Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

స్వంత ఇంటికి వచ్చాక జీవన్ ఇంట్లో ఫోన్ పెట్టించాడు. దానితో చీటికీ మాటికీ కిరణ్ టెలిఫోన్ బూతుకి వెళ్లవలసిన అవసరం తప్పిపోయింది. కాని దానివల్ల కిరణ్ రాబడి కొంత పడిపోయింది. అది చాలక సెల్ఫోన్లు రావడంతో అసలు టెలిఫోన్ బూత్ యొక్క అవసరమే కనిపించడం మానేసింది జనానికి. కిరణ్ మళ్ళీ నిరుద్యోగుల జాబితాలో పడ్డాడు. ఆపై “పులిమీద పుట్ర” అన్నట్లుగా మరో ఇబ్బంది కూడా వచ్చింది కిరణ్ కి - అది అతని పెళ్లి!

ఆ రోజు కిరణ్, శుభలేఖ ఒకటి తెచ్చి జీవన్ చేతిలో ఉంచాడు. అది చదివి ఆశ్చర్యంతో కిరణ్ వైపు చూసి “ఇది నిజమేనా” అని అడిగాడు జీవన్.

ఉసూరుమన్నాడు కిరణ్. “నిజమేరా. అసలే రాగి కానీ సంపాదన లేదని నే నేడుస్తూంటే, మా వాళ్ళు నా పెళ్లి తలబెట్టారు. తా దూర కంతలేదు, మెడకొక డోలుట!” అతని కంఠ స్వరం దుఃఖంతో బరువెక్కింది.

“ఇప్పుడప్పుడే పెళ్లి వద్దని చెప్పితే సరిపోయేదిగా... దానికింత ఏడు పెందుకు” అన్నాడు జీవన్.

“నేనెంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోడంలేదు. కొన్నాళ్ళు ఆగమన్నా ఆగేలా లేరు. అనుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి అయ్యితీరాలిట!” ఏడుపు మొహం పెట్టుకుని అన్నాడు కిరణ్.

జీవన్ ఆలోచనలో పడ్డాడు. అదేమీ చూసుకోకుండా తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోయాడు కిరణ్.

“మా అమ్మమ్మ మంచం పట్టింది. ఆమె చూడాలంటే ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచిదిట. వాళ్ళ అమ్మ చూస్తూండగా తన కూతురు పెళ్లి జరగాలని మా మామయ్య ఆరాటం, దానికి వత్తాసు మా అమ్మానాన్నలు. నా కర్మకొద్దీ మామయ్యకు కూతురు పుట్టగానే అందరూ కిన్నూగాడికి పెళ్ళాం పుట్టింది - అన్నారుట! ఆ మాట పట్టుకుని కూర్చుంది కాబోలు, సుమతి కూడా నా కొంప ముంచింది. “బావకు కాలు ఔడైనా ఫరవాలేదు, మనసు ఔడు కాదు కదా! నేను బావనే పెళ్ళాడుతాను” అంటూ పట్టుపట్టిoదిట! ఇంక మా వాళ్ళు నా మాట పట్టించుకోడం మానేశారు. ముహూర్తం పెట్టి, శుభలేఖలు అచ్చుగుద్దించేశారు. అసలే, ఎన్నేళ్ళు గడిచినా నాన్నకు నన్ను పోషించక తప్పడం లేదని నే నేడుస్తూంటే, ఇకనుండే నన్నేకాదు, నా సంసారాన్ని కూడా నాన్నే పోషించాలి కదా! తలుచుకుంటే చాలు నాకు ఒంటిమీద తేళ్ళూ, జెర్రిలూ పాకుతున్నట్లుoది, పెళ్ళన్న ఆనందమే రావడం లేదు ఎక్కడా! దిక్కు తోచక కుడితిలోపడ్డ ఎలకలా కొట్టుకుంటున్నా.”

అదాటుగా కుర్చీలో నిఠారుగా లేచి కూర్చున్నాడు జీవన్. “ఒరేయ్ కిన్నూ! నాకో గొప్ప ఐడియా వచ్చింది, విను. ఒక ఐడియా మన జీవితాలనే మార్చేస్తుంది – అంటారు కదూ ... ”

“ఎటూ తోచక నేనేడుస్తూoటే వీడిలా ఐడియా అంటాడేమిటి! అసలు వీడు నాగోడు విన్నాడా, లేదా” అని మనసులో అనుకుంటూ తెల్లబోయి చూశాడు కిరణ్ జీవన్ వైపు

“ఏమిటలా చూస్తున్నావు? నీకిష్టమైతేనేలే - బలవంతమేమీ లేదు. శీఘ్రం వచ్చి శ్రీ జననీ కుటుంబంలో చేరిపో. నువ్వు వచ్చి చేరితే నువ్వూ, అమ్మా, నేనూ పార్టనర్లమౌదాము. వచ్చిన దాంట్లో ముందుగా ఖర్చులకు పోను, ఆపై 2% తాతయ్య పేరుమీద జరిగే ధర్మకార్యాలకు మినహాయించి మిగిలినది మనం ముగ్గురం సమంగా పంచుకుందాము. నేను ప్రొప్రైటర్ని, అమ్మ టెక్నికల్ మేనేజర్, నువ్వు అడ్మినిస్త్రేటర్వి! ఎలా ఉందంటావు నా ఐడియా?”

కిరణ్ చెలించిపోయాడు. “జీవన్” అంటూ ఒక కేక పెట్టి, లేచి మిత్రుణ్ణి గాఢoగా కౌగిలించుకున్నాడు. “ఏ ఫ్రండ్ ఇన్ నీడ్, ఈజ్ ఏ ఫ్రండ్ ఇన్డీడ్” అన్నాడు కళ్ళ నిండుగా ఆనందభాష్పాలతో.

“నువ్వు చెప్పిన సూక్తి అక్షరాలా నిజంరా! “ఏ ఫ్రండ్ ఇన్ నీడ్, ఈజ్ ఏ ఫ్రండ్ ఇండే డ్!” ఒకసారి గుర్తుచేసుకో! అనాధలుగా మా అమ్మా నేనూ ఈ ఊరుకి వచ్చినప్పుడు మీ కుటుంబం మమ్మల్ని ఎంతగా ఆదుకుందో నేనెలా మర్చిపోగలను! మా అమ్మ యాజులుగారి ఇంటికి వంట చెయ్యడానికి వెళ్ళినప్పుడు నన్ను మీ అమ్మ నీతోపాటుగా పెంచి, బడికి పంపి చదివించింది - అన్నది మరుపొచ్చే విషయమా! సరే, నువ్వొచ్చి పనిలో చేరాక, నేను వెళ్లి నైట్ కాలేజీలో చేరుతా, నాకింకా చదువుకోవాలని ఉంది. ఎంత త్వరగా నువ్వొచ్చి చేరితే అంత త్వరగా నా పనిభారం తగ్గి, చదువుకోడానికి సమయం చిక్కుతుంది. “ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండే డ్!” జీవన్ చిరునవ్వు నవ్వుతూ కిరణ్ వైపు చూశాడు..

“కృతజ్ఞతని ‘బెక్వర్డు వర్చ్యూ’ అంటారు. వెనక ఎప్పుడో జరిగిన విషయాలు ఎంత మందికి గుర్తుంటాయి చెప్పు! నిజం చెప్పాలంటే నువ్వు నన్ను సరైన సమయంలో ఆదుకున్నావు. ధన్యుణ్ణి! నీ ఋణం ... ”

కిరణ్ నోరు తన చేత్తో మూసేశాడు జీవన్. “ఆపు! ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. మనమిలా ఒకరిని గురించి ఒకరం చెప్పుకుంటూపోతే విన్నవాళ్ళు ‘పరస్పర డబ్బా’ అంటూ నవ్విపోగలరు” అంటూ నవ్వాడు జీవన్, శృతి కలిపి తనూ నవ్వాడు కిరణ్.

కిరణ్ మిత్రుని రెండు చేతులూపట్టుకుని, “థాంక్స్ రా జీవా! సరైన టైంలో సరైన సహాయం చేసి, నన్ను నవ్వుల పాలవ్వకుండా కాపాడి పుణ్యం కట్టుకున్నావు. నేను సుమతి ఎన్నిజన్మ… ”

జీవన్ కిరణ్ ని మాట పూర్తి చెయ్యనివ్వలేదు. “ఎవరికి ఎవరు ఋణపడి ఉన్నారో తరవాత తీరికగా లెక్క కడదాంలే. ప్రస్తతం తీరిక లేదు. చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీ వీలునుబట్టి వచ్చి పనిలో జేరు. నీ మేనేజిమెంటులో శ్రీ జనని బాగా అభివృద్ధిలోకి వస్తుందన్న నమ్మకం నాకు ఉంది. “బి చియర్ఫుల్ బడ్డీ!" అంటూ మిత్రుని భుజం చుట్టూ చెయ్యేసి వీధి గుమ్మం వరకూ సాగనంపాడు జీవన్. ఇద్దరూ సంతోషంగా చెయ్యీ చెయ్యీ కలుపుకుని వీడ్కోలు చెప్పుకున్నారు.

కిరణ్ పెళ్లి క్లుప్తంగా గుళ్ళో జరిగిపోయింది, ముసలావిడ కన్నుల పండువుగా. మనుమల పెళ్ళి వేడుకలు చూసి, చాలా చాలా ఆనందించింది. మనుగుడుపులు అవ్వగానే వచ్చి కిరణ్ “శ్రీ జననీ”లో మేనేజరుగా చార్జి తీసుకున్నాడు.

జీవన్ శ్రీ జననీ ఆఫీసు పని చాలావరకు కిరణ్ కి అప్పగించి, తన దృష్టిని చదువు మీదికి మళ్ళించాడు. నైట్ కాలేజిలో కొత్తగా పెట్టిన MCA క్రాష్ కోర్సులో చేరిపోయాడు. తను కోరుకున్నట్లుగానే డాబామీద, తంగేడు చెట్టు నీడన కూర్చుని సంతోషంగా చదువుకుంటున్నాడు. సీజన్ రాగానే విరబూసిన తంగేడుచెట్టు, అతని కృషినిన మెచ్చుకుంటున్నదానిలా, అతని తలపై ఉండుండి ఒకో పూవు రాలుస్తోoది. అతనికి చదువుమీదున్న శ్రద్ధను ప్రశంసిస్తున్నట్లుగా అల్లంత దూరంలోవున్న కృష్ణా నదిలోని చిరు అలలు మర్మర ధ్వనులు చేస్తున్నాయి. చెట్టుపైన వాలిన పిట్టలు కూడా అతనికి దీక్షాభంగం కాకూడదని కాబోలు గట్టిగా కుయ్యడం మానేశాయి. అలా ఆ డాబా మీద కుర్చీ వేసుకుని కూర్చుని, జీవన్ శ్రద్ధాభక్తులు ఉట్టిపడేలా, మనసు పెట్టి అంకితభావంతో చదువుకోసాగాడు. కృష్ణా నదిపైనుండి వస్తున్న చల్లని నీటిగాలి అతనికి శ్ర*మన్నది తెలియనీకుండా చేస్తోంది.

*     *     *

ఒక రోజు అకస్మాత్తుగా యాజులుగారి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది, త్వరలోనే తాము తిరిగి వస్తున్నామనీ, ఇంటిని శుభ్రం చేయించి ఉంచమనీ, ఏ రోజున అక్కడ దిగేదీ తరువాత తెలియజేస్తామనీ రాశారు. వాళ్ళు వెళ్లి ఏడాదికి పైనే అయ్యింది. ఎప్పటికప్పుడు తమ I-94 ని పెంచుకుంటూ, మళ్ళీ వెళ్ళేది ఎన్నాళ్ళకోనని, పిల్లలదగ్గర తనివితీరా ఉండి మరీ తిరిగి వస్తున్నారు వాళ్ళు. జీవన్ ఆ ఉత్తరం తను చదివి తల్లికి ఇచ్చాడు చదవమని.

ఈ మధ్యకాలంలో ఆ తల్లీ కొడుకుల జీవితాలలో ఎన్ని మార్పులు వచ్చాయి. ఎప్పటిలాగే మీనాక్షి వచ్చి తమకు వండి పెడుతుందని వాళ్ళు అనుకుంటూ ఉండివుంటారు. అది తలుచుకోగానే మీనాక్షి గుండె వేగం పెరిగింది. ఆదిదంపతుల్లా కష్టసమయంలో తనను ఆదుకున్న యాజులుగారినీ, రాజ్యలక్ష్మిగారిని తను ఎలా కాదన గలదు? అలాగని ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న శ్రీ జననిని విడిచి వెళ్ళడం మాత్రం ఎలా పొసగుతుంది! ఈ పరిస్థితి ఆమెను అయోమయంలోకి నెట్టి, తలనొప్పిగా తయారయ్యింది.

దిగులు నిండిన తల్లి మొహం చూడగానే ఆమెను భయపెడుతున్న సందిగ్ధ పరిస్థితి ఏమిటో జీవన్ కి అర్థమయ్యింది. వెంటనే ఒక పరిష్కారమార్గం అతని మనసులో మెదిలింది...

“అమ్మా! మనం సైడ్ బిజినేస్ గా కేటరింగ్ మొదలుపెడదామా?” సంతోషంతో అతని ముఖం వికసించింది. “తగిన వాళ్ళను నలుగుర్ని చేర్చుకుని వంట వండించి ...”

కొడుకుని మాట పూర్తిచెయ్యనివ్వలేదు మీనాక్షి. ఆమెకి కోపం వచ్చింది. ఏమి చెయ్యాలో తోచక తను అవిధి పడుతూవుంటే, కొడుకు ఇలా “కేటరింగు, గీటరిoగు” అంటూ ఏమేమో మాటాడడం ఆమెకు కొంచెం కూడా నచ్చలేదు. మధ్యలోనే అడ్డుపడి, “అబ్బ! ఇక ఆపరా బాబూ! అసలే ఏం చెయ్యాలో తోచక నేను కొట్టుకుంటూoటే మధ్యలో ఈ గోలేమిటి” అంటూ కొడుకు మీద విసుక్కుంది మీనాక్షి.

తల్లికి అంత విసుకు ఎందుకో జీవానికి అర్ధమవ్వలేదు. మాటలాపి తల్లివైపు చూశాడు జీవన్ ఆశ్చర్యంగా.“

నువ్వు యాజులు తాతయ్యగారు రాసిన ఉత్తరం చదవలేదా? తాతయ్యగారు, అమ్మమ్మగారు అమెరికానుండి త్వరలోనే వస్తున్నారు - అన్నది తెలుస్తోoదా నీకు” అని అడిగింది కొడుకుని మీనాక్షి.

“తెలుసమ్మా, అదేకదా ఇప్పుడు నా బాధ! నువ్విప్పుడు వెనకటిలా వాళ్ళింటికి వెళ్ళడం కుదరదు కదమ్మా! అందుకే దాని కొక ప్రత్యమ్నాయం ఆలోచించా. మనం కేటరింగ్ మొదలుపెట్టి, ఉదయం కాఫీ, టిఫిను; పన్నెండున్నరకంతా భోజనం, సాయంకాలం నాలుగుకి టీ, ఏదో చిన్న స్నాకు; రాత్రికి గోధుమరొట్టెలు, కూర సప్లై చెయ్యడం మొదలుపెట్టామనుకో - ఎలా ఉంటుంది? అలా మనము ఇళ్ళకు సప్లై చెయ్యడం మొదలుపెడితే చాలామందికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది కదా... ఇకపోతే, ఇంట్లో వంట పెట్టకుండా, మన కేటరర్సు వండిన భోజనమే యాజులు తాతయ్యగారి ఇంటికి కూడా సప్లై  చెయ్యవచ్చు. మధ్యాహ్నం భోజనంతో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్లకి వడ్డించి, కాసేపు వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళు భోజనం చేసి విశ్రమించాక తిరిగివస్తే బాగుంటుంది. నేనుకూడా వారానికి ఒకసారి వెళ్లి, వాళ్లకి ఏమి కావాలో కనుక్కుని, అన్నీ తెచ్చి ఇచ్చి వస్తూంటా. ఈ లోగా ఏమి కావలసి వచ్చినా ఔట్ హౌస్ లో ఉంటున్న వెంకటేశు మామ చూసుకుంటాడు. ఇప్పుడు మనుమలు కూడా లేరేమో, వాళ్ళని దిగులు పడనీకుండా మనమే చూసుకోవాలి. వాళ్ళు మనకు చేసిన సాయానికి మనం వాళ్లకి ఆపాటి గౌరవం ఇవ్వడం బాగుంటుందమ్మా” అన్నాడు జీవన్.

అంతా విన్నాక మీనాక్షి చాలా సంతోషించి కొడుకుని మెచ్చుకుంది, “ఓరి నీ ఇల్లు బంగారం గానూ! అందరికీ మేలు జరిగేలా ఎంత చక్కగా ఆలోచించావురా” అంటూ.

“ఈ ఏర్పాటు నీకు నచ్చిoది కదూ! కొంచెం శ్రమనిపించినా నువ్వు వెళ్ళిరావడమే బాగుంటుందనిపిస్తోoదమ్మా!”

“నువ్వు ఆలోచించి ప్లాన్ చెయ్యడమూ, అది నాకు నచ్చకపోవడమూ కూడానా! నీ ప్లానుకి తిరుగులేదురా అబ్బీ” అంది మీనాక్షి మురిసిపోతూ. మొదట్లో పెద్దగా ఆలోచించకుండా తొందరపడి కొడుకుపై విసుక్కున్నందుకు లోలోన పశ్చాత్తాపపడింది మీనాక్షి.

రోజు రోజుకీ మరింత అపురూపంగా కనిపిస్తున్నాడు ఆమెకు తన కొడుకు.

“అమ్మా! మరోమాటకూడా చెప్పాలి నీకు, మన ఊళ్ళో ఇలా కేటరింగ్ సర్వీస్ పెట్టిన మొదటివాళ్ళం మనమే ఔతాము, తెలుసా! హోమ్ డెలివరీ చేశామంటే మన జగన్నాధం తాతయ్యగారిలాంటి ఒంటరి బ్రతుకు బతికేవాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. వాళ్ళు అన్నానికి కూడా మొహంవాచిపోవలసిన పని ఉండదు. అలాంటి ఒక్క వృద్దునికి సాయపడ గలిగినా మన జన్మ ధన్యమే కదమ్మా!”

“ఐతే రేపే పని మొదలుపెట్టాలి, వ్యవధి ఆట్టే లేదనిపిస్తోంది. తాతయ్యగారు, అమ్మమ్మ ఈ గడ్డమీద కాలు మోపే లోగా అన్నీరెడీ అయిపోవాలి” అంది మీనాక్షి.

“ఔను. రేపే మనుష్యులను పిలిపించి, ఔట్ హౌస్ ని రిపేర్ చేయించి, కిచన్ గా మార్పించు. పనిలో పనిగా కిచన్ కి కావలసిన పాత్ర సామగ్రీ, పచారీ సామానులు వగైరాలన్నీ లిష్టు రాసుకుని తెప్పించు. ఈ కిచెన్ అజమాయిషీ మన కిరణ్ భార్య సుమతికి ఇద్దాము. మొన్న నొక రోజు సుమతి, “అన్నా! బోరుకొడుతోంది, నాక్కూడా ఏదైనా పని ఇప్పించ కూడదూ” అని అడిగింది. ఈ పనికి తప్పకుండా ఒప్పుకుంటుంది. రేపే పిలిపించు, నీకు పనిలో తోడుగా ఉంటుంది.

“సరే,సరే! గొప్పగా ఉoది నీ ప్లాను” అంటూ ఆమోదముద్ర వేసింది మీనాక్షి.

*     *      *

రోజులు ఏ ఒడిదుడుకులూ లేకుండా నిమ్మకు నీరెట్టినట్లు చక్కగా సాగిపోతున్నాయి. యాజులు దంపతులిద్దరూ కూడా మీనాక్షీ జీవన్లు సాధించిన అభివృద్ధికి సంతోషించారు. ఉభయతారకంగా జీవన్ చేసిన ఏర్పాటుకి మెచ్చుకున్నారు. చేతిలో ఉన్న పని పక్కనపెట్టి, పన్నెండయ్యే సరికల్లా ఏ రోజుకారోజు కేరేజి తీసుకుని యాజులు దంపతులకు భోజనం పెట్టి రావడానికి ఆటో మీద బయలుదేరుతుంది మీనాక్షి. మధ్యమధ్య జీవన్ చదువు పక్కనపెట్టి వెళ్లి యాజులుగారి యోగక్షేమాలు కనుక్కుని వస్తున్నాడు. జీవన్ పర్యవేక్షణలో యాజులుగారి దినచర్య సంతృప్తికరంగా సాగిపోతోంది.

ఉన్నట్టుండి మీనాక్షికి ఒక ఆలోచన వచ్చింది. “జీవా! ఈ నాటి మన ఈ అభివృద్ధికి, జగన్నాధం తాతయ్య మనమీద చూపించిన అభిమానమే కదురా మూలం” అంది ఉపోద్ఘాతంగా.

ఏదో పుస్తకం చదువుకుంటున్న జీవన్ ఆ పుస్తకంలోంచి తల పైకెత్తకుండానే, “ఔనమ్మా! అందుకు సందేహమా” అన్నాడు.

“జీవా! మరేమోనేం, తాతయ్య ... ” అంటూ మళ్ళీ పలకరించింది మీనాక్షి కొడుకుని.

జీవన్ కి అర్థమయ్యింది, తల్లి తనకేదో చెప్పాలనుకుంటూ ఉందన్నది. పుస్తకం మూసి, పక్కనపెట్టి, "ఏమిటమ్మా! ఇప్పటి వరకూ మనం తాతయ్య చారిటీ ఫండ్ 2% ఇస్తున్నాము. దానిని పెంచుదామంటావా? ఫరవాలేదు, మనకి లాభాలు బాగానే వస్తున్నాయి. 5% చేద్దామని ఉంటే చెప్పు” అన్నాడు.

“నీకు ఏం చెయ్యడం బాగుంటుందనిపిస్తే అది చెయ్యి. ఆ లావాదేవీలన్నీ నాకేమిటి తెలుస్తాయి ... నేను చెప్పబోయేది తాతయ్య ఉంగరాన్ని గురించి. నాకది వెనక్కి తెచ్చుకుంటే మంచిదనిపిస్తోoదిరా. బ్యాంకులో డబ్బు ఎంతుందో ఒకసారి లెక్క చూడు.”

“అలాగే నమ్మా! నాకూ అదే ఆలోచనవుంది. అది ఉంగరం కాదు, తాతయ్య మనకిచ్చిన వరం! బ్యాంక్ లో డబ్బు ఉందమ్మా, అది సరిపోతుంది. రేపే చగన్లాల్ దగ్గరకు వెడతా. దాన్ని మనం విడిచిపెట్టి అప్పుడే సంవత్సరం దాటింది. ఇప్పుడది ఎక్కడుందో!”

“తాతయ్య అన్న మాట నీకు జ్ఞాపకముందా! “ప్రాప్తమున్న వస్తువు నట్టేట్లో పడ్డా నట్టిoటికి వస్తుంది” అన్నది గుర్తు చేసుకో. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆపైన అంతా ఆ భగవంతుడి దయ!” రెండు చేతులూ జోడించి దైవానికి నమస్కరించింది మీనాక్షి.

*       *       *

మెట్లెక్కి షాపులోకి వస్తున్న జీవన్ ని చూసి, “మీరా సర్! రండి రండి” అంటూ లోనికి ఆహ్వానించాడు శేఠ్ చగన్ లాల్ ఆప్యాయంగా.

చగన్ లాల్ షాపు ఇదివరకటిలా రద్దీగా లేదు. కొనుగోలుదారులు ఒకళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు అక్కడ.

“బాగున్నారా సార్! బిజినెస్ బాగా సాగుతోoదా” అంటూ జీవన్ ని కుశలప్రశ్నలు వేశాడు చగన్లాల్.

జీవన్ ఆశ్చర్యపోయాడు. “ఇదివరకటికీ ఇప్పటికీ పలకరింపులో ఎంత తేడా”. వెంటనే అతనికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గాధ గుర్తుకి వచ్చింది. తన బట్టలవైపు చూసుకున్నాడు.

“నిజమే! మనిషిని చూడగానే అతని ఆంతర్యం ఎలా తెలుస్తుంది ఎవరికైనా! డిగ్రీలను బట్టి జ్ఞానాన్ని, మనిషి వేష భాషల్ని చూసి అతని స్థితి గతుల్ని అంచనా వేస్తారు జనం. అంతేగాని, మనసులో దూరి చూసి మరీ మనిషిని  విలువ కట్టలేరు కదా! ఆనాడు పేదరికంలో ఉన్న నన్ను చూసి దొంగ అనుకున్నాడు, పాపం! అందులో చగన్ లాల్ తప్పేముంది, అది మానవ నైజం“ అని మనసుకి సద్ది చెప్పుకున్నాడు జీవన్.

ఆపై “అరె! శేఠ్జీ! నా బిజినెస్ సంగతి మీకెలా తెలిసింది” అని అడిగాడు జీవన్ .

చగన్ లాల్ నవ్వి అన్నాడు, “శ్రీ జననీ ఫుడ్ ప్రోడక్ట్సు” అధిరోహించని డైనింగ్ టేబుల్ లేదు ఈ ఊళ్ళో అంటే నమ్మండి. మీ సరుకు మార్కెట్ లోకి వచ్చాక, ఇదివరకు స్వయంగా చేసుకు తినే వాళ్ళు కూడా మానేశారు. వాటి రుచి మరి వేటికీ రాదు. “శుచికి రుచికి మేటి, ధర సరసం” అన్న మీ అడ్వర్టైజ్మెంట్ అక్షరాలా నిజం!”

“ధన్యవాదాలు! ఇంతవరకూ ఈ సంగతి నాకు తెలియదు, ఊళ్లోవాళ్ళకి మామీద ఇంత అభిమానముందన్నది! అంతా మీ వంటి పెద్దల ఆశీస్సులు! అవే మా అభివృద్ధికి దోహదాలు” అన్నాడు జీవన్ వినయంగా.

చగన్ లాల్ సంతోషించాడు. “మాదేముంది, అంతా మీ కృషి ఫలం. ఇంతకూ మీరిలా వచ్చారేమిటి? పెళ్లికి నగలు కావాలా?”

జీవన్ చిన్నగా నవ్వాడు. “ఇంకా ఆ టైం రాలేదండి. ఇప్పుడు నేను వచ్చింది వేరే పనికోసం. సుమారుగా ఒక సంవత్సరం క్రిందట నేనొక పాత వజ్రపుటుంగరం మీకు అమ్మా నన్నది గుర్తుందా? అదిప్పుడు ఎక్కడుందో చెప్పగలరా?”

“ఎక్కడో కాదు, అది నాదగ్గరే ఉంది. అప్పుడది కొని, ఆ వజ్రంతో కొత్తగా ఉంగరం చేయించుకుని వేలికి పెట్టుకున్నాను. కాని అదినాకు కలిసిరాలేదు. అమ్మేద్దామని చూశా. నేను కొన్న ధరకు ఇస్తానన్నా ఎవరూ దాన్ని కొనడానికి ముందుకు రాలేదు. చూసిచూసి అంత విలువైన దాన్ని పారేయలేక ఒకచోట దాచి ఉంచా. ఎందుకు దాని గురించి అడుగుతున్నారు మీరు.

వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లు అనిపించి చాలా సంతోషమయ్యింది జీవన్ కి. “మీరు అమ్ముతానంటే నేనే కొంటా, బేరం చెప్పండి” అని అడిగాడు.

చగన్ లాల్ కూడా సంతోషించాడు. అతనికొక ఆలోచన వచ్చింది. తనకది మంచి చేస్తుందనిపించింది. చివరకి ఒక నిర్ణయానికి వచ్చి జీవన్ కి చెప్పాడు. “ధరదేముందిలెండి! నిన్నటికీ ఈ రోజుకీ ధరలు ఎంతో పెరిగి పోతున్నాయి. ఇది మీకు తెలియనిది కాదుకదా! నాకు మీరు ఎక్కువేం ఇవ్వొద్దు, అది మీరు నాకు అమ్మినట్లు కాకుండా, మీరు దాన్ని నాదగ్గర తాకట్టుపెట్టి, అప్పుగా రెండు లక్షలు తీసుకున్నట్లుగా భావించండి. వడ్డీ కూడా ఎక్కువేం వద్దు. ధర్మ వడ్డీ ప్రకారం లెక్కకట్టి, అసలూ వడ్డీ చెల్లించి దాన్ని వెనక్కి తీసుకోoడి. దానిపై అంతకన్నా ఎక్కువ వద్దు నాకు.”

క్షణం ఆలస్యం చేస్తే చగన్ లాల్ ఎక్కడ మనసు మార్చుకుంటాడోనన్న భయంతో, వెంటనే తన సమ్మతిని తెలియజేసి, లెక్కలు కట్టించమని అడిగాడు జీవన్.

క్షణాలమీద లెక్కలు తయారైపోయాయి. ఒక్క అరగంట గడిచిందో లేదో, జీవన్ లెక్కలు సరిజూసి చెక్కు రాసి ఇవ్వడం, ఉంగరం అతని చేతిలోకి రావడం జరిగిపోయింది. జీవన్, చగన్ - ఇద్దరి మనసుల్లోనూ సంతోషం వరదలై, వాహినై ప్రవహించింది!

ఉంగరాన్ని చూసి, చెయ్యి జారినదనుకున్న పెన్నిధి చెంత చేరిందని మురిసిపోయింది మీనాక్షి. దాన్ని సబ్బుతో తోమి కడిగి, గుడ్డతో తుడిచి; దేవుని మందిరంలో ఉన్న తాతయ్య పటం ముందర ఉంచి ఆపై కొడుకు వేలికి తొడిగి సంబరపడింది మీనాక్షి.

జీవన్ సాధించిన అభివృద్ధిని చూసి, దాని వెనకనున్న గాధను మీనాక్షి ద్వారా విని యాజులుగారు ఎంతో ఇదయ్యారు. ఆ గౌరవాన్ని తను దక్కించుకోలేకపోయినందుకు లోలోన చాలా విచారించారు. మీనాక్షి జీవన్ని చదివించడానికి కష్ట పడుతున్నప్పుడు, తానూ తరుచూ ఇంతో, అంతో సాయం చేస్తూనే ఉండేవారు. కాని, జీవన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పై చదువు చదివిస్తే బాగుంటుందన్న ఆలోచన తనకు రానేలేదు. అలా చదివించి ఉంటే, ఒక తెలివైన కుర్రాడికి సాయపడి పైకి తీసుకువచ్చిన పుణ్యం తనకు దక్కేది, తన సంపదకూ సార్థకత ఉండేది కదా - అన్నది తలుచుకుని బాధపడ్డారు ఆయన. కానీ గతజల సేతు బంధనం వల్ల ప్రయోజనం ఏముంది?

చివరకు, “సరే! అయ్యిందేదో అయ్యింది. గడచిన రోజులు తిరిగి రావుకదా. ఇప్పటికైనా వాళ్ళ కష్టాలు గట్టెక్కాయి, అదే పదివేలు” అనుకుని మనసు సరిపెట్టుకున్నారు యాజులుగారు.

“త్వరలోనే జీవన్ కి మాస్టర్సు డిగ్రీ వస్తుంది. పనిలోపనిగా మంచి ఉద్యోగం కూడా వస్తుంది, ఇక తిరుగులేదు! ఆ తరవాత, ప్రయోజకుడైన కొడుక్కి మీనాక్షి పెళ్లి తలపెడుతుంది. చదువులో మనం తగినసాయం చెయ్యలేకపోయినా పెళ్ళిలోనైనా సాయపడదాం. మనకి తెలిసిన వాళ్ళలో అన్నివిధాలా కలిసోచ్చే మంచి సంబంధం ఉందేమో చూద్దాం” అంటూ తన మనసులోని మాటను భార్య రాజ్యల్లక్ష్మితో అన్నారు యాజులుగారు. వెంటనే ఆమె తన ఆమోదం తెలిపింది.

రోజులు తాపీగా, సాఫీగా గడిచిపోతున్నాయి. పరీక్షలు సమీపించడంతో “శ్రీ జననీ” తాలూకు పనిమొత్తo కిరణ్ కి వదిలి, తాను డాబా మీద, తంగేడుచెట్టు నీడలో కుర్చీ వేసుకు కూర్చుని దీక్షగా చదువుకోసాగాడు జీవన్. అంకిత భావంతో మనసుపెట్టి చదివిన ఆ చదువు వృధాపోలేదు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఫస్టుక్లాసులో డిష్టింక్షన్ మార్కులతో పాసయ్యాడు పరీక్ష. వెంటనే కాంపస్ సెలక్షన్లో ఎంపికై, ఎంచి పెట్టుకున్న ఉద్యోగంలో, ఒక ఇంటర్నేషనల్ సాఫ్టువేర్ కంపెనీలో చేరిపోయాడు జీవన్. ఆ కంపెనీ పక్కూరిలోనే వుండడం వల్ల తల్లినీ, శ్రీ జననినీ విడిచిపెట్టి ఇప్పుడింక దూరంగా ఉన్న ఊరికి ఎక్కడకీ వెళ్లాల్సిన అగత్యం లేదు. ఉదయం బస్సుమీద వెళ్లి, రాత్రికి ఇంటికి తిరిగి బస్సెక్కి రావచ్చు. జీవన్ తీసుకున్న ఆ నిర్ణయం “శ్రీ జననీ” కుటుంబంలో అందరికీ సంతోషాన్నిచ్చిoది.

****సశేషం****

Posted in May 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!