Menu Close
Bulusu-Sarojini-Devi
గోపురం(ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

ఉదయం ఏడున్నర గంటలు.

కిటికీ లోనుంచి చల్లని గాలులు నెమ్మదిగా హాయి గొలిపేలా వీస్తున్నాయి.

ప్రాంజల్ నైట్ సూట్ లోనే హాల్లోకి వచ్చాడు.

ప్రతి రోజూ అయితే ఎనిమిదిన్నర దాటుతుండగా కంపెనీకి వెళ్ళడానికి రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేవాడు.

భార్య ధృతి పెట్టిన టిఫిన్ చిరునవ్వుతో తినేవాడు. ఈ రోజు అతడి మొహంలో నవ్వులేదు.

నిన్న రాత్రి ఒక విషయం చెప్పి ధృతి కి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఇప్పుడూ అది చెప్పేందుకే వచ్చాడని అర్థం అవుతోంది.

ధృతి తన రొటీన్ వర్క్ చేసుకుపోతోంది.

పిల్లలు ఎనిమిది గంటలకి స్కూల్ కి వెళ్తారు. ఏడేళ్ళ జాజి పదేళ్ళ సౌమిత్ కంటే నయం. సౌమిత్ లా ఇది తినను, అది నాకొద్దు అనదు. అందుకే సౌమిత్ ఫుడ్ విషయంలో ఎక్కువ అటెన్షన్ చూపించాలి.

ప్రాంజల్ ధృతి వేపు సూటిగా కళ్ళార్పకుండా చూడడం గమనించింది.

పెళ్లైన పన్నెండు సంవత్సరాల్లో భర్తలో ఇంత మొండితనం చూసి ఎరుగదు. అదేమిటో కొత్తగా కనిపిస్తున్నాడు. చేస్తున్న పని పూర్తి చేసి భర్తకి కాఫీ తెచ్చి ఇచ్చింది. అందుకుని ఒక్కో సిప్ నెమ్మదిగా తాగుతూ అసలు విషయానికి ఎలా వద్దామా? అని ఆలోచిస్తున్నాడు ప్రాంజల్.

ధృతి మౌనంగా కిటికీ బయట నుంచి కనిపించే ప్రకృతి అందాలు చూస్తోంది.

ఒక పిట్ట ఓంకారం చేస్తూ ఎగిరిపోయింది. ఇంకోటి దాని వెనుక తుర్రుమంది. పెరట్లో అయిదు నెలల క్రితం కొత్తగా వచ్చిన తోటమాలి సింహాద్రి తోటలో కనులకింపుగా ఒక లైన్ ఏర్పాటు చేసుకుని వాటిమధ్య తిరుగుతున్నాడు.

తెల్లవారుజామునే నీరు పోసినట్టు ఉన్నాడు. తడికి బరువెక్కి కూరగాయల మొక్కలు అన్నీ నిండుగా ఉన్నాయి. రంగురంగుల పూలన్నీ కంటికి ఇంపైన సొగసులతో తలలు ఊపుతున్నాయి. పుష్య మాసం. చలిగాలులు వీస్తూనే ఉన్నాయి.

ఒక సూర్య కిరణం ముందుగా దూసుకొచ్చింది. ఆ వెలుగు పచ్చని తోటంతా పరుచుకుంది. ఒక చిరునవ్వు పరవశంతో అప్రయత్నంగా వచ్చి చేరింది.

ధృతి మొహంలోని ప్రశాంతత చూసి ఇదే సరి అయిన సమయం అనుకుని ప్రాంజల్ గొంతు సవరించుకుని గానే ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చి పడింది.

ఎదురుగా తన మొహంలోకే చూస్తున్న భర్త.

"ఏమంటావ్?" అడిగాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో.

ధృతి మొహంలో నవ్వు మాయమైపోయింది.

రాత్రి చెప్పిన మాటే!

ఈరోజు నొక్కి మరీ చెప్తున్నాడు. మౌనంగా ఉండక తప్పలేదు ధృతి కి.

ఆఫీస్ కి వెళ్లబోయే ముందు భర్త మూడ్ పాడు చేయడం ఏమాత్రం ఇష్టం లేదామెకి.

ఉద్యోగం బాధ్యతగా నిర్వర్తించాలి. అదేం ఆట కాదు. ఎంతో డబ్బుని వెచ్చించి ఒక కంపెనీ పెట్టారంటే తమ ఎదుగుదల కోసం ఉద్యోగస్తులు ఎన్నుకునే ప్రక్రియలో ఒక రాత పరీక్ష పెట్టి అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంత అంకితభావంతో పని చేయగలరో పరీక్షిస్తారు.

ఆయా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు అని పరిశీలించి మాటల్లో వారివారి తెలివితేటల్ని అంచనావేసి సెలెక్ట్ చేసుకుంటారు.

ప్రాంజల్ ది అతడు పనిచేసే కంపెనీలో చక్కని హోదా గల ఉద్యోగం. అలా సెలెక్ట్ అయ్యాడంటే అది అతని ప్రతిభకి నిదర్శనం.

ఇల్లు అన్న తరువాత వాదోపవాదాలు, సంఘర్షణలు సహజం. ఆ ప్రభావం ఉద్యోగం మీద పడితే అతడికి బ్యాడ్ రిమార్క్ వస్తుంది. భార్యగా అతడి ఉన్నతి గురించి ఆలోచించాలి తప్ప సమయం, సందర్భం లేకుండా మాట్లాడడం వల్ల నష్టం జరుగుతుంది. అది ఆలోచించే మౌనం వహించింది.

కానీ ప్రాంజల్ కి ఆ మౌనం ఇరిటేటింగ్ గా ఉంది.

'అరే! పెళ్ళి నాడు అగ్ని సాక్షిగా తను చేసిన ప్రమాణానికి ఎంత విలువ ఇవ్వకపోతే ఈ రోజు ఇంత ఇదిగా బతిమాలుతాడు? అర్థం‌ చేసుకోదే?

గట్టిగా అడుగుదామంటే ఇదో ఉమ్మడి కుటుంబం. అందరూ చుట్టూ ఉంటారు. ఎవరు విన్నా తనని మరోలా అనుకుంటారు. చాదస్తులు. ఇప్పుడు బతిమాలి నచ్చ చెప్పే సమయం లేదని తనకి తెలియదా? చదువుసంధ్యలు బాగానే ఉన్నాయిగా? అనుకుంటూ ఉలిక్కిపడ్డాడు.

'ఏంటి? ఎవరువిన్నా తనని మరోలా అనుకుంటారా? ఇదేమి ఆలోచన? ఇంత పాత చింతకాయ పచ్చడి ఆలోచన తనకు ఎలా వచ్చింది? ఇవి అభ్యుదయ నిరోధకాలు. తను దీన్ని ఖండిస్తున్నాడు!’ అనుకుని నోరు విప్పాడు.

ఈ సారి అతని గొంతు ధ్వని లో ఖచ్చితత్వం, ఒక నిర్ణయం ఉన్నాయి.

"ధృతీ! నేను ముక్కు మూసుకుని ఇంక తపస్సు చేయలేను. ఇప్పటికే నేను మోడ్రన్ కల్చర్ ని చాలా మిస్ అయ్యాను. నా ఫ్రెండ్స్ ఎంతగా ముందుకి దూసుకుపోతున్నారో నీకు తెలియదు. బంధనాల సముద్రంలో ఇరుక్కుని నేను మిస్ అయిపోతున్న బ్రహ్మానందాన్ని అందిపుచ్చుకోవాలి.

అందుకే వాళ్ళందరూ గోవా వెళ్తున్నామని చెప్తూ...'వస్తావేంటి?' అని నన్ను పప్పుసుద్ద ని చూసినట్టు చూస్తూ ఆహ్వానిస్తే నేను కుంగిపోయాను. వెంటనే వస్తానని తలెత్తుకుని ధైర్యంగా చెప్పాను. నువ్వు ముక్కుతూ మూలుగుతూ అడ్డుతగలకు. నా పేరు లోనే ఉంది నిజాయితీ. అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పి వెళ్ళాలి అనుకుంటున్నాను. నువ్వు కాదనకుండా...అంటున్నాడు.

అతడి మాటలు ఇంకా పూర్తవకుండా జాజి హాల్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి-

"అమ్మా! అనసూయత్త నా జుట్టు కట్ చేసి బాబ్ చేస్తానంటోంది. అమ్మని అడగాలి అంటే... అక్కర్లేదు. నేను కట్ చేస్తే మీ అమ్మ ఏమి అనదు అంటోంది చూడు!" అంది ఇష్టం లేనట్టు మొహం పెట్టి.

అనసూయ కూడా అంతే హడావిడిగా వచ్చి-

"జుట్టు కట్ చేస్తే మనకి పని తగ్గుతుంది. వాళ్ళకీ హాయి. మరీ చాదస్తం కాకపోతే జుట్టు బారెడు ఉన్నంత మాత్రాన పద్ధతిగా పెరుగుతారని గ్యారంటీ ఏమిటి? కాలంతో పాటు మనము మారాలి మరదలా!” అంది ధృతి మొహం లోకి చూస్తూ.

అంతే!

సందు దొరికింది ప్రాంజల్ కి.

"నేను అదే చెప్తున్నా. కాలంతోపాటే వచ్చే చేంజెస్ ని మనమూ అంగీకరించాలీ అని. అబ్బే! ఈవిడ మారదు. మనని మారనివ్వదు. చెవిటి వాడి చెవిలో శంఖం!” అన్నాడు. చివుక్కున చూసింది ధృతి.

ఇలా ఎప్పుడూ జరగలేదు. తను ఈ ఇంటిలో అడుగుపెట్టిన రోజు నుంచి ఏ నాడూ భార్యని ఎవ్వరి దగ్గర అగౌరవపరచని ప్రాంజల్ మొదటిసారిగా నోరు జారాడు.

అప్పుడే హాల్ లోకి రాబోయిన సుందర మూర్తి ప్రాంజల్ మాట విని వెనక్కి తగ్గి వెనుతిరిగి వెళ్ళి పోబోయాడు. అది చూసిన అనసూయ-

"రారా పెద్దన్నయ్యా! ఈరోజు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి. త్వరగా వెళ్ళాలి అన్నావుగా... టిఫిన్ రెడీ గా ఉంది. తినేసి వెళ్ళు!” అంది.

సుందర మూర్తి మారు మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోతున్నప్పుడు హడావిడిగా ఎదురొచ్చింది అపర్ణ.

అది చూసి-

"ఇదొక చాదస్తం రా ప్రాంజల్! వదిన ఎదురొస్తేనే వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుందట!” అంది ఎకసెక్కెంగా.

అదోలా నవ్వాడు ప్రాంజల్.

ఈలోగా కొంపలు మునిగిపోతున్నట్టు ప్రాంజల్ రెండో అక్క సావిత్రి ఫోన్లో మాట్లాడుతూ హాల్లో నే అలజడిగా తిరగడం మొదలెట్టింది.

ఏడుపు గొంతు తో-

"అంతే లెండి. అంతే లెండి. అత్తింట్లోనూ విలువ లేదు నాకు. పుట్టింట్లోనూ నేనంటే లెక్కలేదు. అక్కకి చెల్లి మధ్య సెంటర్ దాన్ని కదా?” అని అనసూయ వేపు ఓ చూపు చూసి-

'అందరూ అనుకుంటారూ... సావిత్రి మొగుడి పేరు కరుణాకర్ అని ఎంతో గొప్ప పేరు అని.

కాని ఏమాత్రం కరుణ లేని వాడని ఎరుగరు. నేనేం అలిగి పుట్టింటికి రాలేదు. మీ అమ్మగారే నన్ను

"నీ దిక్కున్న చోట చెప్పుకో” అన్నారు. అందుకే మా పెద్దన్న దగ్గరికి వచ్చేసాను.

ఎందుకు అంటారా? ఓహో? ఆ హిస్టరీ తెలుసుకునేందుకా ఫోన్ చేసింది? ఇంకా నామీద ప్రేమ పారుతుందేమో అనుకున్న.

ఎందుకు చెప్పను?' రోట్లో తల దూర్చాక రోకటి పోటు కి వెరవడం' మా ఇంటా వంటా లేదు.

వినండి మరి.

నేను మన బట్టలు ఉతుకుదామని వాషింగ్ మిషన్ లో వేశాను. ఈలోగా నూకాలు బాత్రూం లు కడగడానికి వచ్చింది.

అత్తగారి వాష్ రూమ్ లో ఓ మూలగా లుంగలు చుట్టి ఓ చీర పడేసారు. అయ్యో! పాపం! పెద్దావిడకదా?

ఆ టైం లో ఓపిక లేకపోయిందేమో అని అదికూడా తీసుకొచ్చి అభిమానంతో మిషన్ లో వెయ్యాలనుకుని మిషన్ దగ్గర పెట్టా.

ఈలోపు మీ చెల్లి, మొగుడు 'టింగు రంగా'అంటూ మన ఇంటికి వచ్చారా? మీ చెల్లి మొగుడు ఆఫీసుకి పొబుద్ధిగాక ఇంట్లోనే ఉంటే మీ చెల్లెమ్మ గారికి కూడా వంట, వార్పు మీద బద్దకం వచ్చి, హోటల్ కూడు కి పొట్ట ఉబ్బరం చేస్తుందని మన ఇంటి కొచ్చేశారుట. సంబడం! ఈ లోగా మీ అమ్మగారు వాషింగ్ మిషన్ లో ఉన్న మన బట్టలు ఓ బకెట్లో కుమ్మరించి ఆవిడ చీరలు మిషన్ లో పడేశారుట.

నాకేం తెలుసు? నేనేమో మీ అమ్మగారి మీది ప్రేమతో, భక్తితో ఆవిడ చీరలు దాన్లో ఉన్నాయని తెలియక మంచి మనసుతో ఆ లుంగలు చుట్టి ఉన్న చీరని కూడా మిషన్ లో పడేసి ఆన్ చేసి పారేసా.

అప్పుడు ఆవిడ వాష్ రూమ్ లోకి వెళ్ళి ఆ చీర వెతుక్కుని కనపడకపోతే రంగు వెలిసి పోయే చీర మిషన్లో పడేస్తావా? అని అరిస్తే కానీ తెలియలేదు. అది రంగు వదులు తుందని. ముందే చెప్తే నేనెందుకు మిషన్ లో వేస్తాను?

గుండె ఆగినంత పనయ్యింది.

అయ్యబాబోయ్! మీవి మంచి మంచి షర్టులు, నా సిల్కు చీరలు దాన్లో నే ఉన్నాయని పరిగెత్తుకెళ్ళి చూసాను.

దాన్లో అత్తగారి చీరలే అన్ని. నేను తెగ ఆశ్చర్యపోయి చూస్తుంటే ఆవిడ చెప్పారు. మన బట్టలు బకెట్లో పడేశానని.

'అమ్మయ్య!’ అన్నాను. ఇంక చూడండి. ఒకటే తిట్లు, శాపనార్ధాలు. మిషన్ లో ఉన్న ఆరు చీరలూ ఆవిడ వేనట. నేను ముందు వెనకా చూసుకోకుండా వాషింగ్ మిషన్ తిప్పి పారేసానుట. అవిడ చీరలన్నీ రంగులంటుకుపోయి అలుగ్గుడ్డల్లా అయిపోయాయిట.

'ఉన్నదీ పోయింది. ఉంచుకున్నదీ పోయింది' అన్నట్టు అయిందట ఆవిడ బతుకు. వింటున్నారా?

ఛీ ఛీ!

మా ఇంట్లో ఇలాంటి పురాణాలు మాట్లాడరు. చిన్నప్పుడే అమ్మ పోయినా పెద్దన్నయ్య పద్ధతిగా పెంచుకు వచ్చాడు. ఉన్న ఆస్తిని రెట్టింపు చేసి మళ్ళీ దానికి రెట్టింపు చేస్తున్నాడు. ఎంతో కష్టపడి సీజనల్ బిజినెస్ ల్లో అన్నింటా విజయం సాధిస్తున్నాడు అంటే ఇలాంటి పదాలు వాడకుండా కుదురుగా ఉండబట్టే!

ఇంత పెద్ద బంగ్లా తమ్ముళ్ల కోసం చెల్లెళ్ళ బాగు కోసం కట్టించాడు అంటే మాటల్ని పొదుపుగా వాడ బట్టే!

దేవుళ్ళు కాపాడుతున్నారు అంటే మంచి మాటలు నేర్పబట్టే.

ఏంటీ? ఒకటి అడిగితే ఇంకో సొల్లు చెప్తున్నానా?

కట్టుకున్నవాడు పిశాచి అయినా సరే రాక్షస ప్రవృత్తి కలవాడు అయినా సరే చచ్చేదాకా ఉండమని శాస్త్రం చెప్తుందని అన్నయ్య అత్తారింటికి పంపే ముందు చెప్పాడు గనుక భరిస్తున్న.

ఏంటి? గట్టిగా అరవకండి. నాకేం చెవుడు లేదు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందో కావాలి. నేను అక్కర్లేదు. అంతేగా?

అత్తగారు చీరలన్ని ఎందుకూ పనికి రాకుండా పోయాయని 'ఇప్పుడు కొత్త చీరలు మీ బాబు వచ్చి కొనిస్తాడా?' అని మాటలు మీరారు. అది నా తప్పని అంటే నేను కాదని వాదించాను. ఆవిడ మితిమీరి పోయారు. నేను మీదే తప్పని కరాఖండిగా చెప్పేసా. ఆవిడ ఠక్కున 'నీ దిక్కున్న చోట చెప్పుకో!' అనేసారు.

అంత మాట సొంత కోడల్ని అనొచ్చా? అందుకే వచ్చేసా.

పద్ధతి ప్రకారం మీకు ఉత్తరం రాసి అక్కడ పెట్టాను.

ఏంటి?

దాన్లో అన్ని తప్పులు తడకలూనా? నాకు చదువు అబ్బక పోతే అది నా తప్పా?

నా ధర్మం ప్రకారం నేను రాసి వచ్చా. ఏంటి? నోర్ముయ్యా?

ఇన్ని చెప్పించుకొని, నేనేమో మీమాట జవదాటకూడదని అన్ని చెప్తే ఇలా తిడతారా? అందుకే నేను నా కొడుకుని పద్నాలుగు ఏళ్ళు వచ్చినా ఇక్కడే ఉంచి చదివించుకుంటున్న. ఆ చెత్త భాష రాదు పైగా పెద్దన్నయ్య చాలా కేర్ తీసుకుంటాడు. ఏంటీ... నోర్ముయ్యవే అనా అన్నది? నన్నే? అంత మాట అన్నది?

చూడు అనసూయ అక్కా!" అంటూ ఫోన్ పక్కన పడేసి బావురుమంది సావిత్రి.

అప్పటికే ఇంట్లో ఉన్న వాళ్ళు హాల్లోకి వచ్చి చేరారు.

నాన్ స్టాప్ గా ఏడుపు గొంతుతో మాట్లాడిన ఆ మాటలు విన్న అందరూ జరిగిందంతా విని పొట్ట పట్టుకుని నవ్వుతున్నారు.

ఆ ఏడుపు తెలుగు సీరియల్ లా ఆగేది కాదు గనక ప్రాంజల్ కంపెనీకి వెళ్ళేందుకు తయారవడానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

'అమ్మయ్య! ఇప్పటికి గండం గట్టెక్కింది!' అనుకుంది ధృతి.

స్కూల్ దగ్గరే కాబట్టి పిల్లల్ని దింపడానికి కిచెన్ లో నుంచి హాల్లోకి వచ్చిన సంపంగి తోటమాలి సింహాద్రి తోటలో కూరగాయలు తెంపి పట్టుకుని రావడం చూసి ఒక్క సైగ తో తో మాట్లాడొద్దని ఆపింది.

వాడు సంపంగి ని మా గొప్పగా లవ్ ఆడేస్తున్నాడు గనుక వెనక్కి తగ్గి సంగతేమిటని కనుబొమ్మలు ఎగరేశాడు.

'తర్వాత చెప్తాను' అని మళ్ళీసైగ చేసి పొమ్మంది.

అనసూయ సావిత్రి ని ఓదారుస్తూ ఉంటే, పిల్లల్ని స్కూలుకి దింపడానికి సంపంగి వెళ్ళడం చూసి ధృతి కూడా గేటు దాకా వెళ్ళి పిల్లలతో బాగా చదువుకోవాలని, స్కూల్లో టీచర్ చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విని ఇంటికి వచ్చాక తనకి అంతా చెప్పాలని వీధి గేటుకి ఆనుకుని హెచ్చరిస్తోంది. ఈలోగా ఒక్క పరుగులో వాచ్ మెన్ గేట్లు రెండూ బార్లా తెరిచాడు. ప్రాంజల్ కారు ఆమె పక్కనుంచి సర్రున దూసుకుపోయింది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in August 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *