9
మాలిని వాళ్ళ గెస్ట్-హౌజ్ లోనూ, పారూ సంగీత సాధనకి అనువైన ప్రదేశంగా… విశాలమైన చలువరాతి గది ఉంది. గదిలో అతిపెద్ద ఆక్వేరియం, గోడలకి అందమైన చిత్రపటాలు ఉన్నాయి.
ఇకపోతే, గెస్ట్-హౌజ్ ని కనిపెట్టుకుని ఉండేందుకు, మల్లయ్య, అతని కూతురు లలితమ్మ అక్కడే వారి క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు.
అనుకున్న ప్రకారమే నెలరోజుల తరువాత శాంతా, రామ్ పిల్లలతో హైద్రాబాదు చేరారు. అప్పటికే కిరణ్ కాలేజీకి వెళ్ళిపోవడంతో అతన్ని కలవలేకపోయారు.
హైదరాబాద్ నగరమంతా తిరిగి చూడ్డమే కాకుండా రామనాధం గారింట వీలైనన్ని సాయంత్రాలు గడుపుతుంది రామ్ కుటుంబం. తన బాబాయి రామనాధంతో తిరిగి సత్సంబంధాలు ఏర్పడ్డం శాంతకి సంతోషమనిపించింది. రెండు కుటుంబాల్లోని ఆడవారు, మగవారు కూడా చక్కగా కలిసిపోయారు.
బంధువులని కలిసేందుకు ఓ రోజు వీలు చేసుకుని కిరణ్ హైదరాబాద్ వచ్చినప్పుడు... మరో మారు అన్నగారి కుటుంబానికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు రామనాధం గారు.
పునీత్, జననీలతోనూ స్నేహితుడిలా కలిసిపోయిన కిరణ్, తన ప్రవర్తనతో శాంత, రామ్ లని కూడా యిట్టే ఆకట్టుకున్నాడు.
అన్నాళ్ళ క్రితం స్వర్గస్తులైన తన అన్నా, వదిన గార్ల మనమలని కలిసిన ఆనందంతో... రామనాధం గారు పారూకి ఐ-ఫోన్, కవలలకు ఐ-పాడ్స్ కానుకలుగా అందించారు.
**
కిరణ్ని కలవడం, అతనితో గడిపిన సమయం... పారూకి ఓ చక్కని అనుభూతినిచ్చాయి.
ఇంటర్న్షిప్ ముగిసి ఆమె తిరిగి కాకినాడ వెళ్ళాక కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి, పాశ్చాత సంగీతంలోనూ కృషి చేయమని, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడ్డం అలవర్చుకోమని ప్రోత్సహించాడు కిరణ్.
పారూ, కిరణ్ ల నడుమ చిగురిస్తున్న స్నేహాన్ని కాదనలేదు శాంతా, సీతమ్మలు. అతడు చెప్పేవన్నీ మంచి విషయాలే అని ప్రోత్సహించారు.
పారూ సంగీత సాధనతో పాటు, చదువు, టెక్నాలజీ శిక్షణ కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు పునీత్ వల్ల చిన్నచిన్న గొడవలు తప్ప ఇంట్లో సీతమ్మ గారి సహకారంతో శాంత జీవనం కూడా మెరుగ్గానే సాగుతుంది.
**
ఆ ఆదివారం అన్ని కార్యక్రమాల నుండి విరామం తీసుకుని, తండ్రితో పొద్దుటే పరమేశ్వరి మార్కెట్ కి వెళ్ళింది.
కవలలకి టిఫిన్ పెడుతూ “ఇవాళ అక్క పుట్టినరోజు కదా! మీకిష్టమైన కేక్ తెచ్చి మీచేత కోయిస్తానంది. మీరంటే అంత ప్రేమ దానికి. ఇకపైన అక్కతో మీరు స్నేహితుల్లా మసులుకోవాలి మరి.” అంది శాంత.
“ఇక చాలమ్మా. పొద్దున్నే మొదలుపెట్టావు అక్క జపం. నాకందుకే కోపం వస్తుంది. ఇంటాబయటా అందరూ పారూని ఒక దేవతలా పొగుడుతారు. మమ్మల్ని దానిలా ఉండమంటారు. మేము మాత్రం మీ పిల్లలం కామా? మేం మాలాగానే ఉండకూడదా?” అంటూ అసహనంగా తింటున్న ప్లేటుని తోసేసాడు పునీత్.
ప్లేటుని తిరిగి వాడి ముందుకు జరుపుతూ... “అది కాదురా. మీముగ్గురూ మా పిల్లలే. అందుకే అక్కతో పోల్చి, ఆమెలా మంచిగా ఉండమనేది. అంతేకాని మీరేమీ తక్కువని కాదు. అది అర్ధం చేసుకోండి.” అంది తన అసహనం కనబడనీయకుండా శాంత.
తన కడుపున పుట్టిన బిడ్డల్లో ఉన్న వ్యత్యాసాలకి కలవరపడుతూ.. వంటింట్లోకి నడిచింది.
**
సాయంత్రం ఆరింటికల్లా పారూ పుట్టినరోజు వేడుకకి జోసెఫ్ దంపతులు విచ్చేసారు. ఆ వెనుకే పారూ స్నేహితురాళ్ళు, పునీత్, జననీల క్లాస్-మేట్స్ కొందరు వచ్చారు.
పెద్దవాళ్లు హాల్లో, చిన్నవాళ్లంతా తోటలోని జాలీ గదిలో స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
డోర్-బెల్ మోగడంతో అందరి దృష్టి అటుగా మళ్లింది. ఊళ్లోని పేరున్న ఎవరెస్ట్-బేకరి నుండి… ఓ ట్రాలీ మీద నాలుగడుగుల కేక్ తో పాటు పీజ్జాలు, బర్గర్ లు, సమోసా, మిర్చిబజ్జీ, సాఫ్ట్-డ్రింక్స్ వగైరాలని హాల్ మధ్యకి తెచ్చి బల్లలపై సర్దారు ఇద్దరు యువతులు.
ఎర్ర గులాబీల గుచ్చాన్ని పరమేశ్వరికి అందించి, "హైదరాబాద్ నుండి రామనాధం, కిరణ్ నాథ్ ల పుట్టినరోజు కానుక మీకు." అని తెలియజేసి సెలవు తీసుకున్నారు.
‘ఇవాళ పారూ పుట్టినరోజని కిరణ్ వాళ్లకి తెలిసే అవకాశం లేదే! ఎవరు చెప్పుంటారు' అనుకున్న శాంత, మాలిని వంక చూసింది.
"కిరణ్ నాక్కూడా మంచి ఫ్రెండ్ కదా! మొన్న ఫోన్ చేసినప్పుడు పారూ పుట్టినరోజు గురించి చెప్పాను. ఇదంతా తానే ప్లాన్ చేసాడు." అంది నవ్వేస్తూ మాలిని.
ఆ తరువాత పుట్టినరోజు వేడుక ఆహ్లాదంగా జరుపుకున్నారు. హైదరాబాదు నుండి శుభాకాంక్షలు అందుకున్న పారూ సంతోషానికి అవధులు లేవు. పారూ ఆనందాన్ని చూసిన సీతమ్మ గారు, శాంత, రామ్ కూడా సంతోషించారు.
**
పొద్దుటే పూజ ముగించుకుని సీతమ్మగారు హాల్లోకి వెళ్లారు. పెద్దమ్మకి కొబ్బరి నీళ్ళు, రామ్ కి కాఫీ తెచ్చి అందించింది శాంత.
"ఈ రోజు సెలవు పెట్టాను శాంత. మెడికల్ చెకప్ ఉంది. అదయ్యాక, కారుకి కొత్త టైర్లు వేయించాలి. త్వరగా టిఫిన్ పెడితే... తిని బయలుదేరుతాను." అన్నాడు రామ్.
"అల్లుడుగారూ, జనవరి నుండి జరిగే ప్రోగ్రాముల తేదీలు తెలిసాక... అనుగుణంగా మీరు సెలవు పెట్టుకోవాలి. ఈ లోగా మనం వాద్యబృందాన్ని సమకూర్చుకోవాలి. వాళ్ళతో సాధన మొదలుపెట్టాలి. ఓ మారు ఆలయ కార్యదర్శితో మాట్లాడుతాను." అన్నారు సీతమ్మ గారు.
"వాద్యబృందం అంటే... కాకినాడలో మనకి తెలిసిన పేరున్న కళాకారులు ఉన్నారు. ముందే ఒప్పందం కుదుర్చుకోవాలి. మీరైతే గుడి కార్యదర్శితో మాట్లాడండి. వెళ్లి కలుద్దాము. ఇప్పుడు కాసేపు పని మీద బయటికి వెళ్ళొస్తాను.” అంటూ బయటికి నడిచాడు రామ్..
**
రామ్ తిరిగి ఇల్లు చేరేప్పటికి, పునీత్ తల్లితో గొడవ పడుతున్నాడు. "అమ్మా ఈ సారికి రిపోర్ట్ కార్డు మీద నీవే సంతకం పెట్టు. నాన్నగారిని అడిగితే తిడతారు. ట్యూషన్ పెడతా అంటూ గొడవ పెడతారు." అని పునీత్ అనడం...
"ప్రతి సారి నాన్న కదా సంతకం చేసేది. ఈ ఫెయిల్యూర్ కార్డు మీద సంతకం నేను చేస్తే నన్ను కోప్పడతారు. నేను చేయనురా. నీవసలు ఓ అడ్డగాడిదలా తయారయ్యావు. మాట వినవు. ఇంటా బయటా అందరితో గొడవలు పెట్టుకుంటావు. పాకెట్-మనీకి నా వెంట పడతావు. నిన్ను చూసి జనని కూడా చెడిపోతుంది. నీకు మీ నాన్నే సరయిన గురువు. నేను చేయను పోరా." అని తల్లి వాడిని కోప్పడం వింటూ షూస్ విప్పి కొడుకు విషయం ఆలోచిస్తూ కాసేపు మౌనంగా హాల్లోనే కూర్చున్నాడు రామ్.
డోర్-బెల్ మోగడంతో లేచి వెళ్లి పోస్ట్-మన్ నుండి సీతమ్మ గారి పేరిట వచ్చిన కవర్ అందుకున్నాడు. శాంతని పిలచి "అత్తమ్మ లేచారేమో చూడు. ఆలయం వారు డాకుమెంట్స్ పంపారు. ఏర్పాట్లు మొదలు పెట్టుకోవాలి." అంటూ పునీత్ గది వైపు నడిచాడు రామ్.
**
కొత్త వాద్యబృందంతో సంగీత సాధన ... పారూకి ఆసక్తికరంగా ఉంది. కార్యసిద్ధికి మూలవిరాట్ అయిన సీతమ్మ గారు ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు.
'టెంపుల్ టైమ్స్' అనే పత్రికలో ‘యువగాయని పరమేశ్వరి రామ్‌కుమార్ గాన కచేరీలు’… కాకినాడ, తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, మంగళగిరిలో సంక్రాంతి నుండి జరగనున్నాయన్న వార్త వెలువడింది.
మరో పక్క, ప్రణాళిక ప్రకారమే... క్రిస్ట్మస్ వేడుకల సందర్బంగా జరగనున్న'మ్యూజికల్ నైట్' లో పాల్గొననున్న యువగాయని పరమేశ్వరి రామ్‌కుమార్ తో పాటు ఆస్ట్రేలియా యువగాయకులు నేథన్ చెరియన్, లహరి చెరియన్ పాల్గొంటారని, ప్రముఖ సినీనటులు అతిధులుగా రానున్నారనీ తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో వార్త వెలువడింది.
కార్యక్రమాల పట్ల జనం నుండి ఆసక్తి కనబడింది.
తమ కూతురుకి, ఆమె గాన నైపుణ్యానికి వస్తున్న స్పందనకి రామ్‌కుమార్, శాంత కూడా అబ్బురపడ్డారు.
"అత్తమ్మా, మీ చేతుల్లో నా బిడ్డకి బంగారు భవిష్యత్తు కనబడుతుంది. మీ ఋణం ఎలా తీర్చుకోగలనో చెప్పండమ్మా." అంటూ భావోద్వేగానికి గురయ్యాడు రామ్ పొద్దుటే వార్తా పత్రికల్ని చూసి.
కొబ్బరి నీళ్ళు సేవిస్తున్న సీతమ్మ గారు ఒకింత చలించిపోయారు. "అల్లుడు గారూ, పారూ కోసమే కాదు, నా చెల్లెలు మాణిక్యాంబ కోసం కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆమె నుండి పారూకి ప్రాప్తించిన అసమాన గాన నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రపంచానికి చూపించే అవకాశం... మీ సహకారం వల్లనే సాధ్యం. మనం కలిసి చేస్తున్న యజ్ఞమే ఇది.
ఈ మధ్య మరోమనిషిని పనికి పెట్టి, ఇంటి పనిలోనూ స్వయంగా సాయం చేస్తూ మీరూ కష్టపడుతున్నారుగా! అంతకన్నా ఏమికావాలి? ఇక అన్నింటికన్నా ముఖ్యం ఇందులో పారూ అదృష్టం కూడా ఉంది బాబు." అన్నారు ప్రశంసగా ఆమె.
**
మరునాడు పనికి వెళ్లిన రామ్ త్వరగా ఇంటికి వచ్చేసాడు. శాంత అడగ్గా... తనకి నీరసంగా ఉందని పడక గదిలోకి నడిచాడు.
మజ్జిగ తెచ్చిన శాంతని కూచోమన్నాడు. “నీవు గాబరా పడకుండా విను. మొన్న మెడికల్ చెకప్ లో నాకు డయాబెటిస్ ఉందని తేలింది. ఇవాళ మొదటి ఇన్సులిన్ షాట్ తీసుకుని, మందులు తీసుకుని వస్తున్నా. నీతో మాట్లాడి విషయం చెబుదామని ఇవాళ సెలవు పెట్టేశాను.
ఇకపోతే, ఇదేమీ పెద్ద వ్యాధి కాదు. గాబరా పడవద్దు. మందులు వేసుకుని, ఆహారాపానీయాల విషయంలో మార్పులు చేస్తే హాయిగా ఆరోగ్యంగానే ఉంటాను. మీ అమ్మకి, పిల్లలకి ఇప్పుడే తెలియాల్సిన అవసరమే లేదు. అర్ధమయిందా?” అడిగాడు శాంత తల మీద తడుతూ.
కన్నీళ్లు పెట్టుకున్న భార్యని, భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. "చెప్పానుగా.. నా ఆరోగ్యానికి ప్రమాదం లేదని. ఇకపోతే, ఇవాళ పునీత్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ ని కూడా కలిసి వస్తున్నాను. వాడు స్కూల్లో స్మోక్ చేసి పట్టుబడ్డాడు. చదువులో వీక్. మిగతా పిల్లలు కొందరు వాడి వల్ల ప్రభావితమవుతున్నారని, వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకోమని సూచించారు. చూడాలి. ఇక నీవెళ్లి పని చూసుకో. కాసేపు పడుకుంటాను.” అంటూ పక్క మీదకి ఒరిగాడు రామ్.
**
అక్క పట్ల అక్కసుగా, అమ్మానాన్నలంటే అలుసుగా ప్రవర్తిస్తున్న పునీత్ ని కట్టడి చేసేందుకు తల్లి, అక్క కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏదో ఒక గొడవతో పునీత్ ఇంటాబయటా ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. చదువుని అశ్రద్ధ చేస్తున్న కొడుకుని నిత్యం నిలదీస్తూ గొడవ పడుతున్న తండ్రిని చూసి పారూ భయపడుతుంది. పునీత్ భవిష్యత్తు తండ్రికి ఎంతో ముఖ్యమని, తమ్ముడి భవిష్యత్తు బాగోవాలంటే ముందు వాడి మనోగతిని ఎలాగైనా మార్చాలని ఆలోచించసాగింది.
పునీత్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్న భర్త ఆరోగ్యం ఏమవుతుందోనని శాంత నలిగిపోతుంది.
**
శాంత ద్వారా...పునీత్ స్కూల్ విషయం గురించి తెలుసుకున్న మాలిని జోసెఫ్ లు, పిల్లలకి ఇష్టమైన ఐస్క్రీమ్ తీసుకుని సాయంత్రం వాళ్ళింటికి వచ్చారు. ఐస్క్రీమ్ తింటూ, అందరూ కాసేపు ఎవరి కబుర్లల్లో వాళ్ళున్నారు.
“ఇటు వినండి. ఈ రోజు మేము పునీత్ కోసం, పునీత్ విషయంగా వచ్చాము. మన చర్చి కంప్యూటర్ విభాగంలో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య నూటయాభై దాటింది. ఆరు నుండి పదేళ్ల వారికి శనాదివారాలు ప్రత్యేక కంప్యూటర్ ట్రైనింగ్ సమయాన్ని ఓ గంట పొడిగిస్తున్నాము. రెండురోజులకి ఆరు క్లాసులుంటాయి.
ముందునుండే ఈ క్లాసులు అటెండ్ అవుతున్న పునీత్, శనాదివారాలు వాలంటీర్ గా పనిచేస్తే బాగుంటుంది. అందుకు వాడికి కొన్ని పనులు ఉంటాయి. స్టూడెంట్స్ కి సాయం చేయడం, వారిని క్రమశిక్షణలో పెట్టడం, కంప్యూటర్స్, వర్క్ షీట్స్ రెడీ చేయడం వంటి పనులే. అందుకు చర్చి నుండి వాలంటీర్ బత్తా లభిస్తుంది.", "చెప్పు.. పునీత్ ఈ జాబ్... బాగుంది కదూ!" అడిగాడు ఐస్-క్రీమ్ తింటూన్న పునీత్ ని జోసెఫ్.
"తక్కువేమీ కాదు. నెలకి పన్నెండొందల రూపాయలు. నీ సొంత సంపాదన. ఇక అమ్మానాన్నల్ని పాకెట్-మనీ అడిగే అవసరమే లేదు." అంది మాలిని.
ఇంతసేపూ ఆలోచిస్తున్న పునీత్. "శాలరీ వస్తుందంటే, ఎందుకు చేయను? అలాగే మాలిని పిన్నీ." అన్నాడు సంతోషంగా. వాడి జవాబు విన్న పెద్దవాళ్ళందరూ 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు.
"నువ్వు బంగారం రా, చక్కగా పని చేసుకో... అందరి కన్నా నీవే బాగా ఎదగవచ్చు. నీవు కంప్యూటర్లో బాగా రాణిస్తావని, నిన్ను టెక్నాలజీ స్కూల్లో వేస్తే మంచిదని, మీ అమ్మానాన్నలు, మేము కూడా అనుకుంటున్నాము. నిన్న మీ నాన్న మీ స్కూలికి వెళితే, మీ టీచర్ కూడా అదే అన్నారట. అలోచించి నీ నిర్ణయం చెప్పు. నీవు ఏదంటే అదే చేద్దాము." అంది మాలిని.
తలూపాడు పునీత్. ఇంట్లో కాస్త ప్రశాంతత నెలకొంది.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్