Menu Close
nirmalaadithya author
జీవన సాఫల్యం (కథ)
-- నిర్మలాదిత్య --
jeevana-saaphalyam-katha

“కథలు రాస్తావు కదా. కొత్త విషయాలు దొరకడం కష్టంగా లేదు? నేను చేసిన గొప్ప పనుల గురించి కూడా ఒక కథ రాసి పడేయి,” అని తన ట్రేడ్ మార్క్ నవ్వు ఒకటి విసిరాడు చందు. వాడు అలా నవ్వాడంటే, నాకూ నవ్వు వచ్చేస్తుంది. వాడు మాటల మాంత్రికుడు. చలోక్తులు వెంట వెంటనే చెప్తుండడం వల్ల వాడెక్కడుంటే అక్కడ జనాలు చుట్టూ ముట్టి వాడి మాటలు వింటుంటారు - పాము ముంగిస యుద్ధం చూపెడతానని, మాటలతో మూలికలు, మందులు అమ్మే వాడి చుట్టూ మూగే జనం లాగా. అందులోనూ వాడు చేసిన ఉన్నతోద్యోగాల వల్ల, వాడి కథలు వినడానికి, వాడు పనిచేసినన్ని రోజులు, వాడి క్రింద పని చేసే జనాల కొదువ లేదు.

ఈ మధ్య రిటైర్ అయ్యాక, వాడి నుంచి నా లాంటి వాడి స్నేహితులకు కొత్త బెడద మొదలైయ్యింది. చందు కలిసినప్పుడల్లా తను ఆఫీసులో చేసిన గొప్ప పనులను గురించి చెప్తాడు. అవి గొప్ప పనులే. ప్రజలకోసం పల్లెలకు రోడ్డు వేయడం. దేశం కోసం పన్నుల ద్వారా ఆదాయం, కొత్త చట్టం ద్వారా, రెట్టింపు చేయడం, ఒకటేమిటి, పేరొందిన అతి పెద్ద ప్రభుత్వపు సంస్థలకు అధిపతి గా పని చేయడం వల్ల, చాలానే ఏకరవు పెట్టేవాడు.

వాటి గురించే మళ్ళీ, మళ్ళీ చెప్తుంటే,

“చందూ టైం ఔట్! కొత్త కథ చెప్పు. ఇదివరకే ఈ కథలు విన్నాను. అదేంటో వయస్సు పెరిగిన తరువాత చెప్పిన కథలే మళ్లీ , మళ్లీ చెప్తుంటారు. నువ్వు రిటైర్ అయ్యిన వెంటనే మొదలెట్టేసావు,” అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసాను.

అలా చెప్పే చనువు నాకు, వాడి దగ్గర ఉంది. అలా అన్నప్పుడు,”చెప్పేసానా?” అని అమాయకంగా ముఖం పెట్టి,” అలా అయితే ఈ కొత్త కథ విను,” అని మరో పాత కథే చెప్పేవాడు.

చందును నేను పాతికేళ్ల క్రితం కలవకముందే, చందూ ఖ్యాతి నన్ను వచ్చి పలుకరించింది. చందూ సహోద్యోగులందరు పని కట్టుకుని, చందు గురించి జాగ్రత్త పడమన్నారు. వాడితో బాటు ఆఫీసులో పని చేయడం కష్టం అన్నారు. పై అధికార్లనంతా బుట్టలో వేసేస్తాడన్నారు. ప్రమోషన్లు, ఇతర మంచి అవకాశాలు వాడే కొట్టేస్తాడు అన్నారు. నువ్వు రాణించకుండా చేస్తాడు అన్నారు. నిన్ను అణగ తొక్కేస్తాడన్నారు. ఏ మాత్రం చనువిచ్చినా నేరుగా ఇంటికి వచ్చి మకాం వేస్తాడనీ, అడ్వాంటేజ్ తీసుకుంటాడని చెప్పారు.

చందు ను కలిసిన కొత్తలో అందుకే నేను జాగ్రత్త పడ్డాను. తనతో కలిసి పని చేసే అవకాశం కూడా వచ్చింది. చందు పనిలో చాల ముందుకు దూసుకు పోయే మనిషి అని తొందరలోనే అర్థమై పోయింది. పై అధికార్లకు కావలసిన విధంగా మాట్లాడటం, పని చేయడం వల్ల వారు చందూను ఆదరించడం నాకు ఆశ్చర్యమనిపించ లేదు. తను చేసే పనులు చందు దాపకరికంగా చేయడు. అందరికీ చెప్పే, అందరికీ తెలిసే విధంగానే చేస్తాడు. జనాలు చందు పైవాళ్ళకి మస్కా బాగా కొడ్తాడు అని కించ పరిచినా, చందు చేస్తున్న పనులు వారు చేయలేరని నాకు తెలుసు.

చందు నుంచి ‘ఈ పని నా వల్ల కాదు. ఇది చేయాలంటే చాల కష్టం. దీనికి చాల సమయం పడుతుంది’ లాంటి మాటలు ఎప్పుడూ వినలేదు. ఏ పని చెప్పినా ఆ పని పూర్తి చేసి పెడతాడు. ఆ పనులు ఇదివరకట్ల కాక ఏదో మార్పులు చేసి మరింత బాగా చేస్తాడు. అలా పనులు చేస్తున్నప్పుడు తనకు పరిచయమై, తనకు తోడ్పడిన వారికి, అవసరమైతే ప్రభుత్వ రూల్స్ పట్టించుకోకుండా కూడా సహాయ పడటం చూసాను. అవసరమైతే వ్యక్తిగతంగా అలా సహాయం చేయడం కూడా చూసాను.

ఒకసారి న్యూయార్క్ లో ఒక నెల రోజులు ఉండాల్సిన పని పడింది. అన్ని రోజులు, హోటల్ ఆఫీసుకు దగ్గరలో దొరికే అవకాశం లేదు. ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు, “ఏంటి అలా ఉన్నావు,” అన్నాడు.

“హోటల్ నుండి రోజూ ఒక గంట కమ్యూట్. ఇంకో నెల ఎలా గడపడం,” అని ఆలోచిస్తున్నాను అని మనస్సులోని మాటను బయట పెట్టాను.

“మా ఆవిడ సబ్బాటికల్ తీసుకొని, చదవడానికి బాస్టన్ వెళ్ళింది. నేనూ వచ్చే వారం నుంచి ఒక నెల ఆఫీసు పని మీద వెస్ట్ కోస్ట్ వెళ్తున్నాను. ఇదిగో ఇంటి స్పేర్ కీ. ఇవ్వాళ సాయంత్రమే హోటల్ మానేసి ఇంటికి వచ్చేయి,” అని నేను  హోటల్ ఖాళీ చేసి ఆఫీసు దగ్గరున్న తన అపార్ట్మెంట్ కు మారేంత వరకు వినలేదు. నాతో ఉన్న వారంరోజులు తనే నాక్కూడా వండి భోజనం పెట్టాడు. తను వెళ్లిపోయిన తరువాత, నేను కష్ట పడకూడదని, పాంట్రీ, ఫ్రిజ్ రెండు వస్తువులతో నింపి వెళ్ళాడు. ఏవి ఎక్కడున్నాయో చెప్పాడు.

ఇంతకూ చందూ గురించి ఈ పరిచయం చేయడానికి కారణం చందు, వాళ్ళావిడ విమ్మి మా ఇంటికి ఒక రెండు రోజులు రావడం. ఇప్పుడే టాంప ఎయిర్పోర్ట్ అరైవల్ టెర్మినల్ దగ్గరకి వచ్చి చూస్తే చందు, విమ్మి, సూట్ కేస్ లతో కనిపించారు.  ట్రంక్ కారులో నుంచే తెరిచాను. చందు లగేజీ కారులో పెట్టి, తలుపు తీసి విమ్మీ ని కారులో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని నాతో చెప్పి మాకు ఒక ఇరవై అడుగుల ముందున్న కారు దగ్గరికి పరిగెత్తి అక్కడ వీల్ చైర్ లో కూర్చున్న మనిషితో ఏదో మాట్లాడం మొదలెట్టాడు.

అక్కడే నిల్చొని ట్రాఫిక్ చూస్తూన్న పోలీసు నన్ను చూసి హడావిడి చేయడం మొదలెట్టాడు. కారు కదల్చమని సంజ్ఞలు చేశాడు. చాలా కార్లు ఉన్నట్టుండి ఒకే సారి వచ్చేశాయి. ఇది చూస్తున్న విమ్మి, “విశ్వం కారు పోనీయి. ఒక రౌండు తిరిగి వద్దాము. చందు ఇంకో ఐదు నిముషాలైన ఆవిడతో మాట్లాడి, ఆవిడని కార్లో ఎక్కించి కానీ రాడు,” అంది.

ఆ పోలీసు వాడి బాధ పడలేక కారు కదపాల్సి వచ్చింది. చందు ఉన్న చోటు దాటుతుండగా చందు చూపులు పట్టుకోగాలిగాను. చుట్టూ తిరిగి మళ్ళా వస్తాము అని సంజ్ఞ చేసి కారు అలాగే ముందుకు నడిపాను. వెనుక కూర్చున్న విమ్మి, “నువ్వు కారు నడుపు విశ్వం. నేను చందుకు టెక్స్ట చేసాను. వెయిట్ చేస్తాడులే,” అంది.

కారు బయటవరకు తెచ్చి, ఎక్సిట్ తీసుకోకుండా తిరిగి టెర్మినల్ల వైపు కారు నడిపించాను.

“ఎవ్వరు వాళ్ళు విమ్మి. మీకు తెలిసిన వారా?” నా మనస్సులోని సందేహాన్ని బయట పెట్టేసాను.

“తెలిసిన వారు కాదు. నెవార్క్ ఎయిర్పోర్ట్ లో కలిశారు. చందూ సంగతి నీకు తెలుసు కదా. తనే జనాలను వెదికి కలుస్తాడు,” గట్టిగా, కొంచెం వెటకారంగా నవ్వింది విమ్మి. అదేంటో విమ్మి కూడా చందు పట్ల అతని సహోద్యోగులు మాట్లాడినట్లే మాట్లాడుతుంది. విమ్మి కూడా చందూతో సహోద్యోగిగా ఉద్యోగం లో చేరింది కాబట్టి ఆశ్చర్యం పడకూడదనుకుంటాను.

విమ్మి చెప్పడం మొదలెట్టింది.

“నెవార్క్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ దగ్గర రెస్టారెంట్ లో కూర్చొని ఉంటే, ఈ గుంపు తగిలింది. మిడిల్ ఏజ్డ్ జంట, వారితో బాటు హై స్కూల్ చదువుతున్న వారి ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. ఇండియా నుంచి వస్తునట్లున్నారు. వీల్ చైర్ లో ఒక పెద్దావిడని కూడా తెచ్చారు. ఆ ముసలావిడ ఆ పిల్లలకి నాన్నమ్మ.

వాళ్ళు మా దగ్గరే కూర్చున్నా, నేను అస్సలు పట్టించు కోలేదు. చందు వాళ్ళని పలకరిస్తే, అప్పుడు చూసాను.”

“ఏమి చేసాడేమిటి?” అడిగాను నేను.

“చందు సంగతి తెలిసిందే కదా. ఒక పట్టాన ఊరుకోడు. ప్రతీ విషయంలో వేలు పెట్టాల్సిందే. ఆ కుటుంబంతో మాటలు పెట్టుకున్నాడు. నేను చూసే సరికి, ముసలావిడ ఆకలి మీదే ఉంది. పిల్లలు బర్గర్ లు కొనుక్కొని తెచ్చారు. ఆ పిల్లలు, వాళ్ళ అమ్మ, నాన్నలు ఆవురావురు మని తింటున్నారు. అమెరికా వదిలి వెళ్తే మొదట మిస్ అయ్యేది ఈ బర్గర్లు, కోకులు, ఫ్రైస్ అని వారి ముఖాలు చూస్తూనే తెలుస్తుంది. పిల్లలు వాళ్ళ నానమ్మను తాము తెచ్చిన బర్గర్ తినమని చెప్తున్నారు. కానీ ఆ ముసలావిడ మాత్రం పిల్లలకు నవ్వుతూనే తనకు బర్గర్ వద్దని చెప్తున్నది. మసాలావిడకు కొంచెం చెవుడు ఉన్నట్లు ఉంది. చెవిలో మెషిన్ పెట్టుకున్నా, పిల్లలు చెవి దగ్గర వచ్చి మాట్లాడితే కానీ అర్థం కావటం లేదు. అలానే ఆ ముసలావిడ కోడలు, అబ్బాయితో ‘పిల్లలను సతాయించవద్దని చెప్పండి. ఇంట్లో అన్నీ వస్తువులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక తనకు కావలసింది తను వండుకోవచ్చు’ అంటే దానికి ఆ ముసలావిడ వాళ్ళ అబ్బాయి, ‘నాన్న పోయి రెండు వారాలు కూడా కాలేదు, ఆకలేసి ఉండదులే’ అని అనడం లీలగా వినిపించింది. వాళ్ళకి ముసలావిడ చెవులు ఎంత వరకు పని చేయవో అనుభవ పూర్వకంగా తెలిసి ఉండాలి. తమిళంలో మాట్లాడుతున్నారు. నేను కోవై అమ్మాయి కాబట్టి వారి మాటలు అర్థం అవుతున్నాయి. చందు పని చేసిన చోటు భాష లన్నీ పట్టుకుంటాడు కదా. దానిపైన నాలాంటి తమిళమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారి దగ్గరకు ‘వణక్కం‘ అంటూ వెళ్లి తమిళంలోనే మాటలు పెట్టుకున్నాడు. చెన్నై నుంచి వస్తున్నారట. ఆ జంట అయ్యితే ముభావంగా, జెట్ ల్యాగ్ తో జేడడ్ గా ఉన్నారు కానీ, పిల్లలు, ముసలావిడ చందు తో కబుర్లలో పడ్డారు. కబుర్లనడం కంటే చందు మరో ఒక సమస్య పరిష్కారాన్వేషణలో పడ్డాడు అంటే సరిపోతుంది.”

“సమస్య ఏంటి?”

“పిల్లలు వాళ్ళ నానమ్మని బర్గర్ తినమని బలవంతం చేస్తున్నారు, ఆవిడ వినడం లేదు. ‘లుక్ అంకుల్ ఇన్ని వెజిటబుల్ టాపింగ్స్ తో నానమ్మకు ఆర్డర్ చేసి తెచ్చాము. తను తినడం లేదు’, మంచి అమెరికన్ ఆక్సెంట్ తో అన్నారు. ఇదంతా చూస్తున్న నాకు నవ్వు వస్తున్నది. చందు ముఖంలో ఏదో చేయాలన్న ఆత్రం, ఆవేదన. నాకు బాగా పరిచయమైన ఎక్సప్రెషనే. నేను ఆశ్చర్య పోలేదు.

చందు, ఆవిడను పిల్లల లాగానే బర్గర్ తినమని అడిగాడు. ఆవిడ నోటి నుంచి మళ్ళీ తిరస్కారం. మనదేశం లో లాగా రైస్ అయితే తింటుందేమో నని, ఆ పిల్ల తల్లి తండ్రులను అక్కడ కొన్నిషాప్ లలో రైస్ అమ్ముతున్నారు కొని ఇవ్వమన్నాడు. వారి నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. కానీ చందూ సంగతి నీకు తెలుసు కదా. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు. ఆవిడ కళ్ళలో ఏమి చూసాడో, తిరిగి మా దగ్గరకి వచ్చి తన బ్యాక్ ప్యాక్ లో నుంచి తనకోసం తెచ్చుకున్న పెరుగన్నం డబ్బా తీసుకెళ్ళి ఆ ముసలావిడ కు బలవంతంగా ఇచ్చాడు.”

“చందూ పెరుగన్నం డబ్బా తెచ్చుకోవడం ఏమిటి?”

“చందుకూ ఈ మధ్య గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చాయిలే. బయట తినడం మానేశాడు. ఫ్లైట్ డిన్నర్ టైంకు దొరికింది. అందుకే డబ్బాలో తనకనే పెరుగన్నం తాలింపు వేసుకొని తెచ్చుకున్నాడు.”

“మరి ముసలావిడ తినిందా?”

“మొదట్లో మొహమాట పడింది. తరువాత చందూ తనే స్వహస్తాలతో వండాను అంటే తీసుకొని తినింది. ఆ తినటం ఆబ, ఆబ గా తిన్నది. పాపం మంచి ఆకలి మీదే ఉన్నట్లుంది.”

“మరి చందూ ఫుడ్?”

“పక్కనే షాప్ లో యోగర్ట్, అరటి పండ్లు కొనుక్కున్నాడు. కానీ ఆవిడ తింటున్నప్పుడు చందు ముఖంలో ఆనందం చూడాలి. నేను తింటున్నప్పుడు ఒక చిరునవ్వు కూడా నవ్వడు. అందుకే తిరిగి వచ్చినప్పుడు ‘ఏంటా ఆనంద’మని అడిగా. ‘పాపం ఇల్లు వదిలిన తరువాత తిండి తిన్నట్లు లేదు. తిన్న తరువాత ఆవిడ ముఖం చూసావా? నాకు చాలా ఆనందం వేసింది.’ అన్నాడు. చందు నాకు చాల సార్లు అంతు బట్టడు. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఆ ముసలావిడ కు వీడ్కోలు చెప్పి వస్తానని పరిగెత్తాడు.”

ఎయిర్పోర్ట్ ప్రదక్షిణ చేసి తిరిగి చందును వదిలిన స్థలానికి వచ్చాం. ముసలావిడ కుటుంబం వాళ్ళ కారు వెళ్ళిపోయింది. చందు మా కోసమే నిలబడి ఉన్నాడు. కారు కెర్బ్ పక్కన ఆపగానే కారు తలుపు తెరిచి నా పక్క సీట్లో కూల బడ్డాడు.

“సారీ బడ్డి. ఆ ముసలావిడను నెవార్క్ ఎయిర్పోర్ట్ లో కలిసాము…”

“ఆ…అన్ని విషయాలు విమ్మి చెప్పిందిలే,” అన్నాను నేను.

“పాపం ముసలావిడ వీడ్కోలు చెప్తుంటే కన్నీళ్లు పెట్టుకుంది. మళ్ళీ, మళ్ళీ థాంక్స్ చెప్పింది. అలానే ‘చిన్న పసంగు. నళ్లవంగు. తెరియాదు” అని పిల్లలపై మాట రాకుండడానికి ప్రయత్నించింది. చిన్న పిల్లలు, మంచి వారు, తెలియక పోవడ మేమిటి? కొడుకు, కోడలు పెద్ద వారే కదా, అమ్మ ఆకలి తెలియదా …”

చందు గొంతులో ఏదో మార్పు. పక్కకు తిరిగి వాడి ముఖం చూసాను. వాడి కళ్ళు చెమ్మగిల్లినట్లనిపించింది.

“నువ్వు ఆకలి మీదున్నావేమో కదా. దారిలో ఎక్కడైనా రెస్టారెంట్ లో ఆగుదామా. నీకు పెరుగన్నం కావాలంటే కూడా దొరుకుతుంది. బోలెడన్ని ఇండియన్ రెస్టారెంట్ లు ఉన్నాయి మా నగరంలో,” అన్నాను.

“పరవాలేదు. ఎయిర్పోర్ట్ లో నాకు కావాల్సింది తిన్నాను. అన్నట్టు నేను నా ఉద్యోగంలో చేసిన పనుల గురించి కథ వ్రాసావా? ఆ మధ్య పెద్ద రోడ్డు వేసాను. ప్రజలకోసం అనేక పథకాలు అమలు చేసాను….”

“టైం ఔట్ చందూ. నువ్వు చేసిన పనులను గురించి ఇదివరకే విన్నాను. రిపీట్ చేయమాక. నువ్వు చేసిన పనులు ఎవరైనా చేయగలరు. నీకు ముందు ఆ పదవిలో ఉన్న వారు చేసి వుంటారు. నీ తరువాత ఆ పదవికి వచ్చిన వారు కూడా చేస్తారు. అది నీ గొప్పదనం కాదు. పదవి తో వచ్చే అధికార మహత్యం.”

jeevana-saaphalyam-katha“అంటే నీ కథకు సరిపడ నేనేమీ చేయలేదా?” బాగా నిష్టూరంగానే అడిగాడు చందు.

“నీ గురించి కథ వ్రాస్తాను. అది నీకు అవతలి మనిషి మీద ఉన్న అక్కర మీద. అవతలి మనిషి సంతోష దుఃఖాలను ఇట్టే అర్థం చేసుకొని, ఆ దుఃఖాన్ని నీ చేతనైనంత వరకు తగ్గించ డానికి నువ్వు చేసిన ప్రయత్నాల మీద. ఆఫీసులో నీ పై వారు నిన్ను ఇష్టపడటానికి కారణం, నువ్వు వారు క్లిష్టమైన సమస్యలతో పోరాడుతుంటే, ఆ సమస్య చిన్నదైనా, పెద్దదైన నేనున్నానని నీ భుజం అండగా ఇచ్చావు. అలానే నీ క్రింద వారు ఏ కష్టాలలో ఉన్నా, కావలిస్తే రూల్స్ అతిక్రమించి, వారికి సహాయం చేసావు. పని లోను, పని బయట సాటి మనిషి గురించి ఆలోచిస్తావు, అల్లాడిపోతావు. నీకు వీలైనంత సహాయ పడతావు. ఆ కథలు నువ్వు చెప్పలేదు.  నేనే విన్నాను. నువ్వు తాకిన జీవితాలనుంచి. ఆ కథ వ్రాస్తాను.”

****సమాప్తం****

Posted in December 2024, కథలు

7 Comments

  1. Uma Bharathi

    భాస్కర్ గారు.. ఎప్పటిలా మనసుని తాకి నిద్రలేపేలా ఉంది మీరు రాసిన ఈ కథ. అభినందనలు.. గొప్ప కథ. ఇటువంటివారు ఉంటారండీ.

    • Bhaskar Pulikal

      ఉమా గారు
      సమయం తీసుకొని చదివినందుకు, మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  2. సత్యం మందపాటి

    మానవత్వపు విలువలు చూపించిన మంచి కథ భాస్కర్. కొంత సస్పెన్స్ కూడా వుంది,
    బాగా వ్రాశారు. అభినందనలు.

    • Bhaskar Pulikal

      సత్యం గారు. మీ స్పందన నాకెప్పుడూ మరిన్ని కథలు వ్రాయడానికి స్ఫూర్తిదాయకం. ధన్యవాదాలు.

  3. Sainarayana karanam

    చాలా బాగుంది. మనుషుల్లో మెల్ల మెల్లగా మరుగున పడిపోతున్న మానవత్వాన్ని కుదిపి లేపే కథ. నైస్ భాస్కర్ గారు.

    • Bhaskar Pulikal

      ధన్యవాదాలు సాయి. మీ లాగా విసృతంగా కథలు చదివిన వారి నుండి ఇలాంటి స్పందన రావడం నా లాంటి రచయితలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. 🙏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!