Menu Close
Galpika-pagetitle
ఉప్పలమ్మ గద్దె -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

“*అల్లాహొ* అక్బరల్లాహ్” అంటూ పెద్ద మసీదులో అజా మొదలవ్వగానే ఉప్పలమ్మకి మెలకువ వచ్చేస్తుంది. అష్టకష్టాలూ పడి రెండు చేతుల్నీ దగ్గరకి చేర్చి కళ్ళు తెరుస్తుంది. ఆ చేతుల్లో ఒకప్పుడు చాలాకాలం పైసలమ్మ కనిపించేది. ఆ తరవాత చదువులమ్మ కనిపించేది. ఇప్పుడు రెండు చేతుల్లోనూ ఒకటే కనిపిస్తుంది. అదే గద్దె. ఆ చేతుల్ని మెల్లగా పక్కలకి దింపుతూంటే ఆ చేతుల మధ్యలోంచీ చుక్కలు తొంగి చూస్తూంటాయి. ఎడం పక్క చందమామ కనిపిస్తూంటాడు. ఆ చుక్కలూ చందమామా దిశలు మార్చుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కడికీ కదలవు. నాలుగైదు మబ్బుతునకలుంటాయిగానీ అవి మబ్బుల్లా కాకుండా దూది పింజల్లాగో ఏకుల్లాగో ఉంటాయి. ఆ మబ్బులు నీళ్ళుతాగడానికి ఎక్కడకీ వెళ్ళవు. అవి నీళ్ళు తాగడానికి వెళ్ళకపోతే వాటికి చల్లగాలి తగిలినా వానెలా కురుస్తుంది. అందుకే ఉప్పలమ్మకి వాన పడదు. ఎండకాయదు. మంచు కురవదు. పగలూ రాత్రీ తేడా లేకుండా చలిమాత్రం చుట్టూ అలుముకునే ఉంటుంది. ఒక్కోసారి ఒళ్ళు జలదరింపజేస్తుంది. ఒక్కోసారి ఎముకల్నే కొరికిపారేస్తూ ఉంటుంది.

తనకి కనిపిస్తున్నది ఆకాశం లాంటిదేగానీ ఆకాశం కాదు. ఎందుకంటే అవి తన మునిమనవడు.., అతని మునిమనవడి కోసం లోకప్పుకి అంటించిన మెరుపు కాగితాలు. అందుకే వెల్లకిలా పడుకుని పైకి చూస్తే చాలు, అంత పెద్ద ఆకాశమూ మన గదిలోకి వచ్చేస్తుంది.

సహజమైనా కృతకమైనా చంద్రుడు చంద్రుడే చుక్కలు చుక్కలే. ఆ చుక్కల్లో చంద్రుడిని మించిన అందగాడు ఈ లోకంలో తన భర్త శివయ్య తప్ప ఇంకెవరైనా ఉన్నారా? సీతారాముల దాంపత్యం కన్నా రాధాకృష్ణుల ఆరాధనకన్నా లైనా మజ్నూల అమరత్వంకన్నా గొప్పదీ అందమైనదీ ప్రేమపూరితమైనదీ ఇంకేదైనా ఉందా?

ఎందుకులేదు? అందాలన్నింటినీ మించిన అందం. భావాలన్నిటినీ మించిన అనుభావం ఒకటుంది. అదే గద్దె. పైన అంటించిన చుక్కలమధ్య చంద్రుడి స్థానంలో మెరిసిపోతూ ఉంటుంది. దాన్ని మించినది ఈ భూమిమీద మరొకటుంటుండదు. ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అది గద్దె. అంటే తన హృదయ పీఠాన్నలంకరించిన సింహాసనం. ఒక్కసారైనా దానిమీద కూర్చోకపోతే ఈ జీవితానికి అర్థం ఉండదు. అర్థం లేని జీవితానికి అంతం ఉండదు. అందుకే గద్దె కోసం అర్రులు చాస్తూ ఎదురుతెన్నులు చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకుని కూర్చుంది.

ఒకప్పుడు పైన పంఖా తిరుగుతూండేది. అది ఆలోచనల్ని సుళ్ళుతిప్పుతూ పైకి లేపేది. అవి పంఖానిదాటి పై అంతస్తుని దాటి ఆకాశంలోకెగిరి చుక్కల్ని చుట్టుముట్టేవి. ఆ చుక్కలన్నీ క్రమంగా కలలగద్దెగా రూపుదాల్చేవి. ఆ పంఖా మాయమై ఎన్నో యేళ్ళయింది. అది లేకపోతే ఝూంకారం చేస్తూ రివ్వున తిరిగే సుడిగాలి సద్దూ ఉండదు ఆలోచనల ఆహాకారాలూ ఉండవు. అవే లేకపోతే మనిషికి ప్రాణం ఉన్నా ప్రయోజనం ఉండదు.

కాలం మారిపోతోంది. ఎంతమారిందో ఎంత ఏమార్చిందో తనకి తెలియదు. కానీ ఇప్పుడు పంఖాని మరిపిస్తూ ఎక్కడినించీ వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియకుండా సద్దులేకుండా గదంతా ఆవహిస్తుంది చల్లదనం. ఆ చల్లదనం ఎంత హాయిగా ఉంటుందో అదిచ్చే నిశ్శబ్దం అంత గంభీరంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని మౌనంగా మారిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు.

ఎందుకుండదు? సృష్టిలో మౌనంకంటే కూడా ఆనందాన్నిచ్చే గద్దె ఉందిగా?

నీ గద్దె ఎక్కడుందో చెప్పు తాతమ్మా, తెచ్చి నీ కాళ్ళముందు పెడతానంటాడు హనుమంతు. తనూ చెప్పాలనే అనుకుంటుంది. తన పెదాలు కదుల్తాయిగానీ అందులోంచీ మాట మాత్రం బైటకి రాదు. దాంతో ఉప్పలమ్మ గద్దె గురించి హనుమంతుకు తెలిసే అవకాశం రాదు. ఫలితంగా ఉప్పలమ్మకి మనసైన గద్దె మనసులోనే ఉండిపోతుంది.

హనుమంతు తన మునిమనవడు. తనలాగే అతనికీ పట్టుదల జాస్తి. ఎంతైనా శివయ్య రక్తం కదా?

ఎప్పుడో అరవైయేళ్ళ క్రితం తనకి మాట పడిపోయే ముందు అన్నమాట విన్నది ఈ హనుమంతే. తన నోట్లోంచి వచ్చిన ఆ చివరి మాటే “గద్దె”. తను ఆ గద్దె కోసమే ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చుందనీ లేకపోతే దేహాన్నించీ జీవం ఎప్పుడో విముక్తిని పొంది అనంతవాయువుల్లో లీనమైపోయివుండేదనీ అతని విశ్వాసం. ఉప్పలమ్మలో కొట్టుమిట్టాడుతున్న జీవానికి శాశ్వత అమరత్వం ప్రసాదించాలన్నదే అతని జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఈమధ్యన అతనిక్కూడా దేహం బరువైపోతోంది. ఆ బరువుని దింపుకుంటేగానీ జీవానికి శాంతి ఉండదనిపిస్తోంది. దానికి శాంతి లభించాలంటే ముందు ఉప్పలమ్మని సాదరంగా సాగనంపాలి. అందుకే ఉప్పలమ్మ మనసులో ఉన్న గద్దె గురించి కనుక్కోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు.

ఒకప్పుడు పోచంపల్లిలో ఉండేది ఉప్పలమ్మ. కాబట్టీ ఉప్పలమ్మ గద్దె అక్కడే ఉండే అవకాశం ఉందని భావించాడు. అన్ని ఇళ్ళలోకీ తీసుకెళ్ళి చూపించాడు హనుమంతు. అప్పటికి హనుమంతు పాతికేళ్ళవాడు. అప్పట్లో చేతికీ మూతికీ అందని కుటుంబం వాళ్ళది. అందుకే దొరగారి గడీలు, నవాబుగారి ఖిల్లా, పంతులుగారిల్లు.., లాంటివి తప్ప తను తీసికెళ్ళగలిగిన అన్ని ఇళ్ళలోకి ఉప్పలమ్మని తీసుకెళ్ళి కుర్చీలన్నింటినీ చూపించాడు. కానీ ఫలితం దక్కలేదు.

హైదరాబాదొచ్చి మేస్త్రీగా మొదలై ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడు. స్థలాలు కొని ఇళ్ళు కట్టి అమ్మడంలాంటి దంధాలు మొదలు పెట్టాడు. క్రమంగా దశ తిరిగింది. దాంతో వాళ్ళుండే ప్రాంతానికి మకుటం లేని మహారాజుగా రూపొందాడు. ఒకప్పుడు ఎవరైతే తమని ఇంట్లోకి రానిచ్చేవారుకారో ఇప్పుడు ఆయా ఇళ్ళన్నింటికీ ప్రధాన అతిథీ ప్రత్యేక ఆహ్వానితుడూ సభాధ్యక్షుడూ హనుమంతే. అలాంటి హనుమంతు, తాతమ్మని తీసుకువస్తానంటే కాదనేదెవరు?

దొరగారి గడీలో ఓ పెద్ద సింహాసనం ఉంది. అది దొరగారి తాతముత్తాతల కాలం నాటిది. దాని కాళ్ళు సింహం కాళ్ళలా ఉంటాయి. పాదాలు పులిపంజాల్లా ఉంటాయి. దాని చేతులు జయకేతనాన్ని ఎగరవేస్తున్న ఏనుగు తొండాల్లా ఉంటాయి. వెనుక ఆనుకోవడానికి ముఖమల్ దిండ్లు. ఆ వెనుక ఎర్ర చందనపు చెక్కతో చెక్కిన నెమలి. దానికి నిజమైన నెమలి కన్నులతో కూర్చిన పింఛం. అందం సౌకర్యాలని మించిన రాజసం ఉట్టిపడుతూ చూసినవాళ్ళని ఊరిస్తూ కలల లోకాల్లో విహరింపజేస్తూ ఉంటుంది. ఎంతటివారికైనా ఆ సింహాసనంలో ఒక్కసారి కూర్చుంటే చాలు జన్మధన్యమైపోతుందనే కోరిక కలగడం సహజం. బహుశా ఉప్పలమ్మ కలవరించే గద్దె అదేనేమో.

తాతమ్మని తీసికెళ్ళి ఆ సింహాసనంలో కూర్చోబెట్టాలనుకున్నాడు. కానీ తాతమ్మ కదిలే పరిస్థితిలో లేదు. కొండ మనదగ్గరకి రానప్పుడు మనమే కొండదగ్గరకి వెళ్ళాలి. అందుకే తాతమ్మకోసం ఆ సింహాసనాన్నే కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాడు. ఓ మంచిరోజున మంగళస్నానాలు చేయించి ఉప్పలమ్మని అందులో కూర్చోబెట్టాడు. ఆమె ముఖంలో ఆనందం కనిపించింది. కానీ అది సింహాసనంలో కూర్చోవడం వల్ల కలిగిన ఆనందం కాదు. తన కోరిక తీర్చడం కోసం తన మనవడు పడుతున్న తపనని చూడ్డం వల్ల కలిగిన ఆనందం. అంటే పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందన్నమాట.

సమ్మక్క సారక్క జాతరకి ఎక్కే గద్దెల్ని చూడాలనేది తాతమ్మ కోరికేమోనని అక్కడికి తీసికెళ్ళాడు. ఆ జాతర్ని చూసి తాతమ్మ ముఖంలో సంతోషమే తప్ప వెలుగెక్కడా కనపడలేదు. ఎక్కడైనా బోనాల పండగ జరుగుతోందన్నా, బతుకమ్మలాడుతున్నారన్నా అక్కడికి తీసికెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఉప్పలమ్మ ముఖంలోనే తప్ప కళ్ళల్లో ఏమాత్రం నవ్వు కనిపించేది కాదు.

ఉప్పలమ్మని సంతోషంగా సాగనంపడం కోసం హనుమంతు చెయ్యని ప్రయత్నాల్లేవు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఉప్పలమ్మని నెలకోసారైనా పోచంపల్లి తీసుకెళ్ళేవాడు. అక్కడ ఉన్నంతసేపూ ఏదో ఒకవైపునుండి మగ్గాల చప్పుళ్ళు వినిపిస్తాయి. ఆ చప్పుళ్ళని సుప్రభాతం విన్నంత శ్రద్ధగా వినేది. కానీ ముఖం మాత్రం వికసించేది కాదు.

ఒకసారి పాతబడి వెనుకవైపుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా ఉప్పలమ్మ ముఖంలో ఏదో దివ్యకాంతి కనిపించింది. అంటే ఆ ప్రాంతాల్లోనే ఎక్కడో ఉందన్నమాట ఉప్పలమ్మ గద్దె. అందుకే తన చలవ బండిని వెనక్కి తిప్పి తీసుకొని వచ్చి పాతబడి ముందు నిలిపాడు. తనకి ఊహ తెలిసినప్పటినుండీ ఆ బడి అలా తుప్పు పట్టిన తాళంతోనే ఉంది. కాస్త గట్టిగా లాగితే ఊడిపడిపోయేలా ఉంది. తన పరపతి ఉపయోగించి అప్పటికప్పుడే బడితాళం తీయించాడు. కిందంతా అరడుగు మందాన పేరుకుపోయిన దుమ్ము, పైనంతాబూజు. చుట్టూ భరించలేని దుర్గంధం. నానమ్మని సాగనంపడానికి గద్దె కోసం వెతకాల్సిన పని లేదు. లోపలకి తీసుకొస్తే చాలు. ఆ కంపుకే పంచ ప్రాణాలూ అనంతవాయువుల్లోకి పారిపోతాయి.

లోపల శుభ్రం చేయించి వెనక గది తలుపు తెరిచి చూస్తే దాన్నిండా కాళ్ళూ చేతులూ విరిగి పోయిన కుర్చీలు, బల్లలు, మేజాలు, పెట్టెలు, భోషాణాలు అడ్డదిడ్డంగా పడున్నాయి. వాటిల్లోనే ఉప్పలమ్మ గద్దె కూడా ఉండుంటుంది. అందుకే అన్నింటినీ జాగ్రత్తగా బైట పెట్టించాడు.

చలవ బండి వెనక వైపున పడకమీద ఉన్న ఉప్పలమ్మ ముఖంలో అనిర్వచనీయమైన ఆనందంతో కూడిన వెలుగు. దాన్ని చూడగానే ఉప్పలమ్మ గద్దె కూడా ఆ కుర్చీల్లోనే ఉండివుంటుందనే నమ్మకం కలిగింది. కానీ ఎంత శుభ్రం చేసినా ఇంకా దుమ్మ వాసనా ముక్కువాసనా పూర్తిగా పోలేదు. అలాంటి కంపులోంచీ ప్రాణవాయువుని పీల్చుకోవడం ఆవిడకి కష్టం అవుతుంది. అందుకే ఆమె ముఖానికి ఆమ్లజని తొడుగుని పెట్టి దానితాలూకూ సరంజామాతో సహా జాగ్రత్తగా కిందికి దింపించాడు.

కిందికి దింపగానే ఉప్పలమ్మ ముఖంలోని వెలుగు నాలుగింతలైంది.

అక్కడున్న కుర్చీల్లో ఒకదానికి ఒక చెయ్యీ ఒక కాలూ విరిగిపోయి ఉన్నాయి. దాన్ని చూడగానే ఉప్పలమ్మకి ప్రాణం లేచివచ్చినట్లైంది. దానిని దగ్గరకి తీసుకురమ్మన్నట్లుగా సైగ చేసింది. దాన్ని తీసుకొచ్చి పడక పక్కనే నిలబెట్టారు. దానికి మూడు కాళ్ళే ఉన్నాయి. నాలుగో కాలు స్థానంలో వేరే కుర్చీ కాలుని తెచ్చి నిలబెట్టారు. తన చేతిని ఆ కుర్చీవైపు చాచే ప్రయత్నం చేస్తోంది ఉప్పలమ్మ. దాన్ని గమనించిన హనుమంతు ఆమె చేతిని కుర్చీకి తగిలించాడు హనుమంతు.

అంతే.., ఒక్కసారిగా లేచి నిలబడింది ఉప్పలమ్మ. అడ్డం వచ్చిన ఆమ్లజని తొడుగునీ దాని గొట్టాల్నీ లాగి పారేసింది. తనంత తానే కుర్చీలోకూర్చుంది. అక్కడున్న అందరూ చేష్టలు దక్కి అబ్బురంగా చూస్తున్నారు.

అంతవరకూ చలనం లేకుండా పడివున్న తాతమ్మలో ఒక్కసారిగా ఇంతటి చైతన్యం, ఇంతటి శక్తి, ఇంత ఉత్తేజం ఎక్కడనించీ వచ్చాయో? ఎలా వచ్చాయో? అర్థం కాక అయోమయంతో కూడిన ఆనందంతో చూస్తున్నాడు హనుమంతు. ఎనభైయేళ్ళ జీవితంలో ఎన్నో విచిత్రాల్ని చూశాడు. మరెన్నో అద్భుతాల గురించి విన్నాడు. కానీ ఇది మాత్రం విస్మయాలన్నింటినీ మించిన విస్మయం. ఆశ్చర్యాలన్నింటినీ మించిన ఆశ్చర్యం. ఉప్పలమ్మ మాట్లాడుతోందిగానీ విస్మయానందంలో తేలాడుతున్న హనుమంతుకు మాత్రం ఏదీ అర్థం కావడం లేదు.

“నాయనా, హనుమంతూ, ఇది మామూలు గద్దె కాదు. ఎంతోమంది గొప్పగొప్ప మహానుభావులు కూర్చున్న గద్దె. దీనిమీద కూర్చుని అలీఫ్ బే తా థా లూ, ఓనమాలూ చెప్పని పంతులు పంతులే కాదు. ఇది గాంధీతాత కూర్చున్న గద్దె. గాంధీ తాత దగ్గర బహుమతిగా కోరి తెచ్చుకున్నారు బాబాజీ. సబర్మతి నుండి పోచంపల్లిదాకా సాగిన దీని ప్రయాణంలో దీనిని దర్శించుకుని తరించినవాళ్ళు లెక్కలేనంతమంది. ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులనీ, శాంతి దూతలనీ, మహా జ్ఞానులనీ, పండితులనీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీర్చిదిద్దిన ఘన చరిత్ర కలిగినదీ గద్దె. దీనిమీద కూర్చుని చేస్తేనే ఆలోచన. దీనిమీద కూర్చుని రాస్తేనే పుస్తకం. దీనిమీద కూర్చుని చెబితేనే పాఠం. ఇంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని పంచిన గద్దె ఈ లోకంలో ఇంకెక్కడా ఉండదు”

ఉప్పలమ్మ తనతో మాట్లాడుతోందో.., తనలో తను మాట్లాడుకుంటోందో తెలియడం లేదు.

తెలిసిందొక్కటే. తాతమ్మ ఓ అద్భుతం. అరవైయేళ్ళ క్రితం.., అరవైయేళ్ళ వయసులో స్పృహ కోల్పోయింది.

నూట ఇరవైయేళ్ళ తాతమ్మ తనకంటే చలాకీగా ఉత్సాహంగా బలంగా ధైర్యంగా తెలివిగా మాట్లాడుతోంది. చిన్నప్పటి యాస కాకుండా బడిలో చదువులు చెప్పే పంతుళ్ళ భాష మాట్లాడుతొంది. అదీ ఈనాటి పంతుళ్ళకంటే వెయ్యిరెట్లు స్పష్టంగా తన భావాల్ని వ్యక్తీకరిస్తోంది.. ముందీ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలి. అందుకే స్పర్శవాణిలో తమ కుటుంబ వాప్యస్థలి బృందాన్ని స్పర్శించాడు. అది తెరుచుకోగానే అందులో తాతమ్మ ఛాయాచిత్రాన్ని పెట్టాడు. ఆవిడ మాట్లాడుతున్న దృశ్యాన్ని కూడా చిత్రీకరించి అందులో పెట్టాడు. చివరిగా తాతమ్మని చూడటానికి అందర్నీ రమ్మని ఆహ్వానించాడు.

%%%%

అదే పాతబడి. అదే పాత కుర్చీ. కానీ తాతమ్మ మాత్రం ఆనాటి ఉప్పలమ్మ కాదు. గురువులకే గురువుగా మారిపోయిన మహితాత్మురాలు. ఆవిడ పాతబడిలో ఏర్పాటు చేసిన సమావేశానికి దేశ విదేశాలనించీ వచ్చిన కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. పాతకుర్చీలో కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టింది, “ఈ రోజు దినపత్రికలో ప్రధానంగా ఒక వార్త నన్ను ఆకర్షించింది. ఒకమ్మాయి, మరుగుదొడ్డి లేని ఇంట్లో పెళ్ళి చేసుకోనంది. అంతే కాదు, తన ఊళ్ళో అందరి ఇళ్ళకీ మరుగుదొడ్లని కట్టించడానికి సహకరించింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని కట్టించడమే తన జీవిత ధ్యేయంగా పనిచెయ్యడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయిని నవ చైతన్యానికి ప్రతీకగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది. సరిగ్గా అరవైయేళ్ళ క్రితం మన ఊళ్ళో బాబాజీ ప్రోత్సాహంతో మేమంతా చేసిన పని అదే. అప్పుడు మేము చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మాయి జాతీయ పురస్కారం అందుకుంది. అంటే అప్పటినుండీ ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అర్థమౌతోంది. అంటే ఈ అరవైయేళ్ళ కాలంలో మీరు సాధించిన అభివృద్ధి శూన్యం అని అర్థమౌతోంది. అప్పట్లో మేము శ్రీమంతులందరి ఇళ్ళకీ తిరిగి వాళ్ళని బతిమాలీ బామాలీ కాళ్ళూ గెడ్డాలూ పట్టుకుని ఇప్పించిన భూముల్ని సాగు చేసుకుని బతుకుతున్నవాళ్ళెందరు? మన హనుమంతు మిమ్మల్ని చదివిండానికీ, తను స్థిరపడ్డానికీ అమ్మిన స్థలం ఎవరిది? ఆ స్థలాన్ని అమ్మిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి చదువుకున్నదెవరు? ఆ చదువు సంపాదించిపెట్టిన ఉద్యోగాలతో ఊడిగం చేస్తూ మీరు సంపాదించి పెడుతున్నదెవరికి? ఆలోచించండి. అర్థం చేసుకోండి. ఇకనైనా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి కలిసి రండి..,

ఉప్పలమ్మ చెబుతూనే ఉంది.

కొందరు వింటున్నారు. కొందరు ఆవిడ ప్రసంగాన్ని చిత్రీకరించి స్పర్శవాణుల్లో అందరికీ పంచుతున్నారు. కొందరు ప్రసంగ పాఠాన్ని పత్రికలకి పంపడానికి చిత్తు ప్రతిని తయారు చేసుకుంటున్నారు..,

ఉప్పలమ్మ చెబుతూనే ఉంది, “నేను ఊరుకోను. మీ పంటికింద రాయినౌతాను. మీ కంట్లో నలుసునౌతాను. మీ చెవుల్లో జోరీగనౌతాను. మీ మనసుల్లో అలజడినౌతాను. మీ జీవితంలో అశాంతినౌతాను. చివరికి మీ చేతుల్లో ఆయుధాన్నౌతాను.., .., .., గ్రామ స్వరాజ్యాన్నౌతాను.. ఊళ్ళన్నీ స్వయం సమృద్ధం అయ్యేంత వరకూ నేను  చావను. మిమ్మల్నీ చావనివ్వను… … …

ఆ 'ధు''నికత -- కాసాల గౌరి

"అమ్మయ్య" ఆఖరి మెట్టు ఎక్కుతూ నిట్టూర్చింది సరిత.

"జాగ్రత్త పిన్ని" అంటూ చేయి పట్టుకున్నాడు..శరత్.

"నీ మొహం ఈ మెట్లు ఎక్కటానికి భయపడే మీ ఇంటికి ఇన్నాళ్లు రాలేదు నేను" అంది సరిత.

"నెక్స్ట్ time వచ్చేసరికి లిఫ్ట్ పెట్టించేస్తాలే" ఆప్యాయంగా భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలకి నడిపించాడు శరత్.

వేడి వేడి పొగలు కక్కే కాఫీ తెచ్చిన శరత్ తో "మీ ఆవిడ ఏదిరా అంది"

"ఫ్రెష్ గా కూరలు తెస్తాను అని వెళ్ళింది పిన్ని వచ్చేస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకో నేను స్నానం చేసి వస్తాను" అన్నాడు.

శరత్ తల్లి శారద, సరితకి తోటి కోడలు. సొంత అక్క చెల్లెలు లాగా ఉంటారు.. సరిత పెళ్లి అయ్యేనాటికి శరత్ సరిగ్గా ఏడాది పిల్లడు. సరితే వాడిని పెంచింది. వాడికి పదేళ్ళప్పుడు భర్తకు అవకాశం రావడంతో ఫారిన్ వెళ్ళిపోయింది. భర్త పోయాక మళ్ళీ ఇక్కడే ఢిల్లీలో ఒక కళాశాలలో ప్రిన్సిపాల్ గా చేరింది.

స్వశక్తి మీద పైకి వచ్చి సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు శరత్  బ్రహ్మాండంగా. తన కొత్త ఇంటికి రమ్మని ఎప్పటినుంచో అడుగుతుంటే ఇన్నాళ్లకు కుదిరింది సరితకి. సరిగ్గా అప్పుడే శారద వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్లాల్సి వచ్చింది.

"మీ అమ్మ వచ్చాక వస్తాను లేరా" అంటే శరత్ ఒప్పుకోలేదు.

"నువ్వు రామ్మా నేనున్నానుగా" అన్నాడు.

పేపర్ చూస్తున్న సరిత తలుపు దగ్గర ఏదో చప్పుడైతే తిరిగి చూసింది.

"స్కిన్ టైట్ జీన్స్, టీ షర్ట్ గాగుల్స్, భుజాల వరకు సన్నగా వేలాడుతున్న రెండు తీగల్లాంటి ఇయర్ రింగ్స్. నుదిటి మీద కనిపించీ కనిపించని స్టిక్కర్. దువ్వటం మరిచిపోయిందేమో అన్నట్టున్న తుప్ప జుట్టు... అల్ట్రా మోడర్న్ గా అమ్మాయి నిలిచింది గుమ్మంలో.

"శరత్ ఎవరో వచ్చార్రా" అనబోతున్న దల్లా

"సారీ అత్తయ్యా" అన్న పలకరింపుకి టక్కున తిరిగింది.

"మీరు వస్తున్నారు అన్నీ తాజాగా తెద్దామని కూరగాయల షాప్ కి వెళ్ళాను. ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను" అంటూ లోపలి కెళ్లి, అన్నట్టుగానే బయటకు వచ్చింది.

"ఏంటి రవళి ఈ వేషం" కొంచెం హాస్యo, మరింత మందలింపు. సరిత గొంతులో..

"ఎందుకత్తయ్యా అందరు నన్ను అలాగే అంటారు. కాస్త ఫ్యాషన్గా ఉండటం తప్పా.. ఇంతకీ మీ అబ్బాయి ఏమీ అనరు కదా.

"వాడు అనకున్నా మనకంటూ ఓ పద్ధతి ఉంది కదా తల్లీ... సరిత మాట పూర్తికాకుండానే "అత్తయ్య ప్లీజ్ " అని వారిoపుగా అని వెళ్ళిపోయింది.

"ఏంట్రా శరత్ ఇది నువ్వైనా చెప్పచ్చు" కదా..

"పిన్ని ఫ్రాంక్  గా చెప్పనా.. అది పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ కదా. ఫ్యాషన్లు పిచ్చి ఎక్కువైంది. ఏమన్నా అంటే గయ్య్ మంటుంది. పైగా నిన్నే తీసుకొస్తుంది మీ పిన్ని ఆదర్శవాది కదా అంటూ. నేను ఊర్లో ఉండేదే రెండు మూడు రోజులు... దీని అరుపుల కన్నా బయట వాళ్ల వెక్కిరింపులే నయం. వాళ్లేమీ మొహం మీద అనరు కదా" శరత్ సమాధానం విని మరింత బిత్తరపోయింది...సరిత అక్కడ ఉన్న నాలుగు రోజుల్లో రవళి అడపాదడపా అంటూనే ఉంది సరిత స్త్రీల కోసం ఎంతో చేస్తుంది కదా! మరి తనను ఎందుకు అంగీకరించలేకపోయింది అని.

మొదటి రోజు అనుభవంతో సరిత అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది.

*     *           *       *

"పిన్ని నాన్న పోయారు అమ్మ చాలా డౌన్ అయిపోయింది నువ్వు వెంటనే బయలుదేరి రా" అర్ధరాత్రి ఫోన్ చేశాడు శరత్. అందుబాటులో ఉన్న ఫ్లైట్ పట్టుకుని వచ్చేసింది సరిత. మాట్లాడుతూ మాట్లాడుతూనే గుండెపోటుతో చనిపోయారుట బావగారు. అంత హఠాత్ పరిణామాన్ని తట్టుకోలేకపోయింది శారద. సరిత క్షణం కూడా వదలలేదు శారదని.

బంధువులు రావటం ఏడుపులు.. ఓదార్పులు....రవళి వాళ్ళ అమ్మ అన్నీ చూసుకుంటోంది, ప్రతి చిన్న కార్యం పద్ధతి ప్రకారం జరగాలని జరగాలని ఆవిడ అన్నిటికీ హడావిడి చేస్తోంది. తొమ్మిది రోజులు గడిచిపోయాయి.

"సరితా... తెల్లవారుతుందంటే భయమేస్తోంది" అంది శారద బేలగా.

సరితకి కూడా దిగులుగానే ఉంది. అదేమిటో ఆచారాలు... రవళి తల్లి మర్నాడు ఏం జరగాలో ముందే చెప్పేసింది. పూర్వ సువాసినిలకు. వాళ్లు రవళి వాళ్ళ ఊర్లో వాళ్లే భర్త పోయిన బాధలో ఉంటే.. మట్టెలు, మంగళసూత్రం ఇవన్నీ తీసే పద్ధతి హృదయవిదారకo.

ఒక నిర్ణయానికి వచ్చేసింది సరిత. "నేను ఉన్నాను శారదా. నువ్వేమీ దిగులు పడకు. అందరూ ధర్మోదకాలు వదిలి వచ్చేసరికి మెట్టెలు మంగళసూత్రం తీసేసి మామూలుగా లేత రంగు చీర కట్టుకో. చిన్న స్టిక్కర్ బొట్టు పెట్టుకో ఏం పర్వాలేదు" అని ధైర్యం చెప్పింది.

ధర్మోదకాలు వదలడానికి వెళ్లి అందరూ వచ్చేశారు. శారద సన్నగా వణుకుతోంది. ధైర్యంగా చెయ్యి నొక్కుతూ పక్కనే కూర్చుంది సరిత. ముందు కొడుకు కోడల్ని వెళ్ళమనమ్మా. ఎవరో అన్నారు బయట... లోపలికి వచ్చిన రవళి అత్తగారిని చూసి చూడకుండానే ఒక్కసారిగా తలవంచుకుని

"చిన్నత్తయ్య  ఒకసారి మీరు ఇలా రండి" అని సరితను పిలిచింది.

సరిత కదలలేదు. దీనంగా అభ్యర్థిస్తున్నట్టున్న లక్ష్మి కళ్ళు సరితను కూర్చోనీయలేదు. లేచి వెళ్ళింది.

"అత్తయ్య గారి మొహాన ఆ స్టిక్కర్ ఏంటి,.. మెడలో గొలుసు.. అవన్నీ తీసేయ మనండి."

"అనను" సరిత కచ్చితంగా అనటంతో రవళి ఏమీ మాట్లాడకుండా అత్తగారి దగ్గరికి వెళ్లి తల ఎత్తకుండానే డైరెక్టుగా చెప్పేసింది. "ఇవాళ ఒక్క రోజు మీ పిల్లల క్షేమం కోసం ఆచారం పాటించలేరా అత్తయ్య" అని కూడా అంది.

శారద వణుకుతున్న చేతులతో నుదుటి మీద స్టికర్ తీసేసి చీర కొంగు మెడ మీద చుట్టూ కప్పుకుంది...ఊపిరి ఉందా లేద అన్నట్టు గోడకి ఆనుకుని కూర్చుంది. అత్తగారిని అలా చూడగానే రవళికి బాధ వేసింది. అయినా 'ఆచారం ఆచారమే కదా ఇవ్వాళ ఒక్కరోజే కదా’ అని అనుకుంది. అత్తగారిని కావలించుకుని బావురుమంది. దూరపు బంధువులు, బంధువులు కాని వాళ్ళు ఒక పది పదిహేను మంది వచ్చేశారు. ముందుకు వచ్చి మొహం లోకి మొహం పెట్టి మరీ చూసి చీర పెట్టి కళ్లు తుడుచుకుంటూ ముక్కు ఎగబీలుస్తూ భోజనాలకి వెళ్ళిపోయారు.

అంతసేపు శారద అలా శిలలా కూర్చునే ఉంది. వాలి తూలిపోతున్న శారదని లోపలికి తీసుకెళ్లింది సరిత.

సరిత తర్వాతి మూడురోజులు ఎవరితోనూ..శరత్ తో కూడా మాట్లాడలేదు. అసలు మాట్లాడాలనిపించలేదు. 13వ రోజు దీపం చూడకూడదు అంటూ రవళి తల్లితో సహా ఎక్కడి వాళ్ళు అక్కడకి వెళ్ళిపోయారు. హాల్ లో కూర్చున్న సరిత దగ్గరికి నెమ్మదిగా వచ్చారు శరత్, రవళి. గంభీరంగా ఉన్న సరితను చూసి శరత్ జంకాడు. ధైర్యం చేసుకుని రవళి ప్రారంభించింది "అత్తయ్య మొన్న పదవ రోజు జరిగిన విషయం మీకు కోపం వచ్చిందని మాకు అర్థమైంది. కానీ మా అమ్మ అమ్మమ్మ ఇద్దరు మరీ మరీ చెప్పారండి. పదవ రోజున మాత్రం ఆమె ఏమీ ధరించకూడదు. అన్ని తీసేసిన బోసి మొహాన్ని అందరూ చూడాలి అని. ఆ ఒక్కరోజే కదా. ఎంతైనా *పద్దతి* కాదనలేం కదా అత్తయ్య అంది.

సరిత పుస్తకం పక్కన పడేసి దీర్ఘంగా నిట్టూర్చింది.

"హుఁ నీది మూర్ఖత్వమో, అమాయకత్వమో అర్థం కావట్లేదు రవళి. ఆచారం కానీ శాస్త్రం గానీ ఎప్పుడూ కఠినంగా ఉండదమ్మ..వేషధారణలో అల్ట్రా మోడల్ అయిన నీకు ..... ఆలోచనలు ఎందుకు ఆధునికం అవలేదు.. నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ నిజంగా పర్ఫెక్ట్పెట్టు. పెళ్లి అయ్యేంత వరకూ పల్లెటూరు లోనే పుట్టి పెరిగిన నువ్వు ఫ్యాషన్స్లో ఎలా ఆరితేరావు. అంటే నేర్చుకున్నావు. ఆలోచనలు మార్చుకున్నావు. మరి పాతకాలపు ఆచారంలో మార్పు రావాలి అనిపించలేదా? కనీసం ఒక స్త్రీగా అయినా ఆలోచించలేక పోయావు. నిజానికి భర్త పోయిన దుఃఖంలో అలంకరించుకోవాలని ఏ స్త్రీ కి ఉండదు.. కానీ నువ్వు ఇలాగే ఉండాలి అని ఒకరోజు నిర్దేశించి ఆవిడని కూర్చోబెట్టి ఆగం చేస్తే ఆవిడ లో కలిగే మానసిక ఆందోళన ఎంత బాధాకరమో ఊహించలేము.

కొన్ని దశాబ్దాల క్రితం ఈ పద్ధతి పాటించేవారు. అందులో ఒక తర్కం ఉంది. ఆ రోజుల్లో పెళ్లయ్యాక స్త్రీకి పగలంతా వంటిల్లు రాత్రి పడక టిల్లు.. అప్పుడే భర్తతో కాస్త సరదాగా ఉండేది. తన జీవితంలో భర్త స్థానం ఏమిటి అని గాని భర్త లేకపోతే తన భవిష్యత్తు ఏమిటి అనేది ఆనాటి స్త్రీకి ఇంచుమించు తెలియదనే చెప్పాలి. అందుకోసమే ఈ తంతు. అది కూడా పదవ రోజే ఎందుకు.

10 సంఖ్యకి సంఖ్యా శాస్త్రంలో ఒక ప్రాముఖ్యం ఉంది. ఆ సంఖ్య ని పదే పదే జ్ఞాపకం పెట్టుకునే వారికి స్వంత నిర్ణయాలు తీసుకోగలిగిన తెలివి, ఒంటరిగా వున్నా హాయిగా ఉండగలిగిన శక్తి కలుగుతాయని అంటారు..( సాధారణంగా పుట్టిన రోజు పెళ్లి రోజు పది సంఖ్యకి సంబంధించినవైతే మనం పదేపదే తలుచుకుంటాంగా).

ఇంక మనస్తత్వశాస్త్రంలో పది సంఖ్య ని క్రాఫ్ట్య్ నంబరు అంటారు. అలాంటివారికి ఆ సంఖ్య కి సంబంధించిన ముఖ్యమైన దినాలు ఉన్నవాళ్లకి తమ విజయాలకి తమ చర్యలకి సమాజం ఎలా స్పందిస్తుందో తెలుసుకోగలిగిన అవగాహన ఎక్కువగా ఉంటుంది అంటారు. పదవ రోజున అన్ని తీసేసి కళావిహీనం చేస్తే తన భర్త పోయింది అనేది ఆవిడ బుర్రకి ఎక్కుతుంది. ఆవిడ లో ఉన్న దుఃఖం అంతా బయట పడుతుంది. అదంతా జరిగింది పదవ రోజు కాబట్టి ఆ 10 సంఖ్య ఆవిడ జీవితంలో ముఖ్యమైన స్థానం వహిస్తుంది. ఒంటరిగా విడిగా నడవటానికి తగిన మానసిక పరిపక్వత అసంకల్పితంగానే కలుగుతుంది. అది ఆనాడు స్త్రీకి ఉపయోగపడే ఒక సిద్ధాంతం.

కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చాలా అంటే చాలా ముందుకు వచ్చేసాము. భర్త అంటే ఏమిటో స్త్రీ కి తెలుసు అతడు పోవటం అంటే తన జీవితం ఏమిటో అప్పుడే తెలుసుకుంటుంది. తనని తాను నిలబెట్టుకోవడానికి కూడా ప్రయత్నంచేయగలదు. అలాంటి సమయాల్లో ఇలాంటి అతితెలివి ప్రదర్శించి ఆడవాళ్ళని ఆడవాళ్లే నరకయాతన పెడుతున్నారు." అంటూ శరత్ వైపు చూసి

“శరత్ పెత్తనం అక్కర్లేదు గాని మగవాడిగా ప్రవర్తించు, రవళీ నువ్వు వేషాలతో పాటు ఆలోచనలో కూడా ఆధునికత తెచ్చుకో!! నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి శారదకి కూడా టికెట్లు బుక్ చేశాను. తను నాతోనే ఉంటుంది.”

“అయ్యో అత్తయ్య ముందుగా పుట్టింటి వా*...(ళ్ళు తీసుకెళ్లాలిట)” అనబోతూ మాట మిగేసి చెంపలు వేసుకుంటూ సరిత కాళ్ళ మీద పడిపోయింది..

సరిత చిరునవ్వు నవ్వుతూ “గుడ్ కీపిటప్” అంది.

Posted in September 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!