ప్రపంచ సాహిత్యంలో యాత్రా చరిత్రలు-వాటి ప్రాముఖ్యత
ప్రత్యేకించి – తెలుగులో యాత్రా చరిత్రలు
తెలుగులో 19 శతాబ్ది తొలినాళ్ళలో శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య గారి ‘కాశీయాత్రా చరిత్ర’ ఎంతో ప్రాముఖ్యం పొందింది. ఈ కాశీయాత్ర చరిత్ర నాలుగు ముద్రణలను పొందింది. రెండవది కోలా శేషాచల కవి గారి “నీలగిరి యాత్ర.”
వీరాస్వామి గారు శృతి, స్మృతి, పురాణేతిహాస జ్ఞాన సంపన్నుడు. బ్రిటీష్ వారికి బహు ప్రీతిపాత్రుడు. బ్రిటీష్ వారు వీరాస్వామి గారికి ఎల్లప్పుడు గౌరవపూర్వకమయిన సహాయ సహకారాలను అందించేవారు. కాశీయాత్ర సందర్భంలో గూడా అడుగడుగునా బ్రిటీష్ వారి సహకారం వీరాస్వామి గారికి ఉంది.
వీరాస్వామి సకుటుంబంగా నూరుమంది అనుచరులతో, మందీ మార్బలంతో మద్రాసు నుండి యాత్ర మొదలు పెట్టాడు. వీరాస్వామి కాశీదాకా రెండు సార్లు యాత్ర చేసినట్లు దిగవల్లి వేంకట శివరావు తన పీఠికలో తెలిపారనీ, కానీ మొదటి యాత్రా సమాచారం వివరాలు ఇవ్వనేలేదు అని సిద్ధాంతకర్త హరిదాసు తెల్పారు. వీరాస్వామి గారు తన యాత్రలో అన్ని విషయాలను పరిశీలనాత్మకంగా కని, విని తెలుసుకోవడమే గాక ఆ విషయాలన్నింటినీ అతి శ్రద్ధగా ఏర్చి, కూర్చి ఒక విజ్ఞాన భాండంగా ఈ గ్రంథాన్ని (కాశీయాత్ర) రచించాడు.
ఈ గ్రంథ రచనకు మూలకారణం స్వామి గారి స్నేహితులు శ్రీనివాస పిళ్ళై (ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవిత చరిత్ర వ్రాసిన వారు) వీరాస్వామి గారిని “మీరు ప్రతిరోజూ చూసిన, వినిన విషయాలు నాకు ఉత్తరం ద్వారా తెలపండి” అని అడిగారంట. ఆ ఉత్తరాలు, ఇంకా వీరాస్వామి గారు రాసుకొన్న దినచర్య రెండూ కలిసి ఒక అద్భుత గ్రంథంగా కాశీయాత్ర చరిత్ర వెలువడింది.
వ్యక్తిత్వం: ఏనుగుల వీరాస్వామి గారి వ్యక్తిత్వం పరిపూర్ణమైనది. ఇప్పటి పచ్చియప్ప కాలేజీకి సంబంధించిన ఒక మోసాన్ని ఎదుర్కొని దాని తాలూకూ ధనాన్ని రాబట్టి పచ్చియప్ప అనే ఆ ఆస్థికి సంబంధించిన వ్యక్తీ పేరున కాలేజీని నిర్మించాడు వీరాస్వామి గారు.
కూతురి పెళ్ళిలో వీరస్వామి పెద్దఎత్తున అన్నదానాదులు నిర్వహిస్తే, దానిని కొందరు, ఆ అన్నదానానికి ఖర్చు పెట్టిన డబ్బు అంతా మీ కూతురికి ఇవ్వకూడదా అని ప్రశ్నించినప్పుడు “చిన్నదాని పోషణ కొఱకు ద్రవ్యమును మనుష్యాధీనముగా ఉంచుటకు ప్రతిగా ఈశ్వరుని చెంత నేను ఉంచుతున్నానని (తె.యా.చ. – పుట 125) చెప్పడం వారి భగవద్భక్తి కి నిదర్శనం.
వివిధానుభవాలు: తన యాత్రలో గ్రామాలు, పట్టణాలు దాటుకొంటూ కాలినడకన, దోలీలలో వెళ్ళిన వీరాస్వామి గారు అనేక అనుభవాలను చవిచూచారు.
౧. ఆ కాలంలో దూరాన్ని కొలిచే పేర్లు, బారలు, పరుగులు, ఘడియలు, ఆమడలు, మజిలీలు మొ||నవి. ‘పాటక్కు’ అంటే కట్టడం, ‘ఆ పాటక్కు కు కొన్ని బారల దూరంగా” అంటూ వ్రాశారు.
౨. ఇప్పటి హైదరాబాదు-నాగపూరు రహదారిలోనే అప్పుడు వీరాస్వామి గారు కాశీయాత్ర చేశారు.
౩. మంచి దారిని ‘సరాళము’ అని వ్యవహరించారు.
౪. ఈగలబండి, జనగల పల్లె, తదితర చోట్ల అడవులలో దారిదొంగలు ఉండేవారు. అందుకే గట్టి జాగ్రత్తగా తుపాకులు దాల్చిన బంట్రోతులను వెంటతెచ్చుకొన్నారు.
౫. ఉత్తరాది స్త్రీలు పురుషులు కనిపిస్తే పవిట మొహానికి కప్పుకొంటారని, దక్షిణదేశపు స్త్రీల వలె తళుకు బెళుకులను ప్రదర్శించరని మొహమాటం లేకుండా చెప్పారు. బ్రిటీష్ వారు దుంప సేద్యం 1910 లో పాట్నాలో ప్రారంభించారని ఆ దుంపకు “ఆలు” అని పేరు పెట్టారని తెల్పారు. వాటినే మనం ఉర్లగడ్డ, బంగాళా దుంప అని కూడా అంటాము.
౬. కాశీవీధులు ఇరుకు కాబట్టి వీరా స్వామి ‘కుసంధి’ అని చమత్కరించారు. ఇలా, రక్షణ, టపా, జీతాలు, పన్నులు, సుంకాలు, కొలతలు మొ|| అన్ని విషయాలను తన చూపుతో బంధించి తన రచనా స్వర్ణ హారంలో మణిపూసలై వెలిగే చందాన పొందుపరిచారు.
కాశీలో ‘పండా’లను ‘గంగ పుత్రులు’ అని కూడా అంటారు. వీరి దౌర్జన్యాల గురించి చక్కగా తెలిపారు. బ్రిటీష్ వారు వీరా స్వామి గారి యాత్ర గురించి చప్రాసీల ద్వారా ముందుగానే జమిందారులకు కబురు పంపితే వారు వీరాస్వామి గారికి మరియు ఆయన పరివారానికి సర్వసౌకర్యాలను సమకూర్చేవారు. ఉదా: గయలో విష్ణుపాదం దగ్గర పిండప్రదానం చేసేటప్పుడు గర్భగుడి లోకి వేరేవారిని రానివ్వరు. రాజులకు మాత్రమే అనుమతి ఉంది. కాని ఆ అనుమతిని బ్రిటీషువారి ద్వారా వీరాస్వామి పొందారు. దీనినిబట్టి వీరాస్వామి గారి ఖ్యాతి ఏపాటిదో మనకు అర్థమౌతుంది.
చెళ్ళపిళ్ళ వేంకటరాయ శాస్త్రి కాశీయాత్ర
దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి ఇరువురు అవధానులైన జంట కవులు. పందొమ్మిదవ శతాబ్ద పూర్వార్థంలో ఆంధ్రదేశంలో వీరు ఒక వెలుగు వెలిగారు.
వేంకట శాస్త్రి గారి జన్మస్థలం రాజమండ్రి సమీపం లోని కడియం గ్రామం. ఇద్దరికీ గురువు బ్రహ్మశ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి. కాశీకి వెళ్ళాలన్న తీవ్రమైన కోర్కె గల వేంకట శాస్త్రి ఎన్నో ఆర్ధిక, సాంఘీక ఇబ్బందులు దాటి కాశీ చేరి తన గురువు గారి గురువు అయిన నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద కొంతకాలం విద్య నభ్యసించి తల్లిదండ్రుల బలవంతం మీద మరల స్వగ్రామం చేరారు.
వేంకట శాస్త్రి గారు కాశీలో ఉన్నన్ని రోజులు తాను నిత్యం చూసిన, అనుభవించిన విషయాల గూర్చి ఒక డైరీ లాగా వ్రాశారంటే యుక్తంగా ఉంటుంది. అందులో కొన్ని;
౧. రోగనివృత్తికి కవిత్వం : తల తిరిగే వ్యాధి తనకు వచ్చినప్పుడు గంగానది మీద కవిత్వం చెప్పి పోగొట్టుకొన్నాడట.”అంగోద్భవాహిత...” అన్నది అందులో ఒక శ్లోకం.
౨. తాంబూలం: కాశీలో సత్రాలకీ, అన్నానికి కొదవేలేదని శాస్త్రి గారు వివరిస్తూ, ‘అన్నంతో పాటు తాంబూలం కూడా ఉచితం మరియు దానిలో ‘సురితి’ (సున్నంతో కలిపి నలిపిన పొగాకు) కూడా ఎవరింటికి వెళ్ళినా ముందు ఇస్తారు’ అన్నారు శాస్త్రిగారు. అందుకేనట వేంకట శాస్త్రి గారు కూడా కాశీ ప్రయాణానికి ఉత్సాహపడింది. దీనివల్ల ఆ కాలంలో బ్రాహ్మణుల అలవాట్లు బంగు తాగడం, సురితి తినడం మొ||. ఇదే అలవాటు విద్యార్థుల లోనూ ఉన్నట్లు శాస్త్రి గారి ద్వారా తెలుస్తున్నది.
బంగుపాన యోగ్యం: గంజాయి, ఎండు గులాబీరేకులు, యాలకుల తొక్కలు కలిపి నూరి ఆ ముద్దను నీళ్ళలో కలిపి తాగడం. ఇది అసలు తప్పేమీ కాదు (మత్తు వస్తుంది) కానీ పొగలో వేసి పీల్చడం మహాతప్పు. విద్యార్థులు దీనిని గూడా తీసుకొనేవారు. కాలారకం కొరకు డబ్బు ఖర్చు పెట్టేవారట. కాలా రకం అంటే కాలభైరవ స్వామికై చేసే సంతర్పణ. ఈ ఖర్చులకు శాస్త్రిగారు కొంత సంపాదించేవారట. ఇలా వెంకట శాస్త్రి గారి కాశీయాత్ర కొత్త కొత్త అనుభవాలతో సాగింది.
నీలగిరి యాత్ర : కోలా శేషాచల కవి.
థామస్ సిమన్స్ అనే బ్రిటీష్ డోరా వద్ద శేషాచల కవి గుమాస్తాగా మద్రాసులో పనిచేశాడు. తన దొరతో గూడా శేషాచల కవి తన మిత్రునితో కలిసి నీలగిరి యాత్ర చేశాడు. నీలగిరికి చాలా ఎత్తులో ఉన్న పర్వతాలను అతి కష్టమైన దారిద్వారా ప్రయాణం చేసి చేరుకొన్నారు. అక్కడ ఉన్న కొన్ని బడుగురులు అనే గిరిజనుల జీవన అలవాట్లకు సంబంధించిన విశేషాలను ఆయన సేకరించారు. బడుగురులు విభూతి చారులు. వీరు తమ ఆస్తి నుండి ఒక్క పైసా కూడా తాకరు. అంతా బిడ్డలకే ఇస్తారు. వారు కష్టపడి సంపాదించి జీవిస్తారు. వీరి వివాహ శైలి భారతాన్ని గుర్తుకు తెస్తుంది. పెద్దకొడుకు భార్యయే మిగిలిన కొడుకులకు కూడా భార్య అవుతుంది. అతను వేరే పెళ్లి చేసుకోవాలంటే ఇంటినుంచి వేరేగా వెళ్లిపోవాలి (అర్జునుని లాగా). అలాగే అమ్మాయి, అబ్బాయి ఒక రాత్రి గడిపిన తర్వాత అమ్మాయి తన అభిప్రాయం (పెళ్ళికై) చెప్తుంది. స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు నగ్నంగా తిరుగుతారు. ఎవరైనా బయటివారు వస్తే వస్త్రాలను ధరిస్తారు. ఇలాంటివెన్నో వింత వింత విషయాలను శేషాచల కవి సేకరించి ప్రాచీన భారతీయ సాంఘీక వ్యవస్థ యొక్క తీరుతెన్నులను మనకు కళ్ళకు కట్టినట్టు తన రచనలలో చూపించారు.
వచ్చే సంచికలో మరో గ్రంథ సమాచారంతో మీ ముందుకు వస్తాను.