
జీవన పోరాటం
కలలు విరిగిన చోట
కన్నీళ్లు పలకరిస్తుంటాయ్.
బీడువారిన పొలం వంక చూసాను
ఆశలు విరిగినట్టయింది.
కళ్ళు ఎర్రగించిన ఆకాశం వంక చూసాను.
గుండె మండిపోతోంది.
దగాపడ్డ రైతువంక చూసాను.
నడ్డివిరిగినట్టయింది.
దీనంగా చూసే
నిరుద్యోగి వంక చూసాను.
రేపటి భవిష్యత్తు పై
బిక్కు బిక్కు మంటున్నాడు.
కూలీలు పనికోసం
ఊళ్ళని వదిలి పోతున్నారు.
పల్లె కన్నీళ్ల తో
నిస్సహాయంగా ఏడుస్తోంది.
ప్రపంచం అంతా
బతుకంటేనే పోరాటం.
విరిగిన కలల్ని మెట్లుగా
వినిర్మాణం చేసి
ముందుకి కదలటమే కదా
బతుకుకి సాకారం.
మనకి మనమే
ఉపాధి ద్వారాలు తెరవడమే కదా
అసలైన ప్రగతి పథం......!