సింహరాజ్ గారి ‘పంచతంత్రంలో ప్రపంచతంత్రం’
(సంస్కృత శ్లోకాలకు ఆంధ్ర పద్యానువాదం వ్యాఖ్యానసహితం)
సంస్కృత మూలం : విష్ణు శర్మ రచించిన “పంచతంత్రం”
లోపల:
౧. సహృదయ హృదయ స్పందనలు
౨. అనువాద విధానం – వ్యాఖ్యానసరళి
౩. రాజనీతి: 12 ఉపశీర్షికలు
౪. వివిధ లౌకిక విషయాలు
౧. సహృదయ హృదయ స్పందనలు:
“ప్రపంచంలోకెల్లా నీతికథా సాహిత్యంలో ఆది గ్రంథం పంచతంత్రం. పశువుల్ని, పక్షుల్ని కథల్లోకి దింపి వాటిచేత మాట్లాడించి మనుషులకు ఉపయోగపడే సందేశాలను అందించిన మొదటి పుస్తకం కూడా పంచతంత్రమే.
రత్నాల్లాంటి పంచతంత్ర సూక్తులను అందంగా, ఆకర్షణీయంగా శిల్పించి పద్యహారంగా గూర్చిన రచయితకు హార్తికాభినందనలు” – పొత్తూరి వెంకటేశ్వరరావు (పేజీ xvii)
“ప్రస్తుత గ్రంథం ‘పంచతంత్రం లో ప్రపంచతంత్రం’ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ సింగరాజు రామకృష్ణ ప్రసాదరావు పద్యానువాద రూపంలో అందిస్తున్నారు. సింహరాజ్ అనే కలం పేరుతో వెలువడుతున్నది. కఠిన పదాలకు అర్థం, తాత్పర్యం కూడా ఇవ్వడంలో అందరికీ అర్థం కావాలనే ఉద్దేశమున్నది.
సుమారు 50 శీర్షికలుగా విభజించబడి వర్తమాన పరిస్థితులను విశ్లేషిస్తూ సాగిన తీరు ఆకట్టుకొంది. ఇలాంటి బృహత్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదువవలసిందే. ” – ఆచార్య ఎన్.గోపి (పేజీ xxii)
“సింహరాజ్ అభ్యసించిన విద్య వైద్యం ఐనా, వారికి జన్మతః అబ్బిన విద్య కవిత్వం. వారికి తన మాతృభాషపైగల అత్యంతాభిమానమే – వారిచేత తిక్కనను, నాచనసోమననూ తన కవిత్వతత్వ నిర్దేశకులుగా నిర్ణయించుకోవడానికి మార్గదర్శకమైంది.
సింహరాజ్ గారికి తెలుగు భాషపై మంచి పట్టూ, పరిశ్రమా ఉందనడానికి వారు వాడిన తెలుగుపదాలే నిదర్శనం. చెట్ట + హాని, వేడు = ఎవడు, అబద్దీకుడు = అబద్దం చెప్పేవాడు, పెరిమ = ప్రేమ, లిబ్బి = ధనము, మారుతులు = శత్రువులు, ఱెక్కొనంగ = ఎక్కువ యగునట్లు, ద్రఢిమ = గట్టితనం మొ|| ఎన్నో ఈ గ్రంథంలో చూడవచ్చు.
ఈ కవికి చక్కటి ధార ఉంది. శైలి ఎక్కడా కుంటుపడదు. తన రచనను ఎక్కువభాగం తెలుగు పలుకులతో కొనసాగించి ఈ ఆధునిక కాలంలో గూడా తిక్కనాది మహాకవుల శైలిపట్ల శ్రద్ధా, భక్తి, గౌరవ, ప్రత్యయములు కలిగిన తెలుగు భాషాభిమానులు ఉన్నారని నిరూపించారు. ” – డా. వసుంధర (ఈ వ్యాసకర్త).
ఇంకా డా. ఉడాలి నరసింహశాస్త్రి గారు, చింతలపాటి పూర్ణానంద శాస్త్రి గారు మొదలైన వారు సింహరాజ్ గారు చేసిన ఈ అనువాద కృషిని ప్రశంసించారు.
ఈ పుస్తక రచయిత పరిచయం:
ఈ పుస్తక అనువాదకుని పూర్తిపేరు –శింగరాజు శ్రీ రామకృష్ణ ప్రసాదరావు. కలంపేరు – సింహరాజ్.
వీరి తల్లితండ్రులు సీతారావమ్మ, సుబ్రహ్మణ్యం గారలు. సింహరాజ్ చదివింది వైద్య వృత్తి. కానీ చిన్నతనంలోనే గురువుల వద్ద, తండ్రి వద్ద తెలుగు, సంస్కృతం చక్కగా నేర్చుకొనడం వల్ల, కవిత్రయ భారతం, గడియారం వెంకటశేష శాస్త్రి గారు రచించిన ‘శివభారతం’ మొదలైన గ్రంథాలు లోతుగా చదివి ఆకళింపు చేసుకొని ఏకలవ్యునిలా తెనుగు, సంస్కృత భాషలపై పట్టు సాధించారు. ప్రస్తుత గ్రంథ పరిమళం “పంచతంత్రంలో ప్రపంచతంత్రం” పరిశీలిస్తే అందులో ఉన్న తెలుగ పదాలు, వాటి అర్థాలు కలిసి ఒక చిన్న నిఘంటువులా అనిపిస్తుంది.
సంస్కృతం నుండి తెనుగు చేసే చాలామంది అనువాదకులు సంస్కృత పదాలు, తెలుగు పదాలు కలిపి వాడటం జరుగుతుంది. కానీ సింహరాజ్ గారు అలా కాకుండా మూలానికి తగ్గ తెలుగు పదాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ అనువాద గ్రంథం సహజసుందరంగా ఉంది.
౨. అనువాద విధానం – వ్యాఖ్యానసరళి:
సింహరాజ్ వివిధ శీర్షికల క్రిందగల తన అనువాద పద్యాలకు ముందు ఆయా శీర్షికలకు సంబంధించి వ్యాఖ్యానప్రాయం, వివరణాత్మకం అయిన ఉపోద్ఘాతం సంతరించారు.
సింహరాజ్ తన అనువాద ప్రారంభంలో “పంచతంత్రంలో ప్రపంచతంత్రం” అన్న శీర్షికలో (vi) తాను ఎందుకసలు ఈ అనువాదం చేస్తున్నది. దానికి తాను ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నది తెల్పారు. పంచతంత్రానికి ఇతర ప్రపంచ భాషల యొక్క అనువాదాలకు సంబంధించిన పట్టికలను సమకూర్చారు. అలాగే నారాయణ పండితుడు (క్రీ.శ. 11-13 శతాబ్దాలు) సంస్కృతంలో రచించిన హితోపదేశం లోని కొన్ని శ్లోకాలను కూడా తాను అనువదించిన విషయాన్ని సింహరాజ్ తెల్పారు.
ఈ శీర్షిక క్రింద సింహరాజ్ – సంస్కృత భాషలో పంచతంత్రం యొక్క అవతార వైవిధ్యాన్ని గూర్చి ఉత్తర, దక్షిణ భారత దేశాలలో జరిగిన అనువాదాల స్వరూప స్వభావాలను గూర్చి చర్చించారు. అటు తర్వాత పంచతంత్రం పహ్లావీ (ఇరాన్), అరబ్బీ భాషానువాదాల గూర్చి తెల్పి అరబ్బీ అనువాద గ్రంథమే (క్రీ.శ.750 – ఇది 22 భాగాలు) తర్వాత గ్రీకు, హిబ్రూ, లాటిన్, జర్మనీ మొదలైన దేశభాషలలోకి జరిగిన అనువాదాలకు మూల గ్రంథమని తెల్పారు. అటు తరువాత అనువాద వివరాల పట్టిక గూడా ఇచ్చారు. ఈ పట్టికను సింహరాజ్ ఆరుద్ర గారి “సమగ్రాంధ్ర సాహిత్యం” 4వ సంపుటం నుండి గ్రహించారు. ఈ విధంగా సింహరాజ్ పంచతంత్రాన్ని, వివిధ భాషలలో దాని అనువాద గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తాను తలచుకొన్న ప్రణాళికను గూర్చి ఇలా వివరించారు.
“ఈ పంచతంత్రం అనువాద గ్రంథాలన్నీ చదివాక ఇందులో సూక్తులు విడిగా, విభిన్న శీర్షికల క్రింద ఉంటే బాగుంటుందనే సంకల్పం నాకు కలిగింది…” అంటూ ఆర్థర్. డబ్లూ. రైడర్ పంచతంత్రానికి చేసిన ఆంగ్లానువాదం తనకెంతో నచ్చిందని, మూల శ్లోకాల అనువాదానికి ఆటవెలదులు తేటగీతులైతే బాగుంటాయని తన అనువాద విధానం వివరించారు.
సింహరాజ్ గారు తన అనువాదాన్ని గూర్చి చెప్పే ఈ సందర్భంలో మహామహోపాధ్యాయ, ఆచార్య పుల్లెల రామచంద్రుడు గారి అభిప్రాయాలను ఆయా సందర్భాలలో ఉటంకించారు. ఆచార్య పుల్లెల రామచంద్రుని అభిప్రాయాల సారాంశం క్లుప్తంగా పొందుపరుస్తున్నాను (బ్రాకెట్లలో).
(పంచతంత్రానికి, తంత్రాఖ్యాయిక అనే పేరు ఉన్నది. తంత్రాఖ్యాయిక కాశ్మీరులో ఆవిర్భవించింది. పంచతంత్రానికి చాల పాఠాలున్నాయి. పంచతంత్రం లోని కొన్ని కథలు కొద్ది మార్పులతో బృహత్కథా మంజరి, కథా సరిత్సాగరాల్లో, అంతేగాక పతంజలి మహా భాష్యంలో కూడా కన్పిస్తున్నాయి. అలాగే పంచతంత్రానికి మొదట ఏ పేరున్నాది అన్న ప్రశ్నకు – క్రీ.శ. ప్రారంభ శతాబ్దాలలో పహ్లవీ భాష (ఇరాన్) లోకి అనువదింపబడిన గ్రంథానికి “కలిలాగ్ –దమనాగ్’ అని పేరు పెట్టారు. ఆ అనువాదాన్నుండి చేయబడిన అరబ్బీ అనువాదానికి “కలిలాహ్ – దమ్మాహ్” అనే పేరు ఉంది. దీన్ని బట్టి మూల పంచతంత్రానికి ‘కరటక-దమనక’ అనే పేరు ఉండి వుంటుందని కొందరు పండితుల అభిప్రాయం. కరటక – దమనక అనేవి మొదటి పంచతంత్రం లో ప్రధాన పాత్రలైన రెండు నక్కల పేర్లు.)