Menu Close
Uma-Bharathi-HG-02
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

7

hrudayagaanam-07

ఓ రోజు పొద్దుటే స్కూలుకి తయారవుతుండగా... అమ్మమ్మ నుండి ఫోన్ అందుకుంది పారూ.

"ఏమ్మా పారూ ఎలా ఉన్నావు? నీతో మాట్లాడి వారమయింది. స్కూల్లో, ఇంట్లో అంతా ఓకేనా?" అంటూ వరస ప్రశ్నలు వేసింది సీతమ్మ గారు.

"అమ్మమ్మా... ఎలా ఉన్నావు? ఎప్పుడొస్తావు? నేను బాగున్నాను. ఏవేవో ఇతర పనులు.. వాటి కోసం పరుగులు.  అంతే." అంటూ జవాబిచ్చింది మనమరాలు.

"మనవరాలా! నీతో మాట్లాడి కొద్ది రోజులయిందిరా. నీ గొంతు వినాలనిపించింది. ఓ మంచి కొటేషన్ చెబుతాను విను.

‘ఎవరూ చూడడం లేదనుకుని, స్వేచ్ఛగా నర్తించు.
ఎవరూ బాధించలేనంతగా ప్రేమించు.
ఎవరూ వినడం లేదనుకుని, హాయిగా పాడుకో. 
ఇదే స్వర్గమనుకుని భూమి మీద జీవించు.’  అన్నాడు మేధావి ~ విలియం డబ్య్లూపర్కీ.

అలా ఆలోచిస్తే, అలా జీవిస్తే... ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు.”  అన్నారామె.

"బాగుంది అమ్మమ్మా. నీవు చెప్పే ఈ కొటేషన్స్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను తెలుసా? సరేగాని అమ్మానాన్నల పేరిట ఇవాళక్కడ గుడిలో అర్చన చేయించు అమ్మమ్మా. స్కూల్ టైం అయింది.  నేను నీతో మళ్ళీ మాట్లాడుతానే." అంది పారూ.

**

తెల్లవారుజామున ఇంటి తలుపులు ఎవరో గట్టిగా కొడుతున్నట్లనిపించి పారూకి మెలకువ వచ్చి, కిటికీలోంచి బయటకు చూసింది. ఇంకా చీకటిగానే ఉంది.

"పారూ, తలుపు తియ్యమ్మా! ఏమర్రా... వినబడుతుందా? శాంతా... తలుపు తీయండర్రా!" అన్న పిలుపు విన్న పారూ అమ్మమ్మ గొంతు గుర్తుపట్టింది. పరుగున వెళ్లి తలుపు తీసి, ఆమెని లోపలికి తీసుకొచ్చింది.

"పది నిముషాల నుంచి తలుపు కొడుతున్నాను. డోర్-బెల్ ఎంత సేపు నొక్కానో! అది పనిచేస్తున్నట్లు లేదు." అంటూ సీతమ్మగారు వచ్చి హాల్లోని పడక్కుర్చీలో కూర్చున్నారు.

ముందుగా తెలియజేయకుండా అమ్మమ్మ రావడం పారూకి ఆశ్చర్యం కలిగించింది. ఆమె సూట్‌కేసుల్ని తీసుకొచ్చి హాల్లో పెట్టింది.

"పారూ, ఇలా రా. నిన్ను దగ్గర నుంచి చూడనీ" అంటూ పిలిచారు సీతమ్మగారు. పారూ ఆవిడ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంది.

"ఎంత బావున్నావే.. తల్లీ! నా దిష్టే తగిలేట్టుంది. బాగా పొడుగయ్యా వు, రంగు తేలావు" అంటూ మనమరాలి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నారావిడ.

ముందుగదిలో చప్పుడు విని, శాంతకి మెలకువ వచ్చింది. లేచి హాల్లోకి వచ్చి చూస్తే, పారూతో కబుర్లాడుతున్న పెద్దమ్మని చూసి ఆశ్చర్యపోయింది. వారికి దగ్గరగా వెళ్లి నిలుచున్నా... వాళ్ళిద్దరిలో ఎవరూ శాంత వంక చూడనేలేదు.

ఒక్క నిమిషం పాటు వాళ్ళ ముచ్చట్లని విన్నాకనే పెద్దమ్మని పలకరించింది శాంత. దగ్గరగా వెళ్లి ప్రేమగా ఆమెని హత్తుకుంది.

"ఏంటి పెద్దమ్మా, ఇంత పొద్దున్నే! అదీ మాకు ముందుగా చెప్పకుండానే వచ్చేసావు?" అని అడిగింది.

"మా గుడి పెద్ద పూజారి భార్య, అమ్మగారు కాకినాడ మీదగా వాళ్ళ ఊరికి వెళుతున్నారు. వాళ్ళ కారులో వచ్చేసి మీ అందరినీ ఆశ్చర్యపరచాలనుకున్నాను. వాళ్ళతో బయల్దేరాను. మీ ఇంటి గుమ్మం వరకు తెచ్చి దింపారు. పారూ తలుపు తీసి నన్ను లోపలికి పిలవగానే వాళ్ళు వెళ్ళిపోయారు. పోతే, మీ డోర్-బెల్ సంగతి కాస్త చూడండమ్మా.... అది మోగడం లేదు." అన్నారు సీతమ్మ.

"ఆ సంగతి రామ్ చూస్తారులే పెద్దమ్మా. నీవు ఇలా రావడం ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. పిల్లలు నిద్ర లేవలేదు. లేచాక అమ్మమ్మని చూసి వాళ్ళూ సంతోషపడతారు." అంది శాంత.

హాల్లోకి అడుగు పెట్టిన రామ్... సీతమ్మగారిని పలకిరించాడు. "రాత్రంతా ప్రయాణం చేసినట్టున్నారు. అలసిపోయుంటారు. కాసేపు పడుకోండి అత్తమ్మా." అంటూ ఆమె సూట్-కేసు అందుకుని లోనికి నడిచాడు.

పెద్దమ్మ విశ్రాంతి తీసుకునేందుకు అన్నీ అమర్చి రోజువారి పనులలో లీనమైంది శాంత.

**

తెల్లారుతూనే ఇంట్లో హడావిడి మొదలయింది..

"అమ్మమ్మా! తొందరగా కాఫీ తాగేయ్. నా బొమ్మరిల్లుతో ఆడుకుందాం" అంటూ అమ్మమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంది జననీ.

"అమ్మమ్మా! నువ్వు నా సైకిల్ వెనుక సీటు మీద కూర్చోలేవేమో కదా!" నవ్వాడు పునీత్.

సీతమ్మ టిఫిన్ తినడం పూర్తి చేసి, "నేనిక్కడకి ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను. అది అయ్యేవరకు ఉంటాను. భడవా పునీత్! నేనిక్కడి నుంచి వెళ్ళేలోపు ఎలాగైనా నీ సైకిల్ ఎక్కుతాను సరేనా?" అన్నారామె నవ్వేస్తూ.

**

ఇంట నిత్యం కొనసాగే అమ్మమ్మా-మనమరాలి స్తోత్ర పఠనంతో, రాగసరాగాలతో అప్పుడే నాలుగు రోజులుగా ఇల్లు శారదాదేవి మందిరంలా విరాజిల్లింది.

ఐదోరోజు పొద్దుటే పెద్దమ్మని నిలదీసింది శాంత. "సరేనమ్మా, మొన్న పిల్లలతో... ఏదో ముఖ్యమైన పని మీద వచ్చానంటున్నావు. నాకైనా చెబుతావా లేదా? నేనిక ఆగలేను." అన్న ఆమె మాటలకి ముసిముసిగా నవ్వుకున్నారామె.

"వెళ్ళు. వెళ్లి దేవుని మందిరంలో నేనొక కవర్ పెట్టాను. ఇవాళ, రేపు మంచిరోజులు. ఆ కవర్ ని ఆలయంలోని కార్యదర్శికి అందించే ఏర్పాటు చేయమ్మా. రేపటి నుండి పారూకి స్వయంగా సంగీత శిక్షణనిచ్చి, సాధన చేయిస్తాను. విషయం తాపీగా చెబుతానుగా!" అన్నారామె.

మనమరాలికి, గాయనిగా తగిన గుర్తింపు, పేరుప్రఖ్యాతులు రావాలంటే... అవలంబించవలసిన విధానాలు, ఉన్నతీకరించే మార్గాల గురించి అహర్నిశలూ ఆలోచించిన సీతమ్మ గారు, ఓ ప్రణాళిక సిద్ధం చేసుకునే ఈ తడవ బాసర నుండి వచ్చారు.

కర్ణాటక సంగీత రంగంలో మనమరాలిని ఒక ధ్రువతారగా నిలబెట్టగల ఆలోచనతో... తాము స్వయంగా ఆలయ కార్యవర్గాన్ని కలిసే అవకాశాన్ని కోరుతూ లిఖితపూర్వక అభ్యర్ధనని శాంత ద్వారా అందించారామె.

వారం లోగానే, సానుకూలంగా స్పందించి ఆమెని ఆహ్వానించారు 'శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి’ ఆలయ కార్యవర్గం.

**

నిర్దేశించిన సమయానికి సీతమ్మ గారు, శాంత ఆలయ ముఖ్య కార్యదర్శి, కల్చరల్ సెక్రటరీ లని కలిశారు. తన మనమరాలు ‘పరమేశ్వరి రామ్‌కుమార్‌ కర్ణాటక గాన కచేరీ’ ని ఆలయ యువకేంద్ర నిర్మాణ నిధి సేకరణకు నిర్వహించమని కోరారు సీతమ్మ.

ఇటువంటివే ఆలయానికి ఉపయోగపడగల ఐదారు కచేరీలని స్వచ్చందగా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారామె. "మా ఈ ప్రతిపాదనకి ... సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తాను. ఈ సమావేశానికి సమయాన్ని కేటాయించనందుకు ధన్యవాదాలండీ." అన్నారు సీతమ్మ సెలవు తీసుకునే ఉద్దేశంతో.

“ఉండండీ సీతమ్మ గారు. మా ఆతిధ్యం స్వీకరించి వెళ్ళండి." అన్నారు కిషోర శర్మ గారు వారికి కొబ్బరి పానీయాలు అందిస్తూ.

“మీరు సంగీతకారులు. కళామతల్లి ముద్దుబిడ్డలు. పెద్దవారు. మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీ కుమార్తె శాంత గారు ఆలయంలో పిల్లలకి శ్లోక పఠనం బోధిస్తారు. మీ మనమరాలు పరమేశ్వరి ఇప్పటికే గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.

గుడికి ప్రయోజనం కలిగించడం కోసం పరమేశ్వరితో సంగీత కార్యక్రమాలు నిర్వహించాలన్న మీ ఆలోచన బావుంది. మన సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పరమేశ్వరి లాంటి వర్ధమాన కళాకారులని ఆదరించడం మా బాధ్యత." అంటూ ఆగారు శర్మగారు.

గుడి కాంటీన్ లో తాజాగా చేసిన లడ్డూ తెప్పించి అతిధుల ముందుంచారు.

"ఈ ప్రతిపాదన గురించి కమిటీతో సమాలోచన చేసి మీకు త్వరలోనే తెలియజేస్తాము. ఇది ఓ చక్కని ప్రాజెక్టుగా ఏర్పాటయ్యేలా ప్రయత్నిస్తాను. రాష్ట్రంలోని మా సంబంధిత ఆలయాల కార్యదర్శులతోనూ మాట్లాడుతాను సీతమ్మగారు. ఇదంతా కార్యరూపం దాల్చేందుకు ఒక ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పెట్టుకోండి. త్వరలోనే, మీతో తప్పక మాట్లాడుతాము." అన్నారు శర్మగారు…

"శర్మగారూ, ఈ విషయంగా మీకు ఏ సమాచారం కావల్సినా నన్ను సంప్రదించడానికి వెనుకాడవద్దు. ఇక మేము సెలవు తీసుకుంటాము." అంటూ నమస్కరించి శాంతతో పాటు అక్కడినుండి నిష్క్రమించారు సీతమ్మ.

బయటకొచ్చి క్యాబ్ లో కూర్చున్నాక, "నీది ఎంత మంచి ఆలోచన పెద్దమ్మా. పారూని ఓ మంచి గాయనిగా చూడడమే కాకుండా, దేవాలయానికి నిధులు సమకూర్చే సత్కార్యంలోనూ పాలుపంచుకునేలా చేస్తున్నావు. ఈ కల నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంది శాంత తన పెద్దమ్మని మెచ్చుకుంటూ.

**

ఇంటికి రాగానే గబగబా వంటచేసి, పిల్లలకి, పెద్దమ్మకి బల్ల మీద భోజనం సర్దేసింది శాంత. హాల్లో ఉన్న పిల్లల్ని ఉద్దేశించి, "మాలిని వాళ్ళింటికి వెళుతున్నాము. మీ అందరికీ భోజనం బల్లమీద సర్దాను. తినేసి, బుద్దిగా హోమ్-వర్క్ చేసుకుని, ఎనిమిదిన్నరకంతా పక్కలెక్కాలి. తెలిసిందా? అమ్మమ్మని సతాయించవద్దు." అని అందరికీ చెప్పి, భర్తతో బయలుదేరింది శాంత.

**

మాలిని ఇంట ఆహ్లాదకరమైన వాతావరణం, పసందైన విందు భోజనం, ఆత్మీయ సంభాషణల నడుమ సగం సాయంత్రం గడిచింది. లోనికి వెళ్లి అందరికీ చెరుకు రసం తెచ్చి అందించి సోఫాలో జోసెఫ్ పక్కన కూర్చుంది మాలిని.

"రామ్, శాంతా... ముందుగా జోసెఫ్ ఓ ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తాడట" అంది మాలిని.

“….ఈ యేడు క్రిస్మస్ పండుగ సందర్బంగా చర్చి 75వ వార్షికోత్సవానికి ప్రత్యేక మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్య గాయనిగా పరమేశ్వరిని, అతిధి గాయనీ గాయకులుగా ఆస్ట్రేలియాలో నుండి మా చెల్లెలి కొడుకు నేథన్ చెరియన్, కూతురు లహరి చెరియన్ ని ఆహ్వానిస్తున్నాము. నేథన్ ఇంజినీరింగ్ చదువుతూనే మ్యుజిషియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. లహరి అన్నతో పాటే కృషి చేస్తుంది." అంటూ రామ్ చేతిలో ఆహ్వానం ఉంచాడు జోసెఫ్.

తెరచి చూస్తే, సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం పలుకుతూ, పాతిక వేల రూపాయల పారితోషికాన్ని అందిస్తామని సూచించారు చర్చి కార్యదర్శి.

“మీ చెల్లెలు ఫామిలీ ఆస్ట్రేలియాలో ఉన్నారని తెలుసు. పిల్లలు మ్యూజిక్ రంగంలో కృషి చేస్తున్నారని తెలియదు. వాళ్ళ రాక గురించి చాలా సంతోషం జోసెఫ్! ఇకపోతే ఈ ఆహ్వానానికి పరమేశ్వరి తరఫున కూడా కృతజ్ఞతలు. యువగాయకులతో మ్యూజికల్ నైట్ ఓ చక్కని కాన్సెప్ట్." అన్నాడు రామ్.

"అంతా మాలిని ఆలోచన, రూపకల్పన. ఇప్పుడు మనకి తెలియని ముఖ్యమైన విషయం డాక్టరమ్మ చెబుతుందట." అన్నాడు జోసెఫ్.

"ఆసక్తికరమైన విషయమే లెండి శాంత. నన్ను మీ కుటుంబంలో ఒకరిగా భావిస్తారు కనుక, పిల్లల వైద్యురాలిని కూడా కనుక ఓ ఆలోచన, ఓ సలహా మీ ముందు ఉంచుతాను. మొన్న మీ ఇంట్లో డబ్బు కవర్ మాయమవడం, పారూపై అనుమాన పడ్డం, పారూ పట్ల కవలల వైఖరి... ఇదంతా కొట్టిపారేసేది కాదు.

అన్నింటికంటే ముఖ్యంగా పిల్లల మానసిక ఎదుగుదలకి శ్రేయస్కరం కాదు. నా ఉద్దేశంలో కవలల పట్ల సరైన రీతిలో స్పందించడం అవసరం. వాళ్ళలో పారూ అంటే అసూయ తొలగి స్నేహభావం ఏర్పడేలా మనం ప్రయత్నించాలి." అన్నది మాలిని.

రామ్, శాంత, జోసెఫ్ సహా మాలిని చెప్పేది శ్రద్ధగా వింటున్నారు.

"ఎదిగే వయస్సులో పిల్లల అభిప్రాయాలని, అవసరాలని గుర్తించడం ద్వారానే వాళ్ళలోని దురభిప్రాయాలని తొలగించి వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించగలం." అన్న మాలిని మాటలకి శాంత కలత చెందితే, రామ్ ఆలోచనలో ఉండిపోయాడు.

"కానీ ... అతిగా వ్యధ చెందే అవసరం కూడా ప్రస్తుతానికి లేదు. అందరి మేలు అలోచించి నేనో ఆలోచన చేసాను. రెండు నెలల పాటు పారూని వేసవి ఉద్యోగ నిమిత్తం హైదరాబాదుకి పంపించుదాము. అది ఎలా, ఏమిటి చెబుతాను. కొద్దిరోజులు పారూ దూరంగా ఉంటే పునీత్, జననీలకి కూడా అక్క తమ దగ్గర లేని లోటు తెలుస్తుంది. అపార్ధాలు తొలిగి తమ వైఖరికి పాశ్చాత్తపపడే అవకాశం ఉంటుంది.." ఆగి రామ్, శాంతల వంక చూసింది మాలిని.

...ఇంతకీ నా ప్రతిపాదన ఏమిటంటే... హైదరాబాదు మణికొండలో ఇటీవలనే 'దివ్య వాణి' అనే మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో మొదలుపెట్టారు మా బాబాయ్ జయదేవ. 'యువ వాణి' అనే కార్యక్రమానికి ‘సమ్మర్ ఇంటర్న్షిప్' కి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.

వక్తగా వ్యవహరించేందుకు టాలెంట్ ఉన్న హైస్కూల్/కాలేజీ స్టూడెంట్స్ ని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నారట. పారూ ఆడిషన్ చేస్తే, తప్పక సెలెక్ట్ అవుతుంది. శాలరీ బాగుంటుంది. ఆ రెండు నెలలు అన్ని సౌకర్యాలతో అక్కడ మన అధునాతన గెస్ట్-హౌజ్ లో ఉండవచ్చు." అని క్షణం ఆగింది మాలిని.

"ఆడపిల్లని అలా దూరంగా పంపడమేంటి, మాలిని?" అడిగింది శాంత అర్ధం కాలేదన్నట్టుగా.

"ఆగమ్మా శాంతమ్మా ఇంకా విను. క్లినిక్ వ్యవహారాలు మరో డాక్టర్ కి అప్పజెప్పి, మొదటి రెండు వారాలు పారూతో పాటు నేనూ హైదరాబాదులో ఉంటాను. మా బాబాయ్ నన్ను రమ్మని చాలా రోజులుగా అడుగుతున్నారు కూడా. తరువాత పారూకి తోడుగా అమ్మమ్మ సీతమ్మ గారు ఓ నెలరోజుల పాటు ఉండవచ్చు. ఆ తరువాత మీరు పిల్లలతో సహా ఓ రెండు వారాలపాటు హైదరాబాద్ ట్రిప్పు వేస్తే... అందరికీ ఒక హాలిడేలా కూడా ఉంటుంది. వేసవి సరదాగా గడిచిపోతుంది.

అంతేకాక, నా ఉద్దేశంలో పారూకి అన్నివిధాలా ఈ ఇంటర్న్షిప్ అనుభవం మున్ముందు మంచి చేస్తుంది. అక్కడ మనకి వసతి, వంటమనిషి, కారు, డ్రైవర్... అన్నీ ఉన్నాయి కనుక పిల్లలతో వెళ్ళినప్పుడు కూడా హాయిగా హైదరాబాదు నగరం, చుట్టుపక్కల ఊళ్లు, ఆలయాలు చూడవచ్చు. కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నాకు చెప్పండి." అంటూ ముగించింది మాలిని..

"ఒకే.. ఈ ప్లాన్ నాకు బాగానే ఉంది. వాళ్ళని కూడా ఆలోచించుకోనివ్వు.” అన్నాడు జోసెఫ్.

“అయితే ఉన్నట్టుండి పెద్ద ప్లాన్ వేశావన్నమాట. ఊహించలేదు సుమా. ఆలోచించి అమ్మతో, పారూతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాము మాలిని." అంది శాంత.

వింటున్న జోసెఫ్, “మా ఆవిడ ప్రతిపాదనలన్నీ ఓ స్థాయిలో ఉంటాయి మరి. ఇకపోతే, రామ్, నీకో విషయం. మన చర్చ్ ఫాదర్ శామ్యూల్ త్వరలో డెన్మార్క్ వెళ్ళిపోతారు. కారు అమ్మేస్తానని నాతో అన్నప్పుడు మీరే గుర్తొచ్చారు. కారుని పరిశీలించి ఖరీదు నన్నే నిర్దారించామన్నాడు. మీకు కారు అవసరం కదా రామ్. తీసేసుకో. లోన్ ఏర్పాటు రెండురోజుల్లో అవుతుంది. ఇది మంచి డీల్." అన్నాడు జోసెఫ్.

"ఇంకేమంటాను. కారు అవసరమే, రేపే వెళ్లి చూస్తాను." అని స్పందించాడు రామ్. మాలిని, జోసెఫ్ ల వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు రామ్ దంపతులు.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in April 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!