2
శాంతకి కాన్పు సమయం దగ్గరకొస్తోంది. తోడుగా ఉండడానికి, తన పెద్దమ్మ సీతమ్మని రమ్మని కోరింది. తన సొంత చెల్లెలు కూతురే కాక పెంచిన బిడ్డ కావడంతో, శాంత పిలుపందుకుని వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగారు సీతమ్మ. కూతురికి ఇష్టమని ఆలయ పూదోట నుండి సంపెంగలు, మొగలి పూవులు కోయిస్తూ తన కూతురి గురించిన ఆలోచనల్లో మునిగారు ఆమె.
బెంగళూరులో సంగీత కచేరీ చేసి తిరిగివస్తూ...ఘోర కారు ప్రమాదంలో... శాంత తల్లితండ్రులు మాణిక్యాంబ, విశ్వనాథంలు అశువులు బాసినప్పుడు ... అప్పటి పన్నెండేళ్ల శాంతకి పెద్దమ్మగా .. ఆ అమ్మాయి బాధ్యతని చేపట్టారామె. అందుకే, అప్పటివరకు అలవాటైన పిలుపుగా ఆమెని 'పెద్దమ్మ' అనో... తల్లి స్థానంలో నిలిచి పెంచి పెద్ద చేసినందువల్ల అప్పుడప్పుడు అంతే ప్రేమగా 'అమ్మా' అనో సంభోదిస్తుంది శాంత. అది గుర్తుకు వచ్చి నవ్వుకున్నారు సీతమ్మ. అన్నీ సర్దుకుని ఆ సాయంత్రమే కాకినాడ కి పయనమయ్యారు ఆమె.
**
సీతమ్మ గారి పూర్తి పేరు వేదాంతం సీతామహాలక్ష్మి. శాంత బాధ్యత స్వీకరించే సమయానికే ... చెన్నై వాస్తవ్యురాలైన ఆమె… ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు. చెన్నై ఆర్ట్స్ అకాడమీ వారి 'కళా ప్రపూర్ణ' బిరుదాంకితురాలు. చిన్నతనంలో విస్తృతంగా కచేరీలు చేసి, సంగీత ప్రియుల అభిమానాన్ని, జాతీయ స్థాయిలో గుర్తింపుని పొందిన గాయనీమణి. సంగీతమే ఆమె ప్రపంచం కాగా... అవివాహితగానే ఉండిపోయారు ఆమె.
పెద్దమ్మ ప్రాపకంలో పెరిగి పెద్దయిన శాంత 'తమిళనాడు మ్యూజిక్ అకాడెమీ' నుండి ఉత్తీర్ణురాలయి, రామ్‌కుమార్ ని ప్రేమ వివాహం చేసుకుని… ఆరేళ్ళ క్రితం కాకినాడ కి వెళ్ళిపోయింది.
ఆ తరువాతే…. జ్ఞాన సరస్వతీ ఆలయానికి.. దశాబ్దాలుగా ఉపకారిగా ఉన్న సీతామహాలక్ష్మి... చెన్నై నుండి బాసరకు వెళ్లి, అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. సంగీత బోధనలోనే జీవితాన్ని గడుపుతూ.. వీలుని బట్టి, శాంత అవసరాన్ని బట్టి కాకినాడ కి వెళ్ళివస్తూ ఉంటారామె.
స్వచ్ఛందంగా సమాజానికి, బీదవారికి తన స్వరజ్ఞానంతో సేవ చేయమని ఆ కళామతల్లి ఆదేశించినట్లు భావిస్తారామె. బాసర లోని శిష్య బృందం కూడా ఆమెని 'సీతమ్మ’ అని సంభోదించడంతో అదే ఆమె నామధేయంగా మారింది.
**
అమ్మమ్మ రాక చిన్నారి పారూకి ఎంతో ఆనందంగా ఉంది. అమ్మమ్మనే అనుసరిస్తూ... అమ్మమ్మ కనుసన్నలలో మెలగసాగింది. పూలు కోస్తున్నా, పూజ చేస్తున్నా, బియ్యం ఏరుతున్నా, పప్పులు చెరుగుతున్నా కూడా ఆమె వెంటే ఉంటుంది ఆ చిన్నారి.
తన సొంత చేతులతో పూజా మందిరాన్ని సవరించడానికి కూడా ప్రయత్నిస్తుంది పారూ. శుక్ర, శనివారాల్లో పూజ చేస్తున్నప్పుడు అమ్మకి, అమ్మమ్మకి మధ్యన కూర్చుని శ్లోకాలకు తగ్గట్టుగా పెదాలు కదుపుతుంది.
**
అమ్మమ్మ ఒళ్ళో కూర్చుని ఆవిడ పాడే భజన గీతాలు, చెప్పే చందమామ కథలు వినడం పారూకి అలవాటుగా మారింది. పాప గుర్తుంచుకునేలా ఒక్కో భజన గీతాన్ని ఒక్కోలా అభినయిస్తారు సీతమ్మ. ఆవిడ పాడే - 'ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా', 'రామ రామ యనుచు భజన సేయవే..' అనే రాముడి కీర్తనలు పారూకి ఎంతో ఇష్టం. రాముడిని దర్శింపజేయడం కోసం ధనుర్బాణాలను గాలిలో గీసి చూపారావిడ. ఆ చిహ్నం పారూ మనసులో బాగా ముద్రించుకుపోయింది.
రాముడి పాటలు అడగాలంటే, తను కూడా చేత్తో ధనుర్బాణాల ఆకారాన్ని ఏర్పరిచి చూపించి, అమ్మమ్మ అభినందనలు అందుకుంటుంది పారూ. అమ్మమ్మ నుంచి ఇంటి పనులు కూడా నేర్చుకోసాగింది. మాట లేదన్న ఒక్క లోపం తప్పితే పారూ గ్రాహ్యశక్తికి, పురోగతికి ఆటంకాలేవీ లేవని గ్రహించిన పాప తల్లితండ్రులు ఏదో ఒక రోజు తమ బంగారుతల్లి మాట్లాడక పోతుందా... అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆ అమ్మమ్మా - మనమరాలకి ముఖ్యమైన కాలక్షేపం మాత్రం... ప్రతి శనివారం పొద్దుటే పొంగలి ప్రసాదం వండుకుని వెళ్లి … గుళ్లో భగవంతునికి నైవేద్యంగా సమర్పించడం. ఆ పిదప గుడిమెట్ల మీద యాచకులకి ఒకొక్కరికి … ప్రసాదంతో పాటు ఓ రూపాయి బిళ్ళని పారూ చేతులతో ఇప్పించడం… ఆ అమ్మమ్మకి, అలా చేసి మంచి పని చేశాననుకోడం ఆ చిన్నారికి ఎంతో ఆనందం.
అభాగ్యులకి, లేనివారికి చేతనయిన సాయం చేయాలని, దానివల్ల మంచి జరుగుతుందని.. పారూకి ప్రత్యేకంగా చెబుతుంది అమ్మమ్మ.
ఇదంతా గమనించే శాంత ఓ మారు …"పెద్దమ్మా, నీవు ఊరెళ్ళిపోతే, ఇదంతా నేనెక్కడ చేయగలను? పైగా నీకైతే సరిపోయింది గాని... ఇంతటి దానాలు నాకు కుదిరేనా?" అంటూ నవ్వుతూ ప్రశ్నించినప్పుడు…
"మనిషిలో జాలి గుణం మహా గొప్పదిరా శాంత. సాయం చేసిన మనిషికి పుణ్యం దక్కుతుంది, మనసుకి ప్రశాంతత దొరుకుతుంది కదా తల్లీ." అంటూ జవాబిచ్చింది సీతమ్మ గారు.
"సరేనమ్మా అలాగే కానివ్వు. నీ మంచితనం, దానగుణం తెలియని వారున్నారా చెప్పు? ఇకపోతే వచ్చేవారం పారూ పుట్టినరోజుకి ఏర్పాట్లు చేయాలి. ఇలా అన్నదానం ఏదన్నా చేయదలిస్తే నాకు ముందే చెప్పాలి." అంది శాంత.
**
పుట్టినరోజు పండుగకి ... పారూ వయస్సు పిల్లలు, వారి కుటుంబాలు ఇరవైమంది దాక వచ్చారు. పిల్లల కేరింతలు, ఆటపాటలతో వేడుక సరదాగా జరిగింది.
ఇంట్లో సందడి ముగిసి అతిధులంతా వెళ్ళాక, పారూకి మరోసారి కేక్ తినిపిస్తూ…శాంత తోను, రామ్ తోనూ కబుర్లు చెప్పసాగారు సీతమ్మ. "ఇన్నాళ్ళుగా పాపని చూస్తున్నాను. నా దృష్టిలో ఐదేళ్ల పారూ ఏకసంథాగ్రాహి, తెలివైనది. బాలమేధావి లక్షణాలున్నాయి.” అని మురిసిపోయారామె.
"నీ మాటలు నిజమవ్వాలని కోరుకుంటాను పెద్దమ్మా." అన్న శాంతతో...
“అంతే కాదమ్మా… ఈ పిల్లకి మీ అమ్మలోని సద్గుణాలన్నీ వచ్చినట్లున్నాయి. సంగీత నైపుణ్యంతో సహా త్వరలో మాట వచ్చి ... పారూ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మరో ‘క్లేరా-షూమన్ లాగా అవుతుందేమో! ఐదేళ్ల వరకు ఆ జర్మన్ స్వరకర్త కూడా మాట్లాడలేదట ..." అంటూ పారూ వంక మురిపెంగా చూసారు సీతమ్మగారు.
“సంతోషం అత్తమ్మగారు. త్వరలో పుట్టబోయే మరో బిడ్డతో…మీరు సమయం లేకుండా అయ్యేలోగానే, పారూకి మీరు నేర్పగలిగినన్ని విషయాలు నేర్పేయండి.” అన్నాడు రామ్.
**
మరో మూడు నెలలకి ఓ గురువారం తెల్లారుఝామున... శాంత కవలలకు జన్మనిచ్చింది. బాబు, పాప పుట్టారు. అబ్బాయికి పునీత్ అనీ, పాపకి జననీ అని పేరు పెట్టారు. పిల్లలిద్దరూ ఆరోగ్యంగా, అందంగా ఉన్నారు.
గంధం, ఎండు నారింజ తొక్కలు, కేసరి, వెన్న కలిపి లేపనం తయారు చేసారు సీతమ్మ. స్నానం చేయించడానికి ముందు ఆ లేపనంతో రోజూ చంటిపిల్లలిద్దరికీ మర్దనా చేస్తారు. పిల్లల కళ్ళకి పెట్టేందుకు ఇంట్లోనే కాటుక తయారు చేసారామె. పునీత్‌ది ఉంగరాల జుట్టు, జననీది వంపులేని పట్టులాంటి జుట్టు.
"పారూ ఎంతో అందమైనది శాంత. మీ అమ్మ మాణిక్యాంబ లాగా సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇక ఈ కవలలు వాళ్ళ నాన్నని పోలారు. వీళ్ళకి ఎముక బరువు.. రంగు కూడా రామ్ లాగా చామనఛాయ. అయినా, వీళ్ళూ అందంగానే ఉంటారనుకో..." అన్నారు సీతమ్మ పసిబిడ్డ తల దువ్వుతూ.
"పెద్దమ్మా ... దయచేసి ఇప్పట్నుంచీ పిల్లల్లో పోలికలు, వ్యత్యాసాలు, తీసుకురావద్దు." బ్రతిమాలింది శాంత.
"పోనీలేవే. అందరూ నీ పిల్లలే. సమానంగానే ప్రేమని పంచుతావు. ఇందులో తప్పేమీ లేదు తల్లీ..." అన్నారావిడ నవ్వుతూ.
పాలనా, పోషణా సవ్యంగా ఉండడంతో పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతున్నారు.
**
నాలుగు నెలల వయసున్న కవలలని తీసుకుని చెకప్ కోసం.. డాక్టర్ మాలిని క్లినిక్‌కి వెళ్ళారు సీతమ్మ, శాంత.
"పెద్దమ్మ గారూ, మీరు ఏమనుకోనంటే ఓ మాట చెబుతాను. పిల్లలిద్దరూ కాస్త పెద్దవాళ్ళయ్యే వరకూ మీరు ఇక్కడే ఉండకూడదూ? శాంతకి తోడు ఉన్నట్లుంటుంది, తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. కనీసం వాళ్ళ మొదటి పుట్టినరోజు వరకైనా ఉంటే బావుంటుంది. ఆలోచించండి." అంది మాలిని సీతమ్మ గారితో.
సీతమ్మ నవ్వేసారు. "నేను కోల్పోతున్నది అక్కడి వారికి నేర్పే సంగీతం పాఠాల్నే. బదులుగా మరో ఇద్దరు టీచర్లని వేసుకున్నారు. నాకు పారూ బాగా దగ్గరయింది. దాన్ని వదిలి వెళ్ళాలంటే కష్టమే. తను త్వరలో మాట్లాడగలదని ఆశగా ఉంది. అందుకే, నువ్వు చెప్పినదాని గురించి ఆలోచిస్తానమ్మా.." అన్నారావిడ.
***
అన్నట్టుగానే ఆవిడ పిల్లలకోసం మరి కొన్నాళ్ళు శాంతకి తోడుగా ఉండిపోడానికే నిశ్చయించుకున్నారు.
పునీత్, జననీల మొదటి పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు శనివారం. చుట్టుపక్కల కుటుంబాలని పుట్టినరోజు పండగకి పిలిచారు శాంత, రామ్‌లు.
అమ్మమ్మ పాటలు, కేక్ కోయడం, చిరుతిళ్ళు, ఆటపాటలతో సమయం సరదాగా గడచిపోయింది.
ఆ మర్నాడే సీతమ్మగారు బాసరకి బయల్దేరిపోయారు. పెద్దమ్మ సాయం లేకుండా... పిల్లలతో రోజూవారీ జీవితం గాడిలో పడేందుకు కొద్ధి రోజులు పట్టింది శాంతకు.
**
ఓ రోజు తెల్లవారుజామునే రామ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక, వాకిలి తలుపులు మూసి వచ్చి మగతగా పక్క మీద వాలింది శాంత. పక్షుల కువకువలు వింటూ, సన్నగా పడుతున్న వాన చినుకుల సవ్వడిని ఆస్వాదించసాగింది.
కొంచెం దూరం నుంచి ||ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా…|| అనే రామకీర్తన శ్రావ్యంగా వినబడుతోంది. ఆ గొంతు ఎవరిదో చిన్నపిల్లది. ‘||రామ రామ యనుచు.. శ్రీరామ రామ రామ యనుచు..||' అంటూ శ్రావ్యంగా సాగింది ఆ కీర్తన. వింటూన్న శాంత మోముపై చిరునవ్వు వెలసింది. అమ్మ తనకి నేర్పిన మొట్టమొదటి కీర్తన కదా..' అనుకుంది.
అంతలో గబక్కున పెద్దమ్మ ఊరెళ్ళి వారం దాటిందని జ్ఞాపకం రావడంతో, ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచి హాల్లోకి పరిగెత్తింది.
**
అక్కడ కనబడిన దృశ్యం చూసి, విస్మయానికి లోనై, సంభ్రమంతో నిలుచుండి పోయింది. పాడుతున్నది పారూ. పూజగదిలో సీతమ్మగారు కూర్చునే చోట కూర్చుని అచ్చం ఆవిడలానే పాడుతోంది చిన్నారి పారూ. కాస్త తడబడుతూనే, పదాలని కూడబలుక్కుంటూ చక్కగా పాడుతున్న ఆ పసిదాని గొంతు లోని స్వచ్ఛతకి శాంత ఆశ్చర్యపోయింది. నిశ్శబ్దంగా వెళ్లి, కొంచెం దూరంలో కూర్చుంది. తన కూతురి గొంతు మొదటిసారిగా వింటూ, చేత్తో తాళం వేయసాగింది.
ఆ క్షణం కోసమే ఎంతగానో ఎదురుచూస్తున్న తమపై, దేవతలు కరుణించినందుకు, పాప గళం విప్పి పలుక గలుగుతున్నందుకు కృతజ్ఞతతో ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించాయి.
**
తన్మయత్వంగా పాట విన్నాక, శాంత కళ్ళు తుడుచుకుని, పాప వద్దకి వెళ్లి, అమాంతం దగ్గరకి తీసుకుని తనివితీరా ముద్దాడింది. పారూతో ఎన్నెన్నో మాటలు పలికిస్తూ మురిసిపోయింది.
"మీ నాన్న ఎంత ఆనందపడతారో" అంటూ, గబక్కున వెళ్ళి రామ్ కి, మాలినికి కూడా వెంటనే ఇంటికి రమ్మని ఫోన్ చేసింది.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నాట్య గురువు, నటి, రచయిత్రి, దర్శక - నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యరీతుల్లో నిష్ణాతురాలు ఉమాభారతి. మేటి నర్తకిగా, గురువుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో మొదటి స్థానం గెలుపుతో మొదలయిన ఆమె కళాజీవన ప్రస్థానం విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు, సినీరంగ ప్రవేశంతో... బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనసాగింది.
'సుడిగుండాలు' చిత్రంలో బాలనటిగా పరిచయమయి, సాహిత్య అకాడమీ అవార్డు పొందిన 'చిల్లరదేవుళ్ళు' చిత్రంలో కథానాయకిగా, 'యమగోల' చిత్రంలో ఊర్వశిగా నర్తించిన ఉమాభారతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే డాక్యుమెంట్రీ, సింగపూర్, జోహన్నస్బర్గ్ టి.వి లకి ‘నర్తకి’ టెలి-ఫిలిం, ‘క్లాసికల్ డాన్సస్ ఆఫ్ ఇండియా’ అనే ఎడ్యుకేషనల్ వీడియో నిర్మించి నటించారు.
ఆమె స్థాపించిన 'అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ' ద్వారా నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఆలయనాదాలు' టెలి-ఫిలిం జెమినీ టీవీలో సీరియల్ గాను, అంజలి వీడియోస్ ద్వారా విదేశాల్లో నేరుగాను పంపిణీ చేయబడింది.
సౌతాఫ్రికా, మారిషస్, సింగపూర్, మలేషియా, అమెరికాలో నృత్య ప్రదర్శనల ద్వారా పెక్కు ఆలయ నిర్మాణ నిధులకు, తెలుగు భాషా-సంస్కృతి అభివృద్ధి కార్యక్రమాలకు, వరద బాధితుల నిధులకు, నేత్రదాన శిబిరాల నిర్వహణకు, పేద విద్యార్ధుల స్కాలర్షిపాపులకు, లైబ్రరీలకు పలుమార్లు నిధులను అందించారామె.
గుర్తింపు: 1975 లో శ్రీ మంగళంపల్లి బాలమురళికృష్ణ గారి చేతుల మీదగా స్వరణకంకణంతో పాటు ‘నాట్యభారతి’ బిరుదును, '89 లో పాండుచేరి గవర్నర్ నుండి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’, 1981 లో ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, 1991 లో ఆంధ్ర ప్రదేశ్ సినీ గోయర్స్ వారి నెహ్రు సెంటీనియల్, హౌస్టన్ లో 'ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు, 2016 లో ఢిల్లీ తెలుగు సంఘం వారి ప్రవాసాంధ్ర కళాకారిణి గుర్తింపుని అందుకున్నారు ఉమాభారతి.
రచయిత్రిగా: ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డులు, సృజనాత్మకతకి గుర్తింపు పొందిన నృత్య నాటికలు - భరతముని భూలోక పర్యటన, దేవి స్తోత్ర మాలిక, కన్య, టెంపుల్ బెల్స్, గురువే నమః, పెళ్లి ముచ్చట, మానసపుత్రి, తెలుగు వెలుగు 2013 నుండి నృత్యేతర రచనల్లో వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి 'ఉత్తమ రచన పురస్కారం' పొందినవి - ముళ్ళ గులాబీ, తులసి, ఏమాయ చేసావో?, విదేశీ కోడలు, సరికొత్త వేకువ, 'ఉమాభారతి కథలు' - (కథలు*డయాస్పోరా కథానికలు* లేఖా సాహిత్యం) - కథా సంపుటిలు.
వేదిక, ఎగిరే పావురమా, నాట్యభారతీయం (నవలలు) ఇప్పటివరకు పుస్తక రూపంగా 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ప్రచురణలుగా వెలువడ్డాయి. ఉమ రాసిన ధారావాహికలు, కథానికలు, కవితలు, నృత్యనాటికలు ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి.
తాజాగా..డా. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి సందర్భంగా.. సిరికోన - జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో .. ఉమాభారతి రచన ‘హృదయగానం – నేడే విడుదల’ ఉత్తమ రచన అవార్డుని అందుకుంది.
ఇతర వ్యాపకాలు, కార్యక్రమాలు:
శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటీ సంస్థ స్థాపించి యేటా కధా - పద్య - కార్టూన్ ల పోటీలు నిర్వహిస్తూ, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉమాభారతి.
1982 లో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి ప్రవాసాంధ్రుల భావితరాలకి నృత్య శిక్షణనిస్తున్నారు.
ఉమాభారతి కుటుంబం:
మేజర్ సత్యనారాయణ, శ్రీమతి శారద: తల్లితండ్రులు, కోసూరి మురళి మోహన్ – భర్త, సత్యజిత్, శిల్ప- సంతానం.
కీ. శే. పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, కీ. శే. కళాప్రపూర్ణ వేదాంతం జగన్నాధ శర్మ –కూచిపూడి గురువులు.
కీ. శే. పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామణి శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్ – భరతనాట్యం గురువులు.
హృదయగానం నవల రచన వెనుక ప్రేరణలు..
ఓ జీవికి సహజంగా సంక్రమించే గుణగణాలు, సామర్ధ్యత, నేర్పు వంటివి ఆ జీవికే సొంతం. పువ్వు వికసించి పరిమళించాలన్నా, మనిషి ఎదిగి సమర్ధవంతంగా జీవించాలన్నా.. సానుకూలత ఎంతైనా అవసరం. సహకారం అందించి, సానుకూలత కల్పిస్తే.. పారలేని యేరు సెలయేరు కాగలదు. కదలిక ఎరుగని కొత్త లేడి పిల్ల లేచి పరుగులు తీయనూ కలదు.
ఒక్కోమారు రాళ్ళని చీల్చుకుని కూడా వికశించగల అపురూపమైన పుష్పం లాగా.. ప్రతికూల పరిస్థితులని సైతం అధిగమించి ఎందరో తామెంచుకున్న మార్గాల్లో రాణించి స్పూర్తిదాయకులు అవ్వగలరు.
ఆ వాస్తవాన్ని ఆధారంగా తీసుకుని రాసిన కథనమే ‘హృదయగానం’. సంగీత విధ్వాంసుల కుటుంబంలో జన్మించిన అమ్మాయి .. ఐదేళ్ల వరకు అమ్మ, అత్త అని కూడా పలుకలేని పరిస్థితి నుండి.. కృషితో, పట్టుదలతో, పెద్దవాళ్ళ సహకారాలతో ప్రఖ్యాత సంగీతకారిణిగా ఎదిగిన వైనమే ఇందులోని ఇతివృత్తం.
అలాగే తల్లితండ్రుల ఆశయాలని, ఆశలను తనవిగా సొంతం చేసుకుని జీవితంలో ముందుకు సాగడంలో తృప్తి, ఆనందం ఉంటాయని కూడా నాయకి తత్వంగా రాసినదే ఈ నవల.
నా మాట:
క్రమబద్దమైన జీవితాన్ని జీవించిన ఓ సామాన్య ఆడపిల్ల పరమేశ్వరి కధనం
ఆమె పథం “జన్మ సార్ధకత - జన్మ సాధికారికత”
శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసుల కుటుంబంలో జన్మించిన పరమేశ్వరి...
ఐదేళ్ళు నిండినా గళం విప్పి పలుకలేని పసిది
ప్రతికూల వాతావరణంలోనూ వికసించే అరుదైన పుష్పం లాంటిదే ఆ చిన్నారి..
**
అయితే, ఆమె హృదయం చేసే గానం శ్రీరాగం లా గంభీరమైనది...
హృదయగానం ప్రేమ మధురిమలని కురిపిస్తుంది. మార్ధవంగా కారుణ్య రసం చిలికిస్తుంది.
సహన రాగం ఆలపిస్తుంది, విలపిస్తుంది, పరితపిస్తుంది కూడా.
అన్ని భావాలని సమపాళ్ళలో ఆస్వాదిస్తూ రాగాలాపన చేస్తుంది.
ఆమె సంగీత జీవన ప్రస్థానంలోనూ ఎన్నెన్నో మలుపులు... వింతలు, విశేషాలు, అద్భుతాలు.
ఇక నవలను మొదలు పెడతాను. చదివి మీ అభిప్రాయాలతో ఆశీర్వదించ మనవి – మీ ఉమా భారతి
మంచి concept మేడం. Story చాలా స్మూత్ గా, interesting గా సాగుతోంది. 👏🏻👏🏻nice story. అవును రాయిని చీల్చుకుని పుష్పం పుడుతుంది. అననుఁకూల పరిస్థితుల నుండి వజ్రంలా మనిషి తయారావుతాడు. 👏🏻👏🏻
సుమా గారు.. ధన్యవాదాలు. మీకు కథనం నచ్చినందుకు, చదివి స్పందిస్తున్నందుకు సంతోషం. 😊