మర్నాడు సాయంత్రం వచ్చింది సంపంగి. రావడం రావడమే-
"అనసూయమ్మ సంగతి నువ్వు ఎరగవు. సుందరమయ్య తరువాత పుట్టిందట. ఆ అమ్మకి ఆశ ఎక్కువ, పీక సన్నం. డబ్బు పట్టుకుని స్వర్గానికి కూడా పోతాననుకుంటుంది.
సుందరమూర్తి అందర్నీ కలగలుపు పోతాడా? అందరి కుశలం తాను సంసారం నడపడంలో ఉందనుకుంటాడు. అందర్నీ ఒకేలా చూస్తాడు. జమా ఖర్చులు పక్కాగా రాస్తూ గడించిన డబ్బుని జాగ్రత్త చేస్తాడు. ఎప్పుడూ పనే. అపర్ణ అమ్మతో సరదాగా నాలుగు కబుర్లు చెప్పడం నేను ఏ రోజు చూడలేదు.
ఈయన పని ఎప్పుడూ లెక్కలు డొక్కలు చూడటమే.
ఈ అనసూయమ్మ కి పేదోళ్ళంటే విసుగు, చిరాకు. వాళ్ళు ఉండబట్టే గొప్పోళ్ళ కి శాంతి లేదని, జలగల్లా ధర్మం దానం అంటూ తిరుగుతారని అంటుంది.
మాటకి అడ్డు తగిలాడు సింమాద్రి.
"ఏటయిందే? ఏటన్న అందా నిన్ను?” ప్రేమగా అడిగాడు.
అవునంటూ తల ఊపింది. కానీ ఏమందో చెప్పలేదు.
ఈ యమ్మ ఇక్కడే పుట్టింటి లోనే ఎందుకుంటాదో తెల్సా? డబ్బు కోసం. ఎవరేం కొట్టేస్తారో అని ఇక్కడే పాతుకుపోయింది. ఎప్పుడో గానీ అత్తింటికి పోదు. ఎక్కడ గానీ... ఎవ్వరు గానీ ఒక ఆడపిల్ల కి పెళ్ళి చేస్తే అత్తారింటికి పోతుందా? పెళ్ళాయ్యాక పండక్కి, పబ్బానికి, పురుటికి పుట్టింటికి పోతుంది కదా? కానీ ఈ అనసూయమ్మ పండక్కి మాత్రమే అత్తింటికి పోతుంది. మరీ బాగోదని.
పుట్టింట్లో ఉంటే ఖర్చు ఉండదు. పని ఉండదు. అత్తగారితో మాటలు ఉండవు. ఆడపడుచుల గోల అస్సలు ఉండదు. మాటామాటా అనుకోడాలు ఉండవు. పెట్టుపోతలు అస్సలుండవు. అందుకే మొగుడినే ఇక్కడికి రమ్మంటుంది.
"అనసూయమ్మ మొగుడు శ్రీధర్ బాబు ని చూసావా అసలు?” అడిగింది సంపంగి.
“చూసిన. నిన్న పొద్దుట రెండు సూట్ కేసులతో దిగితే నేనే కదా లోనికి తీసుకు వచ్చింది. కొత్త వాడివా?" అన్నాడు.
'అవును' అని సూట్కేస్ కింద పెడుతుంటే చేతిలో నుంచి జారి కింద తిరగబడింది.
"అయ్యయ్యో! ఈ మాత్రం తేలేవూ? అదేమన్నాబరువు ఉందా? నాలుగు చక్రాలు ఉంటాయి. లాక్కుని రాలేకపోయావు. చూడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే ఇక్కడే ఉంటావు. లేకపోతే ఉద్యోగం ఊడిపోతుంది అని బెదరగొట్టాడు!" అన్నాడు సింమాద్రి.
నవ్వింది సంపంగి.
"ఆయనేం తీసేయలేడులే. తాటాకు చప్పుళ్ళు. పెళ్ళానికి తగ్గ మొగుడు. నెలకోసారి వచ్చి పదిహేను రోజులు ఉండిపోతాడు. వెళ్ళేముందు పొలాల్లో పండినవి, ఇంటి సరుకులలో ఇంటికి కావలసినవన్నీ పట్టుకుపోతాడు. అల్లుడు కదా...అని అన్ని మూటలు కట్టి ఇస్తాడు సుందరమూర్తి.
"తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయని లెక్కలు కడతాడే తప్ప పైసా తియ్యడు. అన్ని ఖర్చులు ఇక్కడే. రేపు వెళ్తున్న అని వారం రోజులు దండోరా వేసి వేసి ఎలాగో వెళతాడు. వారం తిరక్కుండా వస్తాడు. పెళ్ళాన్ని, హాస్టల్లో ఇంటర్ చదువుతున్న కొడుకుని చూసుకుంటూ అటూ, ఇటూ తిరుగుతూ ఉంటాడు. 'వాళ్ళిద్దర్నీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు జీవితానికి!' అంటుంటాడు.
ఆ మాటకి అనసూయమ్మ తెగ మురిసిపోతూ మర్యాదలు చేస్తుంది. చెయ్యమంటుంది. ఆ పోరు పడలేక అందరూ 'బాగున్నారా? బావున్నారా?’ అంటూ ఉంటారు. అంతే!
అత్తింటికి మొదటిసారి వచ్చినట్టు పోజు ఇస్తాడు. అందరూ అలాగే కొత్త అల్లుడు ని చూసినట్టు యాక్షన్ చేస్తారు.
అనసూయమ్మ గొంతు, ఆ ఆర్డర్లు వెయ్యడం చూశావుగా? సుందర మూర్తి తర్వాత పుట్టిందట ఆవిడ. మొట్ట మొదటి ఆడపిల్ల అని ముద్దు చేసిచేసి అగ్గిబరాటా చేశారు. ఏదన్నా అంటే మండిపోతది. ఈ ఇల్లు తాను ఒక్కర్తే చక్క పెట్టగలను అని అంటుంది. ఇంకెవ్వరికి ఆ ఒడుపు తెలియదని చెప్తుంది. ఈ ఇంటికి అసలైన మహారాణి నేనే అనుకుంటుంది. అలా గారాం చేసి ఒగ్గిసీరు. ఆయమ్మ మరి గద్దె దిగనే లేదు. అన్ని ఆర్డర్ లే!
ఇప్పుడు ఇంకో కొత్త ఫ్యాషన్ మరిగి 'బాబ్' చేయించుకొని ఓ చిన్న దువ్విన అట్టుకుని జుట్టుని ముందుకి వెనక్కి తిప్పి తిప్పి దువ్వుతాది. చూశావు కదా? ఇంట్లో కూడ పట్టుచీరలే కడుతుంది.
అసలు ఆవిడ కన్ను ఆస్తి మీదే. 'ఎవరికీ ఎంత చెందుతుంది? ఎంత వస్తుంది? 'అనే లెక్కలే. అందుకే ఇక్కడి నుండి కదిలి ఎక్కడికి పోదు. శ్రీధర్ రావు అప్పుడప్పుడు ఉండబట్టలేక అడుగుతాడు అత్తింటికి రమ్మని.
“ఇక్కడ ఇంత వదులుకొని అక్కడికి వచ్చి ఏం చేయాలి? నువ్వు ఇక్కడే ఉంటే రానున్న రోజుల్లో మనం ఏనుగు ఎక్కీ ఊరేగే రోజులు ముందున్నాయి. అవి వదులుకుని...
లోకం పుట్టింట్లో ఉంటే ఏమనుకుంటుంది? అనుకుంటూ కూర్చుంటే మంగళ హారతే. లెక్కా డొక్కా చూసుకోవొద్ద?" అని మొగుడిమీద అరుస్తుంటే నేను ఎన్నో సార్లు విన్నా. అందుకే ఆయన కిమ్మనకుండా అ పెళ్ళాం చాటు మొగుడిలా పడి ఉంటాడు. ఆయనకీ ఈ ఆస్తి మీదే కన్నే. ముంగిలా చెప్పడు గానీ!" అంది.
"ఎంతుంటుందే?” సింహాద్రి అడగకుండా ఉండలేకపోయాడు.
చిలిపి నవ్వు నవ్వింది సంపంగి.
"అందరూ కలిసి కూర్చుని ఖర్చుపెట్టినా తరగనంత అంట. ఈమధ్య సావిత్రమ్మ అంది నాతో!” అంది.
ఉలిక్కిపడ్డాడు సింహాద్రి.
"సావిత్రమ్మ నీతో చెప్పిందా?” ఆశ్చర్యంతో కళ్ళు వెళ్ళ బెట్టాడు. ఆవిడకి ఏడుపు ఒక్కటే తెలుసు అనుకుంటున్నాడు.
"ఆ ఏడుపులు, గోలా నిజనుకుంటున్నావా? అదో జిమ్మిక్కు. ప్లాను మీద ప్లాను గీస్తుంది సీక్రెట్ గా. ఎవరెంత దొంగచాటుగా కొట్టేస్తున్నారో అని గొప్ప అనుమానం. భర్తతో గొడవపడి ఎందుకు వస్తదో తెల్సా? ఇక్కడ అనసూయమ్మ ఎలాగా తిష్ట వేసింది. తాత ముత్తాతల ఆస్తి కాకుండా తల్లిగారి నగ-నట్ర పసుపు కుంకుమ కింద తెచ్చిందే బొచ్చెడు ఉందట. ఇంకా ఎవ్వరూ పంచుకోలేదట. ఎక్కడ ఎవరు ఏటి కొట్టేస్తారో అని బెంగ కొద్దీ ఆ ఏడుపు.
ఏడుస్తూ అందరికళ్ళల్లో పడుతూ 'పాపం' అని అనిపించుకుంటుంది.
మొగుడితో ఏదో ఒక తగవు పెట్టుకొని తన సంసారం బాగున్నా బాగులేదని చూపిస్తుంది. పుట్టింట్లో ఉండిపోవడానికి అదొక వంక.
తనకీ, ఎదుటి వాళ్ళకి కూడా శాంతి లేకుండా ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, అని లేనిపోని నొప్పులు చెప్పి అందరినీ తనవైపు తిప్పుకుంది.
కరుణాకరమూ అంతే! భార్య పోరు పడలేడు. వదులుకోలేడు! అంతా డబ్బు మహిమ!” అంది.
"కాపురం కూలిపోదూ... కరుణాకరం బాబు అక్కడ, ఈవిడ ఇక్కడా ఉంటే?” అన్నాడు సింహాద్రి అమాయకంగా.
"కాపురమా? పాడా? రాబోయే రోజుల్లో అస్సలు శ్రమ పడకుండా ఆస్తులు మూటగట్టుకు పోవచ్చని ఆశతో జాగిలాల్లా ఇక్కడిక్కడే తిరుగుతుంటే.
కానీ, ఎంతకని ఎప్పుడో వచ్చే డబ్బు కోసం ఇప్పుడు పెళ్ళాం, పిల్లల కోసం ఇటూ, అటూ తిరుగుతా ఉంటాడు? తల్లిని, ఇంటికొచ్చి పోయే చెల్లెల్ని, బావగార్ని చూసుకోవాలి. ఆఫీసుకు పోవాలంటే కారేజి కట్టుకోవాలి. తిప్పలు పాపం. ఒకటే గొణుగుతా ఉంటాడు. ఆఫీసులో సరిగా పని చెయ్యకుండా బాస్ చేత చీవాట్లు తింటూ ఆ తిట్లకి నాలుగు కలిపి భార్యని తిడుతూ ఉంటాడు.
"అట్టనా?” అన్నాడు సింహాద్రి.
"డబ్బు కోసం గడ్డి అన్నమాట!" అన్నాడు.
"ఇంకా ఏమి చూశావు? వీళ్ళందరికీ ముద్దొచ్చే ముద్దుగుమ్మ, చంటి చెల్లి ఉంది.
ఆవిడే అనులేఖ. ఆవిడ పెనిమిటి మనోహర్. మొగుడితో చిన్న హానీ మూన్ ట్రిప్ కి వెళ్ళింది. రేపో మాపో దిగుతుంది. ఆవిడొస్తే ఇల్లు ఇలా ఉండదు. ఏటి జరుగుతుందో అని అందరికి రోజంతా టెన్షన్.
ఈ లోగా ఇంకొకరి గురించి విను.
బయట వీధి సైడు పెద్ద బాల్కనీ ఉందా? అక్కడ సదువుకుంటుంది సత్య భామ. సావిత్రమ్మ కూతురు.
"చూసిన... చూసిన. తొడల మీదకి నిక్కరేస్తాది. పొట్ట పైకి చొక్కా ఎస్తది. ఆ చొక్కాకి సేతులుండవు.
బుజ్జి జుట్టు కి కిప్పు. అటూ ఇటూ తిరగతా ఉంటది. కానీ ఇంకోటి కనుక్కున్న నేను!" అన్నాడు.
ఫక్కున నవ్వి -
"ఏటో?" అంది.
"లవ్వాడతావా? సెప్తా." అన్నాడు అడుగు ముందుకేసి. వాడి భాష లా వాడుండడు.
జీను ప్యాంటు, పూల టీ షర్టు. కిర్రు చెప్పులు.
"ఏటో సెప్పెహే!"
"ఎదురుగ్గా రంగా బడ్డి కొట్టు నేదూ? ఆడికి లైను ఎత్తా ఉంటది. నేను ఊకె అక్కడ నించోని దిక్కులు సూత్తానా? ఈ పిల్ల బాల్కనీ లోకి వచ్చిందంటే రంగా యాపారం సెయ్యడు. పదిహేను రూపాయలకి ఎటైనా కొని ఇరవై నోటియ్యి. ఈ పిల్ల అవుపిస్తే మనకి సిల్లర కింద వంద నోటిస్తాడు!" అని గట్టిగా నవ్వాడు.
"అబ్బో! నీకు శానా తెలుసు!" అని నవ్వింది.
"సంపంగీ!” ధృతి పిలుపు వినిపించింది.
ఒక్క పరుగు తీసింది. పోతూ పోతూ వెనక్కి తిరిగి వెక్కిరించి మరీ పారిపోతుంటే ఆ కాలిమువ్వల చప్పుడికి సింమాద్రి గుండె ఘల్లు ఘల్లంది.
★★★
"నువ్వు ఏమైనా అనుకో. నేను మాత్రం కల్చర్ ని మిస్ అవను.
నువ్వు చెప్పేది మన తాతల ముత్తాతల తాతలు ఆచరించిన పద్ధతుల్ని అనుసరిస్తున్న విధానాల్ని. అచ్చం అలాగే ముక్కుమూసుకుని జపం చేయమని.
అబ్బా! అబ్బబ్బబ్బా! నాకు తెలుసు.
నువ్వు గొంతు విప్పకు. విని విని విసిగిపోతున్న!" అరుస్తున్నాడు ప్రాంజల్.
విస్తుపోతూ వింటోంది.
"అసలు నీ సమస్య ఏమిటి ధృతి?
పొద్దున్నే లేచి 'ఆహా ఓహో' అనుకుంటూ తోటలో ప్రకృతి చూడటం, ఆ తర్వాత రోజు ఇల్లు పరిశుభ్రంగా ఉందో లేదో పరికించి, పరిశీలించి చూడడం... అప్పుడు అభ్యంగన స్నానం చేసి తూర్పు తిరిగి దండం పెట్టడం. మంచినీళ్ళు తాగామోలేదో అడగడం, ఆకలి వేయకపోయినా పలహారములు అంటూ ఒక హారం... ఒక ఫలం... ఆ తర్వాత కంపెనీకి పోయి మధ్యాహ్నం నువ్వు పెట్టిన లంచ్ బాక్స్ ని తీసి రొటీన్ వంటలు తినడం, కంపెనీ నుంచి బుద్ధిగా నువ్వు చెప్పినట్టు ఇంటికొచ్చి పిల్లలిద్దరికీ కూడికలు, తీసివేతలు, ఇంటూలు, బాగా హారాలు చెప్పడం. కాసిన్ని ఇంగ్లీష్ ముక్కలు పేలడం, తెలుగు భాష మాట్లాడమని బతిమాలడం ఇవేగా?
ఆగు! అడ్డు రాకు!
రాత్రివేళ ఇంత తిని నిద్రపోవడం, రోజూ...రోజూ... ఇంతేగా? ఇదేగా? నా మొహం మీద రాసిపెట్టి ఉంది.
నువ్వేం చెప్పకు. నేనేమివినను. ధృతీ! నీ గొంతు విని విని విని చెవులు చిల్లులు పడి పోతున్నాయి!" ఆవేశంగా అని ఎగ ఊపిరి పీలుస్తూ, చేతులు తిప్పేస్తూ, కళ్ళెర్ర చేస్తూ మనసులో ఉన్నదంతా కక్కేసాడు ప్రాంజల్.
అతనిలోని ఈ కొత్త కోణాన్ని ధృతి విస్తుపోయి చూస్తోంది.
ఆమెకి మతి మతి లో లేదు. ఏం జరుగుతోందో తెలియడం లేదు.
ఈలోగా అ వాచ్మెన్ కొడుకు తొమ్మిదేళ్ళ రాజు చప్పట్లు కొట్టుకుంటూ అరుస్తున్నాడు.
దానితో ఆ సంభాషణ కి ఫుల్ స్టాప్ పడింది.
"ఓహో హోయ్ హోయ్! అను లేఖ మామ్, మనోహర్ బాబు వచ్చారోచ్!" అంటూ పాట పాడేస్తున్నాడు.
వాడు అనులేఖ వస్తోందని తెలిస్తేనే ఆ ఇంట్లోకి ఎంట్రన్స్ ఇస్తాడు. చాకు లా సర్రు మనే... పరుగులాంటి వాడు.
వాడికి లాభం లేని పని ఒక్కటి కూడా చెయ్యడు. అను లేఖ ఏం చెప్తే అదే చేస్తాడు.
వాడు రాజకుమారి కి అనుంగు చెలికత్తె లాంటి వాడు. చిటికేస్తే చిందు లేస్తాడు. అనులేఖ ఇచ్చే గిఫ్ట్ లు వాడికి లోకంలో అనూహ్యమైన అదృష్టాలు.
తెల్లగా చూడముచ్చటగా అనులేఖ ఇచ్చిన మంచి మంచి డ్రస్సులు వేసుకుని ఎప్పటి ఫ్యాషన్ ని అప్పుడు తెలుసుకుని అలాంటి క్రాఫ్ తో నీట్ గా వచ్చి సెల్యూట్ పెట్టి అటెన్షన్ లో నిలబడి ఉంటాడు. అనులేఖ వాడి హడావుడి చూసి సంతోషంగా నవ్వుతూ లోపలికి వచ్చింది.
మనోహర్ సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు.
"ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది ఏంట్రా?" అడిగింది అనులేఖ రాజుని.
"పెద్దలంతా పనులమీద, పిల్లలంతా స్కూలుకి వెళ్ళిపోయి ఉంటారండి!" అన్నాడు రాజు.
టైం చూసుకుంది. ఉదయం తొమ్మిది.
ప్రాంజల్ బయటికి వచ్చి చెల్లిని దగ్గరగా తీసుకుని-
"ఎలా ఉంది టూర్?" అన్నాడు.
"ఫెంటాస్టిక్ అన్నయ్య! కంపెనీ కి వెళ్తున్నట్టున్నావ్. వెళ్ళిరా. సాయంత్రం కబుర్లు చెప్పుకుందాం. త్వరగా వచ్చేస్తావుగా? అడిగింది.
"లేదమ్మా! ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. రేపు పొద్దున్న కబుర్లు చెప్పుకుందాం!" అన్నాడు.
ధృతి అనులేఖ కి కాఫీ తెచ్చి ఇచ్చి మనోహర్ కోసం రెండో కప్పు పట్టుకుని నిల్చుంది.
"ఓ మనోహర్ కోసమా? వచ్చేస్తారు వదినా...”అని, 'మనో' అని కేకేసింది.
టక్కున మనోహర్ వచ్చాడు.
ధృతి వైపు చూసి నవ్వి కాఫీ కప్పు అందుకుంటూ ప్రాంజల్ వైపు చూసి పలకరింపుగా నవ్వాడు.
ప్రాంజల్ చేయూపి వెళ్ళిపోయాడు.
అనులేఖ కాఫీ తాగుతూ రాజు భుజం మీద చెయ్యేసి ఫ్రంట్ బాల్కనీ వైపు వెళ్తుంటే... మనోహర్ కాఫీ కప్పుతో తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
ధృతిమొహంలో తెచ్చిపెట్టుకున్న నవ్వు మాయమై అయోమయంలో పడిపోయి ఆలోచనల్లో మునిగిపోయింది.
"ఏరా ఏంటి సంగతులు? రాజు భుజం మీద చెయ్యివేసి అడిగింది అనులేఖ.
ఆ చెయ్యి మరింత భుజాలమీదకి లాక్కుని
"ఇప్పుడే కదండీ ఆరంభం?" అన్నాడు.
ఫక్కున నవ్వింది అనులేఖ.
"అవును అవును. బాగా చదువుతున్నావా?"అడిగింది.
"బ్రహ్మాండంగా ఇప్పుడే కదా ఫిఫ్త్ క్లాస్ లోకి వచ్చింది. మార్కులు అన్నీ నావే! పాఠం మొత్తం బట్టీ కొట్టి పారేస్తా. అప్పుడు కదా ఆన్సర్లు రాయడం ఈజీ అని మీరు చెప్పారు. ఎంత చదివితే అంత చదవమని అన్ని ఫీజులు కడుతున్నారు కూడా కదా?
నేను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి గాని చదువులో వెనకబడటం ఏమిటండి?
రాజు కొడుకు రాజు, వాచ్మెన్ కొడుకు వాచ్మేను అవడని మీరే నా భుజం తట్టి ప్రోత్సహించారు.
నేను మీ దయవల్ల బాగా ఎదుగుతాను అండి. చదువులో నా చూపు అర్జునుడి చేతిలో బాణం లాంటిదండి. గురిచూసి కొట్టేయడమే చేపని!" అన్నాడు రాజు.
ఆ వాగ్ధాటికి మురిసిపోతోంది అనులేఖ.
"భేష్ బేటా! నువ్వు నువ్వు నా కుడి భుజానివి. మామూలుగా ఉదాహరణకు రాజునే తీసుకో. రాజుకో మంత్రి. రాణినే తీసుకో. రాణికో చెలికత్తె. మంత్రిని తీసుకో. మంత్రి కో గూఢచారి. గూఢచారి ని తీసుకో. వాడికో బంటు. బంటునే తీసుకో. వాడికో అసిస్టెంట్. అసిస్టెంట్ ని తీసుకో. వాడికో బుర్రని వాడే భార్య.
ఇదే సైకిల్. ఆడదే జగతికి ఆధారం.
ఇదే చరిత్ర ఒక్కటి మారదు.
లేకపోతే రాజ్యాలెలా నడుస్తాయి?
దేశాలు ఎలాఎదుగుతాయి?
అందుకే పాత వాటిని మనం పూజించాలి.
లేకపోతే మనం ముందుకు పోలేము!" అంది. అది విని వాడు మొహం వెలిగిపోయే ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. కాళ్ళతో సెల్సా డాన్స్ చేసాడు. కానీ భుజం మీద ఆమె చెయ్యిని మాత్రం విడవలేదు.
“మీరు ఇంతింత గొప్ప గొప్పవి చెప్తారు గాని ఒక్కటి మర్చిపోయారు అండి!" అన్నాడు.
"అదేంటో చెప్పు చెప్పు!” కుతూహలంగా అడిగింది.
"మరి కోప్పడకూడదు బాబు!" అన్నాడు.
నీ మీద కోపమా? నీకు నా దగ్గర ఫుల్ రైట్స్. చెప్పేహే!"అని దీర్ఘం తీసింది.
"నేను కుడి భుజం అయితే నీ ఎడమ వైపు ఏం ఉంటుంది?" అడిగాడు.
"ఏంటి రా?" వాడి వైపు అభిమానంగా చూస్తూ అడిగింది.
"పొండి మామ్ గారు! ఎడం పక్క ఉండేది మీ గుండెకాయ. అంటే మనోహర్ బాబు. అది కొట్టుకుంటూ ఉంటే కదా నా భుజం మీద ఉన్న కుడి చెయ్యి పని చేసేది!" అన్నాడు ఇంకా బిగిస్తూ.
చెయ్యి లాక్కుని చప్పట్లు కొట్టింది అనులేఖ.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|