
6
రాత్రి సుమారుగా తొమ్మిది గంటల సమయంలో వంటగది శుభ్రం చేసి, తల్లి గదిలోకి వెళ్ళింది పారూ. మంచం మీద కూర్చుని బట్టలు మడతపెడుతుంది శాంత. వెళ్లి తల్లి వెనుకగా కూర్చుని... ఆమె మెడని, భుజాలని సున్నితంగా నొక్కసాగింది.
"అమ్మా... త్వరలో నీ పుట్టిన రోజు వస్తోంది కదా. ఏదైనా నగ కొనుక్కోమ్మా. బావుంటుంది. గుడి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కొనుక్కోగలితే నాకన్నా సంతోషించేవాళ్ళు ఎవరూ ఉండరు..." అంది స్వరం తగ్గించి.
శాంత నవ్వేసి, పారూ వైపు తిరిగింది. "మంచి ఆలోచనే తల్లీ. నీ వయసులో అమ్మానాన్నల గురించి ఇంతలా ఎవరు ఆలోచిస్తారు? నీ తమ్ముడు చూడు... సైకిల్ కొనమని ఒకటే సతాయింపు. చెల్లెలు ఖరీదైన బొమ్మరిల్లు కావాలని గొడవ. సరే.. వీళ్ళ సంగతి పక్కన పెడదాం. నిజానికి నీకే ఏదైనా కొనిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే.. ఆ డబ్బు నీ శ్రమకి, నైపుణ్యానికి వచ్చిన బహుమతి తల్లీ..." అన్నది శాంత.
అమ్మ ప్రేమకి పారూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కూతురి బుగ్గల మీదకి జారిన కన్నీళ్లు తుడిచింది శాంత. పారూ కాసేపు అక్కడే అమ్మ మంచం మీద నిద్రపోయింది.
పారూ వంక చూస్తూ... ‘ఇంత పిచ్చితల్లి. తనని బాధించిన తమ్ముడిపై దెబ్బలు పడకుండా అడ్డుపడుతుంది. తన బాధని దిగమింగి వాడిపై ప్రేమ కురిపిస్తుంది. ఏమిటో ఒక్కొక్కరు ఒక్కో రకం’ అనుకుందా తల్లి.
**
స్కూల్ నుండి పిల్లలు వచ్చేముందు పకోడి వేస్తూ వంటింట్లో ఉంది శాంత. వాళ్ళు వచ్చిన హడావిడితో పాటు ఎన్నడూ లేని గలాటా కూడా వినరాడంతో… మధ్య గదిలోకి వచ్చి చూస్తే … హాల్లోకి వస్తున్న జననీ ముఖం కోపంగా ఉంది.
శాంతని చూడగానే, అసహనంగా బిగ్గరగా మాట్లాడసాగింది. "అమ్మా... ఎక్కడ చూసినా అందరూ అక్క పాట గురించే మాట్లాడుతున్నారు. ఇకనుండి నేనూ ప్రోగ్రాముల్లో పాడతాను. నువ్వు ఒప్పుకోకపోతే సంగీతం నేర్చుకోడం మానేస్తా.." అని గట్టిగా అరుస్తూ పుస్తకాల సంచీని ఓ మూలకి విసిరేసింది.
"ఊర్కో జానీ. అక్క వాగుడుకాయ. ఎప్పుడు చూసినా పాడుతూనో, వాగుతూనో ఉంటుంది. అందరికీ పెద్ద తలనొప్పిగా తయారయింది. నువ్వు కూడా ఎందుకు అక్కలాగే అవ్వాలనుకుంటున్నావ్? వేరే పనేం లేదా?" అంటూ గట్టిగా నవ్వుతూ లోపలికి వచ్చాడు పునీత్. వాడి వెనుకనే లోనికి వస్తున్న పారూ ఆ మాటలు విని చిన్నబుచ్చుకుంది. అయినా నవ్వేసింది.
ఇదంతా చూస్తున్న శాంత కలవరపాటుకి గురయింది. ఎలా కట్టడి చేయాలో తోచలేదామెకి.
"నోరు మూసుకోండి. తిన్నగా మాట్లాడ్డం నేర్చుకోండి. అక్కని మెచ్చుకోవలసింది పోయి, ఇలా హేళన చేస్తారా? జానీ ... నువ్వు కూడా పాడవచ్చు. వద్దన్నదెవరు? సాధన చేయాలి. ఏదీ సులువుగా లభించదు. అర్థమైందా?" అంది కోపాన్ని అణుచుకుంటూ శాంత.
తల్లి కోపాన్ని గ్రహించిన కవలలు మౌనంగా తలలు వంచుకున్నారు.
"సరే, వెళ్ళి అందరూ ముఖాలు, కాళ్ళూ చేతులు కడుక్కుని రండి..." అనేసి వంటింట్లోకి నడిచింది శాంత.
**
వార్షిక పరిక్షలకి ముందు ... చిన్న తరగతుల పిల్లలకి రోజూ ఓ గంటన్నర ట్యూషన్ చెప్పమని పారూని కోరింది టీచరమ్మ వాణీ మేనన్. అందుకు జీతం కూడా ఇప్పిస్తానన్నది.
వారానికి మూడు రోజులపాటు ఆరుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలుబెట్టింది పారూ. గంటన్నరసేపు సాగే ఆ క్లాసు సరదాగానే ఉందనిపించింది ఆ అమ్మాయికి.
ఆరు వారాలు గడిచాక, తాను వెచ్చించిన సమయానికి, వాణీ టీచర్ నుండి 1500 రూపాయల పారితోషికం అందుకుని ఉత్సాహంగా ఇంటికి బయల్దేరింది పారూ.
ఆర్.ఎస్. గార్మెంట్స్ లో అమ్మ కోసం పొడవాటి కాటన్ హౌస్‌కోట్, మరో షాపులో నాన్న కోసం స్టీల్ లంచ్ బాక్స్ కొన్నది. దారిలో తమ్ముడు, చెల్లెలి కోసం జిలేబి కొన్నది. అందరికీ అన్నీ తీసుకున్నానన్న ఆనందంతో ఇంటి దారి పట్టింది.
రద్దీగా ఉన్న రోడ్డు మీద నడుస్తూ.. ‘తను ట్యూషన్ చెప్పేందుకు మరింతసేపు స్కూల్లోనే ఉండిపోడానికి, అమ్మని ఒప్పించడం ఎంత కష్టమైందో’ గుర్తు చేసుకుంది. గణితంలో వెనుకబడిన పిల్లలకి సహాయం చేస్తానని బతిమిలాడి ఎట్టకేలకు తల్లిని ఒప్పించగలిగింది. కానీ... పాఠాలు చెప్పినందుకు డబ్బిస్తారని మాత్రం అమ్మానాన్నలకి చెప్పలేదు. వాళ్ళని ఆశ్చర్యపరచాలని అనుకుంది.
‘ఆరు వారాల పాటు ట్యూషన్ చెప్పినందుకు ఇంత డబ్బు వచ్చిందని తెలిస్తే.. అమ్మ ఆశ్చర్యపోతుందేమో చూడాలి..' అనుకుంటూ ఇల్లు చేరి... ఉత్సాహంగా లోపలికి అడుగుపెట్టింది పారూ.
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటగది, పూజ గది, పిల్లల గదులు అన్నీ దాటుకుని తల్లి గదికి వెళ్ళింది. అక్కడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిందరవందరగా ఉన్న గదిని కంగారుగా వెతుకుతున్న శాంత, పునీత్, జననీ కనబడ్డారు.
"అమ్మా, ఏమైంది? ఏం పోయింది?" అని అడిగింది పారూ. అందరూ ఒక్కసారిగా పారూ కేసి, ఆమె చేతిలో సంచుల కేసి చూసారు.
వాళ్ళెవరూ ఏమీ మాట్లాడక ముందే బయటి నుంచి తండ్రి గొంతు వినబడింది.
"ఏమర్రా... ఎక్కడున్నారు? శాంతా... జానీ ... ఒక్కరూ కనబడరే.." అంటూ గదిలోకి అడుగుపెట్టాడు రామ్. కాని వెంటనే అడుగు వెనక్కి వేసాడు. ఆ గందరగోళ పరిస్థితిని చూసి తొట్రపాటుకి గురయ్యాడు.
"ఏమైంది శాంతా? ఏం జరిగింది? ఏమిటిదంతా?" అడిగాడు రామ్ విసుగ్గా.
అప్పటికే బెంబేలెత్తిపోయున్న శాంత, "రామ్, నలభై వేల రూపాయల కవర్ కనిపించడం లేదు. మన గదిలో అలమారాలో నేనే పెట్టాను.." అంటూ కంగారుగా వెతకసాగింది. ఆమె గొంతులో వణుకు గమనించిన రామ్, పారూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
ఇంతలో పునీత్ వచ్చి పారూ పక్కన నిలుచున్నాడు. "అక్కా, నువ్వు బయల్దేరే ముందు అమ్మని డబ్బు అడిగావా? అడిగే తీసుకున్నావా? నీ చేతిలో ఉన్న సంచులేంటి?" అని అడిగాడు. "లేకపోతే డబ్బుల కవర్‌ని ఎక్కడ పెట్టిందో అమ్మ నిజంగానే మర్చిపోయిందంటావా?" అని అడిగాడు. అవే ప్రశ్నలని మళ్ళీ మళ్ళీ అడుగుతూ పారూ చేతిలోని సంచులని లాక్కోడానికి ప్రయత్నించాడు.
"అన్నా.. నువ్వు చెప్పిందే నిజం. నీకూ, నాకూ ఏదైనా కొనడం అక్కకి ఇష్టముండదు. అన్నీ తనకే కావాలనుకుంటుంది. అందుకే డబ్బంతా తీసుకుని తనకి కావల్సినవి కొనుక్కున్నట్లుంది." అంటూ జననీ పరిగెత్తుకు వచ్చి పారూ చేతుల్లోని సంచీలను లాక్కుంది. పునీత్, జననీ ఇద్దరూ కలసి వాటిల్లోని వస్తువులను మంచం మీద పోసారు.
ఓ కవర్ లోంచి కొంత డబ్బు, చిల్లర మంచం మీద పడ్డాయి. అందరి చూపులూ పారూ వైపు మళ్ళాయి. వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. ఉన్నట్టుండి పారూకి దుఃఖం ముంచుకొచ్చింది. మోకాళ్ళ మీద కూర్చుని ఏడవసాగింది.
మరోవైపు ... తాను మోసపోయినట్లు భావించిన శాంత కోపంతో ఊగిపోయింది. పారూ రెక్క పట్టుకుని తన వైపుకి లాక్కుంది. "నీకేమయినా దెయ్యం పట్టిందా? నీ డబ్బు నువ్వే దొంగతనం చేస్తావా? ఎందుకిలా చేసావు పారూ? నువ్వెంతో మంచిదానివని అనుకున్నాను. నీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. ఇలా చేసావేమే?" అని అరుస్తూ, చాచి చెంపదెబ్బ కొట్టింది.
రామ్ తక్షణమే జోక్యం చేసుకుని వారిద్దరిని విడదీసాడు. శాంత కూడా నేల మీద కూర్చుని భోరుమని ఏడవసాగింది.
రామ్ పక్కకి తిరిగి, "పిల్లలూ, మీరు వెళ్ళి అన్నం తినేసి పడుకోండి. రేపు చర్చ్‌కి వెళ్ళాలి. వెంటనే వెళ్ళండి .. ఇక్కడ్నించి కదలండి..." అంటూ వాళ్ళని పంపించేశాడు. పారూని, శాంతని గదిలోనే ఉంచి, లోపల్నించి గడియ పెట్టాడు.
**
మర్నాడు, ప్రతీ ఆదివారం లానే, ఉదయం ఎనిమిది గంటలకి నిద్ర లేచారు పునీత్, జననీ. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో తిరగడానికి కూడా భయపడ్డారిద్దరూ. ధైర్యం చేసి వంటింట్లోకి నడిచారు. అమ్మ, అక్క హాయిగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ చపాతీలు చేస్తున్నారు. రాత్రి అసలేమీ జరగనట్టుగా… ప్రశాంతంగా ఉన్నారు. కొద్దిసేపటికి ఇంటిల్లిపాదికీ తాము చేసిన చపాతీలు, ఆలు కర్రీ వడ్డించారు.
**
అందరి టిఫిన్లయ్యాక, "పునీత్, జానీ... చర్చికి వెళ్ళాలి పదండి. ఇవాళ అమ్మ రాదుట." అంటూ తండ్రితో పాటు బయలుదేరింది పారూ.
వెళుతున్న వారికి ఎదురొచ్చింది మాలిని. "నేను ఇవాళ చర్చికి కాస్త లేట్ గా వస్తాను. మీరు వెళ్ళండి.” అంటూ లోనికి నడిచిందామె.
లోపల హాల్లో…తనకోసమే ఎదురు చూస్తున్న శాంతని చూసి.. "ఏమైంది శాంతా? నన్ను రమ్మన్నావు. దిగులుగా కనబడతున్నావు. ఏం జరిగింది? నీ ఒంట్లో బాగానే ఉందిగా?" అని అడిగింది.
ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది శాంతకి. ఏదో దారుణమైన సంఘటన జరిగి ఉంటుందని మాలిని ఊహించింది. శాంతని ఓదార్చడానికి ప్రయత్నించింది.
కాసేపటికి తనని తాను సంబాళించుకుని, జరిగినదంతా మాలినికి వివరించింది. చేయని తప్పుకి తాను పారూని నిర్ధాక్షణంగా ఎలా శిక్షించిందో చెప్పుకొచ్చింది. ఇదంతా వింటున్న మాలిని విస్తుపోయింది. కానైతే, సమస్య ఎలా పరిష్కారమైందో ఆమెకి అర్థం కాలేదు.
"పునీత్ మాటలకి నేనెలా లొంగిపోయానో నాకే తెలీదు. డబ్బు పోయిందనే సరికి కంగారుపడి వాడి మాటలు నమ్మేసాను. ఇంకా దారుణం ఏంటంటే.. అమాయకురాలైన పారూని... పాపం... గట్టిగా కొట్టాను. బాగా తిట్టాను.." అంటూ కంట నీరు పెట్టుకుంది శాంత. జరిగిన సంఘటనలో పారూ పరిస్థితిని ఊహిస్తూ, ప్రశాంతంగానే కూర్చుంది మాలిని.
"రామ్ ఉండబట్టి సరిపోయింది. ఇంకా కూడా నేను పారూని తిట్టకుండా, కొట్టకుండా తెలివిగా ప్రవర్తించారు. లేకపోతే ఇంకేం చేసేదాన్నో!.. అవతలకి తీసుకెళ్లి ముందు దాన్ని ఓదార్చారు. తర్వాత మంచం మీద ఉన్న కవర్‌ని తీసి చూస్తే… దాని మీద స్కూల్ ముద్ర ఉంది. అందులో ఉన్న డబ్బు లెక్కపెట్టారు. పారూ భుజం మీద చెయ్యేసి, ఆ డబ్బు గురించి అడిగారు." అంటూ క్షణమాగింది శాంత.
ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ.. "పిచ్చి పిల్ల... అప్పుడు చెప్పింది.. ట్యూషన్ చెప్పినందుకు తనకి స్కూల్లో 1500 రూపాయలు ఇచ్చారని. మాకు నిజం చెప్పనందుకు క్షమించమని అడిగింది చిట్టితల్లి,”, “తను సంపాదించిన డబ్బుతో మాకోసం కానుకలు తెస్తే.. నేనేమో ఇలా చేసాను." అంటూ నిట్టూర్చింది. కన్నీళ్ళు ఆమె బుగ్గల మీద నుంచి కిందకి జారాయి.
శాంత చెబుతున్నది వినడం మినహా చేష్టలుడిగి ఉండిపోయింది మాలిని.
"పిల్ల పట్ల అంత క్రూరంగా ప్రవర్తించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. కనీసం ఇప్పటి నుంచైనా ఇటువంటి తప్పిదాలు, ఆవేశాలు నుండి నన్నునేను సంబాళించుకోవాలి. లేదంటే పారూకి తల్లి స్థానంలో ఉండగల అర్హత లేనట్టే." అని వాపోయింది పారూ తల్లి.
పోయిందనుకున్న డబ్బుల కవర్... చివరికి మంచం మీది పరుపు గలీబు లోపల దొరికిందని, పునీత్, జననీలే అలా చేసుంటారనడంలో సందేహం లేదని కూడా అంది శాంత. "చేయని నేరానికి పారూకి శిక్ష పడేలా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం.." అంటూ బాధ పడింది ఆ తల్లి.
నిముషం సేపు ఆలోంచింది మాలిని. "పారూలో… వయసుకి మించిన ఆలోచన, తనవారిని సంతోష పెట్టాలనే తపన నన్ను ఆశ్చర్యపరుస్తుంది శాంతా. సరేలే, ఒక పని చేద్దాం... చర్చిలో పనయ్యాక, పిల్లల్ని తీసుకుని అటునుండి మేము, నిన్ను తీసుకుని ఇటునుండి రామ్... షాపింగ్ మాల్లో కలుద్దాము. కాసేపు షాపింగ్ చేసి, బయటే డిన్నర్ కూడా చేద్దాము." అంటూ బయలుదేరి పోయింది మాలిని.
**
మాల్లో పునీత్‌కి హెర్క్యులస్ సైకిల్, జననీకి బొమ్మరిల్లు కొనిచ్చారు తల్లితండ్రులు. అవి ఇంటికి పంపబడేలా ఏర్పాటు చేశారు. వాళ్ళ సంతోషానికి పగ్గాలు లేవు. ఏం మాట్లాడినా బొమ్మరిల్లు, సైకిల్ గురించే మాట్లాడుతున్నారు.
"సరే, ఈ రోజు మీకు లభించిన ఈ కానుకలని జాగ్రత్తగా ఉంచుకుంటారుగా.." అంటూ పక్కనే ఉన్న రెస్టారెంట్ లోకి నడిచింది మాలిని. అందరూ ఆమెని అనుసరించారు.
ఫుడ్ ఆర్డర్ చేసి... వెళ్లి జననీ, పునీత్ ల నడుమ కూర్చుని వాళ్ళని కబుర్లలోకి దింపింది మాలిని.
"చూడండి పిల్లలూ… మీ అక్కకి, అమ్మానాన్నలకీ మీరంటే ఎంతో ఇష్టం. మీరంటే మీ అక్కకి ఎంత ఇష్టమంటే.. మీ నాన్నతో గొడవపడి మరీ ఈ బొమ్మరిల్లు, సైకిలు కొనిపించింది. మిమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటుంది. మరి అక్కని మీరూ ప్రేమించాలిగా. అక్క మాట వినండి, అక్క మీకోసం చేసే పనులను మెచ్చుకోండి. అర్థమైందా?", “ఆ, ఇంకో విషయం... రాత్రి మీరు నిద్రపోయాక, డబ్బుల కవర్ వెదకడంలో మీ అక్కే అమ్మకి సాయం చేసిందట. మీ అమ్మ దిండు గలీబులో ఆ కవర్ దొరికిందట." అని వారికి వివరించింది మాలిని.
కవలలిద్దరూ మాలిని చెప్తున్నదంతా మౌనంగా విన్నారు. పారూ దగ్గరికి వెళ్ళి అక్క చేయి పట్టుకుని ధన్యవాదాలు చెప్పారు.
ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు.
**
ఇంట జరిగిన సంఘటన గురించి పెద్దమ్మకి చెప్పుకున్నాకే, ఒకింత ఊరట పొందింది శాంత.
అంతా విన్న సీతమ్మ గారు కొద్ధి మౌనం తరువాత నోరు విప్పారు.
"పిల్లల పెంపకం సులభమని ఎవరినోటా విన్న దాఖలాలు లేవు. ఒక్కో ఇంట్లో ఒక్కో పరిస్థితి. ఒక్కో బిడ్డ ఒక్కో వ్యక్తిత్వం. ఓపిగ్గా, మెళుకువతో సమర్ధవంతంగా సాధించుకోవాలి తల్లీ. చేతికున్న ఐదువేళ్ళూ ఒక్కలా ఉండవు కదా! ఇదీ అంతే.
సరే.. ఇంతకీ పారూ సంగతికి వస్తే, తానొక నిస్వార్ధ జీవి. అది తన నైజం. ఇక పునీత్ విషయానికి వస్తే, నేనక్కడ ఉన్నప్పుడు కూడా... అన్నీ వింటూనే ఉన్నా ... కలగజేసుకోలేదు. ఎందుకంటే, తల్లితండ్రులు మీరున్నారుగా. సామ దాన భేద దండోపాయాలతో మీరే మీ కొడుకుని దారిన పెట్టాలి. అధైర్య పడకు. అన్నీ సర్దుకుంటాయిలే. నేను కూడా వీలు చేసుకుని త్వరలో వస్తాను." అన్నారామె.
"అవునమ్మా... త్వరగా రా. ఇక్కడే మా వద్ద ఉండమంటే... కుదరదంటావు. అక్కడ అమ్మవారి ఆస్థానానికి ... ఎంతో కాలంగా నీవు ఉపకారివి, శ్రేయోభిలాషివి. అందుకోసమని…అక్కడే ఉండాల్సిన పని లేదుగా. సరేలేమ్మా. వచ్చే ముందు మాత్రం చెప్పు. స్టేషన్ నుండి ఒక్కతివే ఇల్లు చేరే ప్రయత్నాలు చేయకు." అంది శాంత.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్