ఉ. |
మేడల మిద్దెలందు కడు మేలిమిపూతల వన్నెకెక్కి నీ
తోడుగ ద్వారజాల(1)పటతోరణశిల్పకళాప్రపంచమున్
వేడుక సంతరించుకొని విందువు కందువు మానవాళి కా
పాడెద వన్నివేళల కృపారహితుల్ నిను చీదరించినన్
(1) కిటికీ
|
ఉ. |
పేడయినన్ గ్రహించెదవు పేదలవాడల పూరిపాకలన్
వీడక వారి క్షేమమును నీవిధి చూచెడివారు లేరుగా
నీడ నొసంగి గ్రీష్మమున నీ వొనరించు సపర్యనొంది నిన్
జూడక పంచితిల్లెదరు(1) చూడుమ మానవజాతి(2)సంస్కృతిన్
(1) మూత్రవిసర్జన చేసెదరు (2) మానవజాతి, మా నవజాతి
|
ఆ.వె. |
సాకుదొరకి నంత సామగ్రి చేపట్టి
తోచి నట్లు మేను తొలిచి తొలిచి
మేకులెల్ల దింపి మిక్కిలిభారంబు
వైచి సంతసించు వైన మరసి
|
ఉ. |
పాడయినన్ శతాబ్దముల పాతకథల్ వినిపించి కాలమే
తోడయి కూలునందనుక దొడ్డధనంబులు దాచిపెట్టి నీ
ప్రోడతనంబు(1) చాటెదవు మూర్ఖులు వ్రాసిన పిచ్చివ్రాతలన్
కూడ భరింతు వోరుపునకున్ నిను పోలినవారు లే రిలన్
|
|
(1) ఇండ్ల మట్టి గోడలలో బంగారం దాచి పెట్టి కట్టేవారు. దీన్ని తెలిసి కూడా పరులకు తెలియనివ్వకపోవడమే గోడ యొక్క ప్రోడతనము
|