Menu Close
ఆగష్టు 2024 సంచిక

సిరిమల్లె పాఠకులందరికీ మన సిరిమల్లె నవమ వార్షిక శుభాకాంక్షలు!!

Sirimalle Anniversary 2024

సిరిమల్లె పాఠకులందరికీ నమస్సుమాంజలి 🙏

ఈ సకల చరాచర సృష్టిలో కోట్ల కొలది జీవరాశులు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. అన్నిటిలోనూ ఆకలి దప్పులు, ఆరోగ్యతిప్పలు అనునిత్యం అనుకరిస్తూ అనుసరిస్తూనే ఉంటాయి. అయితే, ఈ జగత్తులోని అన్ని జీవాలలోకి మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. కారణం; ఏ జీవికీ లేని ఆలోచనా పటిమ, అత్యంత చైతన్యవంతమైన మెదడు ఒక్క మానవునికి మాత్రమె ఉంది.

భూత భవిష్య వర్తమాన కాలాల్నివిశ్లేషిస్తూ సమయస్ఫూర్తి తో ఆలోచించి సరైన దారిలో జీవన స్రవంతిని మలుచుకుని సౌలభ్యాలతో సుఖంగా జీవించడం ఒక్క మానవునికి మాత్రమె వీలౌతుంది. అటువంటి మహత్తరమైన ఆలోచనా పటిమ కలిగిన మనిషి, మానవత్వ విలువలని మరిచి సమాజ అభివృద్ధికి సహకరించక స్వార్థ చింతనతో తన ఎదుగుదలను మాత్రమె కోరుకుంటూ మసలిన నాడు, తనకు అందించిన సుఖజీవనాన్ని ఆస్వాదిస్తూ సాటివారి పట్ల కృతఘ్నుడై ప్రవర్తించిన రోజు, ఆ మానవజన్మ వ్యర్ధం అని చెప్పక తప్పదు. మనిషి జీవితం ఒక జీవనది వంటిది. తాను ప్రవహిస్తూ తనతో పాటు తరతమ భేదాలను, సామాజిక స్థితిగతులను, హోదాలను అన్నింటినీ మరిచి అందరినీ కలుపుకుంటూ ప్రశాంతంగా సాగిననాడు అదే నిజమైన మానవ ధర్మం అవుతుంది.

అక్షర సిరులతో ఆనందాన్ని అందించే అమ్మనుడి యొక్క ప్రాభవం నేడు అమెరికా ఖండంలోనూ మరియు ఇతర దేశాలలోనూ అనేక విధాలుగా ప్రాచుర్యం పొందుతున్నది. మన తెలుగువారు విదేశాలలో కూడా ఉన్నత పదవులను అధిరోహిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. వారిలో కొందరు తమ మూలాలను మరిచిపోకుండా భాష, సంస్కృతి సంప్రదాయాలను తమవంతు బాధ్యతగా భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజంగా ఎంతో ఆనందదాయకం.

మనలో ప్రతి ఒక్కరికీ ఈ దైనందిన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడడం సహజం. అట్లని వాటికి వెరవక ముందుకుసాగడమే మనిషి చేయాల్సింది. అయితే ఆ గజిబిజి ప్రపంచం నుండి కొంచెం ఆడవిడుపు అంటే సామాజిక సేవ అనే మాటకు మించిన మరో మంచి అంశం ఉండదు. ఆ సేవ ఏ రూపంలోనైనా ఉండవచ్చు. అదే సంకల్పంతో “సిరిమల్లె” రూపంలో మేము మొదలుపెట్టిన ఈ సాహితీ సేవ నిర్విఘ్నంగా నేటికీ కొనసాగుతున్నది. తద్వారా మేము పొందుతున్న మానసిక సంతృప్తి మాటలలో చెప్పలేనిది.

తొమ్మిది సంఖ్య మానవ జీవితాలతో అతిసన్నిహిత సంబంధము కలది. తొమ్మిది నెలల గర్భవాసముతో మొదలయి తొమ్మిది గ్రహాల ప్రభావాలతో సాగేది మానవ జీవితము. తొమ్మిది అనగానే వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, దేవీనవరాత్రులు, వాటితో వచ్చే ఉత్సవ సంబరాలు గుర్తుకు వస్తాయి.

అలాగే నవనవలాడడము మృదుత్వాన్ని, ప్రకాశాన్ని, తాజాతనాన్ని సూచిస్తుంది. ఈ మూడు లక్షణాలు పుష్కలముగా సంతరించుకొన్నది నేటి మన నవవసంతాల సిరిమల్లె బాల.

ఈ బాల చాల సుగుణాలజాల, జ్ఞానాలవాల, వినోదాలడోల, మన్నన రత్నాలశాల.  వైవిధ్యరచనలతో మీ ముందుకు నేటికి 108 సంచికలతో వచ్చి, మీ ప్రేమాభిమానాలను చూఱకొన్న సాహిత్య సౌరభాల సుమాలమాల యీ బాల. అలాగే, 108 సంఖ్య కూడ ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది. ఇదివినగానే అష్టోత్తరశతనామాలు గుర్తుకు వస్తాయి కదా.  మీ అందరి ఆశీర్వచనాల ఆత్మీయ ఆదరణ ఇలాగే కొనసాగుతూ మమ్ములను మరిన్ని సంచికలు విడుదల చేసేందుకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి.

సునిశితమైన పదాలు, గాఢత కలిగిన పదాలు, గంభీరమైన పదాలు ఇలా అన్నీ మిళితమైన మన తెలుగు భాష అత్యంత శక్తివంతమైనది. కనుకనే అన్ని మాండలీకాలు, ప్రాంతీయ వ్యవహారిక పద సమ్మేళనాలు ఉన్ననూ అన్నింటినీ కలుపుకొని తెలుగు భాషగా నిలిచింది. బలవంతమైన సామాజిక ఉత్ప్రేరకంగా పనిజేస్తున్నది. మరి తెలుగు మాతృభాష అయిన తెలుగువారికి భాషాభిమానం ఉన్న లేకున్నా ఆత్మాభిమానం మాత్రం మెండుగా ఉంది. ఉంటుంది. మరి మాతృభాష గొప్పదనం తెలిస్తే గర్వం రాకుండా ఉంటుందా? మన తెలుగు వారు ఎక్కడ ఉన్ననూ అందరికీ అర్థమయ్యే రీతిలో ఆసక్తిని కలిగించి మన సనాతన ధర్మాలను, భాషా విలువలను వివరిస్తే, అటుపిమ్మట అందరికీ సరైన విధంగా ప్రదర్శించే అవకాశాన్ని కలిగిస్తే మన మాతృభాష మనతోనే విలసిల్లుతుంది.

భావితరాల మధ్యన తెలుగు భవితవ్యాన్ని పదిలంగా ఉంచాలనే భావనతో తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో సంస్కృతాంధ్ర, గ్రాంధిక, వ్యవహారిక తెలుగు శైలి మధ్యన వారధిగా నిలిచి అనేక రకములైన రచనలతో మన సిరిమల్లె మలిచి మీకు అందిస్తున్నాము.

వైవిధ్యమైన సాహితీ రచనలను ప్రోత్సహిస్తూ అనుభవజ్ఞులైన సాహితీ పండితులకు సరికొత్త ఆలోచనా ప్రక్రియలకు అవకాశమిస్తూ వారి అనుభవపూర్వక రచనలను నిత్యం పాఠక లోకానికి అందిస్తూ వస్తున్నాము. అలాగే తెలుగు భాష మీద పట్టును పొంది సాహిత్య రచనలు చేయాలనే కోరిక కలిగిన యువతను, క్రొత్త రచయితలను సరైన సూచనలు, సలహాలు అందిస్తూ వారిలో రచనాసక్తిని పెంపొందించే దిశలో నిరంతరం కృషి చేస్తూ వారి రచనలకు మన సిరిమల్లె వేదికగా చేసి తద్వారా వారిలో కూడా సాహిత్యాభిలాషను మరింత మెరుగుపరుస్తూ, సేవాస్ఫూర్తిని నింపేందుకు నిరంతరం శ్రమిస్తున్నాము.

చివరగా, కథలు పంపుతున్న వారికి ప్రత్యేక సందేశం. మీరు పంపిన కథలు ప్రచురించడానికి కొన్ని సార్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కారణం మన సిరిమల్లె లో ప్రచురించే కథల విషయంలో మేము నిర్దేశించుకున్న కొన్ని పరిమితులు. మాకు అందిన కథలను పరిశీలించి వాటిని తప్పక ప్రచురించడం జరుగుతుంది. అలాగే మీకు సరైన సమాచారం అందించడం కూడా చేస్తున్నాము. మీ సహాయ సహకారాలకు మరియు ఓపికకు మనఃపూర్వక కృతజ్ఞతలు.

మన సిరిమల్లె కు తమ రచనలు పంపుతున్న రచయిత(త్రు)లందరికీ మరియు చదువుతూ మీ సూచనలు, సలహాలు అభిప్రాయాలు తెలుపుతున్న మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

నమస్కారములతో

మధు-ఉమ