మధూకమాల గ్రంథ ప్రశంస:
౧. వేడుకోలు, ౨. ఏమని పొగడుదు, ౩. మదూకమాల – కవనవనహేల, ౪. ఇవిగో కొన్ని కలకండ పలుకులు, ౫. సహృదయ హృదయ స్పందనలు.
౨. ఏమని పొగడుదు!
ఓ కవీశ్వరా! మీరు రూపై నిల్చిన జ్ఞాన మకరందసంద్రము
మీరు దివ్య కావ్య నిర్మాణ చాతుర్య చతుర్ముఖ బ్రహ్మము.
మీ ప్రతి పద్యమొక హిమాలయ సమున్నతమ్ము
మీ ప్రతి భావమొక త్రివేణీ సంగమమ్ము
ఏమని వివరింతు మీ పద పద్య
నిర్మాణ విద్యాగరిమ, గణుతింప
శక్తి జాలని నా బోంట్ల రాతలెల్ల
నిక్కము కలము కాగితమునకు
చేటగుగాని చేరదు పారమునకు.
అందుకే-
ఓ సరస సహృదయ పఠితలారా!
చదువుడు ‘మధూకమాల’ సత్వరముగ
రుచి చూపుదు కొన్ని కలకండ పలుకులివిగో
అరుచి పోగొట్టి మనసుకు హాయినిచ్చు.
౩. మధూకమాల – కవనవనహేల!
దైవ కార్యనిర్వహణకై దివినుండి భువికి దిగిన
దేవకన్నియలు ఈ ఇప్పపూలు.
వాని పవిత్రతకు ముగ్దుడై, కవిగైకొనె వాని పేరు
తన కవనమాలకు పేరుగా అర్హమనుచు.
కవిహృదయమొక
అనర్ఘ రత్నములకు ఖని
త్రవ్వగా త్రవ్వగా నవి
తళుకు తళుకు మనుచు తగులు
అట్టి వానినన్నింటిని భద్రపరిచి
కవికూర్చె ఈ ‘మధూకమాల’.
తాను చూచి, అనుభవించి,
ఆనందానుభూతిని పొందిన ప్రతి రత్నమును
ఆచార్యుల వారు ఆకృతి నొసగ కృతి రూపమై వెలసె.
౪. ఇవిగో కొన్ని కలకండ పలుకులు!
ఓ కవివర్యా!
మాతృ శబ్దము మొదటి శబ్దము మానవులకు
బ్రతుకు నాటకమునకు ‘నాంది’ మొదటిదనుచు
మీరు రచించితిరి ‘మాతృభూమి’ ‘నాంది’ మొదల మొదల.
1. మాతృభూమి
‘మాతృమూర్తి’ మాతృభూమి’ మానవులకు మధురానుభూతిని మిగిల్చే మరుమల్లె, సిరిమల్లెల వంటి సిరులు. అందుకే,
“బ్రహ్మ విద్యావారి నిధి తీ
ర్థముల నాపోశనము గొనిన త్ర
యీ విశారదులైన ఋషులకు
తావలం బిదిరా” ...... అని,
ఇంకా
“పరమ పాతివ్రత్య మహిమల” గూర్చి “తెలుగు వీరుల శౌర్య పటిమ” గూర్చి “ధన్యజీవులెందరో మును తలలు దాచిరిరా....” అని భారతదేశ సంస్కృతీ వైభవాన్ని మీరు చాటి చెప్పిన రీతి ధన్యతమము.
2. నాంది
జీవితమునకు పునాది దాంపత్యమే. అందుకే
పల్కితిరి కావ్య కళ్యాణికి నుదుట
కుంకుమై శోభిల్లు ఉషోదయ వర్ణన ముందు నడువ –
“గగన కల్యాణి గారాబు కన్నపట్టి
ప్రత్యుష శ్రీ కుమారి నవ్యప్రపుల్ల
కరకుశేశయ కమ్ర కంకణ మధుకర
మంజు శింజితములు మాఱుమలయుచుండ”
అనుచు సాగిన మీ ‘నాంది’ అంతమున-
దంపతుల యదృష్టము తీగేసాగుగాక
అంటూ ఆగింది. ‘మూగమాటలు’ ‘తీగేసాగుట’
....ఎక్కడివయ్యా మీకు ఈ పూల మాటలు!
3. హరిజనులు
“అంటరాని వారు హరిజనులైనచో
నంట దాగిన వారన్యులెవరు” అంటూ అగ్రకులాల వారిని నిలదీసి, హరిజనులలో గూడా –
“పరమజ్ఞానులు, భక్తిపూర్ణులు, కవిబ్రహ్మల్, మహాదేశికుల్, ఎందరెందరో” ఉన్నారని తెల్పారు.
“అకటా! పంచమజాతి బుట్టుటొక తప్పై” అంటూ హరిజనులకై ఆవేదన చెందిన మీరు పరమ కరుణామూర్తులు, మానవతావాదులు.
4. శక్తిరథము
“కదలె కదలె శక్తిరథము
కదలె ప్రజాశక్తిరథము” ..అంటూ
“కనక తప్పెటల మ్రోతలు, కాహళిక నిస్వనములు” లను వినిపింపజేస్తూ
“ఎండుగోగు పుల్లలవలె బెండుపడిన చేతులేల?” అని ప్రజలను ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తూ కార్యోన్ముఖులను చేస్తూ,
“కప్పలు తిను, జాతి జూచి కళవళ పడుటెంత సిగ్గు
గజమును దిగిమ్రింగినట్టి గరుడాళ్వార్ మనవాడే”
అని గుర్తుచేసి ప్రజాస్వామ్య రథ గమన వేగాన్ని పెంచిన మీ కవిత, మీ దేశభక్తికిమ ఆత్మ శక్తికి ప్రతీక. మీరు బోధించిన సమైక్యవాదం, సుస్థిర ప్రజాస్వామ్య లక్షణం ప్రశంసనీయం.
5. తెల్లవారలేదు
పేదల బ్రతుకు స్వాతంత్ర్యానంతరం గూడా వెలుగు చూడలేదన్న మీ ఆవేదనకు ప్రతిరూపమిది.
“కయ్యదిబ్బలందు కాల్వగట్టులందు
తోటలందు పెరటి దొడ్లయందు
కాపురమ్ము సలుపు కష్టజీవుల కింక
తెల్లవారలేదు కల్లకాదు” అని చెప్పి వారి ఆత్మాభిమానాన్ని గూర్చి
“ఒక్క సంక్రాంతి శుభవేళ దక్క బిచ్చ
మడుగ నొల్లదు పరుల నీ బడుగు జాతి
కాయికశ్రమ మనపాలు కడుపు మాత్ర
మా కులముల పాల్సేత యఘము మనకు”
సంక్రాంతి రోజు పండుగ ముష్టి సందర్భంగా మన వాకిళ్ళ ముందు నిలబడతారే గాని, మరెప్పుడూ వారు ఇతరులను యాచింపని సంస్కార సంపన్నులు ఈ నిరుపేదలు, అటువంటి వారి కష్టాన్ని మనం దోచుకోవడం పాపం అని చక్కగా సెలవిచ్చారు.
ఆచార్యుల వారు ఆ వేంకటేశ్వరుని అనుగ్రహ సంపదను కొల్లగొట్టిన భక్త శిఖామణి. ఇతరుల ధనాన్ని కన్నెత్తి కూడా చూడని కాంచనదూరులు. కర్మయోగి. ఈ విషయం ఆయన జీవనశైలిని గమనిస్తే అవగతమౌతుంది.
240 పేజీలుగల ఈ మదూకమాల గ్రంథంలో, సగభాగం కవి వివిధ విషయాలపై కవితలు వ్రాశారు. మిగిలిన భాగంలో ఆచార్యుల వారు తన స్నేహ సంపదను గూర్చి, సద్గురువుల గూర్చి, పీఠాధిపతుల గురించి వ్రాసి వారందరి మీద తనకుగల స్నేహ, ప్రేమ, గురుత్వం చాటుకొన్నారు.
౫ సహృదయ స్పందనలు
౧. నాడు నన్నయ్య ప్రతి పర్వరసోదయంగా మహాభారత రచన కావించారు. నేడు మహాకవి శ్రీ ముదివర్తి కొండమాచార్యుల వారు ప్రతి పద్యరసోదయంగా “మదూకమాల” సమకూర్చారు.
--డా. సముద్రాల లక్ష్మణయ్య
౨. ఈ మదూకమాల అద్భుతమైన పాత్రికేయుని జీవన ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రష్పంకం
---గొల్లపూడి మారుతీరావు
౩. ‘ఋషివంటి నన్నయ’, ‘రెండవ వాల్మీకి’ – అని విశ్వనాథ వారు పేర్కొనిన మహాకవుల పరంపరలో చేర్చి తెలుగువారు ఆరాధింపదగిన కవితా తపస్వి ఈ మహాకవి.
-- డా. మేడసాని మోహన్ (సహస్రావధాని)
౪. సుజనుడైన కవి దొరకడం సాహిత్యం చేసుకొన్న పుణ్యం. ఆచార్యుల వారు కూడా అటువంటి సుజన సుకవి.
--డా. కంపెల్లె రవిచంద్రన్
“మదూకమాల” సరసహృదయుల పాలి
ఉత్తమ గ్రంథం –జ్ఞానవాహిని. చక్కని సాహిత్య పూలతోట