పంచచామరము | సమీరణాంజనాతనూజ! సర్వశాస్త్రకోవిదా! సమస్తఖేదభూతదుష్టశక్తిభీతిభంజనా! తమోఽపహారిపుత్రికేశ(1)! తార్క్ష్యభీమదర్పహా(2)! నమో ధరాత్మజాహృదీశనామగానశేఖరా(3)! 1 |
(1) సూర్ర్యుని కూతురైన సువర్చలకు భర్త |
|
సీ. | సీతామహాసాధ్వి క్షేమంబు రామున కందజేసిన ఘనసుందరుడవు లంకిణిన్ మర్దించి లంకేశు దర్పంబు నుక్కడంచిన వీర! యో కపీశ! భానుశిష్యా! నవవ్యాకరణోద్దండ పండితా! లక్ష్మణప్రాణదాత! భూతప్రేతపిశాచభీతులెల్ల హరించి రక్షగా నుండెడు రామదూత! |
తే.గీ. | అమితవిక్రమ! విజయసఖా! అజేయ! కల్పకల్పాంతచిరజీవి! కార్యశూర! మన్మనోవాస! హనుమంత! మారుతసుత! అంజలి ఘటింతు కొను మిదే ఆంజనేయ! 2 |
ద్విప్రాసకందము | కనుమా వినుమా మనుమా అనుదినమును నాదు స్వాంతమందున; దానన్ చను మా వెత లెల్లను; చేకొనుమా వందనము చేదికొనుమా హనుమా! 3 |
రవికాంతము | హనుమద్దర్శనభాగ్యము గల్గ మహాబలబుద్ధివిశేషయశః ఘనవాగ్వైభవధైర్యము లబ్బి యఖండభయంబులు జాడ్యములున్ తనురోగంబులు వీడి నశింపవె? తథ్యము చేకురు మంగళముల్ మన మానందము నొందు; తరించును మానవజన్మము తత్కృపచే 4 |
ఉ. | శ్రీకర మాశ్రితావనప్రసిద్ధము రావణగర్వఖండన వ్యాకులకారణంబు దురితౌఘలతాకరవాల(1) మగ్నికీ లాకరశీతలీకరవరాప్తము(2) వాలము(3) వానరాప్తమే(4) మా కగు నిత్యరక్ష హనుమానుకటాక్షకృపాలవాలమై 5 |
(1) పాపములు అనే లతలకు కత్తి వంటిది |
శ్రీ పి.డి.రావు గారు,
మీ స్పందనకు వందనాలు, కృతఙ్ఞతలు. మీ రెక్కడ ఉన్నారు? Contact details ఇస్తే సంతోషిస్తాను.
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
With par to kavisarvobhoma Srinatha