Menu Close
Uma-Bharathi-HG
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

5

hrudayagaanam-05

రద్దీగా ఉన్న తన క్లినిక్ లో మాలిని నోట్స్ రాస్తుండగా ... ఉన్నట్టుండి ముందుగదిలో గొడవ రేగింది. పిల్లల ఏడుపులు, పెద్దవాళ్ళ అరుపులు వినిపించాయి. క్లినిక్ లోనికి వచ్చిన వాళ్ళు చాలా బిగ్గరగా అరుస్తుంటే... రిసెప్షన్‍లో అమ్మాయి, నర్స్ వారిని సంబాళించలేక పోతున్నారు.

తన గదిలోంచి బయటకి వచ్చి జోక్యం చేసుకోక తప్పలేదు మాలినికి. వచ్చి చూస్తే అక్కడ శాంత... ఏడుస్తున్న తన కొడుకు పునీత్ ని దగ్గరగా పట్టుకుని కూర్చునుంది. వారికి ఎదురుగా ఇంకో కుర్రవాడు ఉన్నాడు. వాడి ముక్కు నుంచి రక్తం కారుతోంది. పక్కనే ఆ అబ్బాయి తల్లిదండ్రులు శాంత మీద అరుస్తున్నారు. శాంత కూడా గట్టిగానే జవాబిస్తోంది. ఒకరినొకరు నిందించుకుంటున్నారు.

"చూడండి. దయ చేసి మీ అరుపులు ఆపండి. ఇది హాస్పిటల్. ఒంట్లో బాగోలేని పిల్లలు ఉన్నారిక్కడ. ఇక్కడి ప్రశాంతతని మీరు భగ్నం చేస్తున్నారు. మీరు కాస్త నెమ్మదిస్తే, మేము మీ పిల్లలను చూసే వీలుంటుంది." అంటూ గంభీర స్వరంతో గట్టిగా చెప్పింది మాలిని.

దెబ్బలు తగిలిన పిల్లల్ని గదిలోకి తీసుకువెళ్ళింది. ముందుగా ముక్కు నుండి రక్తం కారుతున్న బాబుని పరీక్షించి, ఎక్స్-రే తీయించింది. కొన్ని మందులు ఇచ్చి ఎలా వాడాలో వివరించింది. ఆ తరువాత పునీత్‌ని పరీక్షించి దెబ్బ తగిలిన దవడ మీద, కంటి దగ్గర పట్టీలు వేసింది. పునీత్‌కి ఏమీ ప్రమాదం లేదని శాంతకి ధైర్యం చెప్పింది.

పునీత్ తమ పిల్లాడ్ని ప్లే-గ్రౌండ్‌లో బాగా కొట్టాడని చెప్పారు ఆ అబ్బాయి తల్లిదండ్రులు. క్లినిక్ రిపోర్టుల ఆధారంగా పునీత్ మీద స్కూల్ బోర్డ్‌ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

****

క్లినిక్ పనయ్యాక… దారిలో శాంత వాళ్ళ ఇంటి వద్ద ఆగింది మాలిని. పునీత్‌ని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది. వాచిన దవడ నొప్పి ఎలా ఉందని కనుక్కుంది.

పిల్లాడి చేయి పట్టుకుని.. "చూడు నాన్నా, జాగ్రత్తగా ఉండాలి కదా. అదే దెబ్బ నీకు తగిలి... నీ ముక్కు నుంచి రక్తం కారితే ఎంత బాధగా ఉంటుంది? నీ మిత్రుడు ఎంతో బాధలో ఉన్నాడు? బహుశా కొన్ని రోజుల పాటు స్కూల్‌కి రాలేడు. అతను గాయపడ్డాడు కాబట్టి వాళ్ళ అమ్మానాన్నలు నిన్ను తిడతారు. అందరూ తప్పు నీదేనంటూ నీకేసే వేలు చూపిస్తారు. ఇటువంటి సంఘటనలు నీకు చెడ్డ పేరు తెస్తాయి. అందుకని బంగారం, బుద్ధిగా ఉండి చక్కగా చదువుకో. గొడవలు మానుకో... సరేనా.." అంటూ సుతిమెత్తగా హితబోధ చేసింది.

“అది కాదు మాలిని పిన్నీ. ఆటలో నేను వేసిన బంతిని అడ్డుకుని టీమ్ ఓటమికి కారణమయ్యాడు. పైగా వాడు మా క్లాస్ లీడర్. వాడికి బాగా పొగరు. నా మీద ఫిర్యాదులు రాస్తూనే ఉంటాడు. అందుకునే వాడిని అలా కొట్టాను. బాగయింది." అన్నాడు పునీత్ మహా పొగరుగా.

"తప్పు నాన్నా.. నీవు క్లాసుని డిస్టర్బ్ చేస్తున్నావనే కదా ఆ అబ్బాయి ఫిర్యాదు రాసేది. నీవు అలాటి పనులు చేయకూడదు. అక్కలా... నలుగురిలో నీవు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి." అంటూ పునీత్ కోసం తెచ్చిన ఓ బోర్డ్-గేమ్ వాడి చేతిలో పెట్టింది.

'సరే పిన్నీ' అంటూ తలెగరేసి, పునీత్ బోర్డ్-గేమ్ అందుకుని అక్కడ్నించి జారుకున్నాడు.

అప్పుడే లోనికి వచ్చిన పారూ... మాలిని వద్దకు వచ్చి కూర్చుంది. "పిన్నీ, స్కూల్ ప్లే-గ్రౌండ్ లో తమ్ముడికి, ప్రసాద్ కి నడుమ జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసినట్టే నాకూ తెలిసింది. ప్రసాద్ తల్లితండ్రులు గుడికి వస్తుంటారు. నాకు వాళ్ళు బాగా తెలుసును. రేపు పొద్దుట నేను వెళ్లి వాళ్ళతో మాట్లాడుతాను. వాళ్ళిల్లు స్కూల్ పక్కనే. ఆ అబ్బాయికి క్లాస్-వర్క్, హోమ్-వర్క్ విషయంగా నేను సాయం చేస్తానని చెబితే ... కాస్త గొడవ తగ్గుతుందేమో.” అంది.

"ఎంత మంచి ఆలోచన తల్లీ నీది. అలాగే చేయి. ఇప్పుడైతే వెళ్లి కాళ్ళూ చేతులు కడుక్కుని కాస్త ఏదైనా తిని నీ పనులు చేసుకోమ్మా." అన్నారు సీతమ్మ.

****

పిల్లలు ఎవరి గదుల్లోకి వారు వెళ్ళాక, అల్లం-టీ పెట్టి మాలినికి, పెద్దమ్మకి కప్పులందించి వారి పక్కనే కూర్చుంది శాంత.

"వీడు మొండిగా తయారవుతున్నాడు మాలిని. పొరబాటున ఎప్పుడన్నా ‘అక్కలా’... అని పారూతో పోలిస్తే అస్సలు నచ్చడం లేదు వాడికి. మరింతగా పెట్రేగి పోతున్నాడు. పైగా అమాయకంగా ఉండే జననీని కూడా తన వైపుకి తిప్పుకుంటున్నాడు." వాపోయింది శాంత.

"అర్ధమయింది. చూస్తున్నాగా! పిల్లల్లో అభద్రతా భావం మొదలైతే అంత శ్రేయస్కరం కాదు శాంత. ఎలాగోలా ఈ వయస్సులో వీళ్ళని బిజీగా ఉంచాలి. ఇప్పుడే నాకో ఆలోచన వచ్చింది.

త్వరలో అంటే.. రెండు వారాల్లో చర్చి కంప్యూటర్ క్లాసులు అన్ని వయసుల పిల్లలకి అందుబాటులోకి వస్తాయి. పారూని ఆ క్లాసులకి నమోదు చేద్దామని అనుకున్నాను. కానీ పునీత్, జననీలని కూడా పంపించు.  శనాదివారాలు ఓ మూడు గంటల పాటు బిజీగా కంప్యూటర్ నేర్చుకోడం కూడా వీళ్ళకి మంచిది.” అంది మాలిని.

“వీడు ఆ మొండితనం వీడితే చాలు.. బాగుపడితే చాలు. అలాగే చేద్దాం. క్లాసులకి పంపిస్తాను.” అని జవాబిచ్చింది శాంత.

వీరి సంభాషణ వింటున్న సీతమ్మ కలగజేసుకున్నారు. “నిజమే కానీ మరో విషయం కూడా ఉంది. నిత్యం అక్క పరమేశ్వరి గురించి ఇంటా బయటా పొగడ్తలు వింటున్న తమ్ముడికి, చెల్లెలికి అభద్రతా భావంతో పాటు అసహనం కూడా పెరుగుతుంది. మనమే గమనించుకోవాలి.” అన్నారు.

“అవునమ్మా అదే చెబుతున్నా. ఇంట వాతావరణం ఇబ్బందికరంగా మారవచ్చు...అనిపిస్తుంది.” అంది మాలిని.

“అదే మరి.” అంటూ పైకి లేచారు సీతమ్మ. “సరేనమ్మా మాలిని. రేపు పొద్దుటే నా ప్రయాణం. సంతోషంగా ఉండమ్మా.” అంటూ లోనికి వెళ్ళారామె.

“నేనొచ్చి అన్నీ సర్దిపెడాతాను పెద్దమ్మా.” అంది శాంత ఆమెకి వినబడేలా.

****

చర్చిలోని ‘యువ కేంద్రం’లో కంప్యూటర్ శిక్షణ మాత్రమే కాదు. వివిధ అప్లికేషన్స్ వాడే విధానాలు, ఆర్ట్, పెయింటింగ్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విభాగం మొదలవ్వడాన్ని అందరికన్నా పారూ ఎక్కువగా హర్షించింది. పునీత్, జననీలు కూడా ఆసక్తిగా క్లాసులకి వెళుతున్నారు.

పారూ సంగీత శిక్షణ సంగతికొస్తే.. అమ్మమ్మ అజమాయిషీలో, తల్లి గురువుగా సంగీత సాధన కొనసాగిస్తూ… తన గానం వల్ల … హైస్కూల్ విద్యార్థి లోకంలోనే కాదు.. ఆ ప్రాంతం లోని సంగీత ప్రపంచంలోనూ... పరమేశ్వరి రామ్‌కుమార్ పేరు తెలియని వారుండరేమో అన్న పరిస్థితి నెలకొంది.

****

అలా కాలగర్భంలో మరో రెండేళ్లు గడిచాయి. పిల్లలు ఎదిగి వారి పనులు వారు చేసుకోడం మొదలు పెట్టడంతో, శాంత అప్పుడప్పుడైనా ఆదివారాలు చర్చికి, ఆలయానికి వెళ్లడం మొదలుపెట్టింది.

పారూకి పదహారేళ్లు నిండితే, పునీత్, జననీలు పదకొండేళ్ళ వారయ్యారు.

‘శ్రీ దశావతార వెంకటేశ్వర ఆలయం’లో మూడు రోజుల పాటు జరగబోయే కుంభాభిషేక మహోత్సవ సందర్భంగా... యువగాయని పరమేశ్వరి గానాన్ని ప్రత్యేక అంశంగా నిర్వహించడానికి ఆలయ కార్వవర్గం...  రామ్‌కుమార్ ని సంప్రదించింది.

ఆ విషయాన్ని పారూకి, శాంతకి, బాసరలో ఉన్న సీతమ్మ గారికి తెలియజేసి ఆలయ కార్యవర్గానికి రామ్ తమ సమ్మతిని తెలిపాడు. ఉత్సవం సందర్బంగా మూడు రోజుల పాటు రామ్‌కుమార్ కుటుంబానికి ప్రత్యేక బస ఏర్పాటు చేశారు దేవస్థానం వారు.

దైవ సన్నిధిలో జరగనున్న కార్యక్రమం పారూ భవిష్యత్తుకి నాంది కాగలదని సంతోషించారు సీతమ్మ. కానీ బాసరలో ‘అన్నమయ్య ఉత్సవం’ నిర్వహించవలసిన బాధ్యత వల్ల, తాను రాలేకపోతున్నందుకు బాధపడుతూ…. పారూ కి ఫోన్ చేశారామె.

“పారూ తల్లీ, మీ అమ్మతోనూ సంప్రదించి, ఒక చక్కని కార్యక్రమం తయారు చేస్తాను. ఎల్లుండి నుండి సాధన మొదలుపెడదాము. ఒక్కటేరా... నీ పాటతో నీవు మమేకమై.. హృదయం నుండి పాడాలి. అదే హృదయగానం. అదే మంత్రం. మీ మాణిక్యాంబ అమ్మమ్మలో ఉన్న గొప్ప నైపుణ్యం అదే.” అంటూ మనమరాలిని ప్రేమగా ప్రోత్సహించింది అమ్మమ్మ.

“తూ.చ తప్పకుండా పాటిస్తాను అమ్మమ్మా. పాటల ఎంపిక, క్రమం అన్నీ చెప్పు మరి. ఎదురు చూస్తుంటాను.” అంది పారూ.

****

శివరాత్రి పర్వదినాన సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది ఆలయంలో ఉత్సవం. తెల్లవారుఝాము నుండే  మొదలయ్యే… స్వామి వారి సేవా కార్యక్రమాలు ఓ వైపు... భగవద్గీత పారాయణం, వేద పఠనంతో ప్రత్యేక దైవిక కార్యక్రమాలు, ఆరాధనోత్సవాలు, అఖండహోమం, అభిషేకాలు మరోవైపు ... అర్థరాత్రి వరకు సాగుతున్నాయి..

గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు ఉత్సవానికి వేంచేశారు. ఆ మూడు రోజులూ… పదహారేళ్ళ పరమేశ్వరి… భగవద్గీతలోని శ్లోకాలను భావయుక్తంగా పాడి వినిపించడం, ప్రతీ శ్లోకానికి అర్థం వివరించడం ప్రత్యేకం. అన్నమయ్య కీర్తనలు, భావగీతాలు, అష్టపదులు కూడా ... పరమేశ్వరి శ్రావ్యంగా పాడిన తీరుని పెద్దలు, పిన్నలు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

ఇళ్ళకి వెళ్ళేముందు ఆ అమ్మాయిని కలుసుకుని, ఆమె గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఎందరో. ఉత్సవాల ముగింపు రోజున … ఆలయ ప్రధానాధికారి ప్రసంగిస్తూ... “ఈ సంవత్సరం ఓ విశేషం జరిగింది. మాకెప్పుడూ బోలెడన్ని ఫిర్యాదులు వస్తూంటాయి. ఈసారి మాత్రం ఎక్కువ భోగట్టాలు వచ్చాయి.

భగవద్గీత శ్లోకాలు, సుప్రభాతం, మంగళ గీతం పాడిన బాలిక గురించిన ఆరాలు వచ్చాయి. అంతే కాదు … మీలో కొందరు ఆ అమ్మాయికి అందజేయవలసిందిగా కొంత నగదును కూడా కవర్లలో పెట్టి ఇచ్చారు. తన గాత్రంతో ఇంతమందిని అలరించిన ఆ బంగారుతల్లిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను...” అని చెప్పి, “పరమేశ్వరి... రామ్మా....” అంటూ పిలిచాడు.

పారూ తత్తరపాటుకి గురయ్యింది. ఈ గుర్తింపుని, ప్రశంసలని ఆమె అసలు ఊహించలేదు. తండ్రిని కూడా వేదిక మీదకి లాక్కెళ్ళింది. ఆ ప్రదేశమంతా చప్పట్లతో మారుమ్రోగింది. సభని ఉద్దేశించి మాట్లాడమని పరమేశ్వరిని కోరాడు ఆలయ ప్రధానాధికారి.

ఏం మాట్లాడాలో తెలియలేదు పారూకి. ‘ఎన్నగాను రామ భజన కన్న మిక్కిలున్నదా’ అన్న కీర్తన పాడి సభికులందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఆ తరువాత, భక్తులు సమర్పించిన కానుకలతో పాటు…ఆలయం తరపున కొంత నగదు పారితోషికంగా పారూకి అందజేసారు.

****

కుమార్ దంపతులు పిల్లలతో కలసి తమ బసకు వచ్చేప్పటికే అక్కడ బల్ల మీద భోజనం సిద్ధంగా ఉంది. పునీత్, జననీ వంటకాల మీద మూతలు తీసి చూస్తున్నారు. పారూ లోపలికి వెళ్ళి ముఖం, కాళ్ళూ చేతులు కడుక్కుని వచ్చింది. మధ్యగదిలో సోఫాలో కూర్చుని ఉండడం చూసి, వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన కూర్చుంది.

“పొద్దున్నుంచి నేను కూడా ఏమీ తినలేదు. పదండి.  భోంచేద్దాం.” అంది పారూ.

ఉలుకుపలుకు లేకుండా తన వంకే చూస్తున్న అమ్మని భుజం పట్టుకుని కుదిపింది. అమ్మ కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీటి చుక్కల్ని చూసి కలవరపడింది.

శాంత కళ్ళు తుడుచుకుని పారూని దగ్గరికి తీసుకుంది. “ఈ బక్కపలచని పిల్లకి ఇంత జనాదరణా? ఈ పిల్ల నోటినుండి ఎప్పటికైనా ఒక్క మాటైనా వింటామా అనుకున్న స్థితి నుంచి... ఈ రోజున తన స్వరమాధుర్యంతో జనాల్ని మైమరపిస్తున్న స్థితికి చేరుకోడం అనూహ్యంగా ఉంది కదండీ... పారూ లాంటి కూతురు ఉండడం మన అదృష్టం.” అంది శాంత.

ఆలయంలో జరిగిన ఉత్సవాన్ని, సంఘటనలని గుర్తు చేసుకుంటే... రామ్ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. పారూకి కానుకగా వచ్చిన నగదు కవరుని బయటకి తీసి లెక్కబెట్టాడు. అందులో నలభై వేల రూపాయలు ఉన్నాయి. మరో పదకొండు వేల రూపాయలున్న చిన్న కవరు కూడా ఉంది.

సంగీతంలో కూతురి విద్వత్తుకి తగ్గ గుర్తింపు రావడం మాత్రమే కాదు.. నలుగురిలో దక్కుతున్న గౌవర ప్రతిష్టలు, మెరుగవుతున్న ఆర్ధిక స్థితి ....రామ్ కి సంతృప్తినిచ్చింది.

ఇంతలో “పదండి మరి భోజనం చేద్దాము. పారూకి ఆకలిగా ఉందని ఇందాకే చెప్పింది పాపం. చిన్నోళ్ళిద్దరూ ఇప్పటికే భోజనం చేసుంటారు.” అంటూ సోఫా నుండి లేచింది శాంత. ఆమెని అనుసరించాడు రామ్.

****

గుడి ప్రోగ్రాం జరిగాక... వరసగా మూడో రోజున పొద్దుటే పెద్దమ్మకి ప్రోగ్రాం విశేషాలు చెపుతుండగా...

“ఒరే పునీ... వదులు నా జడని వదులు...” అంటూ పారూ అరుపు... ఆ వెంటనే పునీత్ పారూని జుట్టు పట్టుకుని పక్క గదిలోకి లాక్కువెళ్లడం కనబడింది శాంతకి.

“అమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తాను.” అంటూ ఫోన్ పెట్టేసి పరుగున వారి వద్దకి చేరుకుంది శాంత.

పునీత్ చేతిలో ఉన్న జుట్టుని విదిలించుకోవాలన్న ప్రయత్నంలో బాధతో విలవిలలాడుతోంది పారూ. పునీత్ చెంప పగలగొట్టి, పారూ జుట్టుని విడిపించింది. “జాగ్రత్త, ఇంకోసారి అక్క మీద చెయ్యెత్తావో... చీరేస్తాను...” అంటూ మండిపడింది.

అంత బాధలోనూ అమ్మ తమ్ముడిని కొట్టడం చూసి నొచ్చుకుంది పారూ. “వద్దమ్మా... తమ్ముడ్ని కొట్టద్దు..” అంటూ తల్లిని బ్రతిమాలుతూ తమ్ముడి వైపు చేయి చాచింది.

విసురుగా పారూ చేయి విదిలించాడు పునీత్. “నన్ను ఎవ్వరు తాకద్దు. నాతో మీరెవ్వరు మాట్లాడద్దు.  నాకు సైకిల్ కావాలి. ఇప్పుడే కావాలి. అంతే. డబ్బులు లేవని సాకులు చెప్పద్దు. నాన్న దగ్గర చాలా డబ్బులున్నాయి. నాకు తెలుసు.. నేను చూసాను. ఇదిగో ఈ అక్క మూలంగానే నాన్న నాకు అడిగింది కొనివ్వడంలేదు..” అంటూ అరిచాడు పునీత్.

అవాక్కయింది పారూ. ఇలా తనని జుట్టు లాగి, బాధ పెట్టైనా సరే, నాన్న చేత సైకిల్ కొనిపించాలన్న పునీత్ ఆలోచన అర్ధమయ్యి కలవరపడింది.

ఇంతలో, చేతిలో కొన్ని దినపత్రికలతో, చాలా ఉత్సాహంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు రామ్. ఆలయ ఉత్సవాల సందర్భంగా పదారేళ్ళ పరమేశ్వరి పాడిన భక్తిగీతాలు, శ్లోకాల గురించి మెచ్చుకుంటూ రాసిన ఆ పత్రికలని ముందేసుకుని కూర్చుని, శాంతని పిలిచాడు.

ఓ పత్రికలో పరమేశ్వరి… తల్లి శాంత గురించి, ఆమె శిక్షణ గురించి రాసారు. మరో పత్రికలో ఆ బాలిక అభిరుచిని గౌరవించి, ఇతర మతాల ప్రార్థనాస్థలాలలో పాడేందుకు ప్రోత్సహించినందుకు తండ్రి రామ్‌కుమార్ ని మెచ్చుకుంటూ రాసారు.

మరికొన్ని పత్రికలలో… ప్రత్యేక సందర్భాలలో… వీరి కుటుంబం చేపట్టే చర్చ్ సేవలు, పరమేశ్వరి పాడే ప్రభువు కీర్తనలు, సండే స్కూల్‌లో పిల్లలకు ఆమె ట్యూటర్ గా వ్యవహరించడాన్ని గురించి ప్రస్తావించారు.  సర్వమత ధర్మాలని ఆచరించి, పిల్లలకి కూడా చక్కని సంస్కారం అలవర్చినందుకు పరమేశ్వరి తల్లిదండ్రులను మెచ్చుకున్నారు.

ఇలా సంగీతకారులు, సామాన్య జనం నుంచి తనకి, తన కుటుంబానికి లభిస్తున్న అంతులేని ఆదరణకి పొంగిపోయింది పారూ. దినపత్రికల హడావుడి ముగిసాక, తన హోమ్‌వర్క్ చేసుకుని, పాఠాలు చదువుకోడంలో చెల్లికి సాయం చేసింది.

****

తెల్లారక ముందే దేవుడి గదిని శుభ్రం చేసి, రోజూ చదివే లలితాసహస్ర నామాలు చదవడమయ్యాక …వంటింట్లో ఉన్న తల్లికి సాయం చేసేందుకు వెళ్ళింది పారూ.

ఫోన్ మ్రోగడంతో పరుగున వెళ్ళి ఫోన్ తీసింది. అటునుండి మాట్లాడుతున్నది సీతమ్మగారు.

“హలో పారూ.. నువ్వేనా.. బంగారు తల్లీ, నీ గురించి పత్రికల్లో చదివానమ్మా. శుభం. ఆ కళామతల్లి దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. నేను వీలు చేసుకుని త్వరలో మిమ్మల్ని చూడ్డానికి వస్తానులే.” అన్నారామె.

పారూ పొంగిపోయింది. “సరే అమ్మమ్మా. ఎప్పుడొస్తారో చెప్పండి. ఎదురు చూస్తుంటాము. ఇదిగో అమ్మ వచ్చింది. మాట్లాడుతుందట.” అంటూ ఫోన్ శాంతకిచ్చింది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in February 2025, కథలు

4 Comments

  1. bhargav chagala

    చాలా interesting గా సాగింది episode, అన్ని మతాలు ఒక్కటే అన్న సందేశం కూడా, నాజూగ్గా అంద చేయబడింది, 💐

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!