ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు అది చెడైనా, మంచైనా మనం ఉద్వేగానికి లోనవడం జరుగుతుంది. అలాగే విపరీతమైన వేడిని లేక చలిని ఎదుర్కొన్నప్పుడు మన శరీరంలో ఏర్పడే జలదరింపు, రోమాలు నిక్కపోడుచుకోవడం తదితర ధర్మాలు మనకు తెలియకుండానే జరిగే అసంకల్పిత చర్యలు. వాటినే మనం ఫీలింగ్స్ అని అంటుంటాము. అటువంటి స్పందనలే మరి ఇతర జీవాలలో కూడా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి అని చెబుతాము.
కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా చెట్లు తమకు కావలిసిన పిండిపదార్థాలను సూర్యకాంతిని ఉపయోగించి తయారుచేసుకుంటాయి. ఇది 18 శతాబ్దంలోనే కనుగొనడం జరిగింది. ఇది ఒక రసాయన ప్రక్రియ. అయితే మనుషుల లాగే చెట్లకు కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగా స్పందించే గుణం ఉంటుందన్న విషయాన్ని శాస్త్రీయంగా వంద ఏళ్ల క్రితం అంటే 20 వ శతాబ్ద ప్రారంభంలో కనుగొనడం మరియు నిరూపించడం జరిగింది. ఆ ప్రక్రియకు ప్రధాన సూత్రధారి మన భారతీయ శాస్త్రవేత్త సర్. జగదీష్ చంద్రబోసు, నేటి మన ఆదర్శమూర్తి.
మనకు స్వాతంత్ర్యం రాకమునుపు ఉన్న అఖండ భారత దేశంలోని బెంగాల్ రాష్ట్రంలో నవంబర్ 30, 1858 వ సంవత్సరంలో జగదీష్ చంద్రబోసు జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రదేశం బంగ్లాదేశ్ లో ఉంది. అయినను అతడు భారతీయుడు గానే గుర్తింపు ఉంది. తల్లిదండ్రులు రామమోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజం లో ముఖ్యులైనందున బాల్యంనుండే చంద్రబోసు గారికి జీవితంలో అతి ముఖ్యమైన మాతృభాష ప్రాధాన్యత, సంప్రదాయ విలువలతో కూడిన సమానత్వం తదితర సామాజిక విలువలు అలవడ్డాయి. ఆయన ప్రాధమిక విద్యాభ్యాసం ఒక సామాన్య బడిలోనే జరిగింది. తరువాతి తరగతులు మరియు కాలేజీ విద్యాభ్యాసం అంతా కలకత్తా (నేడు పేరు మార్చారు) లోనే జరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి BA పట్టాను పొందారు. పిమ్మట వైద్య వృత్తిలో పట్టాను సాధించుటకు లండన్ వెళ్లి అందులో ఇమడలేక చివరకు Christ's College, Cambridge నుండి BA పట్టాను మరియు University College London నుండి BSc, DSc పట్టాలను పొంది తిరిగి ఇండియా కు వచ్చేశారు. ఆ తరువాత భౌతిక శాస్త్ర బోధకుడిగా, ఆచార్యుడిగా పనిచేస్తూ, తనకెంతో ఆసక్తి కలిగిస్తున్న వృక్ష శాస్త్రం మీద దృష్టి సారించి పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. 1917 బోస్ ఇన్స్టిట్యూట్ ని నెలకొల్పి తద్వారా తన ఆవిష్కరణలన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేశారు.
మనుషులు ఇతర జంతువులు ఎండ, వాన, చలికి అనుగుణంగా స్పందించడం జరుగుతుంది ముఖ్యంగా అనారోగ్యం కలిగినప్పుడు మన శరీరంలో వణుకు లాంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా వాతావరణంలో ఏర్పడే ఉష్ణోగ్రతల వ్యత్యాసాలకు అనుగుణంగా విధ్యుత్ ప్రేరేపిత ఉత్తేజిత కారకాలు చెట్లలో జనించి తదనుగుణంగా చెట్ల కణాలలో వ్యాకోచ సంకోచ ప్రకంపనలు ఏర్పడి తద్వారా వాటి గమనంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. అందుకు చెట్లలో జనించే రసాయనాలు మాత్రమే కారణం అనే భావన నుండి సూర్యకాంతికి చెట్లు స్పందిస్తాయని మన జగదీష్ ప్రతిపాదించి ప్రయోగాత్మకంగా దానిని నిరూపించాడు. వాటినే heliotropic movements అని అంటారు. అంతేకాక చెట్ల యొక్క కణాల మీద సూక్ష్మ తరంగాల (మైక్రోవేవ్స్) యొక్క ప్రభావం గురించి మన చంద్రబోసు పరిశోధనలు సాగించి ఆ ప్రభావం వలన కణాల మధ్యన ఉండే పొరల యొక్క సామర్ధ్యాల అసమానతలను కొలిచి చూపించారు. అంతేకాదు ఋతువులకు అనుగుణంగా చెట్లలో కలిగే మార్పులు మరియు ఉష్ణోగ్రతల తేడాలకు అనుగుణంగా చెట్లలో జరిగే రసాయన ప్రక్రియల గురించి ఎన్నో అనిర్వచనీయమైన పరిశోధనలు సాగించారు. తన ఆవిష్కరణలు అన్నింటినీ రెండు పుస్తకాల రూపంలో ‘Response in the Living and Non-living’ (1902) మరియు ‘The Nervous Mechanism of Plants’ (1926) పదిలపరిచి వృక్ష సంతతికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను భావి తరాలకు అందించారు. ఆయన అందించిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని నేటికీ ఎంతో మంది వృక్ష ధర్మ శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలకు ఆది గ్రంధంగా వాడుకుంటున్నారు. ఆయన నిర్వచించిన ‘జంతువులకు, వృక్షాలకు మధ్యన ఉన్న సమాంతర దృక్పథాలు’ నేటికీ ఎంతోమంది జీవ భౌతిక రసాయన శాస్త్రవేత్తలకు ముఖ్యాంశాలు అవుతున్నాయి. కనుకనే 1920 లో ఎంతో ప్రతిష్టాత్మకమైన Fellow of Royal Society గా జగదీష్ చంద్రబోసు గుర్తింపు పొంది పేరు ముందు సర్ అనే బిరుదును తగిలించుకొన్నారు.
బోస్ ఇన్స్టిట్యూట్ అధినేతగా 20 ఏళ్ళు పనిచేసి ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించి ఎన్నో శాస్త్రీయ ఆవిష్కరణలకు మూలపురుషుడైన జగదీష్ చంద్రబోసు గారు నవంబర్ 23, 1937 న పరమపదించారు. కానీ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. వాటికి కూడా స్పందించే గుణం ఉంది అని నిరూపించి, మనం వదిలే కర్బన ధూళిని పీల్చుకొని మనకు ప్రాణవాయువును అందించే మంచి శ్రేయోభిలాషులు మన చుట్టూ ఉన్న పచ్చని చెట్లు అని బోధించిన ఆ శాస్త్రీయ గురువుకు నివాళులు అర్పిస్తూ 'వృక్షో రక్షతి రక్షితః'.