Menu Close
ఆగష్టు 2025 సంచిక

సిరిమల్లె పాఠకులందరికీ మన సిరిమల్లె దశమ వార్షిక శుభాకాంక్షలు!!

SM-10Anniversary-2025

సిరిమల్లె పది వసంతాల ప్రస్థాన పదనిసలు

పామరుడైన తెలుగు భాషాభిమానిగా
బహువిధ మాతృభాష మాధుర్య పిపాసినై
సత్సంకల్పంతో సాధన చేస్తూ, నిత్య విద్యార్థినై
సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలను అర్థం చేసుకుంటూ
సేవా దృక్పథం తో నిత్యకృషిని నమ్ముకుని
మాతృభాషకు మరింత ప్రాభవాన్ని అందించాలనే చిరు ఆశతో
పయనిస్తున్న నా జీవనయానంలో,
నేనూ నా వంతు సహకారాన్ని అందిస్తాననే భరోసాను కల్పించి, నన్ను మరింత ప్రోత్సహించిన నా జీవిత భాగస్వామి, నా శ్రీమతి, ఉమాప్రియ ఇచ్చిన, ఇస్తున్న సహాయ సహకారాలతో ఇరువురము భాషాసేవకులుగా మారి మొదలు పెట్టిన ఈ అంతర్జాల వేదిక “సిరిమల్లె”, సాహితీ సౌరభాల సువాసనలు విరిజల్లులై కురవడం ప్రారంభమై నేటికి పది సంవత్సరాలు.

ఈ మహా యజ్ఞం ‘సిరిమల్లె’ ఆవిర్భావ ముఖ్యోద్దేశం; తెలుగు భాషా విలువలను కాపాడుకుంటూ, భావితరాలకు మాతృభాష మమకారాన్ని అందించాలనే చిరు ఆశతో, అమ్మ నుడిని అన్ని వర్గాలకు నిత్యం మాట్లాడుకునే వాహకంగా మలచాలనే సంకల్పంతో, అవిఘ్నంగా కొనసాగిస్తూ నిరంతరం నిత్య నూతన సాహితీ ప్రక్రియలు, భాషా ప్రయోగాలతో, సరికొత్త అభిరుచుల సమాహారంతో తెలుగు భాషా ప్రియులకు, పాఠకులను అందించడమే. అందుకు మా కృషితో పాటు మా ఈ సాహితీ సేవా యజ్ఞంలో భాగమై తమవంతు సహాయసహకారాలు తమ రచనల రూపంలో అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మనఃపూర్వక కృతజ్ఞతలు.

2015 ఆగష్టు నెలలో తెలుగు ప్రాభవాన్ని పరిరక్షిస్తూ ఆ సంపదను పదిలపరిచి భావితరాలకు అందించాలనే చిన్న ఆలోచనతో దిశానిర్దేశం ఏదీ లేకున్ననూ ధైర్యం చేసి చేయగలిగినంత చేయాలనే దృఢ చిత్తంతో మొదలుపెట్టిన మా ఈ ‘సిరిమల్లె’, అందరి ఆశీస్సులతో, భాషా ప్రేమికుల ప్రోత్సాహంతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా సాగడం మొదలైంది. కనుకనే నూతన సాహిత్య పోకడలను, వ్యావహారిక ప్రక్రియలను కూడా ప్రోత్సహిస్తూ, సంప్రదాయ సాహిత్య విలువలను కూడా పరిరక్షిస్తూ నిర్విఘ్నంగా పత్రికను క్రమం తప్పక ప్రతి నెలా ఒకటోతారీఖున ప్రచురించే సామర్ధ్యాన్ని స్థిరం చేసుకున్నాము. ఈ పదేళ్ళలో ప్రతి ఆగష్టు నెల సంచిక వార్షికోత్సవ సంచికగా మార్చి ఎన్నో విషయాలను, మాలో కలుగుతున్న సాహిత్య ప్రేరణనలను సంపాదకీయం ద్వారా మీకు వివరిస్తూ వస్తున్నాము.

మన సిరిమల్లె ఆగష్టు నెల సంచిక పదివసంతాల పండుగ సంచికగా వెలువరిస్తూ, మీ అందరి అభినందనలను, ప్రోత్సాహానికి అక్షరరూపం కల్పించి పదిలపరచి పదిమందితో కలిసి పంచుకోవాలనే తలంపుతో పాఠకులులైన మీ అందరి నుండి కొన్ని శుభకర వాక్యాలను ఆశీర్వచనాలుగా పొందాలని కోరినప్పుడు, వెనువెంటనే లభించిన అనూహ్య స్పందన మా దంపతులిరువురినీ ఎంతో ఉద్వేగానికి లోనయ్యే విధంగా చేసింది. మీ అందరి ప్రోత్సాహక మాటల ఒరవడి నిజంగా మమ్ములను కట్టి పడేసింది. ఆ ఆనందకర మనోద్వేగం, మరోవిధంగా మా గురుతర బాధ్యతను కూడా సూచించింది. సాహిత్యపరమైన విలువలను, సరైన భాషా ప్రక్రియలను మేము మరింత జాగురూకతతో గమనించి పత్రిక నైతిక, సామాజిక, సాహిత్య ధర్మాలు అన్నింటినీ స్థిరంగా మరియు సమ పాళ్ళలో ఉండే విధంగా కృషి చేయాలని మాకు మరోసారి గుర్తిచేసింది. అందుకు మీ అందరికీ పేరు పేరునా మనఃపూర్వక కృతజ్ఞతలు.

ఈ దశమ వార్షిక సంచికకు మరింత సాహిత్య విలువను పెంచే విధంగా, సంస్కృతాంధ్ర ఉభయ భాషా ద్విశతావధాని, బహుభాషా కోవిదులు శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారి సంస్కృతాంధ్ర ఏకాదశాంశిక అవధాన విశేషాలను ఆగష్టు సంచికలో పొందుపరచడం జరిగింది. ఇది ఒక విధంగా చక్కటి ఆశీర్వచనం అని చెప్పవచ్చు. ఈ నివేదికను తయారుచేసిన సాహితీకిశోర్ గారికి, అందించిన గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు. అలాగే మరో మూడు క్రొత్త వ్యాసాలను జత చేశాము, మరో ధారావాహికను మొదలుపెట్టాము. ఈ సాహిత్య ప్రవాహం ఇలాగే కొనసాగిస్తూ నిబద్దతతో మా వంతు కృషి సల్పి పత్రికను ముందుకు తీసుకెళతామని హామీ ఇస్తున్నాము. అందుకు మీ అందరి సహాయసహకారాలు సదా మాతోనే ఉంటాయని ఆశిస్తూ....

సిరిమల్లె దశమ వార్షిక శుభాభినందనలతో,

మీ, మధుసూధన బుడమగుంట (మధు-ప్రియ)