ!’
“యు ఆర్ వెల్కం!” చిన్నగా నవ్వి అన్నాడు జీవన్. “ప్రదీప్ మనసేమిటో మనకు ఎలా తెలుస్తుంది? జీవితంలో ఈ ప్రేమలూ, పెళ్ళిళ్ళు ఒక భాగమేగాని పూర్తి జీవితం ఎంతమాత్రం కాదు కదా! వైవాహిక బంధం ఒకటే కాదు, ఇంకా ఇంకా ఎన్నో రకాల బాధ్యతలూ, బంధాలూ ఉంటాయి జీవితంలో. ప్రదీప్ విషయంలో ఇప్పుడు జరిగింది మంచిదే కదా, ఇంకా బాధపడుతున్నావెందుకు? మీ అమ్మాయిలతో వచ్చే చిక్కే ఇది, ఔనంటే తప్పు, కాదంటే ముప్పు!” విసుక్కున్నాడు జీవన్.
గతుక్కుమంది స్రవంతి. “సారీ బాసూ! జస్టు క్యూరియాసిటీ! తెలుసుకోవాలన్న కుతూహలం, అంతే!”
“కల్పనాజగత్తులో చాలా ప్రేమ కథలు వచ్చాయి. వాటిలో కొన్ని పాఠకులను ఆకట్టుకుని పాత్రల సుఖదుఃఖాల్లో లీనమయ్యీలా చేశాయి కూడా. కాని అవి నిజాలుకావు. నిజానికి వాటిని మనం పట్టించుకోవలసిన పనిలేదు. కానీ వాస్తవాలు వేరు. మనం చేసుకున్నది కష్టమైనా సుఖమైనా మనమే అనుభవించక తప్పదు. చాలా ప్రేమలు, చిన్నగాలికే ఎగిరిపోయే ఎండు టాకుల్లా చిన్న ఉత్పాతం వస్తే చాలు మాయమైపోతున్నాయి. ఎంత గాలి వచ్చినా చెక్కుచెదరని ఊడలమర్రి లాంటి ప్రేమలు చాలా అరుదు.”
“అంటే సృష్టిలో ప్యూర్ అండ్ స్ట్రాంక్ లౌ అన్నది లేనే లేదా!”
“ప్యూర్ లౌ" అంటే నీ ఉద్దేశం?”
”మనసారా తను ప్రేమించిన వ్యక్తికోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండడం, తను ప్రేమిoచిన మనిషిలోని తప్పొప్పుల మధ్య వివక్ష లేకుండా ఎప్పుడూ ఒకేలా ప్రేమించడం - ఇలా ఏవో కొన్ని సరిహద్దులు ఉన్నాయి.”
“ప్యూర్ లౌ లేకేం! ఉంది, అదే తల్లిప్రేమ. బిడ్డతో ఎన్ని కష్టాలైనా పడనీ, తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తూ, ఆ బిడ్డ శ్రేయస్సునే కోరుతూ ఉంటుంది. తన కష్టాన్ని లెక్కచేయదు. నా ఉద్దేశంలో తల్లిప్రేమను మించిన ప్రేమ మరేదీ లేదు.” అన్నాడు జీవన్.
“థాంక్సు గురూ! తెలియని విషయాలెన్నో నాకు తెలిసీలా చేశావు. థాంక్యూ ఎగైన్” అంది ఉత్సాహంగా స్రవంతి.
“థాంక్యూ టూ! నేనూ నీకు థాంక్సు బాకీ ఉన్నా. నువ్వు ఎక్సెలెంట్ కుక్కువి! మువ్వొంకాయ కూర చాలా బాగుంది” అన్నాడు జీవన్ మాటలను మరోదారి పట్టిస్తూ. .
“అంటే కొబ్బరి పచ్చడి బాగులేదనా అర్థం” అంది స్రవంతి కొంటెగా.
జీవన్ చిన్నగా నవ్వుతూ, “నేను ముందే చెప్పానుగా నువ్వు బ్రహ్మాండమైన వంటగత్తెవని! అంటే - నువ్వు గడ్డి పచ్చడి చేసినా, అది బ్రహ్మాండగా ఉంటుందని అర్ధం. అలాంటిది కొబ్బరి పచ్చడి బాగుందని నేను వేరే చెప్పాలా ఏమిటి!” అన్నాడు ఎదురట్టిస్తూ.
ఆ ప్రశంసకి స్రవంతి బుగ్గల్లో కెంపులు మెరిశాయి. కొంటెగా తనుకూడా ఏదో ఒక కౌంటర్ వెయ్యాలని నోరుతెరిచింది, కాని, అంతలోనే, “సార్! మీకోసం ఎవరో వచ్చారు” అంటూ ఆఫీసు బోయ్ రావడంతో, తెరిచిన నోరు మళ్ళీ మూసేసుకుంది స్రవంతి.
జీవన్ ని కలవడం కోసం “హితైషిణి” పత్రికా ఆఫీసునుండి ఎవరో వచ్చారన్న వార్త తెచ్చాడు బాయ్. వెంటనే లేచి అతని వెనక బయలుదేరాడు జీవన్. వెనువెంట నడిచింది స్రవంతి కూడా.
రిసెప్షన్ రూమ్ లోకి వచ్చిన జీవన్ ని, హితైషిణి పత్రిక నుండి వచ్చిన నడివయసు వ్యక్తిని ఒకరికొకరిని పరిచయం చేసింది రిసెప్షనిస్టు.
ఒక్కక్షణం ఆ వచ్చిన అతను జీవన్ వైపు ఆశ్చర్యంగా చూసి, అంతలోనే సద్దుకుని జీవన్ నుద్దేసించి, “సర్! నేను “హితైషిణి” పత్రికకు సబార్డినేట్ ఎడిటర్ ని. నన్ను మా పత్రిక వాళ్ళు పంపారు, మిమ్మల్ని ఇన్వైట్ చెయ్యడానికి. నాపేరు ప్రకాశరావు. మీరు రాసిన “జీవన స్రవంతి” నవలకు ప్రధమ బహుమానం వచ్చిoదని మీకు ఇదివరకే తెలియజేశాము కదా... ఈ సంవత్సరం హితైషిణికి సిల్వర్ జూబిలీ ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్ కి మిమ్మల్ని ఆహ్వానించి, ఆ సందర్భంగా జరిగే ఉత్సవంలో, స్టేజి మీద మిమ్మల్ని సన్మానించి మీకా బహుమానాన్ని అందజెయ్యాలని మా సంకల్పం. మీకు స్వయంగా మా ఆహ్వానాన్ని అందజేసి, మీ సమ్మతిని అందుకుని రమ్మని వాళ్ళు నన్ను పంపారు. మీరు ఫంక్షన్ కి రావడానికి ఒప్పుకుంటే ఆ సమయానికి మీరు పంపమన్న చోటుకి కారు పంపుతాము. చిరంజీవిగారూ! మీరు తప్పక రావాలి.” గుక్కతిప్పుకోకుండా చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు అతడు.
“నాకు సెలవు దొరకాలికదా!” నసికినట్లుగా అన్నాడు జీవన్.
“ఒక్కరోజు సెలవు పెడితే చాలు, మీకే ఇబ్బందీ ఉండదు. ఆరోజు రాత్రికే మిమ్మల్ని మీ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాము. ప్లీజ్! రాననకండి సార్! సిల్వర్ జూబిలీ సమయం కనక బహుమతి ప్రధానోత్సవం గొప్పగా చెయ్యాలని ప్లాన్ చేశారు మా వాళ్ళు. నిజం చెప్పాలంటే, మీ నవల పడడం మొదలయ్యాక మా పత్రిక సర్క్యులేషన్ బాగా పెరిగింది. మీకు మా కృతజ్ఞత తెలియజేసే అవకాశం మాకివ్వండి. మానవ జీవితానికి ఒక జీవనదితో పోలికపెట్టి మీరు చేసిన ప్రస్తావన చాలా మందికి నచ్చింది. ఆ విషయాన్ని ఎంతో మంది పాఠకులు మాకు ఉత్తరాలద్వారా తెలియజేస్తున్నారు. మీ రచనను చదివిన పాఠకులు మీరెంతో అనుభవజ్ఞులని, మీవయసు ఏభైకి పైమాటే ఉండవచ్చుననీ అనుకుంటున్నారు. మిమ్మల్ని చూడకముందు నేనూ అలాగే అనుకున్నా! ఇంత చిన్న వయసులోనే మీరంత బాధ్యతాయుతమైన రచనలు చేసి, గొప్ప పేరు గడిoచుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. రేపు సభలోని వారందరికీ మిమ్మల్ని రచయిత చిరంజీవిగా పరిచయం చేసే భాగ్యం మాకు కలిగించమని మరీమరీ అడుగుతున్నాను. మీరు “సరే” అంటే మేము ఆహ్వాన పత్రికలు అచ్చు వేయిస్తాము.” అంటూ మాటలు ఆపాడు హితైషిణీ సబ్ ఎడిటర్ ప్రకాశరావు.
జీవన్ కి, తానే రచయిత చిరంజీవి - అన్న విషయం ఆఫీసులో తెలియడం ఇష్టం లేదు. అందుకే ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచాడు. కాని ఈ వేళ అందరికీ ఆ సంగతి తెలిసిపోయింది. లంచ్ అవర్ కావడంవల్ల అందరూ ఖాళీగా ఉండడంతో చోద్యం చూడడానికి వచ్చినట్లు కోలీగ్సంతా రిసెప్షన్ రూమ్ లో చేరిపోయారు. జీవన్ కి చాలా మొహమాటమయ్యిoది.
ప్రకాశరావు పక్కకు చేరి అన్యాపదేశంగా, “మీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పారు” అని అడిగాడు జీవన్.
“మీరు మాకు ఇచ్చిన అడ్రస్ ప్రకారం నేను మీ ఇంటికి వెళ్లాను. ఆక్కడ మీ గురించి అడిగితే మీ అమ్మగారు ఈ అడ్రస్ ఇచ్చి పంపారు” అన్నాడు అతడు.
ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఉండాలనే తను ఇంటి అడ్రస్ ఇచ్చాడు. కాని, తల్లికి ముందుగా చెప్పి ఉంచకపోడం వల్ల ఇలా జరిగింది. అది తన తప్పే అనుకుని ఖిన్నుడయ్యాడు జీవన్. కానీ ఇప్పుడు సమయానికి తగిన విధంగా ప్రవర్తించక తప్పదు కదా ...
“హితైషిణి వారు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కాని, నేనొక బాధ్యత గల ఉద్యోగిని. రచనలంటారా ... అది నా “హాబీ” మాత్రమే! ఇలా సభలనీ, సమావేశాలనీ ఊళ్లుపట్టుకుని తిరగడం నాకు కుదరదు, క్షమించాలి మీరు” అన్నాడు జీవన్.
“అలా అనొద్దు సార్!’ అంటూ ప్రాధేయపడ్డాడు ప్రకాశరావు. “మీ రచనలు చదివి, చాలామంది పాఠకులు మీపై అభిమానాన్ని పెంచుకున్నారు. మీ రాక మా ఫంక్షన్ కే హైలైట్ ఔతుంది. మా మేనేజర్ తో విషయం చెప్పి, ఫంక్షన్ ఆదివారం జరిగేలా ప్లాన్ చేస్తాను. మీరు సెలవు పెట్టవలసిన పని కూడా ఉoడదు. రాననిమాత్రం అనొద్దు.”
అప్పటికే అక్కడ ఆఫీసులో వాళ్ళు చాలా మంది చేరిపోయారు. వాళ్ళలో కొందరు చిరంజీవి రచనలు చదివి, అతని మీద అభిమానం పెంచుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకి, తమ కొలీగ్ జీవనే “ప్రముఖ రచయిత చిరంజీవి” కావడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. వాళ్ళందరూ చుట్టూ చేరి బలవంతపెట్టడంతో జీవన్ కి హితైషిణి వాళ్ళ ఆహ్వానాన్నిఅంగీకరించక తప్పలేదు.
జీవన్ దగ్గర మాటపుచ్చుకుని ప్రకాశరావు సంతోషంగా వెళ్ళిపోయాడు.
*************
ఆ రోజు జీవన్ ఆఫీసునుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా అగరువత్తుల పరిమళంతో గుబాళించిపోతోంది. ఆ సుగంధం అతనికి పరిచయమే! అది అతని మనసును ఉత్తేజపరచి, ఏవేవో జ్ఞాపకాలను రేపింది. ఆ పరిమళం అతనికి మల్లెవాడను గుర్తు చేసింది.
జీవన్ గట్టిగా ఊపిరి పీల్చుకుని, “అబ్బా! ఎంత మధురమీ పరిమళం” అన్నాడు.
ఆ మాటలు అతడు పైకే అనడంతో, అప్పటికే సాయంత్రపు పూజ ముగించి దేవుడి గది బయటకి వస్తున్న మీనాక్షి చెవుల్లో పడ్డాయి ఆ మాటలు. వెంటనే ఆమె మాట అందుకుని, “ఔనురా! ఎవరో గుమ్మంలోకి తెచ్చి అమ్ముతుంటే కొన్నాను. మొగిలిపూల వాసనట! ఆ పేరు విన్నాగాని అదింత బాగుంటుందనుకోలేదు! అగరొత్తులు పెట్లో ఉండబట్టి అప్పుడు తెలియలేదు గాని, ఈ పరిమళం ఇంత బాగుంటుందని ముందే తెలిసుంటే మరికాసిని కొనివుండే దాన్ని” అంది మీనాక్షి .
జీవన్ ఈలపాటగా, “మొగలిపూలవాసనతో జగతి మురిసిపోయింది ... ” అంటూ పాడి , “ మొగిళినే మొగలి - అనిక్కూడా అంటారమ్మా! నిజం మొగలిపువ్వు వాసన నాకు తెలుసు. అది ఇంతకంటే కూడా ఇంకా బాగుంటుంది. యాజులు తాతయ్య పనిమీద నేను మల్లెవాడ వెళ్ళినప్పుడు దీనిని నేను ప్రత్యక్షంగా చూశా. మొగలి పూవు బంగారు రంగులో పొడుగ్గా అదో తమాషాగా ఉంటుంది. అన్నిపూల మాదిరి కాదు. నిడుపుగా ఉంటాయి రేకలు! అగరవత్తులు తయారుచెయ్యాలంటే రకరకాల పదార్ధాలు కలుపుతారు. అయినా ఈ అగరువత్తుల వాసనకూడా చాలావరకూ అలాగే ఉందమ్మా! ఈ వాసన నాకు మల్లెవాడను గుర్తుచేసింది” అన్నాడు జీవన్.
“అగరువత్తుల పెట్టె మీద బొమ్మ వేశారు. కానీ, దానిని చూసి నేనది పువ్వనుకోలేదు. అచ్చం నువ్వు చెప్పినట్లే ఉంది ఆ బొమ్మ” అంది మీనాక్షి.
మల్లెవాడ జ్ఞాపకాలతో ఆ రాత్రి అతనికి సరిగా నిద్ర పట్టలేదు. కరణంగారి ఆత్మీయత, సీతమ్మగారి ఆదరణ, మల్లేశు అమాయకపు ప్రేమ, పసివాళ్ళ తొక్కుపలుకులు - అన్నీ జ్ఞాపకం వచ్చాయి. వాటన్నిటితోపాటుగా జాహ్నవి పరిదీన మూర్తి కూడా! వెంటనే అతనికి తన కర్తవ్యమ్ గుర్తుకు వచ్చింది.
“అప్పుడు నేను నిరుద్యోగిని, నా మనసులోని మాట పైకి అనే అర్హతలేని వాడిని. ఇప్పుడలా కాదు కదా! జగన్నాధం తాతయ్య దయవల్ల ప్రయోజకుడినయ్యాను. ఇప్పుడు మాకింక ఏ లోటూ లేదు. ఇక జాగు చెయ్యడం ఎందుకు? అమ్మ ఆశీస్సులు తీసుకుని, మల్లెవాడకు వెళ్ళి కరణం గారితో మాటాడిరావాలి. త్వరలో సెలవు తీసుకుని వెడతా. పెద్దలందరి ఆశీస్సులతో నేను జాహ్నవిని పెళ్ళిచేసుకుని ఆ పసివాళ్ళకు తండ్రి నౌతా, వాళ్లకి ఏ లోటూ రానీకుండా ప్రేమగా చూసుకుంటా” అనుకున్నాడు.
మళ్ళీ అతనికి మరో ఆలోచన వచ్చింది, “ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో! తెలుసుకోకుండా ఏ నిర్ణయానికీ రాకూడదు” అని అనుకున్నాడు. ఒక స్థిరమైన నిశ్చయానికి రావడంతో అప్పుడు అతనికి గాఢంగా నిద్రపట్టి, సుఖంగా నిద్రపోయాడు.
*************
ఆ మరునాడు రాత్రి భోజనాలయ్యాక మీనాక్షి తీరికగా చాపమీద కూర్చుని భాగవతం చదువుకుంటూ వుంది. జీవన్ కూడా రాస్తున్న కథను పూర్తిచెయ్యడం కోసం కలం పట్టుకున్నాడన్నమాటేగాని అతనికి ఏకాగ్రత కుదరడం లేదు. తన మనసులోని మాట తల్లికి ఎలా చెప్పాలా - అన్న ఆదుర్దాతో కొట్టుమిట్టాడుతోంది అతని మనసు.
గోడగడియారం లోని చిలక పది అయ్యిందన్నదానికి గుర్తుగా పదిసార్లు బయటికి వస్తూ, లోనికి పోతూ కూసి కూసి ఆపై గూట్లో దూరి, తలుపేసుకుంది. మీనాక్షి ఒకసారి దానివైపు తలెత్తిచూసి, మళ్ళీ తలవంచుకుని చదువుకోసాగింది. జీవన్ కలానికి కేప్ బిగించి బల్లమీద ఉంచి లేచాడు. నెమ్మదిగా తల్లి పక్కన జేరి, ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకున్నాడు. తల్లితో మాటాడాలంటే ఏదో బిడియం అడ్డు వస్తోంది. మీనాక్షికి మాత్రం జీవన్ చిన్నతనం తలపుకి వచ్చింది ...
చిన్నప్పుడు జీవన్ ఏ కష్టం వచ్చినా, మనసులో ఏ అలజడి కలిగినా ఇలాగే తన ఒడిలో చేరి సేదదీరేవాడన్నది గుర్తువచ్చి ఆమె మనసు చెమ్మగిల్లింది. వెంటనే, “వీడిలా నా ఒడిలో చేరాడంటే వీడికి ఏదో ఇబ్బంది ఉందనే కదా అర్థం” అనుకున్న ఆమె పుస్తకం మూసి పక్కన ఉంచి, పాతికేళ్ళు వయసున్న తన గారాలపట్టి తల నిమురుతూ, ఆర్ద్రత నిండిన స్వరంతో, “ ఏరా పండూ! ఏమయ్యిoదిరా నాన్నా” అని లాలనగా అడిగింది.
తల్లి పలకరింపుతో జీవన్ నోరు తెరిచి, “అమ్మా! ఇన్నాళ్ళూ నీతో చెప్పలేదని అపార్థం చేసుకోవద్దు. ఆ టైం వచ్చాక చెప్పొచ్చులెమ్మని ఊరుకున్నానేగాని నీకు చెప్పకూడదని కాదు. ఇప్పుడు ఆ టైం వచ్చిoదనిపిస్తోoది, చెపుతా వినమ్మా! మూడేళ్ళకు ముందు, యాజులు తాతయ్య పనిమీద నేను కోనసీమకు వెళ్లాను కదా! అక్కడ నేనొక అమ్మాయిని చూశా... పేరు జాహ్నవి! కరణం కామేశంగారి అమ్మాయి ... ” జీవన్ ఉద్వేగంతో ఊపిరాడనట్లై కాసేపు ఆగాడు.
మీనాక్షి ముఖం ఆనందంతో విప్పారింది. “మరి ఇకనేం! తాతయ్యతో చెప్పి కరణం గారికి కబురు చేయిద్దాం, పెళ్ళి మాటలకి రమ్మని! ఇంక నాన్పుడు వద్దు. వెంటనే..” ఉబలాటపడింది మీనాక్షి.
తల్లి మాటలకు అడ్డువచ్చాడు జీవన్. “అంత తొందర వద్దమ్మా! అప్పుడే అయిపోలేదు, ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. అంతా విన్నాక నెమ్మదిగా, రెండు - మూడు రోజులు బాగా ఆలోచించి మరీ నీ మనసులోని మాట నిస్సందేహంగా చెప్పు. నువ్వు “సరే” నంటేనే నేను ముందడుగు వేసేది. నిన్నుకాదని నేనేమీ చెయ్యనమ్మా! భయపడక శ్రద్ధగా విను...
ఆ మల్లెవాడ అమ్మాయిని నేను చూసింది ఒకే ఒక్కసారి! అదికూడా ఒక్క క్షణం! ఆమె అచ్చం నీలాగే తెల్లని బట్టలు కట్టుకుని, ఏ అలంకారమూ లేకుండా, తలయినా సరిగా దువ్వుకోకుండా మూర్తీభవించిన శోకదేవతలావుంది. చెదిరిన ముంగురుల చాటునుండి కనిపించిన ఆమె ముఖం నాకు, అచ్చం మేఘాల చాటునుండి తొంగిచూస్తున్న చంద్ర బింబంలా అనిపించింది. చందమామలోని మచ్చలాగే ఆమె విశాల నేత్రాల నిండా గూడుకట్టిన విషాదం! ఆమెను చూచినప్పుడే అనిపించింది నాకు, ఆ కళ్ళలోని విషాదాన్ని నా చేతులతో తుడిచెయ్య గలిగితే ఎంత బాగుంటుంది - అని. కాని అప్పుడు నేను నిరుద్యోగినమ్మా! పూర్తిగా అన్నింటికీ తల్లిమీదనే ఆధారపడి ఉన్న బదనికను - పరాన్నజీవిని! అది తగిన సమయం కాదనిపించి, అప్పట్లో ఏమీ మాటాడకుండా ఉండిపోయాను. కాని, ఇప్పుడు మాటాడవలసిన సమయం వచ్చిందని అనిపిస్తోందమ్మా నాకు” అంటూ జాహ్నవిని గురించి తనకు తెలిసినదంతా తల్లికి చెప్పాడు జీవన్.
“ఇదంతా వింటే, ఇదేదో కొంతవరకూ నా కధ లాంటిదే అనిపిస్తోంది! ఇదెక్కడి సామ్యంరా..” అంది మీనాక్షి.
“ఔనమ్మా! బలే కనిపెట్టావు! కొన్ని తేడాలున్నా, కొంత పోలిక కూడా ఉంది. ఆమె కూడా వితంతువే! భర్త పోయేసరికి ఆమెకూడా గర్భవతి! కవలలు పుట్టారు.”
అప్రయత్నంగా, ”అయ్యో పాపం!” అంది మీనాక్షి. ఆ రోజుల్లో తాను పడ్డ కష్టాలన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ఆమెకు జాహ్నవి మీద వల్లమాలిన జాలి పుట్టుకొచ్చింది.
“ఔనమ్మా! సరిగ్గా అలాగే అనిపించింది నాకుకూడా!”
నిర్ఘాoతపోయిoది మీనాక్షి. కొంత సేపు ఇద్దరూ మాటాడలేదు. నెమ్మదిగా మనసు చిక్కబట్టుకుని మీనాక్షే మాటాడింది, “జాలి పడుతున్నావా బాబూ” అంది లో ఎలుగుతో.