“వచ్చేనండి నన్నుఁ బసిపట్టి, రైలొద్ద దాని దాఁకనైతి దాని గోఁక నైతి”
“.....జాలి మాలితి నా కూలి కూలిపోను.”
“.....బట్టుకొందుఁ గ్రింది తట్టు కుఱికి” నా కుక్కను రక్షించుకొంటాను అని ఉప్పరి కన్నీర్ దొన దొన గాఱంగ నెల దూకంబోయెన్.”
ఇక కుక్క అవస్థ కడు దయనీయంగా ఉంది. అయినా అది పరుగు ఆపలేదు. అయితే దాని స్థితి-
ఒడలెల్ల నురుగు గట్టెను’
బడఁ బారుచునుండె, వెనుకఁ బడు చుండె నిఁ కన్
గడుదూరమైన నిటు పరు
గిడఁ జాల దటంచు దోఁచె నెల్లర మీదికిన్”
రైల్లో నుండే అందరూ పరుగెత్తుతున్న ఆ కుక్కను గమనిస్తూనే ఉన్నారు. అది తర్వాత స్టేషన్ కు క్షేమంగా చేరితే అక్కడ దానికి టికెట్ కొని ఉప్పరితో గూడా పంపాలని రైల్లో ఉన్న వారి ఆశ. అయితే విధి విధానం మరోలా ఉంది. రాబోయే స్టేషన్ పేరు కౌతరం. అక్కడికి ఒక మైలు దూరంలో ఒక నది ఉంది. రైలు ఆ నదిపై ఉన్న వంతెన మీదికి వచ్చింది. వంతెన మీద రైలు ప్రయాణిస్తున్నందున కుక్క పరుగెత్తడానికి చోటులేదు. అప్పుడు కుక్క “నీట నుఱికి యీది యావలి దరి జేరుకోదలంచె”. అందుకే అది కాలవలో దూకడం రైల్లో వాళ్ళంతా చూచారు. రైలు మాత్రం కౌతారం స్టేషన్ కు చేరింది. కుక్క మాత్రం కాలువకే అంకితమయింది. శాస్త్రి గారు మాత్రం కుక్క కొరకు టిక్కెట్టు కొన్నారిప్పుడు.
ఉప్పరివాని పరిస్థితి దయనీయం. సాకిన మమత అటువంటిది. “దిగులు గుండెలతో వాడు దిగెను రైలు.” కొన్న టిక్కెట్టు శాస్త్రి గారు, చౌదరిగారు కొంత డబ్బు ఇవ్వబోగా ఉప్పరి,
“కుక్క చచ్చెనేమో నీట బడి, నాకు నివి
యింక నేటి కనుచు” వాడు వాపోతూ “గుడివాడ లోనే రైలు దిగనైతి నా కుక్క గోలు పోతి!”
“కుక్క చచ్చెనేని కూలి నాకింకేల
కుక్కలేక రైలు నెక్కఁజాల
కుక్క నాకు దిక్కు; కుక్కకు నే దిక్కు
దక్కు నాకుఁ గుక్క కొక్క దిక్క”
---ఇలా గుండెలు అవిసేలా రోదిస్తూ “పరుగు వాఱె కాల్వ ప్రక్క కపుడు.”
ఆ ఉప్పరి ఆవేదనను, ఆలోచనలను రైల్లో ఎక్కినప్పటి నుండి మనసుకు తెచ్చుకొన్న కథా రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మాత్రం అయోమయ స్థితిని తలచుకొని
“అయ్యో! ఆ కుక్క ఉసురుతో ఉన్నదో లేదో
అదిలేకపోతే వీడు బ్రతుకుతాడా-
నూజిండ్లలోనే వాడిని దింపేసి ఉండాల్సింది.
కుక్క టిక్కెట్టు కొని అక్కడే ఇవ్వకపోతిని
కనీసం రైలులో ఉన్న గొలుసు కాల్వ దగ్గర అయినా
గార్డుకు భయపడి లాగకపోతిని. అందుకే
విప్రులు పశ్చిమ బుద్ధులన్న నుడి సుబద్ధమయ్యె”
(అంటే బ్రాహ్మణులు జరిగిపోయిన తరువాత చింతించేవారు)
అంటూ శాస్త్రి గారు వగచారు. శాస్త్రి గారు తాను చేసిన పొరపాట్లను, ఉప్పరి అగచాట్లను తలుచుకొంటూ చింతించారు. రైలు ఎవరి బాధలతో సంబంధం లేకుండా ముందుకు కదిలింది.
ప్రభాకర శాస్త్రి గారు ఇల్లు చేరినా రైలు లోని సంఘటన ఆయన మనసునుండి తొలిగిపోలేదు. అదే కవులకు, ఇతరులకు గల తేడా. అందుకే శాస్త్రి గారు తాను చూచిన ఆ సంఘటనను లఘుకృతిగా మలిచి కుక్క ఆత్మకు శాంతి గల్గించారు. మనకు రసానుభూతిని మిగిల్చారు.
***********************************
శాస్త్రి గారు వాడిన పదాలు పదబంధాలు, విలక్షణంగా ఉన్నాయి. ‘సుబద్దం’, ‘పశ్చిమ బుద్ధులు’, ‘అల్లు మామలు’, ‘త్రొక్కటంబు’, ‘చిట్టుమొఱుగుచు’, ‘తెల్వి వెల్లి విరిసె’, ‘చురుకు చురుకు’, ..మొదలైనవి శాస్త్రి గారి భాషా వైభవాన్ని తెలియజేస్తున్నాయి.
మిగిలిన నాలుగు కథలు కూడా ఒకటి భారతం లోనిది. మిగతావి వాస్తవ గాథలే, ప్రతి కథ ఒక సత్యాన్ని తెలిపే చక్కటి విషయమే. హాస్యంలో కూడా శాస్త్రి గారిది అందెవేసిన చేయి. అయిదవ కథ అందుకు నిదర్శనం. ఇలా ‘కావ్యమంజరి’ లోని కథలన్నీ కవితా రూపంలో ఉన్నప్పటికీ, పఠిత చేత ఏకబిగిన చదివించే మంచి శిల్ప చాతుర్యం, భాషా వైభవం, కథా కదన నైపుణ్యం మొదలైన కావ్య గుణాలతో అలరారుతున్నది.