Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

కొత్త జాబ్, కొత్త ఆఫీసు, కొత్త పరిచయాలు - అంతా సరికొత్త ప్రపంచం! తొలిరోజున ఆఫీసులో అడుగు పెట్టగానే జీవన్ కి ఒళ్ళు గగుర్పొడిచింది. వెంటనే జగన్నాధం తాతయ్య గుర్తుకి వచ్చారు. జీవన్ కృతజ్ఞతతో మనసులోనే ఆయనకు వినమృడయ్యాడు.

ఒక పెద్ద హాలును చెక్కల కూర్పుతో చిన్న చిన్న క్యూబికిల్సులా విభజించారు. ప్రతి క్యూబికిల్లోనూ ఉన్న టేబుల్ మీద ఒక్కో కంప్యూటర్ ఉంది. అప్పటికే కొందరు టేబుల్ కి ముందరున్న కుర్చీలో కూర్చుని కంప్యూటర్ మీద దీక్షగా పనిచేస్తున్నారు.

తను చెయ్యాల్సిన పని ఏమిటో తెలుసుకుని వచ్చి, తనకై అలాట్ చెయ్యబడ్డ క్యూబికిల్లో కంప్యూటర్ ముందు కూర్చుని పని మొదలుపెట్టాడు జీవన్. కంప్యూటర్ మీద “లాగ్ ఆన్” అవ్వగానే అతని మనసు ఉద్వేగంతో నిండిపోయింది. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు తన ఆశ ఫలించింది - అనుకున్నాడు. కీ బోర్డు మీద పొడవైన చేతివేళ్లు వేగంగా కదులుతూంటే ఉంగరం లో ఉన్న వజ్రం థళథళా మెరిసింది, స్వర్గంలో ఉన్న జగన్నాధం తాతయ్య ఆశీస్సులా! ఈ విధంగా తాతయ్య తనను దీవిస్తున్నారు - అనుకుని తృప్తి పడ్డాడు జీవన్.

ఆరోజు విజేతలా ఇంటికి తిరిగివచ్చిన జీవన్ ని చూసి మీనాక్షి ఉప్పొంగిపోయింది. ఆమె కళ్ళలో ఊరిన నీరు చెంపల వెంట ధారలు కట్టింది. తల్లి కన్నీరు చూసి కంగారుపడ్డాడు జీవన్...

“కలలు పండిన రోజున ఈ కన్నీరు ఏమిటమ్మా!” ఆందోళన ధ్వనించింది అతని కంఠంలో.

మీనాక్షి నవ్వింది. “ఇవి కన్నీరు కాదు నాన్నా! వీటిని ఆనంద భాష్పాలు అనాలి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, కాని వాటి మధ్యన ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ కన్నీరు పన్నీరుకంటే కూడా ప్రియమైనది” అంది, వాటిని పైట చెంగుతో తుడుచుకుంటూ.

ముఖమంతా పరుచుకున్న ఆనందం, కళ్ళనిండా తొణికిసలాడే కన్నీరుతో ఉన్న కన్నతల్లి రూపాన్ని ఒక అద్భుతాన్ని చూసినట్లు చూశాడు జీవన్. వెంటనే, “అమ్మా! నన్నొక్కసారి నీ కాళ్ళంటి దణ్ణం పెట్టుకోనియ్యి, నాకు నీ ఆశీస్సులు కావాలమ్మా! ఇప్పుడు నేనీ దశకు చేరుకున్నానంటే అదంతా నీ కృషేనమ్మా! నేను పసివాడిగా ఉన్నప్పుడు నువ్వు నాకోసం చేసిన త్యాగమే నన్ను కాపాడి, ఈ స్థితికి తెచ్చింది. నీకు నా నమోవాకాలమ్మా” అంటూ జీవన్ ఆమె కాళ్ళ ముందు మోకరిల్లాడు. అతని  కళ్ళనుండి కారిన భాష్పధారలు తల్లి పాదాలను అభిషేకిస్తే. మీనాక్షి ఆనందభాష్పాలు, ఆ తల్లి ఆశీర్వచనపు టక్షిoతల్లా జీవన్ తలపై పడుతున్నాయి.

ఇంటికి పోతూ, చెప్పిపోవాలని అక్కడకు వచ్చిన కిరణ్ ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. అతని కళ్లు కూడా ఆనందంతో చెమర్చాయి. అంతలోనే తేరుకుని సంతోషంతో చప్పట్లు కొట్టాడు కిరణ్. అక్కడితో ఆ "స్పెల్" చెదిరిపోయింది. మీనాక్షి వంగి కొడుకుని లేవదీసింది. ముగ్గురూ తడికళ్ళను తుడుచుకుని మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది.

తనకు దగ్గరగా వచ్చిన జీవన్ ని, “జీవా! చూస్తూండగా ఎంత ఎత్తుకి ఎదిగిపోయావురా” అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు కిరణ్. ఆ తరువాత తను తెచ్చిన శ్రీ జననీ ఆఫీసు తాళాలు మీనాక్షికి ఇచ్చి, ఇంటికి వెళ్ళిపోయాడు.

విజేతగా తిరిగివచ్చిన కొడుక్కి ఘనంగా దిష్టి తియ్యడానికి తగిన సామగ్రిని తేవడం కోసం లోపలకు వెళ్ళింది మీనాక్షి.

దిష్టి తియ్యడానికి కావలసిన సామగ్రిని పళ్లెంలో ఉంచుకుని తనకి ఎదురుగా వచ్చిన తల్లిని చూసి, “ఎన్నాళ్ళిలా! ఇక వద్దమ్మా! ఇన్నాళ్ళూ నిన్ను కష్టపెట్టలేక, నాకు ఇష్టం లేకపోయినా ఓర్చుకున్నా. ఇక నిన్ను కష్టపెట్టక తప్పదు. ఈ సంగతి ఆఫీసులో ఎవరికైనా తెలిస్తే నాకు తోకలు కడతారు. ఇంత వయసొచ్చాక కూడా ఇంకా నాకు దిస్టేమిటమ్మా! ఇకనుండే మానేయ్” అన్నాడు ప్రాధేయపడుతూ.

“తల్లిప్రేమను శంకించకురా జీవా! ఎన్నేళ్ళు గడిచినా తల్లికి తన బిడ్డలు చిన్నగానే కనిపిస్తారు. ఎoదుకంటే - వాళ్ళిద్దరి మధ్యా ఉన్న వయసుల్లోని వ్యత్యాసం ఎప్పుడూ ఒకలాగే ఉండిపోతుంది కనుక! మన వయసులో ఉన్న తేడా నువ్వు పుట్టినప్పుడే కాదు, ఇప్పుడుకూడా పందోమ్మిదేళ్ళే!”

“అమ్మా! ఆపు. ఈ మధ్య నీ తెలివితేటలు రోజురోజుకీ అమోఘంగా పెరిగిపోతున్నాయి. నేను నీతో వాదించలేను. ఈ రోజుకి ఏదో ఒకటి కానియ్యి. కానీ, ఇక మాత్రం, ఇలా దిష్టీ, గిష్టీ అంటే నేనసలు ఇంటికి రావడమే మానేస్తాను, అంతే!”

మీనాక్షి కంగు తింది. కానీ అది పైకి తెలియనీకుండా, “నువ్వు చాలా పెద్దాడివైపోయావు. సరే, ఇక నీ ఇష్టం” అని చెప్పి తను తెచ్చినవన్నీ పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయింది.

జీవన్ ఉద్యోగంలో చేరాక కొత్తలో కొన్నాళ్ళు రూటు బస్సుమీద పక్కూరిలో ఉన్న ఆఫీసుకి వెళ్లి వచ్చాడు. అది చాలా ఇబ్బందికరoగా తోచింది మీనాక్షికి. సరైన సమయానికి ఆఫీసులో ఉండాలంటే చాలా ముందుగానే బయలుదేరాల్సి ఉoటుoది. తెల్లారేసరికల్లా కొడుకుకోసం కాఫీ, టిఫిన్ తయారుచేసి, ఆపై వంటకూడా చేసెయ్యాలి. లేకపోతే జీవన్ కి లంచి బాక్సు ఇవ్వడం కుదరదు.

ఇలా బస్సు ప్రయాణంలో విలువైన కాలాన్ని వృధా చేసుకోడం జీవన్ కి కూడా నచ్చడం లేదు. పైగా జనంతో కిక్కిరిసి ఉన్న బస్సులో ప్రయాణం చెయ్యడం వల్ల అతనికి బడలికగా ఉండి, రాత్రి అన్నం తినగానే నిద్దర వస్తోంది. దానివల్ల తనకెంతో ప్రియమైన హాబీ - కథలు రాయడం మానుకోవలసి వస్తోంది. అది అతనికి అస్సలు నచ్చడంలేదు. ఒక బైక్ ఉంటే దినసరి కార్యక్రమం ఇoతచేటు తొడతొక్కిడిగా ఉండదేమో నన్న ఆలోచన తల్లీ కొడుకుల కిద్దరికీ ఒకేసారి వచ్చింది. వెంటనే “హీరో హోండా” బైక్ కి ఆర్డర్ ఇచ్చారు.

నెల ఇట్టే గడిచిపోయింది. నెలజీతం అందుకుని తెచ్చి తల్లి చేతిలో ఉంచి, తల్లి ఆశీస్సులు అందుకున్నాడు జీవన్. బైక్ కూడా వచ్చేసింది. బస్సు బెడద తప్పింది. కాల గమనాన్ని అదుపులో పెట్టుకుని తన గమనాన్ని సుగమం చేసుకుని హాయిగా బైక్ మీద ఆఫీసుకు వెళ్లి వస్తున్నాడు జీవన్.

చక్కగా ఇస్త్రీ చేయబడ్డ పేంటులో షర్టు టక్ చేసుకుని, మెడకు సిల్కుటై కట్టుకుని, నల్లగా నిగనిగలాడే బూట్లు తొడుక్కుని, అందమైన జుట్టుని చక్కగా దువ్వుకుని, చేతికి వాచీ, వేలికి ఉంగరం పెట్టుకుని హీరోహోండా బైక్ మీద ఆఫీసుకి వెడుతున్న కొడుకు మీనాక్షికి , పంచకల్యాణి గుర్రాన్నెక్కి వనవిహారానికి వెడుతున్న రాజకుమారుడిలా కనిపించేవాడు. కొడుకుని ఎంతసేపు చూసినా ఆమెకు తనివి తీరేది కాదు. అలా చూస్తూ చూస్తూ అంతలోనే కొడుక్కి దిష్టి తగులుతుందేమోనన్న భయంతో ముఖం పక్కకి తిప్పుకునేది మీనాక్షి. “తల్లి దిష్టి తగని దిష్టి” అన్న సామెతను ఆమె నమ్ముతుంది మరి.

*      *      *

ఆరోజు జీవన్ ఆఫీసునుండి తొందరగా ఇoటికి వచ్చాడు. వస్తూనే తల్లిని అడిగాడు, “అమ్మా! కిన్నూ ఇంటికి వెళ్ళిపోయాడా” అని.

“లేదురా. వెంటనే చూడవలసిన అక్కౌంట్ లున్నాయని ఉండిపోయాడు. ఆఫీసు రూంలో ఉన్నాడు, ఎందుకు?.”

“నేను వాడిని చూసి చాలా రోజులయింది. ఒకసారి పలకరించి వస్తాను. సుమతి ఉందా?”

“లేదు. ఇంటికి వెళ్ళిపోయింది."

“సరేనమ్మా” అంటూ, జీవన్ బట్టలైనా మార్చుకోకుండా కిరణ్ కోసం పరుగెత్తాడు.

నిజంగానే మిత్రులిద్దరూ కలుసుకుని చాలా కాలం అయ్యింది. పొరుగూరు కావడంతో ఉదయం తొందరగా జీవన్ ఆఫీసుకి వెళ్లిపోతున్నాడు. కిరణ్ ఆఫీసుకు వచ్చే వేళకు అతడు ఇంట్లో ఉండటం లేదు. సాయంకాలం ఆఫీసు వదిలాక బైక్ మీద జీవన్ ఇంటికి వచ్చేసరికి కిరణ్ ఆఫీసు మూసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అలా ఇద్దరి మధ్యా దూరం ఏర్పడింది. ఆదివారాలు కలుసుకుందామంటే రెండిళ్ళ మధ్య దూరం ఎక్కువయ్యింది, పైగా ఆరురోజులూ భార్యాభర్త లిద్దరూ ఏకబిగిన పనే లోకంగా బ్రతికిన మీదట, సుమతి భర్తతో కలిసి ఏ సినిమాకో, లేక పార్కుకో వెళ్ళే ప్లాను పెడుతుంది. ఆ ఒక్కరోజూ వాళ్ళనలా ఫ్రీగా వదిలెయ్యడం ! అలా ధర్మం కదా! రోజులు తెలియకుండానే గడిచిపోతున్నాయి.

శ్రీ జననీ ఆఫీస్ రూమ్ లోకి జీవన్ రాగానే, కంగారుగా లేవబోయాడు కిరణ్. ఒక కాలు అవుడు కావడంవల్ల బేలన్సు కుదరక తూలి, పడిపోబోయాడు. ఒక్క అంగలో వచ్చి కిరణ్ ని పట్టుకుని, పడకుండా ఆపాడు జీవన్. అశక్తతతో తన మీదికి వాలిపోయిన కిరణ్ ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

“లేవబోయావెందుకురా కిన్నూ, పెద్దమనిషి ఎవరో వచ్చారన్నట్లు” అంటూ నొచ్చుకున్నాడు జీవన్.

“నిజంగా అలాగే అనిపించింది. నీ “ఆరా” చాలా మారిపోయిందిరా! నిన్ను చూడగానే గౌరవించాలన్న ఆలోచనే వస్తుంది ఎవరికైనా. సారీరా! ఇంక నిన్నిలా “రా – రీ “ అంటూ తక్కువచేసి మాటాడడం న్యాయంకాదు. ఈ అలవాటు నెమ్మదిగా తగ్గించుకుంటాను” అన్నాడు కిరణ్ తలవంచుకుని.

కిరణ్ మాటలు జీవన్ కి కోపం తెప్పించాయి. “ఒరేయ్! నువ్విలా గౌరవమర్యాదలంటూ అడ్డదిడ్డంగా పిచ్చి కూతలు కూస్తూ, నన్ను దూరంగా నెట్టేస్తానంటే నేను ఒక్కనాటికి కూడా ఒప్పుకోనురా. ఏదో ఒకరోజున నాకు తిక్కరేగిందంటే, నీ పీక పిసికేసి నే నెళ్ళి జైల్లో కూర్చుంటాను, ఏమిటనుకుంటున్నావో!”

జీవన్ ఆ డైలాగ్ ని ఝాంకారంగా మొదలుపెట్టినా చివరకు వచ్చేసరికి అతని గొంతు గద్గదమై దుఃఖంతో పూడిపోయింది.

కిరణ్ తెల్లబోయి చూశాడు జీవన్ వైపు. మిత్రులిద్దరూ భావావేశంతో వివశులై ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు.

“ఒరేయ్ కిన్నూ! ఇంకెప్పుడూ నన్నిలాంటి మాటలతో కించపరచకురా. చెట్టే మనకి ఆదర్శం, ఎంత ఎత్తుకి ఎదిగినా అది భూమి లో ఉన్న తన వెళ్ళే తనకి ఆధారమన్నది ఎప్పుడూ మరచిపోదురా. “

“సర్లేరా ...  నీమాటే ఖాయం. ఇక ఈ బాదుడు ఆపేస్తే బాగుంటుంది” అన్నాడు కిరణ్ చనువుగా.

జీవన్ నవ్వి అన్నాడు, “ఆపేశాలే. నువ్వు ఇంటికి ఫోన్ చెయ్యి, ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేస్తానని. లేకపోతే సుమతి నీకోసం అన్నం తినకుండా ఎదురుచూస్తూ కూర్చుంటుంది. ఈవేళ మనం కొంచెంసేపు మాట్లాడుకోవలసిన పనివుంది. ఆలస్యంగా వస్తానని కూడా చెప్పు“ అంటూ జీవన్ వెళ్ళడానికి లేచాడు.

“అలాగే లేరా. రేపటిలోగా చూడవలసినవి ఇంక రెండు అక్కౌoట్లు ఉన్నాయి. నువ్వెళ్ళి “అమ్మకి తోడుగా ఉండు. నేనవి పూర్తిచేసి పది నిమిషాల్లో వచ్చేస్తా” అంటూ పనిలో మునిగిపోయాడు కిరణ్.

శ్రీ జననీ కుటుంబంలో ఎవరైనా “అమ్మ” అని అన్నారంటే అది మీనాక్షినే! ఆమెకూడా తనదగ్గర పనిచేసేవాళ్ళని తల్లిలా కనిపెట్టి చూస్తుంది. వాళ్లకి ఏ అవసరం వచ్చినా “మీకు నేనున్నా” నంటూ సాయం చెయ్యడానికి ముందుకువస్తుంది ఆమె.

జీవన్ ఆఫీసు బట్టలుమార్చి, తెల్లని పైజామా లాల్చీలలోకి మారి, తల్లిని వెతుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళాడు.

అక్కడ రాత్రి భోజనం తయారు చేసే పనిలో ఉన్న మీనాక్షి బియ్యం కడుగుతోంది. “అమ్మా! సాయంకావాలా” అంటూ తల్లికి దగ్గరగా వెళ్ళాడు జీవన్, “ఈ రాత్రికి కిన్నూగాడు కూడా నాతోపాటే భోజనం చేస్తాడు. ఫరవాలేదు కదా” అని అడిగాడు.

బియ్యం కడగడం ఆపి సర్రున వెనక్కి తిరిగింది మీనాక్షి. “ఇప్పుడా చెప్పేది! ఇదేమి షాక్ ట్రీట్మెంట్ రా నాయనా! ఎవరినైనా భోజనానికి పిలవాలంటే ముందుగా అనుకుని, నాలుగు సరుకులూ ఉన్నాయో లేవో చూసుకుని మరీ పిలవాలి, అంతేగాని ఉరమని పిడుగులా ఇలామాత్రం కాదు. ప్రిజ్ లో కూరలు నిండుకున్నాయి. పొద్దున్న వండిన కూరే రాత్రికి నీకోసం కొద్దిగా మూతపెట్టా. పని రంధిలోపడి ఈవేళ కూరలకు వెళ్ళలేదు. నీకైతే పొద్దుటి కూరేసి పెడతా, మరి వాడికేమేసి పెట్టను? పైమనిషి పదిమందిపెట్టు - అని ఊరికే అన్నారా ఏమిటి” అని విసుక్కుంది మీనాక్షి.

“కిన్నూ మనకేం పరాయివాడు కాదమ్మా! నీకు మరో కొడుకనుకుని నాకు పెట్టిందే వాడికీ పెట్టు. వాడు ఎంతో సంతోషిస్తాడు. నాదీ పూచీ” అన్నాడు జీవన్.

“ఆ కాస్తకూరా మీ ఇద్దరికీ చెరో రెండు ముద్దల్లోకీ వస్తుంది. ఆ తరవాత?”

“ఏమమ్మా, ఊరూ వాడా ఊరుకుంటూ తింటున్న శ్రీజననీ ఫుడ్ ప్రోడక్ట్సు ఇంటిలో వాడడానికి పనికిరావా ఏమిటి! ఈ రోజున మనం మన ఆంధ్రమాత - గోంగూరను శరణడుగుదాము. గోంగూర పచ్చడి కలుపుకుని, పచ్చి ఉల్లిపాయ కొరుక్కుతింటూ ఈజీగా గిన్నెడన్నం లాగించెయ్యొచ్చు. ఆపై మన కందిపొడి ఉంది. ఇంకా ఎన్నెన్నో పదార్ధాలు ఉన్నాయి. చివరకు కడుపును చల్లబరచడానికి చల్ల ఉంటే చాలు. పెరుగే కావాలని ఎవరూ నిన్ను అడగరు. ఇప్పుడు కడుగుతున్న బియ్యానికి మరో కప్పు బియ్యం చేర్చి కుక్కర్ పెట్టు, చాలు. ఇంకా నీకు చాలదనిపిస్తే, రెండవపక్క బర్నర్ మీద బాణ లిపెట్టి ఓ నాలుగు అప్పడాలు, మరో నాలుగు వడియాలూ వేయిస్తే చాలు, భోజనం అదిరిపోతుంది. జానెడు పొట్ట, ఇది నిండడానికి ఎన్ని రకాలు కావాలిట!”

అక్కడితో మీనాక్షి మూడ్ మారిపోయింది. “పోరా, కోతీ! ప్రతీదీ హాస్యంలా మార్చడం నీకే చెల్లింది. ఎలాగైనా వంట వచ్చిన మగాడితో వేగడం మహాకష్టం సుమీ” అంది నవ్వుతూ.

ఆరాత్రి భోజనాలదగ్గర మాటాడుతూ అడిగాడు జీవన్, ”ఒరేయ్ కిన్నూ! మన రాఘవ ఎన్నాళ్ళు అల్లా ఆటో నడుపుకుంటూ బ్రతుకుతాడు! వాడినికూడా మనలో చేర్చుకుందామా? సరుకు రవాణా, బాకీలు వసూలు చెయ్యడం లాంటివి వాడైతే బాగా చెయ్యగలడనిపిస్తోంది నాకు. అలా జరిగితే నీకూ పనిభారం కొంత తగ్గుతుంది. నువ్వేమంటావు?”

ప్రాజెక్టు మేనేజర్ కావడంతో ఇదివరకులా జీవన్ శ్రీ జననీ వ్యవహారాలలో కిరణ్ కి సాయం చెయ్యలేకపోతున్నాడు. వృద్ధి పొందుతున్న వ్యాపారంలాగే ఆఫీస్ వర్కు కూడా రోజురోజుకీ పెరుగుతోంది. కిరణ్ పగలూ రాత్రీ కూడా పని చెయ్యాల్సివస్తోంది. కొన్నిరోజులుగా ఈ విషయం జీవన్ దృష్టికి తేవడం ఎలాగా అని కిరణ్ మధనపడుతూనేవున్నాడు. అందుకే రాఘవ వచ్చి కొంత పని అందుకుంటాడంటే కిరణ్కి చాలా ఆనందంగా ఉంది. వెంటనే “సరే” అన్నాడు.

“మరి, నువ్వేమంటావమ్మా!” తల్లిని అడిగాడు జీవన్.

“మీ ఇద్దరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి ఇక తిరుగేముంటుంది! మీరు “సరే” అంటే, నేనూ “సరే”యే! ఇంతకీ రాఘవ అంటే మీ అందరిలోకీ వస్తాదులా ఉంటాడు, ఆ అబ్బాయేనా? ఆతను వెళ్లి గుమ్మంలో నించుని అడిగితే ఎలాంటి మొండి బాకీలైనా యిట్టె వసూలైపోతాయనిపిస్తోంది నాకు” అంది మీనాక్షి నవ్వుతూ.

స్నేహితుని గురించి తల్లి అలా మాట్లాడడం జీవన్ కి ఇబ్బందిగా అనిపించింది. “ఇంతకీ మనం “సై” అనేస్తే సరిపోదు, వాడుకూడా “సై” అనాలిగా! వాడి ఆలోచనలేవో వాడికి ఉంటాయి కదా! కిరణ్! రేపే నువ్వు వాడితో మాటాడు. జీతం ఎంత కావాలంటాడో అదికూడా నువ్వే అడుగు. ఇంతవరకు సరే; మరోమాట కూడా ఉంది, చెపుతా వినండి ... ఇప్పటి వరకూ మనం సరుకు రవాణా కోసం అద్దె బళ్ళు వాడుతున్నాము. మన స్వంతానికి, సెకండు హేండు దైనా సరే, ఒక “టెంపో” కొనడం బాగుంటుందనిపిస్తోంది. ఇకపొతే, డ్రైవర్ని నమ్మి, అంత సరుకుతో ఉన్న టెంపో అతని చేతులో పెట్టాలంటే నమ్మకస్తుడైన ఒక మంచి మనిషి మనకు డ్రైవరుగా కావాలి ...”

మీనాక్షి కళ్ళు మెరిశాయి. “మన వేంకటేశు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు! వేంకటేశు నడుపుతున్న లారీ యజమాని ఆ లారీని అమ్మేశాడుట! ఆ లారీ కొన్నవాడేమో, తనకి ఆల్రడే డ్రైవర్ ఉన్నాడు, నీ సర్వీసు నాకు అక్కరలేదు – అన్నాడుట! అతడు, రెండురోజుల క్రితం నాతో చెప్పుకుని బాధపడ్డాడు.

“ఇకనేం! అతన్ని డ్రైవర్ గా పెడదాము. అంతకన్నా మంచివాడు, మన కింకెక్కడ దొరుకుతాడు! రేపు నువ్వు యాజులు తాతయ్యగారి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పు, వేంకటేశు మామని మంచిరోజు చూసుకు వచ్చి పనిలో చేరిపోమను. టెంపో అని తగ్గించేది లేదు, వెనకటి యజమాని ఇచ్చినంతా ఇస్తామని చెప్పు.”

మీనాక్షి గతుక్కుమంది, “ఇంకా టెంపో కొనలేదు కదా! ఇప్పటినుండే డ్రైవర్ ఎందుకురా?” ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి.

“నేను ఆఫీసుకి వెళ్ళిపోతా, ఇక కిరణ్ ప్రతి చోటికీ వెళ్ళి టెంపోలను చూసిరావాలంటే కుదరదు కదా. మనదగ్గర చేరాక ఆ పని వెంకటేశం మామే చూసుకుంటాడు. అతనికైతే నాణ్యతలో ఉన్న లోపాలు కూడా తేలిగ్గా తెలుస్తాయి. చాలారోజులుగా లారీమీద పనిచేశాడు కనక మోటారు వెహికిల్సు విషయం తనకైతేనే బాగా తెలుస్తుంది. అంతేకాదు, మామకి ఉద్యోగం పోయిన వెంటనే మళ్ళీ ఉద్యోగం వచ్చిందని వాళ్ళ కుటుంబం కూడా సంతోషిస్తుంది.”

“సరేరా! నువ్వు నిశ్చింతగా నీ ఆఫీసుపని చూసుకో. టెంపో వెంకటేశుమామ సెలక్టు చేస్తే బేరసారాల పని నేను చూసుకుంటా. రేపే రాఘవతో మాటాడుతా. ఒప్పుకుంటే వెంటనే వచ్చి పనిలో చేరిపొమ్మంటా. ట్రక్కు మెయింటెనెన్సు, సరుకుడెలివరీ, సొమ్ము వసూళ్లు రాఘవకి అప్పజెప్పుదాం, సరా!”

“శ్రీ జననీకి కావలసిన ముడి సరుకు సప్లై కూడా రాఘవకే అప్పగించు. అవసరమైతే నాలుగుచోట్ల తిరిగి నాణ్యత చూసి పట్టుకోస్తాడు. వాడు తప్పకుండా మనతో చెయ్యి కలుపుతాడనే అనిపిస్తోంది నాకు.” అని కిరణ్ కి చెప్పి, తల్లివైపు తిరిగి, “అమ్మా! మజ్జిగ పొయ్యి” అంటూ తల్లిని అడిగాడు జీవన్. మిత్రులు ఇద్దరూ భోజనాలు ముగించి లేచి చేతులు కడుక్కున్నారు. మెయింటినెన్సు కూడా ట్రక్ లాంగ్ లైఫ్ కి అవసరం. ఆపని రాఘవకి అప్పజెప్పితివా, వాడు అశ్రద్ధ చెయ్యకుండా ఎప్పటికప్పుడు తగిన మరమ్మత్తులు చేయిస్తూ, తన ఆటోని చూసుకున్నట్లే గారాబంగా చూసుకుంటాడు. మోటార్ వెహికిల్సు పదికాలాలపాటు మన్నాలంటే దాని మెయింటెనెన్సు బాగుండాలి.”

“సరేరా! అవన్నీ నేను చూసుకుంటా. రాఘవ, వేంకటేశు మామ ఒక పెయిరుగా చేసి, బయటకు వెళ్లి చెయ్యవలసిన పనులన్నీ వాళ్లకి అప్పజెప్పుదాము. వాళ్ళు ఇద్దరూ వచ్చి చేరాక లేబర్ని పెంచి, సరుకు తయారీని కూడా పెంచి బిజినెస్సుని ఎక్స్టెండ్ చేద్దాం. ఈ మధ్య కొత్త ఆర్డర్లు కొన్ని వచ్చాయి. వాళ్లకి కూడా సరుకు సప్లై చెయ్యవలసి ఉంది.”

“సరే! ఇక మనం వెడదాము. తొమ్మిదయ్యింది. ఇంకా ఆలస్యం చేస్తే సుమతి నన్ను క్షమించదు, నడు” అంటూ బైక్ తాళాలు అందుకున్నాడు జీవన్.

ఆ విధంగా ముగిసింది శ్రీ జననీ ఫుడ్ ప్రోడక్ట్సు ఆఫీస్ బేరర్సు తొలి సమావేశం.

****సశేషం****

Posted in June 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!