Menu Close
Uma-Bharathi-HG-02
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

13

hrudayagaanam-13

'ఆనందో బ్రహ్మ' సినిమాకి పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్ చేరారు పారూ, సీతమ్మ. శాంత, రామ్ కూడా వచ్చి, ఒక్క రోజు షూటింగ్ చూసి తిరిగి కాకినాడ వెళ్లిపోయారు.

ఆ మరునాడు కిరణ్, మీనాక్షీలతో పాటు వారి కుటుంబాలు షూటింగ్ చూసేందుకు వచ్చారు. పారూని మేకప్ లో చూసి "చాలా బావున్నావు" అన్నారందరూ.

గమనిస్తున్న కిరణ్ మాత్రం "బావున్నావు సరే, నీవు ఇక పాట మానేసి సినీతార అవ్వచ్చునేమో! మాకు అందకుండా అయిపోతావేమో పారూ." అన్నాడు నవ్వుతూ.

పారూ మాత్రం కిరణ్ మాటలకి చిన్నబుచ్చుకుంది. "నేనెక్కడికి వెళతానులే కిరణ్ బావా! మీ అందరి ఎదుటే ఉంటాను. ప్రామిస్." అంటూ నవ్వేసింది.

అక్కడే ఉన్న సీతమ్మ గారు కలగజేసుకుని, "మన పారూ చాలా నిరాడంబరమైన యువతి కిరణ్. సంగీతంలో ఆమెకున్న సహజ నైపుణ్యాన్ని ప్రపంచం గుర్తించాలన్నదే మా అందరి అభీష్టం. అంతే తప్ప సినీనటి అవ్వాలని తాను కూడా అనుకోడంలేదు." అన్నారు.

****

సాయంత్రం చీకటి పడ్డాక సీతమ్మ వద్దకు వచ్చిన కిరణ్ "నానమ్మగారు! పారూ ఇవాళ రాత్రి తొమ్మిది వరకు ఉండాలంట. అమ్మావాళ్ళు ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నారు. దారిలో మిమ్మల్ని గెస్ట్-హౌజ్ లో దింపి వెళ్ళగలరు. మీరు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. నేనిక్కడ పారూకి తోడుండి పనయ్యాక తీసుకువస్తాను." అని సూచించాడు కిరణ్.

మీనాక్షి సహా అందరూ పారూకి చెప్పి బయలుదేరిపోయారు.

****

ప్యాక్-అప్ చెప్పగానే, “పద పద పారూ! హైదరాబాదులోనే బెస్ట్ ఐస్-క్రీం తినిపిస్తాను. కారులోనే కూర్చుని తినవచ్చు.” అంటూ కార్ స్టార్ట్ చేసాడు.

డ్రైవ్ చేస్తూ, “నీవు వేసుకున్న హార్ట్ లాకెట్ బాగుంది.” అంటూ మెచ్చుకున్నాడు కిరణ్.

“అవును... నాకు చాలా ఇష్టమైన లాకెట్. థ్యాంక్యూ వెరీ మచ్ బావా! అప్పుడు చెప్పలేదు కదా!” అంది మెడలోని లాకెట్ చేత్తో తాకుతూ.

“హార్ట్ మీద లాకెట్ ఉంది సరే... నీ హార్ట్ లో నా గురించి ఏమనుకుంటావు? మంచివాడినా? కాదా? నేనంటే ఇష్టమా? లేదా?” అని సూటిగా అడిగాడు కిరణ్.

ఒక్కసారిగా బావ అలా అడగడంతో ఏమనాలో తెలీలేదు పారూకి. ఐస్-క్రీం పార్లర్ డ్రైవ్-ఇన్ లో కార్ పార్క్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసాడు.

“చెప్పు. నీవేమన్నా...నో ప్రాబ్లెమ్. జవాబైతే కావాలి. నేనంటే ఇష్టమే ఐతే గ్రేట్. లేదంటే కూడా ఒకే. చెప్పానుగా. నేనూ ఓ అభిమానిగా ఉండిపోతానులే.” అన్నాడు నవ్వేస్తూ కిరణ్.

ఉక్కిరిబిక్కిరయింది పారూ. జవాబివ్వకపోతే కిరణ్ ని దూరం చేసుకోడమే అవుతుంది. తన కుటుంబంలోని వారందరికీ కూడా కిరణ్ అంటే ఎంతో ఇష్టం. ధైర్యం తెచ్చుకుని, నోరు విప్పింది.

“బావా నీవంటే ఎప్పటినుండో నాకిష్టం. అందుకేగా ప్రతిరోజూ నీతో మాట్లాడుతాను. కాకపోతే.. నా పట్ల నీకు ఇటువంటి ఆలోచన ఉంటుందని ఊహించలేదు. ఉన్నట్టుండి ఇలా అడిగితే మరి ఏమనగలను? నువ్వు నాకు అప్పుడే నచ్చావ్ కిరణ్ బావా!” అనేసింది పారూ.

ఇరువురి నడుమ కొద్దిక్షణాల మౌనం తరువాత... పారూ చేతిని తీసుకుని తన ఎదపై ఉంచాడు.

తలతిప్పి అతని వంక చూసిన పారూతో “గ్రేట్... నిజానికి నిన్ను కలిసేంత మటుకు నీలాంటి ఆడపిల్లల్ని చూడనే లేదు. నీ స్వచ్ఛమైన ఆలోచన, నడవడి నన్ను ఆకట్టుకున్నాయి పారూ! నీలోని సంగీత నైపుణ్యం, నీ వృత్తి పట్ల అంకిత భావం, నీ మంచి మనసు ఎవరినైనా ఆకర్షిస్తాయి. అలా ఈ నాలుగేళ్లలో నాకు తెలియకుండానే.. నా మనసులో తిష్టవేశావనుకో.” అన్నాడు తన మాటగా కిరణ్.

ఇంతలో,  ఆర్డర్ చేసిన ఐస్-క్రీం రావడంతో ...  మెల్లగా తినసాగారు. “నీకు తెలుసునా బావా? అమ్మ, అమ్మమ్మలకి కూడా నువ్వంటే ఇష్టం. అందుకే నాకు ధైర్యం.” అంది పారూ.

“అవునా? అది నాకు తెలుసును మేడమ్. నువ్వంటే కూడా మా ఇంట్లో తాతగారికి, నాన్నకి ఎంతో మురిపెం. అమ్మకి నీ నడవడి ఇష్టం.” అన్నాడు కిరణ్.

పక్కనే ఉన్న ఫోన్ మోగడంతో... స్పీకర్ మీద ఉంచి ఆన్సర్ చేసాడు. అటునుండి వకుళ.

“కిరణ్ ఎక్కడరా నీవు?” ఆతృతగా అడిగిందామె.

“ఏమయిందమ్మా?” అడిగాడు కిరణ్.

“మీనాక్షిని హాస్పిటల్లో చేర్చారు. అపోలో ఎమెర్జెన్సీలో ఉంది. నీవు ఎప్పుడొస్తావు? శ్రీను మామయ్య కంగారు పడుతున్నాడు.” అంటూ ఫోన్ పెట్టేసింది.

“ఇంటికి వెళ్లే దారిలోనే ఉంది హాస్పిటల్. పద” అంటూ కార్ స్టార్ట్ చేసాడు కిరణ్.

****

నేరుగా ICU వద్దకి చేరారు. కిరణ్ని చూడగానే ఆవేదనతో కుప్పకూలారు శ్రీనివాస్ గారు. కన్నీరు మున్నీరైంది విమల. డాక్టర్ తో మాట్లాడ్డానికి వెళ్ళాడు కిరణ్.

ఓదార్చేందుకు ఆయన పక్కన కూర్చున్న పారూ వంక చూస్తూ, “నా కూతురు ఏమవుతుందో!” అంటూ దుఃఖించ సాగారు శ్రీనివాస్.

మీనాక్షి విషయం ఇంకా పరిశీలనలో ఉండడంతో తిరిగి వచ్చిన కిరణ్ “అసలేం జరిగింది అత్తయ్యా?” అని అడిగాడు పక్కనే కూర్చుంటూ.

“ఊహించలేదు కిరణ్. శిల్పారామం నుండి ఇల్లు చేరాక భోజనం చేయడానికి వస్తుందని అన్నీ బల్లమీద సర్దాను. ఎంత సేపు పిలిచినా రాకపోతే గదిలోకి వెళ్లాను. అదృష్టం ఏమంటే... తలుపులు బార్లా తీసే ఉన్నాయి.” అంటూ ఇక ఆ పైన దుఃఖంతో మాట రాలేదు విమలకి.

“ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుని, మమ్మల్ని సతాయించడంలోనూ ఆనందం పొందుతుంది అనుకున్నాను గానీ ఇలా...” అంటూ తల వంచుకున్నారు శ్రీనివాస్.

కాస్త తేరుకున్న విమల, “అంత బాధ ఏమొచ్చిందో.. అంత కోపం దేనికో.. గదిలోకెళ్ళి చూస్తే మణికట్టు కోసుకోవడం వల్ల తీవ్రమైన రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడుంది మీనా.” అందామె.

ఇక ఆ తరువాత క్షణాలమీద మీనాక్షిని హాస్పిటల్ కి చేర్చారట.

కన్నీరుమున్నీరవుతున్న అత్తయ్యా, మామయ్యలని అంతటి దుఃఖంలో వదిలి వెళ్లలేక, కాలేజీకి సెలవు పెట్టి, మీనాక్షి తేరుకుని ఇంటికి వెళ్లేంతమటుకు వారికి సాయంగా ఉండదలిచాడు కిరణ్.

****

మీనాక్షి అనాలోచిత చేష్టతో రెండు కుటుంబాలు కొంత నిస్సత్తువయ్యాయి.

సంఘటన జరిగిన మరునాడు రామనాధం గారి ఇంట పెద్దవాళ్ళు ముగ్గురూ అన్యమనస్కంగా భోజనానికి కూర్చున్నారు. ముందుగా పెద్దాయనే మౌనం వీడి, “ఎంతో మంచి మనుషులు శ్రీనివాస్, విమల.  సమాజానికి వారందించే సేవలు, చేపట్టే సంక్షేమాలు ఎన్నెన్నో. అయినా ఇలా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడుతుంటారు.

సంతానం లేదనేగా మీనాక్షిని దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఆ అమ్మాయి తల్లితండ్రుల్ని సంతోషపెట్టే విధంగా నడుచుకుంటే బావుణ్ణు.” తన మనసులోని మాట బయట పెట్టారు రామనాధం.

కాసేపటికి, “అవును నాన్నగారు! మన కిరణ్ చేయి పట్టుకుని స్కూలుకి వెళ్ళింది మీనాక్షి. వాడిని అనుసరిస్తూ వాడి మాటే వింటుంది ఆ అమ్మాయి. తన తల్లితండ్రుల్ని మాత్రం చిటికిన వేలి మీద ఆడిస్తుంది.  ఏమైనా, ఈ దుర్ఘటన బాధాకరమే.” అంటూ వాపోయాడు శ్రీనాధం.

అప్పటివరకు మౌనంగా ఉన్న వకుళ, “ఇక్కడ మరో విషయం కూడా ఉంది మామయ్యా, కిరణ్ని అల్లుడుగా చేసుకోవాలని విమల ఆలోచన. మీనాకి మన కిరణ్ అంటే ఇష్టం అని మనకీ తెలుసును.

ఆ మధ్యన ఓ సారి… కిరణ్, మీనా ల ఎదుటే విమల ఆ విషయం ప్రస్తావించినప్పుడు.. మీరూ విన్నారుగా! తనకి మీనా పట్ల అటువంటి భావన లేదని, ఆమెని ఒక బాధ్యతగా, స్నేహితురాలిగానే పరిగణిస్తానని కిరణ్ అనడం, అది తట్టుకోలేక మీనా తిండి మానేసి నీరసించి హాస్పిటల్లో చేరడం.. మూడేళ్లు దాటినా ఇంకా నాకు బాగా గుర్తు. ఈ సారి ఈ సంఘటన కూడా అటువంటి కారణంతోనే అయివుంటుందని నా ఉద్దేశం.” అంది వకుళ.

****

ఉన్నట్టుండి మీనాక్షి అలా ఆత్మహత్యా యత్నం చేసి తన తల్లితండ్రుల్ని బాధించడం జీర్ణించుకోలేకపోతుంది పరమేశ్వరి.

అందరినీ అదిరించి బెదిరించేందుకు మీనాక్షి చేసిన ఆత్మహత్యాయత్నం కిరణ్ కి మాత్రం అసహనాన్ని కలిగించింది. వింత పోకడలతో అందరినీ మనస్తాపానికి గురిచేస్తున్న మీనాక్షి వైఖరి నచ్చలేదు.

శిల్పారామంలో పారూతో మరికొంత సమయం గడపలేక పోయినందుకు కూడా బాధపడ్డాడు.

****

షూటింగ్ ముగించుకుని హైదరాబాదు నుండి తిరిగి కాకినాడ చేరిన పారూ, సీతమ్మ నాలుగు రోజుల పాటు విశ్రాంతిగా గడిపారు. మనమరాలు అన్యమనస్కంగా తిరగాడ్డం గమనించిన అమ్మమ్మ మనమరాలిని ప్రశ్నించింది.

కొద్దిక్షణాలు మౌనం తరువాత పారూ నోరు విప్పింది. మీనాక్షి ఆత్మహత్యా ప్రయత్నం గురించి ప్రస్తావించింది. తాము హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మీనాక్షి తల్లితండ్రుల పరిస్థితి హృదాయవిదారకంగా ఉందంటూ, ఆ దుర్ఘటన గురించి వారు చెప్పిన మాటలు పూస గుచ్చినట్టు అమ్మమ్మకి చెప్పింది.

“ఆ అమ్మాయి నీ పట్ల అక్కసుగా మాట్లాడుతుందని అనుకున్నాను. కానీ తనని తాను హింసించుకొనే ఈ కోణం మామూలు విషయం కాదు. అలా తలుపులు బార్లా తెరచి ఉంచి మరీ మణికట్టు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిందంటే, తల్లి తండ్రులని, బంధువుల్ని బెదిరించే చర్యగా భావించవచ్చునేమో! నా అంచనాలో అది అంతవరకే. కానీ అలా ఎందుకు చేస్తుంది? అన్నది ప్రశ్న. మరి ఈ విషయంలో కిరణ్ ఏమన్నాడు?” అడిగారు సీతమ్మ.

“మేము ఆ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేప్పటికి అర్ధరాత్రి దాటింది. మర్నాడు పొద్దుట నుండి రాత్రి వరకు నేను షూటింగుతో బిజీ కదా అమ్మమ్మా. 'మీనా కోలుకుంటుంది... నేను త్వరగా కాలేజీకి వెళ్ళిపోతాను' అంటూ బావ నుండి టెక్స్ట్ మెసేజీలు తప్ప... పెద్దగా మాట్లాడింది లేదు. ఈ లోగా మనకంటే ముందే బావ ఊరెళ్ళిపోయాడు. కానైతే...” అంటూ శిల్పారామం నుండి ఇంటికి వచ్చే దారిలో ఐస్-క్రీం కోసం ఆగినప్పుడు తమ నడుమ జరిగిన సంభాషణ గురించి... ఏదీ దాచకుండా చెప్పింది పారూ.

“చాలా సంతోషం! దేవుని దయ. కానయితే తొందర పడవద్దు. ఎలాగైనా మీనాక్షి సంగతి మాత్రం కిరణ్ నుండే తెలియాల్సి ఉంది. సరేనా? నేను చెప్పేది అర్ధమయిందా?” అని అడిగిన అమ్మమ్మకి ‘అర్ధమయింది’ అన్నట్టుగా తలాడించింది మనమరాలు.

****

ఆదివారం పొద్దుటే - ఆస్ట్రేలియా నుండి వేలుస్వామి అయ్యర్ అనే వ్యక్తి ఫోన్ చేసాడు. తనని తాను 'పెర్త్ లోని ఇండో-ఆసియన్ కల్చరల్ అసోసియేషన్' కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. ‘మ్యూజిక్ సొసైటీ’ స్థాపకుడు ‘నేథన్ చెరియన్ ద్వారా పరమేశ్వరి బయో-డాటా, కచేరీ వీడియోలు సేకరించామని తెలియజేశాడు.

దేవీ నవరాత్రి పండుగ సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పరమేశ్వరి గాన కచేరీ ఏర్పాట్ల గురించి మాట్లాడేందుకు త్వరలో తాను ఇండియాకి వచ్చినప్పుడు కలుస్తానని చెప్పి సెలవు తీసుకున్నాడు.

ఊహించని విదేశీ పర్యటన అవకాశానికి ఇంటిల్లిపాదీ అమితానందం పొందారు.

పునీత్ మాత్రం "అమ్మయ్యా! కొద్దిరోజులు ఇంట ఏ గొడవా ఉండదన్నమాట. ప్రశాంతంగా జీవించవచ్చు. వెళ్ళే ముందు మాత్రం 'హీరో ఎలెక్ట్రిక్ ఎలెక్స్' అనే స్కూటర్ కొనిపెట్టండి. హాయిగా మీరు ఫారిన్ టూర్ చేసుకోండి. ఇదిగో జానీని కూడా తీసుకువెళ్ళండి." అంటూ హార్లిక్స్ కప్పు అందుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు.

****

ఆ మరుసటి రోజు ఆస్ట్రేలియా నుండి నేథన్ చెరియన్ ఫోన్ కాల్ అందుకుంది పారూ. అందరి యోగక్షేమాలు కనుక్కుని, కుటుంబ సభ్యులు కూడా వినేలా తన కాల్ స్పీకర్ మీద ఉంచమని కోరాడు.

"నమస్తే రామ్ గారు, శాంత గారు, గ్రాండ్-మా గారు. ఇక్కడి ఆలయ నిర్వాహకులు వేలుస్వామి అయ్యర్ మీతో ప్రస్తావించిన కచేరీలు కాక, 'నేషనల్ మ్యూజిక్ సొసైటీ' తరఫున మేము మ్యూజిక్ కాన్సర్ట్స్ ఏర్పాటు చేస్తాము. ప్రోగ్రామ్స్ విషయమై పరమేశ్వరికి ప్రపోజల్ ప్యాకేజీ పంపిస్తాము. మీ నుండి రెస్పాన్స్ వచ్చాక నేను, వేలుస్వామి కలిసి ఏర్పాట్లు చేసుకుంటాము. మళ్ళీ మాట్లాడుతాను. ఇక ఉంటాను" అని ముగించాడు నేథన్.

****

రాత్రి వంటిల్లు శుభ్రం చేసి పారూ తన గదిలోకి వచ్చేప్పటికే పునీత్ అక్కడ వేచి ఉన్నాడు.

"ఏమిటి పునీత్? ఏమి కావాలి? అడిగింది తమ్ముణ్ణి.

"చూడక్కా, నీకు చేతి నిండా డబ్బు ఉంటుంది. బాగా సంపాదిస్తున్నావు కదా. సంతోషమే. ఎలక్ట్రిక్  బైక్ నాకు తప్పక ఇప్పించు. అది కాక... నా ఫ్రెండ్ సరోజకి నీవంటే చాలా ఇష్టం. తన పుట్టినరోజు రేపే. నీ వద్ద ఉన్న ఏదైనా కొత్త వస్తువు ఇస్తే, తనకి గిఫ్ట్ గా ఇస్తాను. ఈ అమ్మాయి 'సరోజ' కంప్యూటర్ క్లాసులో నాకు అన్నింటా సాయం చేస్తుంది తెలుసా?" అంటూ ఏకబిగిన ఏకరవు పెట్టాడు పునీత్.

వాడి మాటలని ఎలా అర్ధం చేసుకోవాలో తోచలేదు పారూకి. నిముషం ఆలోచించింది.

వాడిని ప్రేమగానే మాట వినేలా చేసుకోడం మంచిదనుకుని "సరే పునీత్ సరోజకి కానుక గురించి నేను చూస్తాను. స్కూల్ కి వెళ్లే ముందు కనబడు. బైక్ విషయం అంటే... నాన్నకి చెబుతాను. 'ఫాదర్ నోస్ బెస్ట్' అంటారుగా. సరేనా? వెళ్లి పడుకో. గుడ్ నైట్." అంది తమ్ముడి భుజంపై మృదువుగా తట్టి.

****

శనివారం గుడికి వెళ్లొచ్చిన సీతమ్మ, అందరితో కలిసి టిఫిన్ చేస్తూ.. "ఈ ఇంటి కిరాయి నన్ను కట్టనిస్తే, బాసర కొలువు నుండి విశ్రాంతి తీసుకుని ఇక్కడే ఉండగలను. మీరు సరే అంటే ఆ ప్రయత్నాల్లో ఉంటాను." అని ప్రకటించారు.

"అలా ఎందుకు?" అని ఏదో అనబోయిన శాంతని వారించాడు రామ్.

సీతమ్మ పట్టుబట్టడంతో... "మీ మాట ఏనాడు కాదన్నాము అత్తమ్మా? మీ ఇష్టప్రకారమే కానివ్వండి. ఇకపోతే, పారూ కోసం మీరు కన్న కలలన్నీ సాకారం చేసుకుంటున్నారుగా! సంతోషం." అన్నాడు రామ్.

****

ఆస్ట్రేలియా నుండి ఇండియా చేరిన వేలుస్వామి గారు కాకినాడకి విచ్చేసి, దేవీ నవరాత్రుల సందర్బంగా ఆస్ట్రేలియా లోని ముఖ్య పట్టణాల్లో సంగీత గాన కచేరీలకి పరమేశ్వరి రామ్‌కుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అంతే కాక, సంగీత విద్వాంసురాలైన సీతమ్మ గారిని, పరమేశ్వరి గురువు స్థానంలో శాంతని కూడా కచేరీల్లో పాల్గొనవలసిందిగా ప్రత్యేకంగా కోరాడు వేలుస్వామి.

****

ఆ మరునాడే, నేథన్ చెరియన్ తోనూ మ్యూజికల్ కాన్సర్ట్స్ కి, మరో ఒప్పందం కుదిరాక, గుడికి వెళ్లి అన్నదాన కార్యక్రమం చేసుకొచ్చారు పారూ, సీతమ్మలు.

పరమేశ్వరి మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారయిన విషయం తెలుసుకుని బంధువులు, జోసెఫ్ దంపతులు శుభాకాంక్షలు తెలియజేసారు.

కిరణ్ కూడా .."ఈ ప్రపోజల్ అద్భుతమైన అవకాశం. నీ కెరీర్ కి బ్రహ్మాండమైన బూస్ట్. అభినందనలు పారూ. నువ్వు లక్కీ ఫెలో!" అన్నాడు.

****

ఆ మరునాడు సీతమ్మ గారికి విడిగా కిరణ్ ఫోన్ చేసి, “విదేశీ కార్యక్రమాల దృష్ట్యా పారూకి మంచి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించాలన్నా, కచేరీలకి చీరలు తీసుకోవాలన్నా మీరు ఓ మారు హైదరాబాద్ రావాలి. నాకు తెలిసిన డిజైనర్ అనిల్ రాథోడ్ ని సంప్రదించవచ్చు. ఆరునెలల ముందే వారి షో-రూమ్ కి వెళ్లి, మాట్లాడి, సెలెక్షన్స్ చేసి పని ఒప్పజెప్పాలి నాయనమ్మ గారు!” అని సూచించాడు.

అంతా విన్న సీతమ్మ గారు, "నేను, శాంతా కూడా అనుకున్నాము. సంప్రదాయం నుండి పాశ్చ్యత్త దుస్తుల వరకు కావాలి. ఎప్పుడు బయలుదేరమంటావో చెప్పు. పారూతో మేము కూడా వస్తాము." అన్నారు.

"వచ్చే వారం నేను హైదరాబాదులో ఉంటాను. వీలు చేసుకుని రండి నానమ్మ!" అన్నాడు కిరణ్.

****

రాత్రి భోజనాల సమయంలో రామ్ ని ఉద్దేశించి,"ఓ రెండు రోజులు మీకు సమయం ఉంటే బాసర వెళ్ళేసి వద్దామా అల్లుడుగారూ?" అని సీతమ్మ అడిగిన మరునాడే, రామ్ వెంట రాగా బాసర వెళ్లి, తన పదవీ విరమణ తతంగం పూర్తి చేసుకున్నారు సీతమ్మ. ఉత్సవాలకు, పెద్ద పండుగలకు పరివారంతో సహా వస్తానని, తమ ట్రస్ట్ నుండి ఆలయానికి నిధులు ఎప్పటిలా అందుతాయని ధర్మకర్తకి తెలియజేసి తిరుగు ప్రయాణమయ్యారు.

****

కాస్ట్యూమ్స్, వాటికి తగ్గ జ్యువెలరీ ఎంపిక చేసేందుకు అమ్మా, అమ్మమ్మలు పారూ వెంట హైదరాబాదు చేరారు. ఫ్రెష్ అయి షో-రూమ్ కి బయలుదేరారు. కిరణ్ కోరగా వారితో మీనాక్షి కూడా వెళ్ళింది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in October 2025, కథలు

2 Comments

  1. Uma Kosuri

    కుమారి గారు, నమస్తే, సమయం తీసుకుని చదివినందుకు, అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.

  2. Kumari Samineni

    చాల బాగుంది! తరువాతి భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *