గత సంచిక తరువాయి »
౧౦. శ్రీ శ్రీ వీలునామా:
ఈ వీలునామా శ్రీ శ్రీ మాటల్లోనే.
“సరే మరణించాను. నాకు 1990 లో చనిపోవాలని ఉంది. (కానీ, శ్రీ శ్రీ 15-6-1983 సాయంత్రం మద్రాసులో చనిపోయారు)…. నా శవం చుట్టూ చాలామంది చేరి ఏడుస్తున్నారు… అనంతర కార్యక్రమం గురించి ఆలోచించమన్నారెవరో…దహన సంస్కారం ఎజండా లోకి వచ్చింది… అదే వీల్లేదన్నాను…మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండకీ నా (సజీవ లేదా నిర్జీవ) కళేబరాన్ని అంకితం చేయడం అనే పనికి నేను సతారామూ అంగీకరించను.
చుట్టూ మూగిన వారిలో నేనొకసారి రాసిన ‘మరణ శాసనం’ జ్ఞాపకం వచ్చింది. అందులో ‘నేను చనిపోయాక జరగవలసిన మొట్ట మొదటి పని నా శవాన్ని విశాఖపట్టణం లోని కింగ్ జార్జి ఆసుపత్రికి అప్పగించడం.’ అని వ్రాశాను…నా శవం మీద ఎర్ర జండాను కప్పడం మాత్రం మర్చిపోకండని మరీ మరీ అభ్యర్థించాను” – శ్రీ శ్రీ – సాహిత్య మరమరాలు – పేజి 215-216.
నోట్: శ్రీ శ్రీ అంత్యక్రియలప్పుడు జరిగిన ఆసక్తికరమైన విషయాలను గోపి (ఇంటి పేరు లేదు) వివరించడం జరిగింది. ఆ విషయాలను 217-220 పేజీలలో పొందుపరిచారు. ఏనుగు మరణించినా జీవించినా విలువైనదే గదా! మరియు ఒక మనిషి యొక్క విలువను గౌరవించడమంటే, ఆ వ్యక్తి యొక్క మాటలను మన్నించడమే.
౧౧. కళ ఏది?
“రేషనింగు బియ్యమున ప్రాకులాడుటకే పొద్దుట చాలని మనకును, కళకును నేమి సంబంధము…ఈ కడుపు గొడవలో గోష్ఠులెవరికి గా బట్టినవి? మన గృహిణులు కూడా మనకు తగినవారే తయారయినారు…వాకిళ్ళ ముందు మ్రుగ్గులు పెట్టుట వారికి మోటుతనము…వారికీ హాయిగా దమలపాకు చిలకలు గట్టుటకు రాదు. ప్రొద్దున లేచినది మొదలు – వారికి పది గంటలకాపీసుకు బోవు మగనికేమి వంట చేయవలెనన్న కూటి చింతయే. ఇక జీవితమున కళ యేది? అందువలన కవికి దిక్కుతోచదు. వాడూరక వెర్రిని బెట్టుకొని మనలను జంపుచుండును.” – పుటపర్తి నారాయణాచార్యులు – సాహిత్య మరమరాలు – పేజి 225.
నోట్: తన కవితకు సహజ సౌందర్య దృశ్యాలు కరవైనాయని కవి గొడవ. అందుకే పిచ్చి కవిత్వంతో మనల్ని చంపుతున్నాడని బాధ.
౧౨. వేలూరు:
వివిధ శాస్త్ర విజ్ఞాన ఖని రూపుదాల్చిన జ్ఞానమూర్తి, మూర్తీభవించిన కవిర్మనీషి, శతావధాని వేలూరు శివరామ శాస్త్రి గారు. 1929లో శాస్త్రి గారి ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంటిలోని వస్తువులతో పాటు శాస్త్రి గారి గ్రంధ సంపద మరియు వారు రచించిన అమూల్య రచనా సిరులు అగ్ని పరమైనాయి. అపుడు శాస్త్రి గారి నోటి వెంట వెలువడిన పద్యం.
ఋగ్వేదమా! యష్ట దిగ్వీధులను నన్ను
గన వెంతో యడలితో గాలునపుడు
వేదాంతమా! నన్ను వీక్షింప యోగదృ
జ్మతి నెంతో పూనితో మాడునపుడు
వ్యాకృతీ! యల యుజుగంతమౌ దృశి నెంత
నఱపితో నాకయి చరమవేళ
కవితాకుమారి! నిన్ గనుపొంటె నెన్నిము
ఖాల దుఃఖించితో క్రాగు తరిని
కట్ట! సాహితిలో నన్ను గౌరవింపు
నెంత చేతులు చాపితో యేమనందు
నన్ను గంగాతమును జేసి చన్నవారె
పుస్తకములారా! విజ్ఞానపుటములారా!
– జానువట్టి హనుమచ్చాస్త్రి – సాహిత్య మరమరాలు – పుట 230.
నోట్: ఈనాడు అపార్ట్ మెంట్లు కూలిపోతే, ఆనాడు పూరిండ్లు అగ్నికి ఆకలి తీర్చేవి. ఆనాడు ప్రతి ఇంటిలో వస్తువులు తక్కువే, పుస్తక సంపద సమృద్ధి. కాని అగ్నిదేవుని బారిన పడి సర్వగ్రంధ సంపద శూన్యమయ్యేది. కళాప్రపూర్ణ డా|| మరుపూరి కోదండరామిరెడ్డి వంటి వారూ ఇటువంటి నష్టాన్ని భరించినవారే.
౧౩. సాహిత్య ధీశాలి:
1868 లో రాజమహేంద్ర వరంలో ఓ శిశువు విషజ్వరం వచ్చి చనిపోయిందని గోతిలో పాతిపెడుతుండగా ఆ శిశువుకు చలనం వచ్చింది. ఆ తరువాత ఆ శిశువే అతడుగా మారి 94 సంవత్సరాలు బతికి, తన సొంత చేతితోనే భారతం 18 పర్వాలు, రామాయణం ఏడు కాండలు, భాగవతం 12 స్కందాలు, 97 పద్యకావ్యాలు, 32 నాటకాలు, 5 శతకాలు, 35 వచన కావ్యాలు వ్రాసిన ధీశాలి గా పేరు గాంచాడు. ఆ శిశువే మన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు – సాహిత్య మరమరాలు – పుట 270.
౧౪. హాస్యం:
వీరేశలింగం గారి ప్రహసనం, చిలకమర్తి వారి చతురోక్తి, పానుగంటి వారి ప్రౌఢోక్తి, భమిడిపాటి వారి హాస్యోక్తి, మొక్కపాటి వారి ఛలోక్తి, ముని మాణిక్యం వారి రసోక్తి, తెలుగు వారి జీవితంలో చిమ్మచీకటులను చిదిమివేసే వెన్నెల మొలకల్లా పనిచేశాయి. గురజాడ వారి సరసోక్తి జాతి ప్రవృత్తి మీద చెరగని ముద్ర వేసింది. బురద నీరులా వరదలై పారుతున్న మూఢాచార ప్రవృత్తికి చిల్లగింజలా పనిచేసిన హాస్య రచనలు తెలుగువారి జీవితంలోనూ, సాహిత్యంలోనూ హాస్యరసానికి ఉన్న ప్రతాపాన్ని, ప్రభావాన్ని ప్రకటించి నిరూపించాయి. జాతి పునరుజ్జీవన వికాసంలో హాస్యం నిర్వహించిన పాత్ర అపూర్వం. జాతిని నొప్పించకుండా కవ్వించిన కళా కౌశలం ఇరవైయవ శతాబ్ది పూర్వార్థంలో ఆంధ్రదేశంలో ప్రదర్శించిన హాస్యం. – జి. వి. సుబ్రహ్మణ్యం – సాహిత్య మరమరాలు – పుట 99.
౧౫. డికెన్సే దేవుడు:
“1957 లో ‘తిరస్కృతి’ రాద్దామని ‘కన్యాశుల్కం’ చదివాను. దేవతలు తప్ప మనుషులు రాయలేరని అనిపించింది” అంటూ కన్యాశుల్కం ప్రభావం తన నాటకాల మీద కన్నా, కథల మీద ఉందని చెప్పారు రా.వి. శాస్త్రి. అంతేగాక ‘కన్యాశుల్కం’ చదవకపోయి ఉంటే ‘సారా కథలు’ రాయగలిగే వాణ్ణి కాదేమో” అన్నారు. శ్రీ శ్రీ ఉర్రూతలూగిస్తే, గురజాడ ప్రభావితం చేసేడు. అలాగే డికెన్స్ గొప్ప రైటరు. అలాగే చెహుల్ కూడా. కానీ ఇతనిది పండితరంజనం. డికెన్స్ ది పండిత పామర రంజితం. అందుకే నాకు చెహుల్ అంటే ఇష్టం, డికెన్స్ అంటే ఆరాధన. దేవుడు ఎవడన్నా వుంటే వాడు డికెన్సే. “Law is an ass” అన్నవాడు నాకు నిజంగా దేవుడే. నేను డబ్బు కోసమో, మరో ప్రయోజనం కోసమో నా పుస్తకాలు అంకితం ఇవ్వలేను. నా బంధువులకు, స్నేహితులకు మాత్రమే ఇచ్చేను.” – రాచకొండ విశ్వనాథ శాస్త్రి – సాహిత్య మరమరాలు- పుటలు 187-88.
నోట్: పుస్తకం విలువ తెలియని వారికి, వేరే ప్రయోజనములను ఆశించి అంకితమివ్వడం మన పుస్తకాన్ని మనమే అవమానించినట్లవుతుంది.
౧౬. ఏకాంతసేవ:
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ గ్రంధానికి పీఠిక రాస్తూ “ఏకాంతసేవ మహా గ్రంథములలో నగ్రస్థానము నలరించు వానిలో నొకటి. కవనమునకుండవలసిన లక్షణములన్నియు ఈ ఏకాంతసేవ గ్రంథమునకు సంపూర్ణముగా గలవు…వేయేలా ఇది విమర్శనాతీతము. వంగ భాషకు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో, యాంధ్రమునకు ఈ మహాకవుల భక్తుల “ఏకాంతసేవ” యట్టిదని నా అభిప్రాయము” అని అన్నారు.
నోట్: జీవాత్మ పరమాత్మల ఏకరూపోజ్జ్వల మూర్తిని ప్రతిష్ఠ చేసి మధుర భక్తి చందన మలది సంగీత సాహిత్య పుష్పధామ శోభల దేల్చి, ఏక మనస్కులైన ఆ జంట కవులు భావ కవిత్వ రసత్వ స్థిరత్వ సంపన్నులై శిల్పించిన మాధుర్యమూర్తి “ఏకాంతసేవ”. కళ్యాణ విభుసేవ గావించు వేళ ఏమి సేయగా బోయి ఏమి చేసితినో. ”దంపతుల మధ్య జీవాత్మ పరమాత్మల మధ్య దాగి ఉన్న – తడబాటు, తృప్తి చెందని ఇంకా ఏదో చేయ్యాలన్న తపన, సేవానిరతి వీటి వెనక దాగిఉన్న మధుర ప్రేమ ఎంత తియ్యనిదోగదా!
మానవులు అర్థ రహిత వ్యర్థాలకై ఇహ పరార్థ పూర్ణ పరమానందాన్ని నేలపాల్జేసి దాంపత్యాన్ని, జీవాత్మ పరమాత్మల ఏకరూపత్వాన్ని నిర్లక్ష్యం చెయ్యడం బాధాకరం. ఏ కాంత అయినా పురుషుడైనా కోరుకోవల్సినది “ఏకాంత సేవ” లోని మాధుర్యమే.
మహామహుల జీవితాలు సందేశాలు
మనందరం ఆచరిస్తే, అనుకరిస్తే,
అవే మహోజ్జ్వల కరదీపాలు
వచ్చే సంచికలో మరో గ్రంథ పరిచయంతో కలుస్తాను…..