జీవన్ పనిచేస్తున్న మల్టీ నేషనల్ సాఫ్టువేర్ కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది. కొత్తగా మరికొందర్ని అప్పాయింట్ చేసుకున్నారు. జీవన్ ప్రోజెక్టు మేనేజర్ అయ్యాడు. అతని టీంలో ఆరుగురు ప్రోగామర్లను అతనికి సహాయకులుగా వేశారు. అందులో కొత్తగా చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలూ ఉన్నారు. టీంలో వాళ్ళు ఒకరొకరుగా వచ్చి టీం లీడర్ని పరిచయం చేసుకుని వెడుతున్నారు. అమ్మాయిలు ఆఖరుకి ఉండిపోయారు. ఇద్దరిలో ముందుగా శిరీష వచ్చి తన పరిచయం చెప్పి వెళ్ళింది. ఆఖరుకి స్రవంతి మిగిలింది.
జీవన్ రూమ్ లో ప్రవేశించిన స్రవంతి ఒక్కసారిగా మ్రాన్పడిపోయింది. జీవన్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. “హల్లో సర్! నాపేరు స్రవంతి. నేను పూనా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సు లో MCA చదువుకున్నాను.” అని చెప్పి, “నేను గుర్తున్నానా” అని అడిగింది.
జీవన్ నిర్ఘాంతపోయాడు. ఎంత ఆలోచించినా ఎక్కడో చూసినట్లు అనిపించిందే గాని ఆమె ఎవరో గురుతురాలేదు. ఎక్కడో ఏదో పరిచయం ఉందని లీలగా అనిపిస్తోంది గాని, అంతకు మించి మరేమీ జ్ఞాపకం రావడంలేదు అతనికి. ఒక అందమైన యువతి, లేతతమలపాకులాంటి నేవళీకం ఉన్న అమ్మాయి వచ్చి, అలా “నేను గుర్తున్నానా” అని అడిగితే ఏమనడానికి తోచక తెల్లమొహం వేశాడు జీవన్.
ఏ భావమూ వ్యక్తం చెయ్యకుండా తెల్లకాగితంలా మారిపోయిన అతని మొహం వైపు చూస్తూ “నేను స్రవంతిని, జగన్నాధం తాతయ్యగారి మనుమరాలిని! పోనీలే, ఇప్పుడు గుర్తొచ్చిందా” అంది చిన్నగా నవ్వుతూ..
వెంటనే జీవన్ ముఖంలోకి వెలుగు వచ్చింది. ఆనాటి సంఘటనలన్నీ గుర్తొచ్చాయి. చొరవగా తాతయ్యకు నిజం చెప్పి తనను జైలుపాలు కాకుండా కాపాడినది ఈ పిల్లే నన్నది కూడా జ్ఞాపకం వచ్చింది. అతని మనసు ఆమె ఎడల కృతజ్ఞాతతో నిండిపోయింది. “స – స్స - సారీ! మిమ్మల్ని మర్చిపోడమా! కాని నాకు మీరు కాప్రి, టీ షర్టు, బాబ్డు హెయిర్లలతో ఒక చిన్నపిల్లలాగే గుర్తుండిపోయారు. ఇప్పుడు ఆనవాలు పట్టలేకపోయా! ఐ యాం సో సారీ” అన్నాడు.
అతని మాటలు విని స్రవంతి, ప్రవహించే సెలయేటి గలగలలలా చిరు సవ్వడితో నవ్వసాగింది. జీవన్ ఉడుక్కున్నాడు. “ఎందుకంతలా నవ్వుతున్నారు? నేనన్నదాంట్లో అంత నవ్వు తెప్పించేది ఏముందని? అప్పట్లో మీ రూపం అదేకదా!””
స్రవంతి బలవంతంగా నవ్వు ఆపుకుని, “సారీ బాస్! మీరన్నదాంట్లో నవ్వొచ్చేదేమీ లేకపోయినా, నాకది ఒక నవ్వొచ్చే విషయాన్ని గుర్తుచేసింది. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, “చీమిడి ముక్కు, చింపిరి జుట్టు, చుట్టుకుపోయిన రెండు చిన్నచిన్న పిలకలు ...” అంటూ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది స్రవంతి. ఈ మాటు జీవన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. స్రవంతి రాకకోసం గుమ్మం బయట కనిపెట్టుకుని ఉన్న శిరీష చెవిని పడ్డాయి ఆ నవ్వులు. జీవన్ కి షేక్ హాండ్ ఇచ్చి సెలవు తీసుకుని బయటకు వచ్చింది స్రవంతి.
టీమ్ లీడర్ రూములో నుండి నవ్వుకుంటూ బయటికి వచ్చిన స్రవంతిని చూసి, ఆమెకు అంత సంతోషాన్నిచ్చిన సన్నివేశం ఏమై ఉంటుందో - అనుకుంది శిరీష. స్రవంతి నవ్వాపి తనలో తాను మాట్లాడుకోసాగిoది...
“అప్పటికీ, ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేదు. అదే రూపం, అదే దర్జా! చెక్కిన శిల్పంలా ఎంత ఠీవిగా ఉన్నాడు! అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఒక్క “ఆరా”లో మాత్రమే! దానివల్ల మరింత రాజసంగా ఉన్నాడు. మానవుడిది మంచి ఎక్సర్ సైజ్డు బాడీ కూడా!”
స్రవంతి పైకే మాటాడడం వల్ల శిరీషకు అంతా వినిపించింది. “ఎవర్ని పొగుడుతున్నావు? ఎవరా మానవుడు? ఏమా కథ?” కొంటెగా అడిగింది శిరీష..
“ఇంకెవరు! మన ప్రాజెక్టు లీడరు, అదే - మన బాసు! అతడేకదా మన కథానాయకుడు” అంది స్రవంతి కళ్ళు తిప్పుకుంటూ.
“ఆయన నీకు ఇదివరకే తెలుసా? ఎప్పుడు? ఎక్కడ? ఎలాగ?” ప్రశ్నలవర్షం కురిపించింది శిరీష.
“అబ్బో! అది చాలా పెద్దకథ! ఇప్పుడు చెప్పడం కుదరదు. తరవాత తీరుబడిగా చెపుతాలే.”
“నిజమా?”
“ఒట్టు!”
%%%
ఆవేళ ఆగస్టు 15 కావడంతో అందరికీ సెలవురోజు, ఒక్క కేటరర్సుకి తప్ప. నిజం చెప్పాలంటే పాపం! వాళ్లకి చేతినిండా ఎడతెగని పని పడింది ఆరోజు! స్వతంత్ర దినోత్సవం కదాని స్వేచ్ఛను ఎంజాయ్ చెయ్యడంకోసమని ఊళ్ళోని చాలా కుటుంబాలవాళ్ళు భోజనాలకు ఆ రోజు కేటరర్సు మీద ఆధారపడాలనుకోవడమే దానికి కారణం.
ఆ రోజు జీవన్ ఆఫీసుకి కూడా సెలవే. తీరుబడిగా పొద్దెక్కి లేచి, తలారా స్నానం చేసి, తల తుడుచుకోకుండానే బయటకు వచ్చిన కొడుకుని మీనాక్షి గట్టిగా కోప్పడింది, “అసలే ముసురుపట్టి ఆకాశమంతా నీరోడుతోంది. ఇలాంటి రోజున నువ్విలా నీరుగారే జుట్టుతో ఉంటే నీకు జలుబు చెయ్యదా? ఇలారా” అంటూ పాతికేళ్ళ కొడుకుని జబ్బ పట్టుకుని లాక్కెళ్ళి, కుర్చీలో కూర్చోబెట్టి తన పైట కొంగుతో కొడుకు తల తుడవడం మొదలుపెట్టింది మీనాక్షి.
కేటరింగ్ డిపార్టుమెంట్ వాళ్ళు పోపులు వేస్తున్నారు కాబోలు, వాటి తాలూకు ఘుమఘుమలు పరిసరాలకు వ్యాపించాయి. వెంటనే జీవన్ స్పందించాడు, “అమ్మా! శరభయ్య ఏమేం వండుతున్నాడో గాని వంటింటి ఘుమఘుమలు మహా పసందుగా ఉన్నాయి. సుమతి ఏమి పురమాయించిందో ఏమో! ఈ వేళ నాకు నీ చేతి వంట తినాలనిపించడం లేదు. కొంపదీసి నువ్వు ఈ సరికే వంట - గింటా చేసేసి కూర్చోలేదు కదా!” జీవన్ కంగారు పడుతున్నట్లు నటించాడు.
మీనాక్షి నవ్వింది. “నీ పుణ్యం బాగుందిలే! నేను వంట ఇంకా మొదలెట్టలేదు. గింట మాత్రం ఎప్పుడో, నువ్వింకా లేవకముందే చెయ్యడం ఐపోయింది” అంది కొడుకుకి జవాబుగా.
“మంచిది, అది చాలు. మరింక చెయ్యి కాల్చుకోకు, నాకు ఈ వేళ శరభయ్య వండిన వంట తినాలని ఉంది. శ్రీ జననీ కిచెన్ కౌంటర్ తెరవగానే వెళ్ళి మన భోజనం కొని తెస్తా. సుమతి ఈవేళ ఏమేమి వండించిందో మరి. సరంగు శరభయ్య అయినా చక్రం తిప్పేది సుమతే కదా!“
“శరభయ్య వెనకటి జన్మలో ఏ నలుడో, భీముడో ఐవుంటాడు. ఎంత వంటైనా అవలీలగా ఇట్టే వండేయడమేకాదు, మంచి రుచిగా కూడా చేస్తాడు. అలాంటివాడు మనకు దొరకడం నిజంగా గొప్ప అదృష్టం“ అంది మీనాక్షి.
“నిజమేనమ్మా! ఒక ఐడియా రాగానే సరిపోదు, దాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు తగిన ప్రతిభగల పనిమంతుల తోడు కూడా దొరికినప్పుడే ఆ ఐడియాకి ఒక అందమైన రూపం ఏర్పడి, అది రాణిoపుకి వస్తుoది. అంతే కదమ్మా!“ అన్నాడు జీవన్.
“ఏం చెప్పమoటావూ! ఇప్పుడు శరభయ్య పరిస్థితి తలుచుకుంటే జాలేస్తోంది. కుడితి తొట్టెలో పడ్డ ఎలకలా ఉంది అతని పరిస్థితి. కూతురు పెళ్లి కుదిరిందని మొన్నమొన్న ఎంతో సంతోషంగా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళేవేవో గొంతెమ్మ కోరికలు అదనంగా కోరడం మొదలుపెట్టారుట. పాపం! ఇవ్వకపోతే పెళ్లి కాన్సిలైపోతుంది - అని బెదిరిస్తున్నారుట. పెళ్ళికి డబ్బు సమకూర్చుకోడానికే కష్టమయ్యింది, ఇక ఇప్పుడు వీటికెక్కడ నుండి తేవాలి - అని బాధపడుతున్నాడు. పొద్దున్న నాతో చెప్పి దేవులాడాడు. కొంత డబ్బు అప్పుగా ఇచ్చి, కొద్దికొద్దిగా తనకిచ్చే జీతంలో అప్పు తీరేవరకూ మినహాయించుకుంటూ ఉండమని అడిగాడు. నీతో చెప్పి సాయంత్రానికి ఏమాటా చెపుతానని మాటిచ్చా.”
“బాగుందమ్మా! మనం డబ్బు అప్పుగా ఇస్తే శరభయ్య బాకీ తీర్చగలడన్న నమ్మకం నాకు లేదమ్మా! బహు కుటుంబీకుడు! మొత్తం జీతం ఇంటికి పట్టుకెళ్ళినప్పుడే ఇల్లు గడిచేది అంతంత మాత్రం కదా! అందులో కొంత మనం మినహాయిస్తే ఇక వాళ్ళు ఏమి తిని బ్రతుకుతారు. శరభయ్యకి డబ్బు అప్పుగా ఇవ్వడం నాకు ఇష్టం లేదమ్మా” అన్నాడు జీవన్.
మీనాక్షి తెల్లబోయింది. “అదేమిటిరా! మనం ఇస్తామని ఎంతో ఆశపెట్టుకుని ఉన్నాడురా... మనం ఇప్పుడిలా మొండి చెయ్యి చూపిస్తే... “
“అమ్మా! చెప్పేది పూర్తిగా వినమ్మా. ఒక పిల్ల పెళ్ళికి సాయపడడం కూడా పుణ్యకార్యమే ఔతుంది కదమ్మా? జగన్నాధం తాతయ్య ధర్మనిధి లో నుండి డబ్బు తీసి మనం శరభయ్యకు ఇద్దాం. వేరే ఏ అప్పు చెయ్యకుండానే అతని కూతురు పెళ్ళి జరిగిపోతుంది, ఏమంటావు?”
మీనాక్షి చాలా సంతోషించింది. “నీ ఆలోచన అమోఘంరా కన్నా! నేనిప్పుడే వెళ్ళి ఈ సంగతి శరభయ్యకి చెప్పి వస్తా. బెంగ తగ్గి ప్రశాంతంగా పనులు చేసుకుంటాడు.”
“అక్కడతో అవ్వలేదమ్మా! ఇంకా మాట్లాడాలి నీతో ... తాతయ్య ఛారిటబుల్ ఫండు విషయంలో నాకు ఇంకా ఆలోచనలున్నాయమ్మా! మనం లాభంలో 5% చారిటీకి అనుకున్నాక చారిటీ ఫండ్ చాలా వేగంగా పెరిగింది. ఆ డబ్బుని, ఎవరైనా తెలివైన కుర్రాడికి, డబ్బులేక చదువు ఆగిపోతే ఆదుకుని ఆ కుర్రాడిని పై చదువు చదివించాలని ఉందమ్మా. చదువుకోవాలని ఉండీ చదువుకోలేని పరిస్థితిలో ఆ పిల్లాడు పడే బాధ నాకు తెలుసు. ఇప్పుడు మన కిన్నూ ఉన్నాడు చూడు, వాడుకూడా నాలాగే మంచిమార్కులతో డిగ్రీ తీసుకున్నాడు. కాని ధనాభావం వల్ల అక్కడితో వాడి చదువు ఆగిపోయింది...”
కొడుకు మనసులో ఏముందో మీనాక్షికి తెలిసిపోయింది. “వివాహో విద్యనాశాయ” అంటారు కదురా... రేపోమాపో బిడ్డకు తండ్రి కాబోతూన్న వాడేమి చదవ గలడురా!”
“ఆ మాట అనవలసింది మనం కాదమ్మా, వాడినే అడిగి చూద్దాం. అయినా వాడు తండ్రవుతున్నాడని నీ కెవరు చెప్పారు?” అన్నాడు జీవన్.
“ఎవరూ చెప్పలేదు ఇంకా. సుమతి పొద్దున్న పొద్దున్నే డోక్కుంటూoటే చూశా. ఒక మగనాలి పొద్దున్నే డోకుతోందంటే పట్టి తల్లి కాబోతోందనే అర్థం.”
మెట్లమీద కర్ర తాటిస్తున్న చప్పుడు వినిపించింది. అంతలో కిరణ్ లోపలకు వచ్చాడు. “రారా కిన్నూ” అంటూ లేచి ఎదురు వెళ్ళాడు జీవన్. స్నేహితుడి బుజం చుట్టూ చెయ్యివేసి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు.
“కిన్నూ! నీకు నూరేళ్ళు ఆయుష్షురా! నీ మాటే అనుకుంటున్నాం ఇప్పుడు“ అంది మీనాక్షి చిరునవ్వుతో.
“నీకు ఈరోజు సెలవు కదా! ఇలా వచ్చావెందుకని? ఏదైనా పని పడిందా” అని అడిగాడు జీవన్.
తల్లీ కొడుకుల్నిద్దరినీ పరిశీలనగా చూస్తూ, “ముందు మీరు చెప్పండి, ఇంతకుముందు నన్ను గురించే చెప్పుకుంటున్నారన్నారుకదా, ముందది ఏమిటో చెపితేనే...” చనువుగా అనేశాడు కిరణ్.
“అదేమీ బ్రహ్మాoడం కాదు, నీకు పై చదువులు చదవాలని ఉంటే, తాతయ్య ఛారిటీ ఫండ్ నుండి డబ్బుతీసి, నైట్ కాలేజ్ లో చేరి చదువుకుంటావేమో కనుక్కుందామని అనుకుంటున్నాము. అంతలో నువ్వొచ్చావు.”
“వద్దమ్మా! మీ ఐడియా అయితే బాగుందిగాని, నాకంత ఓపిక లేదు. ప్రస్తుత స్థితి నాకు సంతృప్తిగా ఉంది. ఇది ఇలా సాగితే సరిపోతుంది, నేను సుఖంగా ఉంటాను. నాకీ అదృష్టం చాలు“ అన్నాడు కిరణ్.
మరి ఇక నీసంగతి చెప్పు - అన్నట్లు సూటిగా కిరణ్ వైపుకి చూసింది మీనాక్షి...
“సరేనమ్మా! ఇక నాసంగతి చెపుతా వినండి ... సుమతి త్వరలో “అమ్మ” కాబోతోంది. ఈ సంగతి మీకు చెప్పిరమ్మని అమ్మ పంపించింది” అంటూ సిగ్గుపడ్డాడు కిరణ్..
జీవన్ ఒక్క ఉదుటున సోఫాలోంచి లేచి, కిరణ్ చెయ్యి పట్టుకుని “మై కంగ్రాట్యులేషన్సురా బ్రదర్!” అంటూ కరచాలనం చేశాడు.
“ఓరి నీ ఇల్లు బంగారంగానూ! అంత చక్కని కబురు ఇంత నెమ్మదిగా చెపుతావేమిటిరా కిన్నూ! ఉండు, ఇంత తియ్యని కబురు చెప్పిన నీ నోటిని తియ్యనజేస్తా” అంటూ లేచి వంటగదిలోకి నడిచింది మీనాక్షి.
“మీరిలా సంతోషిస్తారనే ముందుగా మీకు చెప్పమని పంపించింది మా అమ్మ” అన్నాడు కిరణ్, తలవంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.
ఇంతలో మీనాక్షి పళ్ళెంలో పాల మైసూరుపాక్ ముక్కల్ని ఉంచి తెచ్చింది. “ఈ వేళ ఇంత మంచివార్త వింటానని ముందుగా అనుకోకపోయినా, దేశం స్వతంత్రమైన శుభదిన వార్షికోత్సవం కదా, తీపి తినడం మంచిదని చేశా! అదే కలిసొచ్చింది. తీసుకోoడి” అంటూ ప్లేటుని, సోఫా ముందున్న టీపాయ్ మీద ఉంచింది మీనాక్షి.
“అమ్మా! స్వీట్ మొత్తం ఇదేనా లేక సుమతికోసం ఏమైనా కొంచెం వేరేగా ఉంచావా?” ఒక ముక్క కిరణ్ కిచ్చి తానొకటి తీసుకుంటూ అన్నాడు జీవన్..
“చాల్లేరా నీ బడాయి! ఇవి మిఠాయి షాపులో పిండివంటలు వండిన చేతులురా, కొంచెం వండడం నాకసలు చేతకాదు. ఇవి మీరిద్దరూ తినడానికి. ఇంటికి వెడుతున్నప్పుడు సుమతికోసం వేరే ఇస్తా. సుమతితోపాటుగా ఇంట్లో అందరూ తినొచ్చు. అందరికీ ఇద్దామనే చేశా” అంది మీనాక్షి.
సోఫాలో సద్దుకుని కూర్చున్నాడు కిరణ్. “అమ్మా! ఒక విషయం నేను మీ ఇద్దరితో చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ మనం ముగ్గురం కలవడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఏమో! ఇప్పుడే చెప్పేస్తా...” అన్నాడు.
ఏమి చెపుతాడోనని ఆత్రంగా చూశారు తల్లీకొడుకులిద్దరూ...
“మరేం కాదు. అది మనం చారిటీ కోసం దాచిన డబ్బు విషయం. ఇప్పుడది ఓమాదిరి పెద్దమొత్తమే అయ్యింది. దానిని సద్వినియోగ పరచే విషయమే నేను మీతో మాటాడాలనుకుంటున్నది ...”
“నువ్వు వచ్చేముందు నేనూ, జీవన్ అదే విషయం మాటాడుకుంటున్నాము” అంది మీనాక్షి. తలెత్తి జీవన్ వైపు చూశాడు కిరణ్.
జీవన్ చెప్పసాగాడు. “ఆ డబ్బు తగుమాత్రంగా ఉన్నప్పుడు మనం అన్నదానం, వస్త్రదానం చేసీవాళ్ళం, బాగుంది. మరి ఇప్పుడు అంతకంటే డబ్బు చాలా ఎక్కువ వుంది. ఇలాంటప్పుడు అంతకంటే పెద్ద విషయాలమీద దృష్టి పెట్టడం బాగుంటుంది కదా. “
వెంటనే కిరణ్ అందుకున్నాడు, “ఔను, నా ఉద్దేశం కూడా అదే! అన్నదానం వల్ల వచ్చిన సంతృప్తి పూర్తిగా ఒక్కరోజు కూడా నిలవదు. ఇక వస్త్రదాన మంటావా - అది ఒక మనిషి అవసరాన్ని పూర్తిగా తీర్చగలిగింది ఎలాగా కాదు. తగినంత డబ్బు సమకూరగానే మనం దానిని కన్యాదానానికి గాని వినియోగిస్తే, ఒకపిల్ల జీవితకాలం సంతోషిస్తుంది. అదే విద్యాదానానికైతే ఒక కుటుంబం బాగుపడుతుంది. ఇది నా ఉద్దేశం. మీ రేమంటారో చెప్పండి” అని మాటలు ఆపేశాడు కిరణ్.
“సరిగ్గా ఇదే ఆలోచన నాకూ వచ్చింది” అన్నాడు జీవన్, “డబ్బు చాలక మన శరభయ్య కూతురు పెళ్లి ఆగిపోయేలా ఉందిట, విన్నావా?”
“ఔను - సుమతి చెప్పింది. ఆ విషయమే అమ్మతోనూ, నీతోనూ మాటాడాలనుకుంటున్నా. ఐతే ఈ విషయం మీకూ తెలిసిందన్నమాట!”
“విషయం చెప్పి శరభయ్య అమ్మని అప్పిమ్మని అడిగాడుట. అప్పెoదుకు, చారిటీఫండ్ నుండి తీసి ఇస్తే సరిపోతుందనుకున్నాము అమ్మా నేనూ ను. నీ ఉద్దేశ్యమేమిటి?”
“భేషైన పని, శరభయ్యకు తెలుసా ఈ సంగతి?”
“చెప్పాలి. ఇదిగో, ఇప్పుడే వెడతా” అంటూ లేచాడు జీవన్. “డబ్బు లేక చదువు ఆగిపోయిన ఒక తెలివైన కుర్రాడికి సాయం చెయ్యాలని కూడా అనుకున్నాము. నిన్ను చదువుకోమంటే వద్దన్నావు” అన్నాడు జీవన్, మాటను నిష్టూరంగా మార్చి.
“పోరా, నేనేమైనా కుర్రాడినా? నువ్వు సహాయం చెయ్యాలనుకుంటే నీకు కుర్రాళ్ళే దొరకరా ఏమిటి?”
“ఇంజనీరింగ్ చదవడానికి ఉబలాటపడుతున్న సుమతి తమ్ముడిని “చదివించలేను, BA లో చేరు” అన్నారుట కదా మీ మామగారు...”
తెల్లబోయి చూశాడు కిరణ్. “ఈ సంగతి నీకెలా తెలిసింది” అని అడిగాడు.
“ఎలా తెలిస్తేనేం, నిజమేకదా! తెలివైనవాడు, శ్రద్ధగా చదివే కుర్రాడు – అలాంటివాడికి కాక మరెవరికి చెయ్యాలిట సాయాన్ని?”
“అది కాదురా జీవా! కొంచెం ఆలోచించి చూడు, ఇలా డబ్బంతా శ్రీ జననీ ఫామిలీలోనే పంచేస్తే ... జనం ఏమనుకుంటారు?”
“అలాంటి కుశ్శంకలు వద్దురా కిన్నూ! యోగ్యతలేనివాడికి మనవాడని పట్టం కట్టడం తప్పు. అంతేగాని, యోగ్యుడైన వాడు ఎదుట ఉండగా మనవాడని తోసిపారేసి, ఎక్కడెక్కడో వెతికి తేవాలా? ఇదేమి న్యాయం? కాకుల్ని తరిమికొట్టి గద్దల్ని విందుకి పిలుస్తారా ఎవరైనా! సుమతి తమ్ముడి చదువు పూర్తయ్యీసరికి వెంకటేశు మామ కూతురు పైచదువులకు ఎదుగుతుంది. ఆతరవాత ...”