Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

కిరణ్ నవ్వాడు, ”అలాగైతే నువ్వు చాలా దూరం ఆలోచించి ఉంచావన్న మాట! సరేరా! నీ ఇష్టం.”

ఏదో పనిమీద లోపలకు వెళ్ళిన మీనాక్షి మళ్ళీ వాళ్ల దగ్గరకు వచ్చింది. జీవన్ తల్లినుద్దేశించి అన్నాడు,

“అమ్మా! నాదో కోరిక – ఈ సంవత్సరమే నాకు ఉద్యోగం వచ్చింది, త్వరలోనే తాతయ్య పుణ్యతిధి రాబోతోంది, ఆ రోజున నా జీతం లోనుండి ఖర్చుపెట్టి, తాతయ్య పేరుమీద అన్నదానం చేయించాలని ఉంది, అలాగే ప్రతిసంవత్సరం కూడా చెయ్యాలని ఉంది నాకు. ఏమంటావు?”

వెనక ఎప్పుడో చేసిన మేలు మరిచిపోక పోవడం కృతజ్ఞతకు మూలం. అందుకే కృతజ్ఞతను “బాక్వర్డు వర్చ్యూ” అంటారు కొందరు. అంటే వెనకబడిన సుగుణం - అనుకోవద్దు, వెనక పొందిన సహాయాన్ని తలుచుకున్నప్పుడు పుట్టే సద్భావన - అని అర్థం చెప్పుకోవాలి.

భూతభవిష్యద్వర్తమాన కాలాల్ని మూడింటినీ సమన్వయపరచి ఆలోచించగల శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. అలాంటిది, సాటి మనిషి చేసిన మేలును మరిచి పోయి కృతఘ్నుడై ప్రవర్తించిన నాడు మానవజన్మ వ్యర్ధం.

“తాతయ్య చేసిన మేలుకు మనం ఈ జన్మలో మాత్రమే కాదు, మరి ఏడు జన్మలవరకూ కృతజ్ఞులమై ఉన్నా ఆయన ఋణం తీరేది కాదు.” భావోద్వేగంతో కళ్ళు చెమ్మగిలాయి మీనాక్షికి.

“సరే అమ్మా! నేను వెళ్ళి భోజనానికి ఆర్డర్ చేసి వస్తా“ అని తల్లికి చెప్పి, కిరణ్ తో, “ఒరేయ్ కిరణ్! ఈ వేళ నువ్వూ సుమతీ మాతోపాటు భోజనం చేస్తున్నారు. సరేనా” అంటూ మరి ఆలస్యం చెయ్యకుండా వేలెట్ చేత్తో పట్టుకుని మేడ దిగి క్రిందకి వెళ్ళిపోయాడు జీవన్. కిరణ్ తో కబుర్లు చెపుతూ కూర్చుంది మీనాక్షి.

మరో పది నిముషాలు కూడా గడవక ముందే, ఉట్టి చేతులతో తిరిగివచ్చిన కొడుకును చూసి ఆశ్చర్యపోయింది మీనాక్షి.

తల్లి ఆశ్చర్యం చూసి జీవన్ చిన్నగా నవ్వి, “సుమతి తెస్తానందమ్మా! వండినవన్నీ అయ్యిపోవచ్చాయిట. కౌంటర్ శరభయ్యకు అప్పగించి, పదార్ధాలు మనకోసం వేడిచేసి తెస్తానంది. నువ్వు తనకోసం మైసూర్పాక్ దాచి ఉంచావని చెప్పేశా. పని తొందరగా పూర్తిచేసి యిట్టే వచ్చేస్తానంది. ఇంక ... శరభయ్యకు కూడా చెప్పేశా; నీ కూతురు పెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతుంది, నువ్వేమీ దిగులు పడొద్దని. వచ్చి అమ్మని కలుసుకో, ఆమె నీకు అంతా వివరంగా చెపుతుంది - అని కూడా చెప్పానమ్మా! మనిషి పాపం, చాలా డీలాపడి ఉన్నాడమ్మా! ఎంత ముందుగా చెపితే అంత మంచిది, దిగులుతగ్గి సంతోషంగా ఉంటాడనిపించిందమ్మా, అందుకే చెప్పేశా” అన్నాడు.

“అబ్బో! ఇట్టే వెళ్ళి, అట్టే వచ్చావుగాని చాలా పనులే చక్కబెట్టుకొచ్చావన్నమాట” అంటూ చిన్నగా నవ్వాడు కిరణ్.

మీనాక్షి కూడా నవ్వి, “మంచి పని చేశావ్” అని కొడుకుని అభినందించి, ఆపై భోజనాలకు ఏర్పాట్లు చెయ్యడానికి లేచింది.

“అమ్మా! మరోమాటుంది, నీతో చెప్పాలి ... మన జగన్నాధం తాతయ్యగారి మనుమరాలు – స్రవంతి, నీకు గుర్తుంది కదూ! ఆమె ఇప్పుడు మా ఆఫీసులోనే, మా గ్రూప్ లోనే పనిచేస్తోంది. మనకు దగ్గరలోనే పక్క ఊరిలోనే ఉంది.”

మీనాక్షి మొహం ఆనందంతో విప్పారింది. కొడుకింకా మాట పూర్తి చెయ్యక ముందే, “ఏమిటీ! ఆ బంగారు తల్లి ఇప్పుడు ఇక్కడే ఉందా! చూడాలని ఉందిరా! నీకు కనిపిస్తే ఒకసారి మనింటికి, నాకోసం రమ్మన్నానని చెప్పు” అంది ఆనందంగా.

“రేపు తాతయ్య పుణ్యతిధికి భోజనానికి పిలుద్దాం. తప్పక వస్తుంది. లక్కీగా ఆరోజు ఆదివారం అయ్యిoది కూడా!”

“పాపం! తాతయ్య ఎప్పుడూ మనుమల్ని తలుచుకుని, “చూడాలని ఉంది” అంటూ బాధపడే వారు, నీకు గుర్తుందా? రేపటి సంతర్పణలో ఆమెను అతిధులకు పరమాన్నం వడ్డించమందాము. తాతయ్య ఆత్మ సంతోషిస్తుంది. ఆ అమ్మాయి తప్పకుండా వచ్చేలా చూడు” అంటూ చెమర్చిన కళ్ళను కొంగుతో తుడుచుకుంది మీనాక్షి.

ఆమె ఉద్వేగాన్ని చూసి ఆ కన్నీటికి కారణం ఏమిటో తెలియని కిరణ్ ఆశ్చర్యబోయాడు. కారణం తెలిసి ఉన్న జీవన్ హృదయం తల్లి ఎడల ఆర్ద్రతతో నిండిపోయింది. అంతలో సుమతి రెండు పెద్ద పెద్ద కేరేజిలతో భోజనం పట్టించుకుని వచ్చింది.

*      *       *

చదువుతున్న పుస్తకం మనసుని ఆకట్టుకోడంతో, చాలా రాత్రివరకూ దాన్ని చదువుతూ నిద్రమర్చిపోయింది స్రవంతి. దానిని పూర్తిచేసి పడుకునీ సరికి రాత్రి రెండయింది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల లేవడానికి తొందరేం లేదని, టయిం ఎనిమిది దాటుతున్నా ఇంకా గాఢనిద్రలోనే ఉంది స్రవంతి.

రాత్రి టీపాయ్ మీద ఉంచిన సెల్ ఫోన్ రింగయింది. అలా ఎడతెగకుండా ఫోన్ మ్రోగుతూండడంతో స్రవంతికి నిద్రాభంగం అయ్యిoది. బలవంతంగా కళ్ళు తెరిచి దుప్పటీ ముసుకులోనుండి తల రవంత ఇవతలకి పెట్టి, చెయ్యిచాపి ఫోన్ అoదుకుని, “హవ్వో! ఒవ్వరు” అంది నిద్దరమత్తులో, బద్ధకంతో ఒళ్ళు విరుచుకుంటూ. ఇంకా మత్తు వదలక పోవడంతో మాట ముద్దగా వచ్చింది.

“సావీ! నేనేనే, సిరిని“ అంది ఆవలి వ్యక్తి ఆర్తనాదం లాంటి ఎలుగుతో. ఆపై ఏడుపు వినిపించింది ఫోన్లో.

శిరీష వెక్కివెక్కి ఏడుస్తోంది. ఆమె కంఠాన్ని గుర్తుపట్టిన స్రవంతికి పై ప్రాణాలు పైకే పోయాయి. నిద్రమత్తు పూర్తిగా దిగిపోయింది. ఉలిక్కిపడి అదాటుగా లేచి కూచుంది స్రవంతి. “ఏమిటే సిరీ! ఏమయ్యింది నీకు” అని అడిగింది కంగారుపడుతూ.

“ఈ వేళ క్రానికిల్ లో ఒక వార్త వచ్చింది చూశావా?” ఏడుపు గొంతుకతో అడిగింది శిరీష.

“క్రానికిలా! నా తలకాయేమీ కాదూ! ఇప్పుడే నిద్ర లేచా. ఇంకా మంచం దిగలేదు. నీ ఫోనే నన్ను నిద్రలేపింది. ఇంతకీ ఏమయ్యిందే, అంతలా ఏడుస్తున్నావు? నిన్నoతలా భయపెట్టిన ఆ వార్త ఏమిటిట!”

“సారీ సావీ! నిన్ను మంచి నిద్రలో ఉండగా లేపేసినట్లున్నా! ఆ వార్త చూడగానే నా పై ప్రాణాలు పైకే పోయాయంటే నమ్ము! ఒళ్ళు తెలియలేదు, సారీ! నాకు చాలా భయంగా ఉంది. నీకు పుణ్యముంటుంది, వెంటనే బయలుదేరి నా దగ్గరకు రావే, అన్నీ చెపుతాను. నీకు చెప్పాల్సినవి చాలా విషయాలున్నాయి. అవన్నీ ఫోన్లో చెప్పలేను” అంది శిరీష దిగులు నిండిన స్వరంతో.

కాదనలేకపోయింది స్రవంతి. “సరే! నేనింకా పళ్ళయినా తోముకోలేదు. తొందరగా తెమిలి, ఒక్క అరగంటలో అక్కడ ఉంటాను. బై” అంటూ ఫోను పెట్టేసింది.

శిరీష మాటల్నిబట్టి ఆమె కేదో పెద్ద కష్టమే వచ్చిందని గ్రహించింది స్రవంతి. శిరీష వట్టి పిరికిది. నీడను చూస్తే కూడా భయపడే రకం. తను అక్కడకి వెళ్ళే వరకూ ఆమె ధైర్యంగా నిలబడాలంటే కొంత ధైర్యం నూరి పొయ్యవలసి ఉంది - అనుకున్న స్రవంతి ఫోన్ అందుకుంది మళ్ళీ.

“సిరీ! పేపర్లో వచ్చే వార్తల్ని చదివి, అవన్నీ నిజాలనుకోవద్దు. పేపర్ సర్క్యులేషన్ పెంచడానికి కొన్నివార్తల్ని కల్పిoచి కూడా రాస్తారుట! మరి కొన్నింటిని “గోరంతల్ని కొండంతలుగా” చేసి ప్రచురిస్తారుట! అలాంటివన్నీ చదివేసి, ఆపై సింపుల్గా ఊరుకోవాలేగాని, మనసుకి పట్టించుకోకూడదు. ధైర్యంగా ఉండు. వచ్చేస్తున్నా.”

“అసలుసంగతి తెలియకుండా ఏవేవో మాటాడెయ్యకే సావీ! వస్తున్నావుగా, అంతా చెపుతా, విని ఆపై మాటాడుదువుగానిలే ” అంటూ ఫోన్ పెట్టేసింది శిరీష.

“అరగంట” అందిగాని అంతకంటే రవ్వంత ముందుగానే శిరీష ఇంటికి చేరింది స్రవంతి. తలుపు చప్పుడు విన్న శిరీష “మేజిక్ ఐ“ లోంచి తొంగిచూసి మరీ తలుపు తీసింది. స్రవంతి లోనికి రాగానే తలుపుమూసి గడియవేసేసి, స్నేహితురాలిని కౌగిలించుకుని భోరున ఏడ్చింది శిరీష. ఆమెకు అంత కష్టం ఏమొచ్చిందో తెలియని స్రవంతి నిర్ఘాంతపోయింది. కొంతసేపలా ఏడ్చి, సద్దుకుని, పేపర్ తీసి చూపించింది ఆ దుర్వార్త! ఆ వార్త చదివి అంది స్రవంతి...

“ఎంత ఘోరం! వాడెవడో మామూలువాడు కాదు, సైకో అయినా, శాడిస్టయినా అయ్యి ఉండాలి. పాపo! ఎంతో విలువైన  ఒక నిండు జీవితాన్ని పొట్టన పెట్టుకున్నాడు. ప్రేమించానని చెప్పడానికి వాడికి ఎంత హక్కుందో, తాను ప్రేమించడం లేదని చెప్పడానికి ఆ అమ్మాయికీ అంత హక్కుటుంది కదా! ప్రేమించడం కుదరదన్నంత మాత్రంలో ఇంత అన్యాయం చేస్తాడా? ఎంత ఘోరం! తననలాగే ఏ అమ్మాయయినా “ప్రేమించా” నంటూ వెంటపడితే, ఇష్టం లేకపోయినా కూడా తను ఒప్పేసుకుంటాడా ఏమిటి? “నో” చెప్పాడని, ఆ అమ్మాయి వీడి మొహం మీద యాసిడ్ పోస్తే! అప్పుడు తెలుస్తుంది బాధ అంటే ఏమిటో! వీడు చేసిన పనికి, వికృతంగా మారిన మొహాన్ని చూసుకుని, భరించలేక ఆ అమ్మాయి నిరాశతో ఆత్మహత్య చేసుకుందంటే, మానసికంగా కూడా ఎంతో బాధపడి ఉంటుంది, పాపం! ఆ అమ్మాయి చావుకి కారణమైనందుకు హత్యా నేరం మీద వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది కదాని, ఆ అమ్మాయికి పోయిన ప్రాణo తిరిగి వస్తుందా?”

“అంతలా ఎక్సైట్ అవ్వకే స్రవంతీ! నువ్వు వినవలసింది ఇంకా చాలా ఉంది. ఎవరో ముక్కూ మొహం తెలియనివాళ్ళకు వచ్చిన కష్టానికే ఇంతగా బాధపడుతున్నావు అంటే, ఇక అదే కష్టం నా కొస్తే ... ” అంటూ భోరున  ఏడ్చింది శిరీష.

“ఏమిటీ! నీకా... ? నీ కిలాంటి కష్టమేమిటే! పగవాళ్ళకు కూడా వద్దనుకోవలసిన దుర్దశ ఇది!”

“ఒక సమస్యకు పరిష్కారం దొరికిందనుకుంటే మరో సమస్య తలెత్తింది. నానీ, నేనూ కలిసి బ్రతకడమన్నది మా మొహాన రాసి లేదు కాబోలు” అంటూ మరింతగా ఏడ్చింది శిరీష.

“నానీ ఎవరు సిరీ? సారీ! ఏడవకు, ఎటువంటి సమస్యకైనా ఒక పరిష్కారం ఉండకపోదు, దానికోసం వెతుకుదాము” అంటూ స్నేహితురాలిని ఓదార్చాలని చూసింది స్రవంతి.

కొంతలో కొంత తెప్పరిల్లి చెప్పసాగింది శిరీష. “నానీ అంటే మరెవరో కాదు నరేంద్ర! ముద్దుపేరు నానీ! నాకోసం ఈ ఉరు వచ్చినప్పుడు నరేంద్రను నువ్వు చూశావు కదా. ఇంతవరకూ నీకు అసలు సంగతి చెప్పలేదు. అతడు నాకు ఫ్రెండు మాత్రమేకాదు, “వుడ్ బి”కూడా. నానీ నేనూ ఒకే ఊరివాళ్ళం. రెండు కుటుంబాలూ ఒకరికొకరం బాగా తెలిసిన వాళ్ళం. నానీ నేనూ చిన్నప్పటినుండే కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం, వయస్సు పెరిగాక ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. కాని కులాలు వేరు కావడంతో అటూ - ఇటూ కూడా పెద్దవాళ్ళు ఎవరూ మా పెళ్ళికి ఒప్పుకోలేదు. చివరకు వాళ్ళ ప్రమేయం లేకుండా, నానీకి ఉద్యోగం రాగానే, స్వతంత్రించి మా పెళ్లి మేమే చేసుకోవాలనుకుంటున్నాము. ఆ సుముహూర్తంకి ఇక ఎన్నోరోజులు లేవని ఎంతో సంతోషంగా ఉన్నాము. అంతలో ఈ ఉపద్రవం ... “ మాట పూర్తిచెయ్యలేక ఏడ్చింది శిరీష.

స్రవంతి తెల్లబోయింది. “ఉపద్రవమేమిటబాబూ… ఇంతవరకు నువ్వు చెప్పినదానిలో ఉపద్రవమెక్కడుంది! నాకేమీ అర్ధమవ్వదాములేదు” అంది. ”శిరీష పక్కన చేరి, బుజం చుట్టూ చెయ్యివేసి, ఓదార్పుగా దగ్గరకు తీసుకుంది స్రవంతి.

స్నేహితురాలి భుజంపై వాలి సేదదీరిన శిరీష మళ్ళీ చెప్పదొడగింది. “ఇన్నాళ్ళూ గొడవ చెయ్యడం ఎందుకని ఎవరికీ చెప్పలేదు - మన కొలీగ్ ప్రదీప్ లేడూ ... వాడే నాపాలిట విలన్. కాస్త వీలు దొరికితే చాలు “ఐ లవ్ యూ” అంటూ నా వెంట పడుతున్నాడు. నేను ”నో” చెప్పినప్పుడు అతని కళ్ళల్లో కనిపించే కసి, కోపం చూస్తే నాకు చాలా భయమవుతుంది. కాని ఏమీ పట్టిoచుకోనట్లుగా ఉండిపోయా నింత వరకు. నిన్న ఒంటరిగా మెట్లు దిగితూంటే ఎదురుగా వచ్చాడు. దారికి అడ్డంగా నిలబడి మళ్ళీ, “ఐ లవ్ యూ” అన్నాడు. “నా పెళ్ళి నిశ్చయమైపోయింది, నన్నిలా బాధపెట్టడం భావ్యం కాదు “ అన్నా. “మనసు మార్చుకో” అన్నాడు. కుదరదు, కమిటైపోయా” అన్నా. వెంటనే అతడు నావైపు కోపంగా చూస్తూ, "ఈ ప్రదీప్ అంత దద్దమ్మేమీ కాడు, నాకు దక్కని సిరి మరెవరికీ దక్కనీను” అంటూ నాకు దగ్గరగా వచ్చాడు. నా పై ప్రాణాలు పైకే పోయాయి. అంతలో నా పుణ్యం బాగుండి, మెట్లమీద ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. దాంతో నన్నొదిలి గబగబా మెట్లెక్కి వెళ్ళిపోయాడు. అది మొదలు ఎప్పుడు ఏం చేస్తాడోనన్న భయంతో లోలోన ఒణికి చచ్చిపోతున్నానంటే నమ్ము! అసలే ఒణికిపోతూంటే, తెల్లారేసరికి పేపర్లో ఇదీ వార్త! ఇక భరించలేకపోయా. దిక్కుతోచక, నీకు ఫోన్ చేసి నిన్నుకూడా బాధపెట్టా, నన్ను క్షమించవే సావీ! ఇక్కడ నా కష్టసుఖాలు షేర్ చేసుకొనేందుకు నాకని నువ్వుకాక మరెవరున్నారు చెప్పు” అంది.

“నీ మొహంలే! నిన్ను క్షమిoచాలా? ఫ్రెండ్సు అన్నాక ఆపాటి సాయం కూడా చెయ్యలేదంటే అది ఫ్రెండ్ షిప్ కే అవమానం. సరే, మరి ఇప్పుడేంచేద్దాం మనం? మీ వాళ్లకు చెపితే ... ”

“వంక దొరికింది కదాని వెంటనే ఉద్యోగం మానిపించి నన్ను ఇంటికి తీసుకుపోతారు. వాళ్ళకసలు నేను ఉద్యోగం చెయ్యడమే నచ్చదు. అక్కడితో నానీ, నేనూ వేసుకున్న ప్లాను ఖతం!”

“పోనీ, నానీకి చెపితే?”

“చదువుమాని వచ్చేస్తాడు. పాండిచేరీ జిప్మెర్ లో కార్డియాలజీ MD చేస్తున్నాడు. కొద్దిరోజుల్లో చదువు పూర్తవుతుంది. నానీకి మంచి ఉద్యోగం ఉంటేగాని మేము జీవితంలో స్థిరపడలేము కదా!. ఇవన్నీ నేనూ ఆలోచించా. చివరకు ఏదారీ సరైనదిగా కనిపించలేదు. అందుకే ... ” అంటూ మళ్ళీ వెక్కి వెక్కి ఏడవసాగింది శిరీష.

“సిరీ! అంతలా ఏడవకురా... ఏడ్చి సాధించేది కాదిది. సమస్య మనల్ని భయపెట్టినప్పుడు పరిష్కార మార్గం ఏదైనా ఉందేమో వెతికి చూడాలి గాని, ఇలా బేలగా ఏడుస్తూ కూచుంటే ఎలాగమ్మా! ఈ వేళ మనం ఈ విషయం మన ప్రాజెక్టు లీడర్కి చెప్పి, అతని సలహా అడుగుదాం. అతను మనకి ఏదైనా ఒక పరిష్కారమార్గం సూచించగలడన్న నమ్మకం నాకుంది. రేపు తొందరగా తయారయ్యి, ఆఫీసు వేళకు కొంచెం ముందుగానే వెడదాము. రేపు మనం పొయ్యి వెలిగించవద్దు, కేంటీన్ మీద పడదాం. గురుడు వచ్చే వేళకి మనం అక్కడ ఉండాలి కదా” అంది స్రవంతి.

*      *      *

జీవన్ ఇంటికివచ్చి, బైక్ కి స్టాండు వేసి, తలెత్తి చూసేసరికి శ్రీ జననీ ఆఫీసు రూంలో లైటు వెలుగుతూ కనిపించింది. వెంటనే అటు వెళ్ళాడు జీవన్, కిరణ్ ని కలుసుకుని చాలా రోజులవ్వడంతో ఒకసారి చూడాలనిపించింది.

జీవన్ వెళ్లేసరికి కిరణ్ కొన్ని ఫైళ్ళు ముందుంచుకుని సరిజూస్తున్నవాడల్లా జీవన్ ని చూసి, గమ్మున లేచి, కూర్చోమని తన కుర్చీ చూపించాడు జీవన్ కి.

కాని ఆ కుర్చీలో జీవన్ కూర్చోలేదు. టేబులుకి ఎదురుగా ఉన్న విజిటర్సు కూర్చునే కుర్చీలో కూర్చుంటూ, “ఆ కుర్చీని మరీ అంత లోకువ చెయ్యకురా కిన్నూ! అది శ్రీ జననీ వారి మేనేజింగ్ డైరెక్టర్ సీటు. అది ఆయనకు మాత్రమే సొంతం” అంటూ, ఒక ఫైల్ ముందుకు లాక్కుని లెక్కలు సరిచూడసాగాడు జీవన్.

కొడుకు రావడం చూసి, మీనాక్షి రెండు కప్పుల కాఫీ ట్రేలో ఉంచుకుని తీసుకువచ్చి ఇద్దరికీ చెరో కప్పూ ఇచ్చింది. ఇంత అభివృద్ధి సాధించినా కూడా ఆమె ఏ డిజైనూ లేని తెల్లని చీరతో, ఏ అలంరమూ లేకుండా, తన పూర్వసువాసినీ నిరాడంబర వేషంలోనే ఉంది. చూసీ చూడగానే వెనకటికీ, ఇప్పటికీ ఆమెలో ఏ మార్పూ కనిపించదు. కాని జాగ్రత్తగా పరికించి చూస్తే మాత్రం ఆమె కళ్ళలో మన కిప్పుడు సంతృప్తి వల్ల వచ్చిన కాంతి కనిపిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించిన ఆనందం అది. ఏ కొడుకు అభివృద్ధికోసం తను అహోరాత్రాలు కృషి చేసిందో, ఆ కొడుకు ఈ నాడు తనకు తగిన పొజిషన్లో ఉన్నాడు. అంతకంటే ఆమె కింకేమి కావాలిట! ఎడమ చేత్తో కాఫీ కప్పు పట్టుకుని ఒక్కొక్కగుక్కెడు కాఫీ తాగుతూ, కుడిచేత్తో పెన్ను పట్టుకుని చకచకా కాగితాలు తిప్పుతూ ఫైళ్ళు చూస్తున్న కొడుకువైపు మెరిసే కళ్ళతో మురిపెంగా చూసింది మీనాక్షి.

జీవన్ కి హఠాత్తుగా గురుతొచ్చి అడిగాడు తల్లిని, “అమ్మా! యాజులు తాతయ్య ఏదో చెప్పారన్నావు, ఏమిటది?”

“అదే! నీకు పెళ్ళి సంబంధం చెప్పారు. వాళ్ళ బంధువుల అమ్మాయి ఉందిట! నువ్వు సరేనంటే త్వరలో పెళ్ళిచూపులకు వాళ్ళింట్లోనే ఏర్పాటు చేస్తానన్నారు. వాళ్లకి ఇద్దరు కొడుకుల మధ్య ఒక్కర్తే కూతురుట! పిల్ల బోలెడు ఆస్తితో వస్తుందిట! నీతో సంప్రదించి, తొందరగా ఏమాటా చెప్పమన్నారు.”

చేతిలోని పెన్ను టేబులుమీద ఉంచి, రెండు చేతులు గుండెలమీద ఉంచుకుని భయం నటిస్తూ, “అమ్మో! కొంపతీసి ఆ కోతిపిల్ల కోవిద కాదు కదా... “ అన్నాడు జీవన్.

మీనాక్షి చిన్నగా నవ్వి, “ఏమో! అయినా అవ్వొచ్చు! ఇంకా నాకు ఏ వివరాలూ చెప్పలేదు వాళ్ళు” అంది.

“కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలని పెద్దవాళ్ళు చెప్పినది ఉత్తిమాట కాదమ్మా! మనకి మనలాంటి వాళ్ళే తగినవాళ్ళు. భాగ్యవంతులతో వియ్యం మనకు వద్దమ్మా... అయినా ఇప్పుడే అంత తొందర పడవలసిన అవసర మేమీ లేదమ్మా!”

ఫైళ్ళు చూస్తూ ఆ తల్లీ కొడుకుల మాటలు వింటున్న వాడల్లా, కిరణ్ ఫైళ్ళ లోంచి తలపైకెత్తి, వాళ్ళని చూస్తూ, “వాడలా ఊరికే అంటున్నాడు. అమ్మా! ఆ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. అవన్నీ ఉత్తుత్తి మాటలు. వీడికి పెళ్లీడు వచ్చింది. ఈ మధ్య వీడు అస్తమానూ, ఏకబిగిని అమ్మాయిల కబుర్లే చెపుతున్నాడు, తెలుసా... “ అంటూ జీవన్ వైపు చూసి కొంటెగా కన్ను కొట్టాడు.

జీవన్ గమ్మున లేచి, “ఒరేయ్ కిరణ్! నిన్నసలు బ్రతకనివ్వకూడదురా! ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పటినుండి మొదలుపెట్టావు? ఉండు, నీ పనిచెప్తా” అంటూ పెన్నుని, కిరణ్ ని కొట్టడానికి అన్నట్లుగా ఎత్తి పట్టుకున్నాడు.

కిరణ్ తన చేతిలోని పెన్ను టేబులు మీద ఉంచి, దెబ్బను కాసుకుoటూన్న వాడిలా రెండు చేతులూ తలకి అడ్డం పెట్టకుని ఘోల్లుమన్నాడు, “అమ్మా! శరణు, శరణు! వీడు నన్ను చంపెయ్యకుండా నువ్వే కాపాడాలమ్మా “ అన్నాడు, వాళ్ళనే చూస్తూ ముసి ముసిగా నవ్వుకుంటూ నిలబడ్డ మీనాక్షివైపు తిరిగి దోసిలిపట్టి .

జీవన్ కూడా తల్లివైపు తిరిగి, “ వీడి మాటలు నమ్మకమ్మా! ఈ కిన్నూగాడు ఈమధ్య బొత్తిగా చెడిపోయాడు. మహబాగా అబద్ధాలు చెప్పడం నేర్చాడు. వీడి మాటల్ని అస్సలు నమ్మ కూడదు. వీడికీ నాకూ కూడా ఒక్కసారి కలుసుకుని పలకరిoచుకోడానికి తీరిక దొరకటంలేదు ...  అల్లాంటిది తీరికగా అస్తమానం, ఏకబిగిని పోచికోలు కబుర్లు చెప్పుకున్నామంటే నువ్వు ఎలా నమ్ముతావమ్మా?”

మీనాక్షి రెండు చేతులతోనూ చెవులు మూసుకుని, “ఆపండిరా బాబూ, మీ అల్లరి! కాస్త నన్నుకూడా రెండు ముక్కలు మాటాడనీయండి, మీకు పుణ్యముంటుంది” అని అరిచి చెప్పింది.

అక్కడితో మిత్రు లిద్దరూ మౌనం వహించారు. మీనాక్షి మాట్లాడసాగింది, “కిరణ్! నాకు తెలుసురా, వీడికి పెళ్లీడు వచ్చిందని. ఆ విషయంలో నాకూ తొందరగానే ఉంది. వీడికి పెళ్ళి చెయ్యాలనే ఉద్దేశంతోనే తెలిసిన వాళ్ళకి నలుగురికీ చెప్పా, “మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా మా అబ్బాయికి తగిన అమ్మాయి ఉంటే చెప్పండి” అని. తగిన పిల్ల దొరకగానే సన్నాయి మేళం  మ్రోగుతుంది. ఇంక ఎక్కువ రోజులు పట్టదు, కాని కొద్ది రోజులు ఓపిక పట్టాలి మనం, తప్పదు” అంది మురిసిపోతూ.

వెంటనే కిరణ్ అందుకుని, “ఔను! ఏ వయసుకి తగిన అందం ఆ వయసులో ఉండాలమ్మా...” అంటూ దీర్ఘం తీశాడు.

“ఇక ఆపండి” అంటూ కేకపెట్టాడు జీవన్. “ఇదిగో, చెపుతున్నా వినండి, నా పెళ్ళిగురించి ఇకనుండే  ఎవ్వరూ మాటాడ వద్దు. అది పూర్తిగా నా స్వవిషయం. సమయం వచ్చినప్పుడు నేనే చెపుతా మీకు, అంతవరకూ ఆగండి. ఇప్పుడప్పుడే నాకు పెళ్ళిచేసుకోవాలని లేదు. మీరు నేను చెప్పేవరకు ఆగితే బాగుంటుంది” అన్నాడు.

మీనాక్షి, కిరణ్ అవాక్కై స్థాణువుల్లా నిలబడిపోయారు. మీనాక్షికి రవంత కోపం కూడా వచ్చింది. కొడుకువైపు తీక్షణంగా చూసింది. వెంటనే ఖాళీ ఐన కాఫీ కప్పులు తీసి ట్రేలో ఉంచి తల్లికి అందిస్తూ జీవన్ మళ్ళీ తనే మాట్లాడాడు, “అమ్మా! అటువంటి మాటలకి ఇది తగిన సమయం కాదమ్మా! ఈ అక్కౌoట్ల పని తొందరగా ముగించి, వీడిని ఇంటిదగ్గర దిగవిడిచి రావాలి. సుమతి వీడికోసం ఎదురుచూస్తూ, భోజనం చెయ్యకుండా కూర్చుంటుంది. నేనామెకు కోపం తెప్పిoచ కూడదు, కదమ్మా! కోపం వస్తే ఆమె తన బేబీని నన్ను ఒక్కనాటికి కూడా ఆడించనియ్యదు” అన్నాడు.

మీనాక్షి ఏమీ మాటాడకుండా, ఖాళీ కప్పులు తీసుకుని వెళ్ళిపోయింది. మిత్రులిద్దరూ సీరియస్ గా పనిలోపడ్డారు.

*     *     *

లంచ్ అవర్లో, ప్రోజెక్టు లీడర్ జీవన్ గదిలోకి ప్రవేశించిన స్రవంతి, “హై, హై నాయకా!” అంటూ నవ్వుతూ అతనికి అభివాదం చేసింది.

లంచ్ అవర్ కావడంతో, లంచ్ బాక్సు ఓపెన్ చేస్తున్న జీవన్, చేస్తూన్న పనిని ఆపి, వింతగా చూశాడు ఆమెవైపు. “ఏయ్, కొంటెకోణoగీ! జనం జడుసుకునీలా ఏమిటా గావు కేకలు” అన్నాడు మందలింపు ధోరణిలో.

“హా! హతవిధీ! తెలుగువాళ్ళకే తెలుగు తెలియకుండా పోతే, ఇక తెలుగు భాషకు వెలుగు ఎక్కడనుoడి వస్తుందిట! ఇoక ఈ భాషని ఆ భగవంతుడే కాపాడాలి” అంటూ కొంటెగా నిట్టూర్చింది స్రవంతి నాటకీయంగా.

“మరీ బాగుంది, ఇదేమి ఆరోపణ” అంటూ విసుక్కున్నాడు జీవన్.

“ఆరోపణా? కాదు, కాదు! నాయకా! ఇది ఆరోపణ ఎంత మాత్రమూ కాదు, అసలు సిసలైన యదార్ధం, అంటే - నిజం! “హలో బాస్!” అన్న మాటనే నేను మ్లేచ్ఛభాషనుండి మాతృభాషలోకి తర్జుమా చేసి “హాయ్ హాయ్! నాయకా”  అన్నాను, అది తప్పా! అంతలోనే నన్నన్నిమాటలనాలా ఏమిటి !” కోపంవచ్చిన దానిలా మూతి ముడుచుకుంది స్రవంతి. జీవన్ వైపు తీక్షణంగా చూడాలనుకుంది, కాని అది ఆమెకు చేతకాలేదు. కొంటె నవ్వును ఆమె పెదవులు దాచలేకపోయాయి.

అది కనిపెట్టిన జీవన్ , ”అంత కష్టపడొద్దులే, తప్పు నాదేనని ఒప్పేసుకుoటున్నా. కాని ఇక్కడ నీ తప్పు కూడా ఉంది, నువ్వనుకున్నట్టుగా నువ్వన్నమాట తెలుగేం కాదు, సంస్కృతం! తెలుగుభాషలో సగానికి సగం పైగా ఆక్రమిoచి ఉంది సంస్కృతం. అలా రెండు భాషలు కలిసి ఉంటే దానిని "మణిప్రవాళము" అంటారు. అది చాలక - ఉన్నకర్మకు ఉపకర్మ కూడా తోడయ్యిoది - అన్నట్లుగా, ఇప్పుడు మరో మ్లేఛ్చ భాషయైన  ఇంగ్లీషు కూడా వచ్చి చేరింది మన భాషలో. ఇక మనం దీనిని ఏమనాలో …! బహుశ: దీని నిప్పుడు “మణిప్రవాళమౌప్తిక” భాష - అనడం బాగుంటుందేమో - పండితుల్ని అడగాలి. తెలుగుభాషని ఉద్ధరించడం - అంటే, అంత తేలికపని కాదు! వాగనుశాసనుడైన నన్నయ్య మళ్ళీ పుట్టాలి! భాషను క్షాళనం చెయ్యడం అన్నది మాటలతో జరిగే పనా ఏమిటి? మన తెలుగు వాళ్ళందరూ కూడి సమిష్టిగా ఎంతో కృషి చెయ్యవలసి ఉంది. ఇక  ఐకమత్యం - అన్న పేరు వింటేనే చాలు హడిలిపోయి ఆమడ దూరం పారిపోయే మనవాళ్ళు కలిసికట్టుగా పని చెయ్యడం అంటే ముందుకు వస్తారా, ఏమో! నాకు వస్తారన్న నమ్మకం కుదరడం లేదు” అన్నాడు జీవన్ పెదవి విరిచి, భుజాలెగరవేస్తూ.

“ఓకే సర్! మీ బాధ నాకు అర్థమయ్యింది. దాని సంగతి తరవాత ఆలోచిద్దాము గాని బాసూ! “ఫస్టు థింగ్స్ ఫస్టు” అని ఎవరో ఎప్పుడో అన్నారని గుర్తు! అందుకని మనం ఇప్పుడు లంచ్ బాక్సుల పని ముందుగా చూద్దాం. బై ది బై! ఈ వేళ నా బాక్సు మొత్తం నేను స్వయంగా చేసిన వంటలే! శ్రీ జననీ ప్రోడక్ట్సులోది ఒక్కటి కూడా లేదు” అంటూ బ్యాగ్ లోంచి లంచిబాక్సు బైటికి తీసి మూత తెరిచింది స్రవంతి. వెంటనే గదిలోని గాలి వంటకాల వాసనలతో ఘుమఘుమ లాడిపోయిoది.

అవి జీవన్ కి ఇష్టమైన వంటకాలు కావడంతో ఆ పరిమళం అతనిని ఆకట్టుకుంది. ఊపిరి గట్టిగా పీల్చి, “ఇంత అట్టహాసంగా ఘుమఘుమ లాడిపోతున్నాయి, ఏమేం వండావేమిటి” అని అడిగాడు.

“మువ్వోoకాయల గుత్తికూర, కొబ్బరికాయ మామిడికాయా కలిపి చేసిన పచ్చడి - అంతే!”

“అవి రెండూ కూడా నాకు చాలా ఇష్టం” అనకుండా ఉండలేకపోయాడు జీవన్.

స్రవంతి మనసులో అనుకుంది. “నాకది తెలుసు, అందుకే కదా వాటిని పనికట్టుకుని వండి ఇక్కడకు తెచ్చింది. “ఎనీ మాన్సు హార్ట్ తౄ హిస్ స్టమక్” అన్నారు కదా! అదే నా ఆశ” అనుకుంది మనసులో. కాని, పైకి మాత్రం “ఐతే మనం బాక్సులు మార్చేసుకుందామా” అని అడిగింది ఏమీ ఎరగనట్లు.

“బాక్సులు మార్చుకోడం ఎందుకు? షేర్ చేసుకోవచ్చుకదా?”

“ఇంటిదగ్గర ఇంకా కొంత మూతపెట్టుకుని వచ్చా, రాత్రి తినడానికి. అవి నేను తింటా కదా! ఇంతకీ అమ్మ ఏం వండారేమిటి” అని అంటూ చనువుగా జీవన్ లంచ్ బాక్సు తీసి చూసింది. “హాయ్! అమ్మ చేసిన గోoగూరపప్పు, దానిలో నంచుకునేందుకు దోసావకాయ! ఇవి నాకెంతో ఇష్టం” అంటూ చొరవగా ఆ బాక్సు తనవైపుకు తీసుకుంది అల్లరి పిల్ల స్రవంతి.

కొంతసేపు ఇద్దరూ మాటాడకుండా భోజనం చేశారు. అంతలో స్రవంతి తలపైకెత్తి జీవన్ వైపు చూస్తూ, “ఇది విన్నావా బాసూ! మనకి అప్పగించిన ప్రాజెక్టుని మనం రికార్డు టైమ్ లో పూర్తి చేశాముకదా! అందుకని, కొత్తగా వచ్చిన ఫారిన్ అస్సైన్మెంట్ కి మన టీములో కొందర్ని లండన్ పంపాలనుకుంటున్నారుట!”

“నీ కది ఎలా తెలిసింది! అదింకా కన్ఫర్ము కాలేదు.”

“గ్రేప్ వైన్ బాబూ, గ్రేప్ వైన్! ఇట్టే పాకిపోతుందది. ఇంతకీ ప్రపోజల్ ఉంది కదా! రేపో మాపో కన్ఫర్మవుతుంది. ఐతే మనలో కొందరికి స్థానచలనం, లోహవిహంగయానం రాసి ఉందన్నమాట!”

“నాకు ఫారిన్ వెళ్ళే ఉద్దేశం ఎంత మాత్రం లేదు, ఇదే నిజమైతే నా బదులు మరెవరినైనా పంపమంటా.”

“అదేమిటి బాసూ! ఎగిరి గంతెయ్యకపోగా మరీ “సిరిరా మోకాలు అడ్డం పెట్టి”నట్లు అలా నెగటివ్ గా మాట్లాడుతున్నావేమిటి!”

“సంతృప్తిని మించిన సిరి ఏదీ లేదు. నాకీ సిరి చాలు. నేను ఫారిన్ వెళ్ళిపోతే మా అమ్మ ఒంటరిదైపోతుంది. మా అమ్మని కనిపెట్టి ఉండడం నా కనీస ధర్మం - అని నా ఉద్దేశ్యం. కన్నతల్లినీ, జన్మ భూమినీ పట్టిoచుకోని వాళ్ళకు పుట్టగతులుండవుట!”

”ఐతే నీ ఆదర్శవాక్యం (matto) “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నమాట!”

“దానిని నోటితో అని తృప్తిపడిపోడం కాదు, ఆచరణలో పెట్టి చూపించాలన్నది నా ధ్యేయం.”

ఇద్దరూ భోజనం ముగించి ఖాళీ బాక్సులకు మూతలు బిగించారు. ఖాళీ బాక్సుల్ని దేని బాగ్ లో దాన్ని ఉంచింది స్రవంతి. కాసేపు విశ్రాంతిగా కుర్చీల్లో కూర్చున్నారు ఇద్దరూ. అప్పుడు జీవన్ ని అడిగింది స్రవంతి ...

****సశేషం****

Posted in August 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!