Menu Close
హిమగిరి తనయే... (కథ)
-- ఓరుగంటి వేణుగోపాల కృష్ణ --

గుడి మెట్లెక్కుతున్నాడు చంద్రశేఖర్. పై మెట్టు దగ్గిరకి వచ్చేసరికి ఆయాసం వచ్చింది. కాసేపు స్తంభాన్ని ఆనుకుని నిల్చున్నాడు. అతనికి ఏభై తొమ్మిదేళ్ళు. కాసేపు నిల్చున్న తరవాత అలుపు తీరినట్టయి, ప్రదక్షిణకి ఉపక్రమించబోతుంటే.. అప్పుడు కనిపించింది ఆమె. అప్పుడే దర్శనం కానిచ్చుకుని, ప్రసాదం చేతిలో పట్టుకుని బయటకు వస్తోంది. ఆమెతో పాటు ఒక యువకుడు వున్నాడు. ఆమె ముఖంలో మంచి వర్చస్సు, ఎక్కడో పరిచయం వున్న పోలికలు. కొద్దిక్షణాలు ఆమె వైపే చూస్తూ ఉన్నాక, అలా తేరిపార చూడ్డం సభ్యత కాదనిపించి తల పక్కకి తిప్పుకోబోతున్న సమయంలో ఆమె కూడా అతని వైపు తల తిప్పి చూడటంతో ఇద్దరి దృక్కులూ క్షణకాలం కలుసుకున్నాయి. ఆమె చూపులో కూడా అదే భావన మెరిసింది.. చాలా పరిచయం అయిన ముఖమే ఇది అన్నట్టుగా.

చంద్రశేఖరం తల పక్కకు తిప్పుకుని ఆలోచిస్తూ ప్రదక్షిణకి ఉపక్రమించాడు. మనసులో అంతా ఆమె ముఖమే మెదులుతోంది. మంగళకలశం లాంటి ముఖం, భక్తురాలికి దేముడి మీదున్న నమ్మకంలా నిటారుగా ఉన్న నాసిక, భావకవులు విహరించే ఊహా ప్రపంచం అంతటి విశాలమైన కళ్ళూ, భూదేవిలాంటి గుండ్రని బొట్టు, అమవసనిశిలో ఆకాశంలో ఉల్కల్లాగ అక్కడక్కడ నెరసిన జుట్టు పాయలు. అందమూ, ఆకర్షణా, తేజస్సు, ప్రశాంతత కలబోసిన ఆ ముఖము- దేవతార్చన కోసం సిద్ధం చేసిన పూలబుట్టలా ఉంది.

దేముడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, ఆమె ఉన్న దగ్గరకి చేరుతున్నప్పుడల్లా యధాలాపంగా చూసినట్టు అటువైపు దృష్టి మళ్ళించి చూశాడు. ఆమె కూడా తననే చూస్తూవుండడం గమనించాడు. ఎప్పుడో చూసిన చిత్రం మళ్ళీ లీలగా కనిపిస్తున్న అనుభూతి, ఏనాడో చదివిన కవితలోని పదాలు వినిపిస్తున్న అనుభూతి. ఎక్కడ చూశాడో జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ అలా ఎన్ని సార్లు ప్రదక్షిణ చేశాడో గుర్తు లేదు. ఆమె కొంచెం చిరునవ్వు నవ్వినట్టనిపించింది. బహుశా తను చాలాసార్లు పిచ్చివాడిలా ప్రదక్షిణ చెయ్యడం ఆమె గమనించి వుంటుందని, ఇంక బాగుండదని దేముడి దర్శనానికి వెళ్ళాడు.

మనసులో ఓ ప్రక్కన ఆమె గురించే ఆలోచిస్తూ దేముడికి దండం పెట్టుకుని, తీర్ధం, ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాడు. పై వరుస మెట్లు దిగాక, కుడి వైపున ఉన్న గచ్చు దాటి, జనం కాళ్ళుకడుక్కునే స్థలం దాటి, ఆ పైన కొబ్బరికాయలు కొట్టే స్థలం దాటి, ప్రమిదలూ, వాడిపోయిన పువ్వులదండలూ, పాత కొబ్బరి చిప్పలు ఉన్న ప్రోగు దాటి, జనసమ్మర్దం దాటి, కొంచెం దూరంగా మొక్కల దగ్గర ఉన్న మెట్లమీద కూర్చున్నాడు. వెనుకకు తిరిగి ఆమె కోసం వెదకబోతుంటే దూరం నుంచి ఆమె తనవైపే రావడం చూశాడు. ఆమె అతని దగ్గరకి వచ్చి, "మీరు.. మీ పేరు చంద్రశేఖర్ కదూ!" అని అడిగింది.

ఆమె గొంతులోంచి బయల్దేరిన శబ్ద తరంగాలకి అతని ఊహల దొంతర్లలో ఎక్కడో ఒక అకల్ప ప్రకంపన. జల జలమని కురిసింది వాన, జాల్వారింది అమృతంపు సోన - మారుమూల జ్ఞాపకాల గదిలోంచి మున్నెన్నడో మరచిన తియ్యని కవితొక్కటి ఆకారం దిద్దుకుంది.. అప్రయత్నంగా .. "హైమవతి!" అన్నాడు.

"అవును" అన్నట్టుగా ఒక ప్రశాంతమైన చిరునవ్వు నవ్వింది ఆమె. తలిరాకు జొంపముల సందుల త్రోవల నేలవాలు తుహిన కిరణ కోమలరేఖవో.. పువుదీవెవో.. వెలదీ ఎవ్వతెవీవు? -మదిలో నిద్రించిన భావుకత్వం నింగి కెగయగా మూడు దశాబ్దాలనాటి, ముఖారవిందంతో మౌలికం చేస్తూ, "హైమవతి.. నువ్వు .. మీరు హైమవతి కదూ!" అన్నాడు.

"అవును, నేను హైమవతినే. గుర్తుకొచ్చానే" మాటలో ఎక్కడా ఎత్తిపొడుపులేదు. స్వచ్చమైన చిరునవ్వు మాత్రమే వుంది.

తన ఒడిదుడుకుల సంసారంలో, అశాంతి, అల్లకల్లోలాలతో, తల్లకిందులైన తన జీవితంలో, తన మనసులో మాత్రమే నిక్షిప్తమైపోయిన భావుకత్వానికి ఓ ప్రేరణగా, ఊహాలోకాల్లోనైనా అశాంతిని తాత్కాలికంగా మరచిపోయేటట్టు జేసిన తన భావాంబర వీధి విస్తృత విహారిణి, ఇన్నాళ్ళకి మున్నెదుట సలక్షణంగా ప్రత్యక్షమై పలుకరిస్తే ఉద్వేగం ఉప్పెనై చెలరేగింది. అతని హృదయంలో కలిగే భావ సంచలనపు ఛాయలు ముఖంలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించాయి. ఆ సంచలనాన్ని ..ఇంకా కాగితంమీద అక్షరరూపం దిద్దుకోని కవితావేశంలా రేగుతున్న ఆ సంచలనాన్ని ..గమనిస్తూ ఆమె చనువుగా, నిశ్శబ్దంగా అతని ప్రక్కనే మెట్టు మీద కూర్చుంది,.

ఏనాటి హైమవతి!!

కాకినాడలో బాలాత్రిపుర సుందరి గుడి దగ్గిర, ముప్పై సంవత్సరాల క్రితం తను ఇంజనీరింగు పాసయి పెళ్ళి చూపులకని వాళ్ళింటికి వెళ్ళాడు. అమ్మాయి అందంగా ఉంది, బి.ఏ పాసయింది. కానీ అమ్మాయి తండ్రి పౌరోహిత్యం చేసేవారనీ, పెద్దగా ఆస్థి అంతస్థూ లేని కుటుంబం అనీ, తన తల్లిదండ్రులకి ఆ సంబంధం అంతగా నచ్చలేదు. అతి సాధారణంగా ఉన్న ఇంటి వాతావరణము చూసి, జాతకాలు కుదరలేదన్న సాకు చెప్పి వదిలేశారు. ఆ అమ్మాయి నచ్చినట్టనిపించినా తను కూడా ఎందుకో అడ్డుచెప్పలేదు.

ఆ అమ్మాయికి మాత్రం తను బాగా నచ్చినట్టనిపించింది. పెళ్ళిచూపుల్లో ఒక పాట పాడమని అడిగితే "హిమగిరి తనయే హేమలతే... " అంటూ తన్మయత్వంతో పాడింది. కానీ తన తల్లిదండ్రులే - “అబ్బాయి పెద్ద ఇంజినీరు, అమ్మాయి కనీసం ఏ ప్రొఫెషనల్ కోర్సులైనా చేసి వుంటే బాగుండేది. బొత్తిగా బి.ఏ .. అందులోనూ తెలుగులో.. మా అబ్బాయికి ఏ డాక్టర్నో, ఇంజినీర్నో చూస్తున్నాం” అని అన్నారు. అలా అన్నప్పుడు తను కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు కానీ తను అంతకు మించి పట్టించుకోక తల్లిదండ్రులు చెప్పినట్టు వినేసి ఊరుకుండి పోయాడు.

పెళ్ళిచూపులయిన కొన్ని రోజులకి ఆ అమ్మాయి తన తమ్ముడి ద్వారా, చంద్రశేఖర్కి ఒక కబురు పంపింది - తనని వచ్చే శనివారం గుడిలో కలుసుకొమ్మని. ముందు ఆశ్చర్యపోయినా, చంద్రశేఖర్ వెళ్ళాడు. గుడి ప్రాంగణంలో ఉన్న పొగడచెట్టు క్రింద ఆమెని కలుసుకున్నాడు. హైమవతి ముందర చాలా మొహమాటంగా క్షమాపణలు చెప్పింది, “ఇలా కలుసుకోమని కబురు పంపినందుకు మరోలా అనుకోవద్దండీ” అని. ఆమె స్వంతంగా చేసిన గ్రీటింగు కార్డు ఒకటి శేఖర్ చేతికిచ్చింది. అది ఆమె వేసిన ఒక చక్కటి రేఖా చిత్రం. సముద్ర కెరటాలూ, వాటి పైన ఒక చిన్న మేఘం వెనకాల నుంచి బయటకు వస్తున్న సూర్య కిరణాలు. లోపలి పుటలో ... నవనవాలైన ఊహార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు... అని వ్రాసి ఉంది.

తాను అది చదివి ముఖంలో ఏ భావమూ వ్యక్త పరచలేదనుకుంటా.. అది గమనించి..

"తిలక్.. దేవరకొండ బాలగంగాధర్ తిలక్.. కవితలు చదివారా మీరు?" అని అడిగింది. "లేదు" అన్నట్టు తాను తల ఊపితే ఆమె ముఖంలో కొంచెం నిరాశ కనిపించినా సర్దుకుని “నాకు తిలక్ కవితలంటే చాలా ఇష్టం, ఆయన కవిత్వంలోని రూపకాలంకారాలు చాలా బాగుంటాయి” అని తేలికపరచడానికి ప్రయత్నించింది.

కాసేపాగి -"నేనెందుకు రమ్మన్నానంటే... అమ్మాయిలు ఇలా చెప్పవచ్చునోలేదో నాకు తెలియదు. కానీ, చెబుదామనే నిర్ణయించుకున్నాను. నాకు మాత్రం మీరు నిజంగా నచ్చారు.. అందుకోసమే ఆఖరిసారిగా నా ప్రయత్నం. మీకు ఆశ్చర్యంగా వుండొచ్చు .. పెళ్ళి చూపులకి వచ్చిన అబ్బాయిని ప్రేమించినట్టనిపించడం కొంత ఆశ్చర్యంగానూ, మరికొంత అసహజంగానూ ఉండి, తాత్కాలికమైన ఆకర్షణేమో అన్న అనుమానం నాకే వచ్చింది.. వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్ధమో ..మహాశ్చర్యంబు చింతించగన్..” గలగలా నవ్వేసింది..భానూదయవేళలో వినిపించే బిలబిలాక్షుల కలకలంలాగ.

ఒక్క క్షణం ఆగి, తల కిందకు దించుకుని, చేతిలో పట్టుకున్న జడ చివరి వంకులు, వేలికి చుట్టుకుంటూ నెమ్మదిగా అంది .. “అందుకనే చాలా సంశయించాను. కానీ మీతో ఒక్కసారి మాట్లాడి, లోటు రానీయనున్నంతలోన నీకు.. రమ్ము దయచేయుమాత్మపీఠమ్ము పైకి అని నా మనసులోమాట చెప్పాలనిపించింది.."

ఆమె అలా చెబుతున్నా - అతనిలో చలనం ఎందుకు కలగలేదో! ఏ పూర్వ జన్మ సుకృతమో ఆమెని కలిసే అవకాశాన్నిస్తే, ఏ శనిదేవతో నెత్తిమీద నిలచి - అతన్ని స్తబ్దుణ్ణి, మృత్పిండుణ్ణీ చేసాయి. నిషాదుని బాణంతగిలి క్రిందపడ్డ క్రౌంచ పక్షి ని చూసిన సమయంలో స్పందించకపోతే - సృజింపబడని ఒక ఇతీహాసంలాగ – మిగిలిపోయాడు.

గడచిన ఇన్నేళ్ళలో ఎన్నో సార్లు ఆనాటి పొగడ చెట్టుక్రింద చూసిన ఆ అమ్మాయి రూపు మరీ మరీ గుర్తు తెచ్చుకుని మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు - సన్నని జరీ అంచు వున్న ఆకుపచ్చ వెంకటగిరి చేనేత చీర, తలంటుపోసుకుని కొంచెం వదులుగా వేసుకున్న పొడుగాటి జడలో - కనకాంబరాలు, మరువము కలిసిన మల్లెపూదండ, నుదుట ఎఱ్ఱని గుండ్రని బొట్టు, రెండుచేతుల నిండా గాజులు, కుడిచేతికి పసుపుకొమ్ము కట్టిన దీక్ష, గోరింటాకు పెట్టుకున్న అరిచేతులు, కాళ్ళకి పసుపు పారాణి, చిన్నగా కదిలే మువ్వల పట్టీలు - బాలాత్రిపురసుందరిలా వుంది. ఆ రూపం గుర్తుకొచ్చినప్పుడల్లా - సంజెవెలుంగులో పసిడీచాయల ఖద్దరు చీరగట్టి.. నారింజకు నీరువోయు శశిరేఖవె నీవు – కరుణశ్రీ కవిత మదిలో మెదుల్తుంది.

తరవాత కొద్ది కాలానికే తనకి ఇంకో సంబంధం కుదిరి లండను వెళ్ళిపోయాడు.

తనకిప్పుడు ఏభై తొమ్మిదేళ్ళు, అంటే ఈమెకి ఇంచుముంచి ఏభై ఆరు వుంటాయి. అయినా ఆమె ముఖంలో ఎంత అందమో! ఉన్న వయసుకంటే పదేళ్ళు తక్కువగా ఆమే, పదేళ్ళు ఎక్కువగా తానూ కనుపిస్తున్నారు. కాలగతి పట్టని కావ్యంలా ఆమె - కాలాతీతమైన ఘటనలా తానూ! మంత్రముగ్ధుడిలా ఆమెనే చూస్తూ జ్ఞాపకాల వెల్లువలు పెల్లుబుకుతుంటే.. నిశ్చేష్టుడైపోయాడు చంద్రశేఖర్.

కాసేపటికి తేరుకుని ..మెల్లిగా "చాలా ఆశ్చర్యంగా వుంది కదూ.. మళ్ళీ మనం ఇలా గుళ్ళో కలవడం" అన్నాడు.

"అవును. చెప్పండి, మీరెలా వున్నారు? ఎక్కడున్నారు? మీ కుటుంబం ఎక్కడుంది? మీ అమ్మా నాన్నగార్లు కులాసాగా వున్నారా?” అతని కళ్ళల్లోకి చూస్తూ చాలా చనువుగా అడిగింది.

చంద్రశేఖరంకి తానెలా వున్నాడో, ఏమని చెప్పాలో అర్ధం కాలేదు. జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, జీవిత వైకుంఠపాళీలో అరుకాసుడు చేత మింగబడ్డాడని, ఎలా చెప్పగలడు ఇంత తక్కువ వ్యవధిలో? -  "చెబుతాను, కానీ ముందర మీ విషయాలు చెప్పండి. మీరు ఎక్కడ వుండడం? మీ ఆయన ఏం చేస్తూ వుంటారు? ఎంతమంది పిల్లలు, మీరేంచేస్తూ వుంటారు? .." అని ఆమెనడిగాడు.

"మీరు నన్ను మీరూ అని సంబోధించొద్దు, “నువ్వూ అనండి. అలాగేనా?" అని చనువుగా అంది.

"అలాగే" అని ఒప్పేసుకున్నాడు. ఆమెతో, ఇంత సాన్నిహిత్యం ఎప్పుడేర్పడింది- పగటికలలకీ - పారవశ్యానికి మధ్య ఉన్నంత సాన్నిహిత్యంలా? ఊహల్లో ఎన్నోసార్లు కలవరించి చేరువయ్యాడా తను?

“అలాగైతే చెబుతాను, కానీ, ఇందాకా నేను మిమ్మల్ని పలకరించినప్పుడు మీ ముఖం చూస్తే ఏమనిపించిందో చెప్పనా? ఇంతలు కన్నులుండ తెరువెవ్వరివేడెదవో భూసురేంద్రా అని అడగాలనిపించింది!”  పర్ణశాలమీద కురిసిన వానజల్లులా గలగలా నవ్వుతూ.

చంద్రశేఖరం ముఖంలో ఎంతో కాలంనుంచి అరుదైపోయి – మళ్ళీ లీలగా మెరిసిన చిరునవ్వుతో “నేను ప్రవరాఖ్యుడంతటి అలేఖ్య తనూవిలాసుణ్ణేమీ కానులే” అన్నాడు. “ఓహో ఈయన కూడా సాహిత్యజ్ఞానియే!” అని ఇంపైనవిస్మయం చెందటం ఇప్పుడు ఆమె వంతయింది. హాయిగా నవ్వేసింది – పచ్చిక బయళ్ళు పరవశంతో ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఉంది ఆ నవ్వు.

నవ్వటం ఆపి మొదలుపెట్టింది - "సరే అలాగే చెబుతాను. మీతో కలిసిన కొన్నాళ్ళకి నాకు చక్రపాణితో పెళ్ళయ్యింది. ఆయన కార్డియాలజిస్ట్. అమెరికా వెళ్ళిపోయాను. ఆస్టిన్ లో వుంటాము మేము. ఇద్దరు పిల్లలు, పెద్దవాడు మోహనవంశి, అమ్మాయి నీహారిక. అబ్బాయి నాతో ఇక్కడే.. కింద పుస్తకాల షాపులో వున్నాడు. ప్రస్తుతం ఆస్టిన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. విడిగా హఠయోగ పాఠశాల ఒకటి పెట్టి అందరికీ యోగా, మెడిటేషనూ నేర్పిస్తాడు. నేనే వాడి ప్రధమ శిష్యురాలిని.. గత ఐదేళ్ళుగా" మళ్ళీ పర్ణశాలమీద వానజల్లు.

"అమ్మాయి ప్రిన్స్ టన్ లో చదివి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లో పని, న్యూయార్కుసిటీలో వుంటోంది. తనకి ప్రపంచాన్ని ఓ సిగ్నేచర్ తో, ఓ పాలసీతో మార్చేయాలన్న తపన. నేను మాత్రం ఏ ఉద్యోగమూ చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చుని, నా సాహిత్యమూ సంగీతమూ వెలగ పెడుతూ వుంటాను. పొద్దున్నే లేచి సంగీతం మొదలు పెట్టి, మా వారు వద్దనే దాకా మార్నింగ్ రాగాస్ భూపాలం, మోహనం అనీ, నూన్ రాగాస్ మధ్యమావతీ, ఆభేరీ అనీ, ఈవినింగ్ రాగాస్ చక్రవాకం అంటూ అబ్బాయినీ కోడలునీ అందరినీ సంగీతంతోనో లేక తిలక్ , కృష్ణశాస్త్రి, జంధ్యాల, లత ఆంటూ సాహిత్యంతోనో విసిగించేస్తూ వుంటాను.... మా ఆయన అంటారు – నువ్వు బినాకా గీత్ మాలా, సంగీత్ సరితా, నిలయవిద్వాంసుల వాద్యగోష్టీ అన్నీ కలిపిన ఒక రేడియోప్రోగ్రాంవి అనీ. సర్లెండి మీరడిగింది తడవు, నా సొదంతా గడగడా చెప్పేసాను. ఇన్నాళ్ళకి మీరు కలిసిన ఆనందం మరి. మీరు చెప్పండి, మీ గురించి.."

అనుకోకుండా తారసపడిన ఆమె గొంతు వింటుంటే గ్రీష్మంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ళవానలో తడిసినంత హాయిగా వుంది. ఎన్నోసార్లు అనుకున్నాడు, ఎప్పుడైనా ఆమె కనబడితే స్వచ్చమైన నిజాయితీగా మాట్లాడాలనీ, భేషజంతో అబద్ధాలు చెప్పకూడదనీ.

శేఖర్ కాసేపు ఆగి చెప్పాడు.. హైమవతిని కలిసిన కొన్నాళ్ళకే తనకి బాంబేలో ఎంబిఏ చదివిన అమ్మాయితో పెళ్ళవడమూ, ఇంగ్లండ్ వెళ్ళి తను లండన్ మెట్రో రైల్ లో ఎలెక్ట్రికల్ ఇంజినీరుగా పని చేయడమూ, కొడుకు కునాల్, కూతురు కరిష్మా పుట్టడమూ, కొడుకు కాలేజి వదిలేసి తిరగడమూ, తనతో పని చేస్తున్న పోలిష్ అమ్మాయితో విడిగా వెళ్ళి పోవడమూ, కూతురు ఒక బ్రిటిష్ బాయ్ ఫ్రెండుతో పెళ్ళిచేసుకోకుండా కలిసి వుండడమూ మొదలైనవి - పిల్లల పేర్లు విషయం దగ్గరనుంచీ, శ్రావణమాసంలో భార్య పట్టుచీరకట్టి చేతి నిండా గాజులు వేసుకుంటే చూడాలన్న కోరిక వరకూ తన ప్రతీ సున్నితమైన మనోభావనా, రోడ్డురోలర్ క్రింద పడ్డ రామచిలకలా చితికిపోవటమూ, ఇంట్లో మనస్పర్ధలూ, దెబ్బలాటల మధ్యలో తన ఉద్యోగం పోవడమూ, తన వ్యక్తిత్వం ఏమిటో తనకే సందిఘ్ధతగా ఉండటమూ, భార్య తనకి విడాకులిచ్చేసి, ఒక పంజాబీ లిక్కర్ స్టోర్ ఓనరుతో వెళ్ళిపోవడము..." అన్నీ నిబ్బరంగా, నిశ్శంకోచంగా, నిర్లజ్జగా చెప్పాడు. సానుభూతి కోసం కాదు-పశ్చాత్తాపంతో. వైషమ్యంతో కాదు-వైరాగ్యంతో.

హైమవతి మాట్లాడకుండా, జాగ్రత్తగా ముఖంలో ఏ భావనా కనుపించకుండా వింది.

చివరిలో శేఖర్ అన్నాడు నీ ఎగిరిన జీవ విహంగం, నా పగిలిన మరణ మృదంగం..

గబుక్కున హైమవతి అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది. ఇంకా ఏదో చెప్పబోతుంటే శేఖర్ వారించాడు. "హైమవతీ, ఎన్ని సార్లో నా హృదయంలో మెదిలావు. నాకు ఎలాంటి జీవితభాగస్వామి కావాలో తెలుసుకోలేని వ్యర్ధుణ్ణనిపించింది, ఇన్ని కలతల్లోనూ నాకు నీ ఊహలే ఆలంబన అయ్యాయి..” అంటూ ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాడు కానీ తన్నుకొస్తున్న ఆలోచనల ప్రభంజనంలో, సుడిగాలిలో గతితప్పి ఎగిరిపోతున్న గుండె - పరుగెట్టి గొంతుకి అడ్డు పడింది మాటలు రానీయకుండా. కానీ మళ్ళీ ఈ అవకాశం రాదు.. ఎంత తపించిపోయాడో ఈ అవకాశంకోసమని .. ఎప్పుడైనా కనిపిస్తే ఒక్కటి అడగాలనీ...తను ఒక్క సారి ఆమె గొంతులోంచి మళ్ళీ వినాలనీ...

"హైమవతీ, నువ్వేమనుకోనంటే .. ఒక విషయం అడగనా?”

“ఏమిటీ?” అన్నట్టుగా చూసిందామె – “భ్రూకుటీ కుటిలముగ్ధ లలాట ముఖేందు బింబయై” శ్రీనాధుని హరవిలాసంలో హైమవతి లాగ.

“ఒక్కసారి ... ఒక్కసారి ... హిమగిరి తనయే హేమలతే .. పాట పాడవా?" అతని మనసులో ఎప్పుడో కలగవలసిన చలనం, ఒక జీవిత కాలం ఆలస్యంగా కలిగింది.

హైమవతి శేఖరం ముఖంలోకి దీర్ఘంగా చూసింది. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల - కుటజములకు చేరిందని - అర్ధమయ్యింది. అప్పుడు గమనించింది అతని కన్నుల్లో సన్నని నీటి పొరనీ, దాని కింద కన్నీటి కెరటాలనీ, ముడుతలు పడిన ముఖంలో ఎండిపోయిన నెగళ్ళనీ, ఎడద సంద్రంలో బడబాగ్నినీ!  చంద్రశేఖరుని గళంలో హాలాహలం కనిపించింది. మండి పోతున్న గుండెల్ని చల్లపరచడానికి శిరస్సున గంగమ్మ మాత్రం కనుపించలేదు. అర్ధం అయ్యింది. తానొక చిన్ని చినుకై, మంచు తునకై అతని మీద కురిస్తే తప్పులేదని నిశ్చయించుకుంది. పరిసరాలను లెక్క చెయ్యకుండా, ధ్యాన నిమగ్నయై, నెమ్మదిగా కన్నులు మూసుకుని, గాత్రం సవరించి మొదలు పెట్టింది ..

"హిమగిరి తనయే హేమలతే .. అంబ ఈశ్వరి శ్రీలలితే..."

గగనపధ విహార గంధర్వ సమసంగీత ఝరి ఒక్కటి చినుకై-చిరుజల్లై, వానై-వరదై, వెల్లువై-కల్లోలమై పెల్లుబికింది. కరడు గట్టిన కఠిన కుటిల నిరంకుశ నిరాశ నిస్తేజిత స్తబ్దతలో ఉత్తేజ జాహ్నవి ఉరక లెత్తింది. శుద్ధధన్యాసిలో ధన్యమైపోయిన ప్రాణశక్తి విశుద్ధిచక్రంలో ప్రవేశించింది. ఆదితాళంలో అనాహత చక్రం అధిరోహించింది. ఆ సాయంసంధ్య వేళ, సహస్రార చక్రంలో కుండలిని ప్రవేశించినట్టుగా, ఆతని మనసొక ఇక్షు సముద్రమైపోయింది.

పాట అయిన తర్వాత కొంత సేపటి వరకూ నిశ్శబ్దం. భ్రమరం వెళ్ళిపోయాక పువ్వు తీసుకున్న ఊపిరిలాంటి నిశ్శబ్దం.

ఆమెకు తెలుసును, వేడెక్కిన ఎడారిలో ఉన్నట్టుండి వానజల్లు పడితే ఆవిరి పైకెగసి కమ్ముకుంటుందని. ఆమె సున్నితంగా అతని చెయ్యి స్పృశించింది ఓ భావకవి యొక్క కలం కొన కాగితాన్ని తాకినట్టుగా. ఆ తర్వాత ఆ చేతిని తన రెండు చేతుల్లోనూ తీసుకుని నెమ్మదిగా నొక్కింది కవితకు అక్షరరూపకల్పన చేస్తున్నట్టుగా. అతని చెయ్యి కూడా ఆమె అరిచేతిలో సంపూర్ణంగా ఒదిగిపోయింది. ఇద్దరూ అలా ఎంతసేపో ఉండి పోయారు - పదాల ప్రతిబంధకాల్లేని సంభాషణ లాంటి నిశ్శబ్దాన్ని పంచుకుంటూ .. ఉండి పోయారు...

దూరంగా అబ్బాయి మోహనవంశి తమ వైపు రావడం ఇద్దరూ గమనించారు. చంద్రశేఖరం కంగారుగా చెయ్యి వదిలించుకోడానికి ప్రయత్నించాడు. హైమవతి మాత్రం తన చేతి పట్టు సడలించే ప్రయత్నం చేయలేదు. ఆమె అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుని "ఏమీ ఫరవాలేదు" అన్నట్టుగా మౌనంగా కళ్ళతోనే చెప్పింది.

ఇంతలో ఆ అబ్బాయి తల్లి దగ్గిరకి వచ్చాడు. హైమవతి శేఖరం చేయి ఇంకా పట్టుకునే "మా అబ్బాయి - మోహన వంశి. నాన్నా, వంశీ, ఈయన నా చిన్ననాటి స్నేహితులు.. చంద్రశేఖరం గారు" అని పరిచయం చేసింది.

"నమస్కారమండీ" అని వంశి కొంచెం తల వంచి నమస్కరించాడు.

శేఖరం తన చేయిని హైమవతి చేతుల్లోంచి విడిపించుకుని, గొంతు సవరించుకుని "నమ.. నమస్కారం.." అని అనగలిగాడు. వంశి, తన తల్లి కేసి చూసి ఆవిడ చెప్పకుండానే అర్ధం అయినట్టుగా, "అమ్మా, నాకు ఆలస్యం అవుతుంది, నేనింకా చాలాసేపు ఆ బుక్ స్టాల్ లో వుంటాను అని చెప్పడానికి వచ్చాను" అన్నాడు.

"అలాగే, నేనటు వస్తాలే!" అని హైమవతి అంది. వంశి శేఖరంతో ఒకటిరెండు మాటలు మాట్లాడి, మళ్ళీ నమస్కారం చేసి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయిలో ఉట్టిపడుతున్న అందానికీ, మర్యాదకీ ముగ్ధుడైపోయాడు శేఖరం. “మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి” అని మనసులోనే అనుకున్నాడు. మోహనవంశి! నీహారిక! ఎంత మంచి పేర్లు పెట్టుకుంది పిల్లలకి! ఆ పేర్లు వింటుంటే - ఏదీ మరొక్కమారు, హృదయేశ్వరా, గుండెలు పుల్కరింపగా ఊదగదోయి, ఊదగదోయీ.. కరుణశ్రీ కవితా, లత మోహనవంశి నవలా గుర్తుకు వచ్చి గుండె పుల్కరించిపోయింది.

ఆ సాయంకాలం అతని మీద అమృతమే కురిసింది. హైమవతి కూడా సమయంతో నిమిత్తం లేదన్నట్టుగా.. నిశ్శబ్దాన్ని .. నిశీధినిలో నేలమీదకి కురిసిన పారిజాతాల్లాంటి నిశ్శబ్దాన్ని .. నీలిగోరింటలోకి జారిన నీహారికలాంటి నిశ్శబ్దాన్ని … కానుకగా ఇచ్చింది అతనికి.

అతనికి ఆ ఒక్క అనుభూతి చాలు - మరుజన్మ గురించి ఎదురుచూడ్డానికి!

ఆఖరికి మెల్లగా అన్నాడు.. అలవాటునీ అస్వతంత్రతనీ కౌగలించుకుని, అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయాను.... ఆమె గబుక్కున తలెత్తి అతని కన్నులోకి చూసింది.

“తిలక్ ... దేవరకొండ బాలగంగాధర్ తిలక్ .. అమృతం కురిసిన రాత్రి .. చదివాను .." ఇంక మాటలు రాలేదు.

హిమగిరి కరిగి గంగమ్మే గొంతులో ఉరికిందో, అమృతమే గుటక వేసాడో మరి !

****సమాప్తం****

Posted in January 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!