అందుగలవు ఇందుగలవు
ఎందెందు చూసిన అందందే
సమాచార కలియుగ ఆకాశవాణై అగుపించే
గూగుల్ తల్లి నీకు వందనం...
నువ్వే టీచర్ నువ్వే డాక్టర్
నువ్వే యాక్టర్ నువ్వే లాయర్
నువ్వే విలేకర్ నువ్వే జోకర్
నువ్వే లాకర్ నువ్వే డిక్టేటర్
నువ్వే పార్మర్ నువ్వే ఇంజనీర్
నువ్వే సర్వర్ నువ్వే సర్దార్
ప్రతి పాత్ర పరిధిని పరిజ్ఞానాన్ని పరిణతిని
ఆన్లైన్ పళ్ళెంలో అందించే
గూగుల్ తల్లి నీకు వందనం...
అరచేతిలో వైకుంఠం చూపిస్తూ
ఆశ్చర్య అవసర ఆనంద అభివృద్ధి బీజాలను
సమాజానికి అందించే టెక్నాలజీ మహిమైన
గూగుల్ తల్లి నీకు వందనం...
నవ్వుకు నవ్వై
ఆశ్చర్యమునకు ఆశ్చర్యమై
బాధకు బాధై
బోధకు గురువై
నవరసాల భావ సముద్రమై
నట్టింట్లో ప్రపంచ నడకను తెలిపే
గూగుల్ తల్లి నీకు వందనం...
నీవే తల్లివి
నీవే తండ్రివి
నీవే గురువువి
నీవే గూగుల్ తల్లివి
సకల గుణాల గుణాకారాలను
అక్షరాల్లో అందించే సమాచార సంజీవని
గూగుల్ తల్లి నీకు వందనం...
మనిషి చుట్టూ తిరిగే మనసు గ్రహమును
నీ చుట్టూ చక్కర్లు కొట్టిస్తున్న
నేలమీది సూర్యగోళమైన
గూగుల్ తల్లి నీకు వందనం...
పురిటినొప్పులు పడకుండా...
చనుబాలు ఇవ్వకుండా...
సమాచారమిస్తూ ప్రపంచానికి తల్లిగా నిలిచిన
గూగుల్ తల్లి... నీకు వందనం...